ఆ పరిపక్వత మాకుంది!

ABN , First Publish Date - 2022-02-13T05:30:00+05:30 IST

ఆమె భారతదేశం గర్వించదగిన బ్యాడ్మింటన్‌

ఆ పరిపక్వత మాకుంది!

ఆమె భారతదేశం గర్వించదగిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి... 

అతను ఇప్పుడిప్పుడే సినిమాల్లో ఎదుగుతున్న హీరో.

వారే .. గుత్తా జ్వాల, విశాల్‌ విష్ణు. విభిన్న నేపథ్యాల్లోంచి వచ్చిన వీరిద్దరిదీ ప్రేమ వివాహం... పెళ్లిపై ఎన్నో కామెంట్స్‌ వచ్చాయి. అవేమీ పట్టించుకోకుండా.. అన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నాం అంటున్నారు వాళ్లిద్దరు.  వాళ్లిద్దరు కలిసి ఇచ్చిన తొలి ఇంటర్వ్యూ విశేషాలివే... 



మీ ఇద్దరూ కొవిడ్‌ పరిస్థితుల్ని ఎలా ఎదుర్కొన్నారు?

గుత్తాజ్వాల: నేనొక క్రీడాకారిణిని.. పరిస్థితులకు అనుగుణంగా మారడం తెలుసు. కొవిడ్‌ సమయంలో కూడా అలా చేశా.

విష్ణు విశాల్‌: ‘ఎఫ్‌ఐఆర్‌’ సినిమాని ఎన్నో ఆశలతో ప్రారంభించా. కొవిడ్‌ కారణంగా షూటింగ్‌ సరిగా జరగలేదు. వేర్వేరు లొకేషన్స్‌, వివిధ రాష్ట్రాలలో, పబ్లిక్‌ ప్లేస్‌లో షూట్‌ చేయడం.. వంటి వన్నీ సవాల్‌గా మారాయి.


ఇద్దరిలో ఎవరు.. ఆశాజనకంగా ఉంటారు?

జ్వాల: ఖచ్చితంగా నేనే. 

విష్ణు విశాల్‌:  ఆశావాదినే కానీ.. అదే సమయంలో నెగిటివ్స్‌ గురించి జాగ్రత్తగా ఆలోచిస్తాను. కొన్నిసార్లు  అటు, ఇటుగా జరుగుతుంటాయి. ఎవరైతే నెగిటివ్స్‌ను నివారించుకోగలుగుతారో.. వారు పాజిటివ్‌ మైండ్‌తో ఉన్నట్లే!


అంటే మీరు రిస్క్‌ తీసుకుంటారని అనుకోవచ్చా?

జ్వాల: ప్రస్తుత ప్రపంచంలో ఏది చేసినా.. రిస్క్‌ కిందకే వస్తుంది. నేను దీనిని సాధారణంగానే చూస్తాను. ఇంట్లో పేరెంట్స్‌ ఉన్నారు కాబట్టి... తను కోవిడ్‌ టైమ్‌లో భయపడిపోయారు. నేను ఏదో జరిగిపోతుందని ఆలోచిస్తూ కూర్చోను. ‘ఏదైతే అది అవుతుంది. చింతించాల్సిన అవసరం లేదు’ అనుకుంటా.

విష్ణు విశాల్‌: నేను భయపడిన మాట మాత్రం వాస్తవం. కానీ వైద్యరంగం వైపు నుండి అతి త్వరలోనే ఏదో ఒకటి వస్తుందని నమ్మాను. అప్పటి వరకూ ఇంటినుంచి బయటికి వెళ్లకూడదనుకున్నా. అమ్మానాన్న వ్యాక్సిన్‌ తీసుకున్నాక ధైర్యం వచ్చింది.


ఇప్పటిదాకా మీ జర్నీ ఎలా ఉంది?

జ్వాల: చాలా బాగుంది. ప్రస్తుతం ఏ వయసులో ఉన్నాం అనేది ముఖ్యం. జీవితం గురించి అర్థం చేసుకునేంత పరిపక్వత ఇద్దరికీ ఉంది. ఈ పెళ్లి నుండి ఏం కోరుకుంటున్నాం? అనేది ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. మళ్లీ పెళ్లి, సమాజం, కుటుంబం, సామాజిక ఒత్తిడి... వీటన్నింటిపై ఇద్దరం అవగాహన పెంచుకున్నాం. తను కెరీర్‌ పరంగా ప్రారంభ దశనుంచి తర్వాత దశకు చేరుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అలాగే నా కెరియర్‌  పీక్‌కి వెళ్లి ప్రస్తుతం తర్వాత దశలో ఉన్నాను. మేమిద్దరం రిలేషన్‌షి్‌పలో ఉన్నప్పుడే కెరీర్‌ గురించి చర్చించుకున్నాం. 

విష్ణు విశాల్‌: ఇపుడు బావుంది. తొలిరోజుల్లో ప్రజలు చెడుగా మా గురించి మాట్లాడుకున్నారు. మీడియాకి దగ్గరగా ఉన్నవాళ్లం కాబట్టి మాపై ఎన్నో వదంతులు వచ్చాయి. తను ఎలా తీసుకుందో తెలియదు కానీ, నేను మాత్రం చాలా సార్లు ఒత్తిడికి లోనయ్యా.

జ్వాల: నేను కూడా అలాంటివి ఎదుర్కొన్నాను. నా మొదటి వివాహం విషయంలో .. నేను విడిపోయినప్పుడు ప్రజలు ఇలాగే మాట్లాడుకుని ఉంటారనుకున్నా. 


కష్ట సమయంలో మీకు సపోర్టుగా నిలబడిందెవరూ?

జ్వాల: మా స్నేహితులే సపోర్ట్‌ ఇచ్చారు. వయసు, తగినట్లు మైండ్‌ మెచ్యూర్‌ ఉంది. మేముగా నిర్ణయం తీసుకున్నాం. నా తల్లిదండ్రులు ఎలాంటి ప్రశ్నలు అడగలేదు. ‘నటుడని అంటున్నావు.. జాగ్రత్త’ అన్నారు. నాకుండే సినిమా స్నేహితులను చూస్తుంటారు కాబట్టే అలా హెచ్చరించారు. సినిమా ఇండస్ట్రీలో పైకి నవ్వుతూ కనిపిస్తారు.. కానీ లోపల చాలా దాచుకుంటారు.అందంగా కనిపించడానికి, బాడీ స్ట్రక్చర్‌ని మెయింటైన్‌ చేయడానికి యాక్టర్స్‌ ఎంతో కష్టపడాలి. అలా కష్టపడే.. వినోదాన్ని అందిస్తున్నారు. కానీ అలాంటి వారిపై ఎవరికి తగినట్లుగా వారు విశ్లేషణలు చేస్తుంటారు. వారికి తెలియదుగా.. నా తల్లిదండ్రులకు కూడా తెలియకపోవచ్చు. కానీ విష్ణుని వారు భిన్నంగా చూశారు. గత ఐదేళ్లలో విష్ణులో ఎంతో మార్పు వచ్చింది. ప్రస్తుతం తను కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.


ముందుగా ఎవరు ప్రపోజ్‌ చేశారు? 

విష్ణు విశాల్‌: గుర్తుకు తెచ్చుకుంటున్నా.. 

జ్వాల: (నవ్వుతూ) ఏంటి? అడుగుతుంది మ్యారేజ్‌ గురించి!

విష్ణు విశాల్‌: ఓహో.. మ్యారేజ్‌ గురించా. కొన్నేళ్ల రిలేషన్‌షిప్‌ తర్వాత మరింత ముందుకు తీసుకువెళ్లాలని అనుకున్నాం. లేదంటే ఇదేదో మా సొంత ప్రయోజనాల కోసం చేస్తున్నామని ప్రజలు అనుకుంటారు కదా. అంటే సమాజం కోసం అని కాదు.. నాకు జీవిత భాగస్వామి ఉందని.. నా తల్లిదండ్రులు అనుకోవాలి. లేకుంటే వీడి జీవితం ఇలా అయిపోయింది ఏమిటి? అని వారు బాధపడుతుంటారు. తల్లిదండ్రులు ఆలోచించేది అదే కదా.

జ్వాల: మన సమాజంలో పెళ్లి అవసరం. 


సినిమా ఒకరు, క్రీడల్లో మరొకరు. పోటీగా ఉండాల్సిన పరిస్థితి. ఒత్తిడిని ఎలా అధిగమించగలుగుతున్నారు?

విష్ణు విశాల్‌: గత మూడు, మూడున్నర సంవత్సరాలుగా ఆమెలో ఇష్టపడింది ఒకటే. తను ఒత్తిడిని బయటకు కనిపించనివ్వదు.  నేను ప్రస్తుతం ఎదుర్కొంటున్నది.. తను ఎప్పుడో దాటి వచ్చింది. తను సాధించాలనుకున్నది సాధించింది. నేను ఇప్పుడిప్పుడే నా లక్ష్యం వైపు వెళుతున్నాను. అందువల్ల ఒత్తిడి ఉంటుంది. దాని నుంచి బయటపడే మార్గాలు వెతుకుతున్నాం. 

జ్వాల: నేను ఏకీభవిస్తున్నాను. నా విషయంలో నా వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడంలో బ్యాడ్మింటన్‌ క్రీడ కీలక భూమిక పోషించిందనుకుంటా. ఏంటంటే నేను కోర్టులో దిగే వరకు గేమ్‌ గురించి ఎక్కువగా ఆలోచించను.నేను దానిని ఎదుర్కోగలమని తెలుసు. ఏదైనా చేయడానికి ముందు ఒత్త్తిడికి గురికావడంలో అర్థం లేదు. కోర్టులో నన్ను అందరూ ఫియర్‌ లెస్‌, దూకుడుగా ఉంటానని అంటుంటారు. కోర్టు బయట కూడా అలాగే ఉంటాను. చిల్‌ అవడానికి ఎక్కువగా ఇష్టపడతాను. సమస్య ఉన్నప్పుడు పరిష్కారం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో పరిష్కారం లేని సమస్య ఉందని నేను అనుకోవడం లేదు. 


సినిమాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారా?

విష్ణు విశాల్‌: మాట్లాడుకుంటాం. తనకు ఫిల్మ్‌ మేకింగ్‌ గురించి తెలిసిపోయింది. 

జ్వాల: ఆట ఆడాక ఆటగాళ్లు వెంటనే ఫ్రీమోడ్‌లోకి వెళ్తారు. కానీ సినిమా వాళ్లకి అది తెలియదు. తర్వాత షాట్‌ ఎప్పుడు వస్తుందోనని సిద్ధంగా ఉండాలి. డైలాగ్స్‌ సాధన చేయాలి. నిరంతరం అందంగా కనిపించాలి. క్రీడలకంటే ఇండస్ర్టీలో ఉండటం కష్టం. 


కమర్షియల్‌ హీరో అన్నప్పుడు ఆ భారం మోయక తప్పదు కదా?

జ్వాల: అవును.. బాగా అలసిపోయి ఒక పాత్రలోకి ప్రవేశించడం ఎంత కష్టమో అర్థం చేసుకోగలను 

విష్ణు విశాల్‌: మనం పోషించే ప్రతి పాత్రకు భావోద్వేగాలు, పాత్రకు కొన్ని లక్షణాలు ఉంటాయి. ఏదో ఒక విధంగా ఆ పాత్రతో మనం అటాచ్‌మెంట్‌ ఉంటుంది. ఆ పాత్ర మనల్ని ఎప్పటికి వదిలి పెట్టదు.. ఎక్కడో ఒకచోట మనల్ని మార్చేస్తుంది. 



ఈ మధ్య కాలంలో మీకు మరపురాని సంఘటనలేమైనా ఉన్నాయా?

