అదే నా ప్రపంచం

ABN , First Publish Date - 2021-08-02T05:30:00+05:30 IST

అవి నేను బెంగళూరులో ఎంబీఏ చదివే రోజులు. 2013లో అనుకుంటా... ఓ మ్యూజిక్‌ చానల్‌లో ఇంటర్న్‌షిప్‌.

అదే నా ప్రపంచం

నటి కాకుంటే..? డాక్టరో... ఇంజనీరో... ఇంకేదో... ప్లాన్‌ ‘బి’ అనేది ఒకటి ఉంటుంది. కానీ మానస మనోహర్‌కు..? ఊహ తెలిసినప్పటి నుంచి ఒకే ఒక్క కోరిక... రంగుల లోకంలో రాణించాలని. ఆ ఊహల్లోనే పెరిగింది. ఆ రంగాన్నే అభిమానించింది.చివరకు ఆ కలలను నిజం చేసుకుంది. ‘ప్రేమ ఎంత మధురం’ అంటూ తెలుగు లోగిళ్లలో అడుగుపెడుతున్న మానస ‘మనోహర’ ప్రయాణం ‘నవ్య’కు ప్రత్యేకం... 


వి నేను బెంగళూరులో ఎంబీఏ చదివే రోజులు. 2013లో అనుకుంటా... ఓ మ్యూజిక్‌ చానల్‌లో ఇంటర్న్‌షిప్‌. డిగ్రీలో నా స్పెషలైజేషన్‌ ‘మార్కెటింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌’ అయినా సినీ రంగంలో స్థిరపడాలనే మక్కువతో ‘మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ ప్రాజెక్ట్‌ని ఎంచుకున్నాను. ఇంటర్న్‌షిప్‌లో ఉండగా సదరు చానల్‌ డీజేల కోసం ఆడిషన్స్‌ నిర్వహిస్తోంది. మా క్రియేటివ్‌ హెడ్‌ ఒకాయన... ‘నువ్వు కూడా ప్రయత్నించవచ్చు కదా’ అన్నారు. సరే అని ఆడిషన్స్‌కు వెళితే అక్కడ దాదాపు రెండున్నర వేల మంది క్యూ కట్టారు. ఒక్కసారిగా అంతమందిని చూసి ఆశ్చర్యమనిపించింది. ఆడిషన్స్‌ అయిపోయాయి. విశేషమేమంటే... వాళ్లందరిలో మొదట ఎంపికైంది నేనే. తరువాత ఆ చానల్‌లో డీజేగా, అసిస్టెంట్‌ ప్రొడ్యూసర్‌గా పని చేశాను. అలా నా ప్రయాణం మొదలైంది. 


చదువులో టాప్‌...  

చెబితే నమ్మరు కానీ... ఐదో తరగతిలో ఉన్నప్పుడే నటి కావాలని అనుకునేదాన్ని. డ్యాన్స్‌, డ్రామా, డిబేట్‌... స్కూల్‌, కాలేజీలో ఈవెంట్‌ ఏదైనా జరుగుతుందంటే నేనే ముందుండేదాన్ని. ఇక కాలేజీ వార్షికోత్సవం అయితే చెప్పక్కర్లేదు... సాంస్కృతిక కార్యక్రమాల్లో మునిగిపోయేవాళ్లం. ఆ అభిరుచే నన్ను నటన వైపు నడిపించింది. ఆటలు, పాటలే కాదు... చదువులో కూడా నేను టాపర్‌నే. ఏ రోజూ మార్కులు తొంభై శాతానికి తక్కువ రాలేదు. అందుకే మా అమ్మా నాన్న నాతో సివిల్స్‌ రాయించాలనుకున్నారు. అయితే నా ఆలోచన వేరు కదా! మనసులో మాట వారికి చెప్పాను. అడ్డు చెప్పలేదు. 


డీజే నుంచి నటిగా... 

చిన్నప్పుడు నాలుగేళ్లు భరతనాట్యం నేర్చుకున్నా. కానీ పూర్తి స్థాయిలో చదువుపై శ్రద్ధ పెట్టాలనే ఉద్దేశంతో మధ్యలోనే ఆపేశాను. ప్రొఫెషనల్‌ డ్యాన్సర్‌ని కాను కానీ... నాట్యం చాలా ఇష్టం. డీజేగా చేసే రోజుల్లో నాట్యంలో నా అనుభవం ఉపయోగపడింది. తరచూ టీవీలో కనిపిస్తుండడంతో కన్నడ సీరియల్‌ ‘అశ్వని నక్షత్ర’లో అవకాశం వచ్చింది. చిన్నదే అయినా ప్రాధాన్యం ఉన్న పాత్ర. అలాంటి పాత్రలే మరో రెండు సీరియల్స్‌లో చేశాను. అదే సమయంలో ‘సినిమా మై డార్లింగ్‌’ అనే కన్నడ చిత్రం(2015)లో ఆఫర్‌ లభించింది. ఎన్నో ఏళ్లుగా నేను కన్న కల అది... వెండి తెరపై కనిపించాలని. తరువాత తెలుగు(2017)లో ‘నాకు నేనే’ సినిమా చేశాను. తమిళ్‌లో ఒకటి, మరో రెండు కన్నడ సినిమాల్లో నటిస్తున్నా. కరోనా వల్ల బ్రేక్‌ వచ్చింది. 


తెలుగులో అలా... 

ప్రస్తుతం కన్నడలో సూపర్‌హిట్‌ సీరియల్‌ ‘జోతె జోతెయాలి’లో నటిస్తున్నా. 2019లో మొదలైంది. దానికి రీమేక్‌గానే ‘ప్రేమ ఎంత మధురం’ పేరుతో ‘జీ తెలుగు’ చానల్‌లో ప్రసారమవుతోంది. మధ్య వయస్కుడైన పారిశ్రామికవేత్త ఆర్యవర్ధన్‌, ఇరవై ఏళ్ల అనుల మధ్య పుట్టిన ప్రేమ కథ అది. ఆస్తులు, అంతస్తులే కాకుండా, వయసు రీత్యా కూడా ఎంతో వ్యత్యాసం ఉన్న వీరిద్దరి ప్రేమను సమాజం ఒప్పుకొంటుందా... తమకున్న అడ్డంకుల్ని దాటుకుని తమ ప్రేమను వీరిద్దరూ ఎలా పండించుకున్నారు అనేది అసలు కథ. ఇందులో ఆర్యవర్ధన్‌ మొదటి భార్య రాజనందినిగా పవర్‌ఫుల్‌ పాత్రలో నేను కనిపిస్తాను. 


తెలుగువాళ్లమే...  

నా కెరీర్‌ను నిర్మించుకోవడానికి ప్రతి పాత్రా ఉపయోగపడింది. అయితే వీటన్నిటిలో నటిగా నాకు పేరు, ఎనలేని గుర్తింపు తెచ్చింది మాత్రం ‘జోతె జోతెయాలి’ తెలుగు వర్షన్ అయిన ‘ప్రేమ ఎంత మధురం’లో ‘రాజ నందిని’ పాత్ర. అది నాకు స్టార్‌డమ్‌ తీసుకువచ్చింది. ఇదే నాకు తెలుగులో తొలి సీరియల్‌. మొత్తంగా ఇది నా ఆరో ప్రాజెక్ట్‌. 


అదే పాత్ర ఇప్పుడు 

తెలుగులో కూడా చేస్తున్నా. ఇక్కడి వాతావరణం, మనుషులు బాగా నచ్చారు. కన్నడ, తెలుగు భాషలకు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. పైగా మా నాన్న తెలుగువారే. ఆయనది అనంతపూర్‌. నేను, మా తమ్ముడు పుట్టింది బెంగళూరులో కావడంతో తెలుగు ధారాళంగా మాట్లాడలేం. కానీ అర్థమవుతుంది. చదవగలను కూడా! అందుకే ఇక్కడ నాకు భాషతో పెద్దగా సమస్య రాలేదు. 


మరో ఆలోచనే లేదు... 

చాలామంది అడుగుతుంటారు... ఒకవేళ నటి కాకపోయి ఉంటే ఏమయ్యేవారని! నిజంగా చెబుతున్నా... నాకు అసలు వేరే ఆలోచనే లేదు. చిన్నప్పటి నుంచి అదే నా ప్రపంచం. నటిని అయినా... కాకపోయినా ఏ క్రియేటివ్‌ హెడ్‌గానో, లైన్‌ ప్రొడ్యూసర్‌గానో... మరోలానో గ్లామర్‌ ఇండస్ర్టీలోనే ఉండేదాన్ని. అందుకే ఎంబీఏ చదివినా, టాపర్‌గా వచ్చినా ఈ రంగాన్నే ఎంచుకున్నాను. ఇక నాకు పెద్ద పెద్ద లక్ష్యాలు, ప్రణాళికలంటూ ఏమీ లేవు. పెళ్లయింది. ఆయన కార్పొరేట్‌ కంపెనీలో చేస్తారు. అమ్మ, నాన్న, తమ్ముడు... నా కుటుంబమే నా లోకం. ఖాళీ ఉంటే ఇంట్లోనే గడుపుతాను. అయితే భవిష్యత్తులో మంచి వెబ్‌సిరీ్‌సలు చేయాలనేది నా కోరిక. అదీ అభ్యంతరకర కంటెంట్‌ లేకపోతేనే. 

 హనుమా


మానస లైఫ్‌లైన్‌...

‘ఊహా లోకం’లో విహరించాలనేది చిన్నప్పటి కల 

ఎంబీఏ చదువుతూనే నటనకు శ్రీకారం 

అనుకోకుండా ఆడిషన్స్‌కు... అదే మలుపు 

ప్రకృతి, జంతు ప్రేమికురాలు 

నచ్చే ప్రదేశం బెంగళూరు. ఆ తరువాత గోవా.  

హీరో అల్లు అర్జున్‌కు వీరాభిమాని. తెరపై అతడి స్టయిల్‌, గ్రేస్‌కు ఫిదా. 

అభిరుచి... పెయింటింగ్‌. సినిమాలతో కాలక్షేపం.


ఆ మూడూ మరిచిపోలేను...

ఈ పరిశ్రమలోకి వచ్చి పదేళ్లు కావొస్తోంది. ఇన్నేళ్లలో పెద్దగా ఇబ్బందులంటూ ఏమీ లేవు. ఆప్యాయంగా పలకరిస్తూ, సొంతవారిలా భావించేవారు నా చుట్టూ ఉన్నారు. వారందరి సహకారంతో ప్రశాంతంగా సాగిపోతోంది నా ప్రయాణం. ఇవాల్టి వరకు ఒక్క రోజు కూడా ఖాళీగా ఉన్నది లేదు. కానీ మధురమైన అనుభవాలు చెప్పమంటే... అలాంటివి మూడున్నాయి. మొదటిది 2012లో డీజే ఆడిషన్స్‌లో ఎంపిక కావడం. రెండోది మొదటిసారి ప్రొఫెషనల్‌ కెమెరా ముందు నిలుచోవడం. మూడోది 2014లో ‘మిస్‌ కర్ణాటక’గా నిలవడం.

Updated Date - 2021-08-02T05:30:00+05:30 IST