‘నిశ్శబ్దం’ కోసం చాలా కష్టపడ్డాను: అంజలి

ABN , First Publish Date - 2020-05-06T02:51:28+05:30 IST

స్వర్గీయ అంజలీదేవిగారి తరువాత టాలీవుడ్‌లో సీతమ్మగా అంతటి గుర్తింపునూ పేరునూ తెచ్చుకున్న హీరోయిన్‌ అంజలి తప్ప మరొక హీరోయిన్‌ లేరంటే అతిశయోక్తి

‘నిశ్శబ్దం’ కోసం చాలా కష్టపడ్డాను: అంజలి

స్వర్గీయ అంజలీదేవిగారి తరువాత టాలీవుడ్‌లో సీతమ్మగా అంతటి గుర్తింపునూ పేరునూ తెచ్చుకున్న హీరోయిన్‌ అంజలి తప్ప మరొక హీరోయిన్‌ లేరంటే అతిశయోక్తి కాదేమో. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’ ద్వారా సీతగా తెలుగు లోగిళ్ళల్లోని గడపగడపకూ అంజలి సుపరిచితురాలైంది. ఆ సినిమాలో తన అందచందాలతో, అమాయకమైన నటనతో అందిరినీ ఆకట్టుకుంది. ఆ సినిమా మంచి విజయం సాధించినా, తెలుగులో సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌ కాలేకపోయింది.. తెలుగమ్మాయి అయి ఉండి తమిళనాటే ఎక్కువ గుర్తింపు, పేరు తెచ్చుకుంటున్న అంజలితో....


కెరీర్‌ ప్రారంభం నుంచీ ఇటు కమర్షియల్‌, అటు ఓరియెంటెడ్‌ సినిమాలు సమానంగా చేస్తున్నారు కదా...ఈ రెండు జోనర్లలో ఏ జోనర్‌ అంటే ఎక్కువ ఇష్టం మీకు?

ఏ జోనర్‌ ఇష్టం అంటే చెప్పడం కష్టమే. నిజం చెప్పాలంటే నాకు సినిమాలంటే తెగ పిచ్చి. అందుకే ఏ జోనర్‌ సినిమా అయినా సరే ఇష్టంగానే చేస్తాను. నాకు సరిపడ కథలు వస్తే మరింత ఇష్టంగా చేస్తాను. ఇప్పటి వరకూ నాకు సరిపడ కథలతోనే సినిమాలు చేస్తూ వచ్చాను. అలాగే భాషా బేధం కూడా లేదు నాకు.


హారర్‌ సినిమాలు చేసేటప్పుడు భయం వేయదా?

ఇంతకుముందు గీతాంజలి, చిత్రాంగద, లిసా వంటి హారర్ సినిమాల్లో నటించాను. అయితే హారర్ సన్నివేశాలను ఎలా చిత్రీకరిస్తారో తెలిసిన తర్వాత అలాంటి సినిమా చూసేటప్పుడు పెద్దగా భయం కలగడం లేదు. పలు సన్నివేశాలను గ్రీన్ మ్యాట్ వేసి చిత్రీకరిస్తున్నారు. గ్రాఫిక్స్, సౌండ్ ఎఫెక్ట్‌తో హారర్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు. ఇప్పుడయితే సినిమాలో సన్నివేశాలు చేసేటప్పుడు బాగా ఎంజాయ్‌ చేస్తున్నాను. గతంలో కొన్ని సినిమాలు చేసేటప్పుడు చాలా భయం వేసేది. అప్పుడు నేను ఒంటరిగా ఉండేదాన్ని. షూటింగ్‌ నుంచి రాగానే నిద్ర కూడా పట్టేది కాదు. ఇదంతా మొదట్లోనే. ఆ తరువాత అలవాటైపోయింది. 


కోలీవుడ్‌లో మీకు బాగా పేరు తెచ్చిన సినిమాలు?

