పల్లె‘టూర్‌’ వేస్తున్నారు!

గ్రామీణ నేపథ్యం సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడూ సక్సెస్‌ ఫార్ములానే! అలనాటి నుంచి ఈ మధ్యకాలంలో టాలీవుడ్‌లో వచ్చిన గ్రామీణ నేపథ్య సినిమాలు ఎంతో సక్సెస్‌ సాధించాయి. అయితే మధ్యలో ట్రెండ్‌ మారింది. తెలుగు సినిమా కథలు మారాయి. కాస్తస్టైలిష్‌, యాక్షన్‌, కమర్షియల్‌ బాట పట్టాయి. మళ్లీ కొన్నాళ్లుగా టాలీవుడ్‌ గ్రామీణ నేపథ్యం బాట పట్టింది. అలా వచ్చిన ‘రంగస్థలం’. ‘సోగ్గాడే చిన్నినాయన’,  ‘శతమానం భవతి’, ‘శ్రీమంతుడు’, ‘మహర్షి’, ‘చినబాబు’, ‘సుల్తాన్‌’, ‘చందమామ’, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘గోవిందుడు అందరివాడేలే’ ఇలా చాలా చిత్రాలు థియేటర్‌లో సత్తా చాటాయి. ఈ ట్రెండ్‌ ఇప్పుడూ కొనసాగుతుంది. ప్రేక్షకులు కూడా ఈ తరహా కథల్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందుకే మన అగ్ర హీరోలు పల్లె‘టూర్‌’ వేస్తున్నారు. తాజాగా ఈ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రాలపై ఓ లుక్కేద్దాం...

చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ‘ఆచార్య’ విప్లవం నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం అయినప్పటికీ గ్రామీణ నేపథ్యంలో సాగే కథే అని తెలుస్తోంది. ఈ చిత్రం నిర్మాతల్లో ఒకరైన రామ్‌చరణ్‌ ఇందులో సిద్ధ పాత్రలో కనిపిస్తారు. ఇటీవల విడుదల చేసిన ‘లాహే లాహే’ పాటను చూస్తే గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రమిదని తెలుస్తుంది. అయితే ఈ సినిమా ఈ నెల 13న విడుదల కావాల్సి ఉంది కరోనా సెకెండ్‌ వేవ్‌ ఉదృతంగా మారడం వల్ల విడుదల వాయుదా పడింది.

‘రామారావుగారూ’ నిజమేనా!
నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే! ఈ చిత్రం కూడా పల్లె వాతావరణంలో సాగే కథ అని తెలిసింది. ఇందులో బాలకృష్ణ రైతుగా కనిపిస్తారట. ఆయన పాత్ర పేరు రామారావు అనీ, ఆ ఊళ్లో అంతా ‘రామారావుగారూ’ అని ఆప్యాయంగా పిలుస్తారని దర్శకుడు ఓ కార్యక్రమంలో తెలిపారని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి ‘రామారావుగారూ’ వర్కింగ్‌ టైటిల్‌ అని సమాచారం. అయితే తాజాగా బాలకృష్ణ నటించిన ‘అఖండ’ కూడా విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ కథే!

వెంకీ వరుసగా రెండు...

అణగారిన కుటుంబం, సంపన్న కుటుంబం, భూస్వాములు, కులం నేపథ్యంలో సాగే చిత్రం ‘నారప్ప’. తమిళంలో హిట్టైన ‘అసురన్‌’ చిత్రానికి రీమేకిది. ఈ తరహా పల్లె కథల్ని తెరకెక్కించడంలో దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల దిట్ట. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత వెంకటేశ్‌, శ్రీకాంత్‌ అడ్డాల కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది. ‘నారప్ప’గా వెంకటేశ్‌ను డిఫరెంట్‌ లుక్‌లో చూపించారు. అలాగే వెంకటేశ్‌ నటిస్తున్న మరో చిత్రం ‘దృశ్యం2’ కూడా గ్రామీణ నేపథ్యానికి చెందిన కథే! ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది.

ఆగస్ట్‌లో సెట్‌కి బంగార్రాజు...
నాగార్జునకు పల్లెటూరి కథలు కొత్తేమి కాదు. ‘ప్రెసిడెంట్‌గారి పెళ్లాం’, ‘జానకి రాముడు’, ‘అల్లరి అల్లుడు’ ఇలా ఆయన ఖాతాలో చాలానే చిత్రాలున్నాయి. 2016లో ఆయన ద్విపాత్రాభినయం చేసి రమ్యకృష్ణ కథానాయికగా విలేజ్‌ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయనా’. సంక్రాంతి సీజన్‌లో విడుదలై సూపర్‌హిట్టైంది. ఆ చిత్రానికి అప్పట్లోనే సీక్వెల్‌ ప్రకటించారు దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ. సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రంలో నాగార్జున పాత్ర పేరు ‘బంగార్రాజు’నే ఈ సినిమాకు టైటిల్‌గా పెట్టారు. ఈ చిత్రం కూడా ఆ తరహాలోనే ఉంటుంది. జూలై, ఆగస్ట్‌లో ఈ చిత్రం సెట్స్‌ మీదకెళ్లనుందని ఇటీవల నాగార్జున వెల్లడించారు. ఇందులో నాగార్జున లుక్‌, యాస ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయట. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.