జ్వాల: స్నేహితులతో కలిసి గత సంవత్సరం కోవిడ్‌ టైమ్‌లో మాల్దీవుల్లో మంచి సమయాన్ని గడిపాం. అది ఒక మధుర జ్ఞాపకంలా ఉండిపోతుంది. అలాగే ’అరణ్య‘ చిత్ర షూటింగ్‌ టైమ్‌లో తనతో కలిసి అడవిలోకి వెళ్లిన సంఘటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అడవిలో షూట్‌ చేయడం చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం. దాని కోసం వారు ఎంత కష్టపడతారో స్వయంగా నేను చూశాను. ఆ కష్టాన్ని వారితో పాటు నేను కూడా అనుభవించాను. షూటింగ్‌ చేస్తున్న ప్రదేశానికి జీప్‌ కూడా వెళ్లలేదు. నడిచి ఆ ప్రదేశానికి చేరుకున్నాం. అది చాలా క్రేజీ ఫీలింగ్‌.  ఆ దారిలో వెళుతుంటే చాలా మందిని జలగలు పట్టుకున్నాయి. 

విష్ణు విశాల్‌: మధురమైన క్షణాల్లో.. మొదటిది తనను కలిసిన సందర్భం. సరిగ్గా అప్పుడు సిక్స్‌ప్యాక్‌ ఫొటోషూట్‌ చేస్తోంటే.. తను నా పక్కనే  ఉంది. ఇది ఎంతో మధురమైన జ్ఞాపకం. ఎందుకంటే.. ‘బాగా కనిపించాల’ని ప్రోత్సహించింది తనే. ‘నిన్ను నువ్వు సీరియస్‌గా తీసుకుంటేనే ప్రపంచం నిన్ను సీరియస్‌గా తీసుకుంటుంది. నీలో చాలా టాలెంట్‌ ఉంది. నువ్వు విష్ణు విశాల్‌.. నేను జ్వాలా గుత్తా ఇది మన గుర్తింపు. కాబట్టి మనం ఇంకా కష్టపడాలి’ అని చెప్పింది. ‘అరణ్య’ షూటింగ్‌లో గాయపడ్డాను.. అలాగే విడాకులు తీసుకున్నా. ఇంకెన్నో గడ్డుపరిస్థితుల్లోంచి తేరుకోవడానికి తనే తోడ్పాటు అందించింది. నా ఫ్యామిలీకి, స్నేహితులకు నన్ను దగ్గర చేసింది. 

జ్వాల: ఇంతకుముందు ఈ లుక్‌లో లేరు. ఇది సాధించడానికి ఎంతో కష్టపడ్డాడు.


మీ ఇద్దరిలో సాధించాలనే తపన ఎవరికి ఎక్కువగా ఉంటుంది?

జ్వాల: నాకే ఎక్కువ ఆ తపన ఉంది. 

విష్ణు విశాల్‌: కాదు, తనకంటే నాలోనే ఆ తపన ఎక్కువగా ఉంది. అయితే తనలా నేను బయటికి ప్రదర్శించలేను.





ఒత్తిడిని ఆమె తీసుకుంటుంది

నా ఒత్తిడిని తను తీసుకుంటుంది. నేను చాలా కష్టాలను ఎదుర్కొని బయటికి వచ్చాను. నేనేంటో ప్రపంచానికి నిరూపించుకునే పనిలో ఉన్నాను. నిర్మాతగానూ సినిమాలు చేస్తున్నాను. ఈ కోవిడ్‌ సమయంలో నటులకే కాదు నిర్మాతలు కూడా ఎలాంటి ఒత్తిడిని అనుభవిస్తున్నారో తెలిసిందే. కాబట్టి నా వైపు నుంచి కూడా ఒత్తిడి ఆమె పైనే పడుతోంది. 




నిజంగా ఊహించలేదు!

ఆరోజు నా పుట్టినరోజున స్నేహితులు, మేనేజర్‌ కలిసి ప్లాన్‌ చేశారు. ఉంగరం కూడా లేదు. నా మేనేజర్‌.. వాళ్ల భార్య రింగ్‌ తెచ్చిచ్చాడు. అంతా ఆకస్మికంగా జరిగిపోయింది. అదో మధుర జ్ఞాపకం.. కాబట్టి చాలా బాగుంది. కానీ మా పేరెంట్స్‌ షాకయ్యారు. మాకు ఎందుకు చెప్పలేదంటూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత కూల్‌ అయ్యారు. ఎప్పటికీ నాన్నకు చిన్నపిల్లనే!

 సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌

Updated Date - 2022-02-13T05:30:00+05:30 IST