తమిళ్‌లో నేను చేసిన చిత్రాల్లోని కొన్ని పాత్రలను ఎప్పటికీ మరచిపోలేను.‘కట్రదు తమిళ్’లోని ఆనంది పాత్ర, ‘అంగాడి తెరు’లో కని పాత్ర, ‘ఎంగేయుం ఎప్పోదుం’లో మణిమేఘలై, ‘సిందుబాద్’లో వెన్బా పాత్రలంటే నాకు చాలా ఇష్టం. 


సినీరంగంలో మీకు మరిచిపోలేని అనుభవం?

టాలీవుడ్‌ల కన్నా కోలీవుడ్‌లోనే నాకు మంచి అనుభవాలు ఉన్నాయి. కోలీవుడ్‌లో విజయ్ సేతుపతి నాకు మంచి మిత్రుడు. ఆయనతో నటించడం చాలా సవాలైన విషయం. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్తగా నటిస్తుంటారు. ‘సిందుబాద్’లో ఆయనతో కలిసి నటించడం మరచిపోలేని అనుభవాన్నిచ్చింది. 


మీకు బాగా పేరు తెచ్చిన సినిమాలు?

తెలుగులో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో సీత పాత్ర. ఇంతకు ముందు చెప్పినట్టుగానే కోలీవుడ్‌లో నేను చేసిన సినిమాలు, పాత్రలు నాకు జీవితాంతం గుర్తుండిపోతాయి. 



తెలుగమ్మాయి అయి ఉండి తగినంత గుర్తింపు రాలేదన్న బాధ ఉందా?

నాకు గుర్తింపురాలేదని ఎవరన్నారు. మిగతా తెలుగమ్మాయిల సంగతేమో నాకు తెలియదు కానీ, నాకు ఇక్కడ మంచి గుర్తింపే వచ్చింది. ఇప్పటికీ నన్ను టాలీవుడ్‌ సీతమ్మ అంటున్నారంటే  ప్రేక్షకుల హృదయాల్లో నాకెంత స్థానముందో ఊహించవచ్చు. ఇక కోలీవుడ్‌లో గుర్తింపంటే...నేను స్కూల్‌ స్టడీస్‌ పూర్తి కాగానే ఇంటర్మీడియేట్‌ కోసం చెన్నై వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే. అక్కడే నా తొలి సినిమా విడుదలైంది. దాంతో సహజంగానే అక్కడ గుర్తింపు కాస్త ఎక్కువగానే లభించింది. భాష ఏదైనా సినిమా ఒక్కటే కదా....సినిమాల్లో గుర్తింపు కావాలనుకున్నాను. వచ్చింది. ఈ విషయంలో నేను హ్యాపీ. ఇక నుంచి టాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. వారికి అందుబాటులో ఉండే విధంగా ఇక్కడే ఉండడానికి ప్లాన్‌ చేసుకుంటున్నాను.


ఈ రంగంలోకి వచ్చి చాలా సంవత్సరాలైంది కదా? తక్కువ సినిమాలు చేయడానికి కారణం?

తక్కువ ఎక్కడ చేశాను? తెలుగు, తమిళం కలిపి దాదాపు 48కు పైగా సినిమాలు చేశాను. నేను వెంటవెంటనే సినిమాలు చేసుకుంటూ పోతే సంఖ్యా పరంగా ఎక్కువ సినిమాలు అయి ఉండేవేమో కానీ, నాకు మాత్రం సంతృప్తి నిచ్చేవీ,. మంచి సినిమాలు చేయాలనే ఉద్దేశంతో నెమ్మదిగా చేస్తున్నాను. అంతే తప్ప నాకు అవకాశాలు రాక కాదు, 



మీ లవ్‌ ఫెయిల్యూర్‌ గురించి?

నాది లవ్‌ ఫెయిల్యూర్‌ కాదు. అసలు నేను ప్రేమలో లేను. జై నాకు మంచి ఫ్రెండ్‌ మాత్రమే. తనూ నేను ప్రేమలో ఉన్నట్టు కానీ, పెళ్ళి చేసుకోవాలని అనుకున్నట్టు కానీ ఎక్కడా ఎవరితోనూ చెప్పలేదు. మా మధ్య ఏదో ఉందనీ, మేమిద్దరం పెళ్ళి చేసుకోబోతున్నామనీ, ఇప్పుడు విడిపోయామనీ ఇవన్నీ ఊహాగానాలే తప్ప వాస్తవాలు కావు. అయినా ఒక హీరోతో కలిసి రెండు మూడు సినిమాలు చేసినంత మాత్రాన ఆ వ్యక్తితో ప్రేమలో ఉన్నట్టేనా? 


ఓ నిర్మాత మీరిద్దరూ ప్రేమికులే అన్న విషయాన్ని ఓ సమావేశంలో స్పష్టం చేశారు కదా? అది నిజం కాదా?

మా మధ్య స్నేహం చూసి ఆయన అలా అనుకుని ఉండొచ్చు. అది ఆయన అభిప్రాయం కావొచ్చు. దాన్ని నేను ఖండించను, సమర్ధించను. ఎవరేమనుకున్నా మా మధ్య స్నేహం తప్ప మరొకటి లేదు.


ఇంతకీ పెళ్ళెపుడు చేసుకుంటారు?

చేతిలో ఉన్న సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉన్నాను. పెళ్ళి గురించి ఆలోచించే తీరికైతే లేదు. అయినా ఇప్పుడప్పుడే చేసుకునే ఉద్దేశం లేదు. నేను చేసుకునేటప్పుడు అందరికీ చెప్పే చేసుకుంటాను.


ఈ మధ్య బాగా వర్కవుట్లు చేస్తున్నట్టున్నారు?

వర్కవుట్లు చేస్తేనే శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోగలం. నేను మొదటి నుంచీ వర్కవుట్లు ఎక్కువగా చేస్తుంటాను. నా తాజా తెలుగు సినిమా ‘నిశ్శబ్దం’ కోసం మరింత ఎక్కువగా వర్కవుట్లు చేసి సన్నపడ్డాను. ఈ పాత్ర కోసం చాలా కష్టపడ్డాను. నా ప్రతి సినిమాకు కష్టపడుతూనే ఉంటాను కానీ, ఈ సినిమాకు మరింత ఎక్కువగా కష్టపడాల్సి వచ్చింది. ఈ సినిమాలో నా పాత్ర అలా ఉంటుంది. సినిమా చూస్తే ఆ విషయం అందరికీ అర్ధమవుతుంది.


ఈ రంగంలోకి వచ్చిన తరువాత బాగా బాధపడిన సందర్భం?

భగవంతుని దయ వలన సినిమాల ఫ్లాపులు నన్ను పెద్దగా బాధపెట్టలేదు. నా సినిమాలన్నీ మినిమమ్‌ గ్యారంటీతో ఆడినవే! సో...సినిమాల పరంగా ఎప్పుడూ బాధపడలేదు. కానీ గతంలో మా ఫ్యామిలీలో కొన్ని సమస్యలు వచ్చి అవి అందరి నోళ్ళల్లోనూ బాగా నానాయి. ఆ సమయంలో నన్ను ఓదార్చినవారి కన్నా, నా పనైపోయిందని అన్నవారే ఎక్కువ. నాతో సన్నిహితంగా ఉండేవారు కూడా అలాంటి మాటలు మాట్లాడడం నాకు బాగా బాధగా అనిపించింది. అది తప్ప సినిమాల్లోకి వచ్చిన తరువాత నేను హ్యాపీగానే ఉన్నాను. 


మీ అభిమాన హీరో, హీరోయిన్లు?

నాతో సినిమాలు చేసిన హీరోలందరూ నాకు ఇష్టమైన వారే. అందులో సీనియర్లు ఉన్నారు, జూనియర్లున్నారు. సీనియర్లంటే భయంతో కూడిన ఇష్టం. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే.. శ్రీదేవిగారంటే చాలా చాలా ఇష్టం. 

Updated Date - 2020-05-06T02:51:28+05:30 IST