పదేళ్లు.. ఫుల్ హ్యాపీ
ABN , First Publish Date - 2022-10-20T05:41:26+05:30 IST
అనుక్షణం పోటీని ఎదుర్కొంటూ, ఉనికిని కాపాడుకొంటూ చిత్ర పరిశ్రమలో పదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేయడం ఏ నటికైనా, నటుడికైనా కీలకమే...

అనుక్షణం పోటీని ఎదుర్కొంటూ, ఉనికిని కాపాడుకొంటూ చిత్ర పరిశ్రమలో పదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేయడం ఏ నటికైనా, నటుడికైనా కీలకమే. అందుకే తన పదేళ్ల నట జీవితం పూర్తి సంతృప్తినిచ్చిందనీ, ఈ పదేళ్ల కాలం హ్యాపీగా గడిచిపోయిందని అలియా అంటున్నారు. దర్శకుడు మహేశ్ భట్ కూతురైన అలియా ‘సంఘర్ష్’ చిత్రంతో బాలనటిగా పరిచయం అయింది. ఆమె హీరోయిన్గా నటించిన తొలి చిత్రం ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’ 2012 అక్టోబర్ 19న విడుదలైంది. కరణ్ జోహర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతోనే వరణ్ ధావన్, సిద్దార్థ్ మల్హోత్రా హీరోలుగా పరిచయం అయ్యారు. ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’ చిత్రంతో అలియా తీసుకున్న తొలి పారితోషికం పదిహేను లక్షల రూపాయలు. ఆ చెక్కుని వాళ్లమ్మ సోని రజ్దాన్ చేతిలో పెట్టి ‘మమ్మీ పండగ చేసుకో’ అని చెప్పారట అలియా. తొలి సినిమాతోనే అందరి దృష్టినీ ఆకర్షించిన అలియా 19 ఏళ్ల వయసుకే సొంత కారు, 22 ఏళ్లు వచ్చేటప్పటికి సొంత ఇల్లు ఏర్పరచుకున్నారు. ఈ పదేళ్ల కాలంలో దాదాపు 17 చిత్రాల్లో హీరోయిన్గా, కొన్ని సినిమాల్లో అతిధిగా నటించారు. ‘ఉడ్తా పంజాబ్’, ‘రాజీ’, ‘గంగూబాయి కథియావాడి’ వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారు. త్వరలోనే ఓ హాలీవుడ్ చిత్రంలో నటించనున్నారు. రణబీర్ కపూర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అలియా మరికొన్ని రోజుల్లో తల్లి కానున్నారు.