కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ థలపతి విజయ్ (Ilaya Thalapaty Vijay) తెలుగులో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నారనే వార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి (Vamsi Paidipally) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన సినిమాలు చాలా తక్కువే. మున్నా మూవీతో దర్శకుడిగా మారిన వంశీ పైడిపల్లి..ఆ తర్వాత బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి లాంటి సినిమాలు తీశారు. వీటిలో ఒక్క మున్నా తప్ప మిగిలిన సినిమాలన్నీ కూడా మంచి కమర్షియల్ హిట్‌ను సొంతం చేసుకున్నాయి.
ఇక మహర్షి (Maharshi) లాంటి డీసెంట్ హిట్ తర్వాత వంశీ పైడిపల్లి మరోసారి సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu)తోనే సినిమా చేయాలనుకున్నారు. ఈ మూవీని ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) నిర్మించాల్సింది. అయితే, లైన్ నచ్చి ఓకే చెప్పిన మహేశ్ ఆ తర్వాత పూర్తి స్క్రిప్ట్ నచ్చక ప్రాజెక్ట్‌కు నో చెప్పారు. దాంతో అదే కథను తమిళ హీరో విజయ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా కీలక మార్పులు చేర్పులు చేసి తెరకెక్కిస్తున్నారు వంశీ. ఈ మూవీ విజయ్ కెరీర్‌లో 66వది కాగా, హీరోయిన్‌గా క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న (Rashmika Mandanna) నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై శరవేగంగా జరుగుతున్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలోనే థలపతి 66 (Thalapathy 66) చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చి వైరల్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళంలోనూ రూపొందుతున్న ఈ మూవీలో విజయ్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారట. దర్శకుడు వంశీ పైడిపల్లి రెండు విభిన్నమైన పాత్రలను డిజైన్ చేసినట్టు, దేనికతే ప్రత్యేకంగా ఉండబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మేకర్స్ అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఇచ్చేవరకు ఆగాల్సిందే. కాగా, ఇటీవల వచ్చిన బీస్ట్ (Beast) సినిమా తమిళంలో హిట్ టాక్ తెచ్చుకుంది. ఇదే సినిమా తెలుగు ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోయింది.