మెగాస్టార్ నుంచి కార్తికేయ వరకు.. తమిళ తెరపై విలనిజం పండించిన తెలుగు హీరోలు వీరే..!

ABN , First Publish Date - 2021-09-25T16:43:07+05:30 IST

ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా పాన్-ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి

మెగాస్టార్ నుంచి కార్తికేయ వరకు.. తమిళ తెరపై విలనిజం పండించిన తెలుగు హీరోలు వీరే..!

ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా పాన్-ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఒక భాషకు చెందిన హీరో వేరే భాషల సినిమాల్లోనూ నటిస్తున్నారు. ఇప్పుడే కాదు.. గతంలో కూడా పలువురు తెలుగు నటులు ఇతర భాషల సినిమాల్లో మెరిశారు. ముఖ్యంగా తమిళ సినిమాల్లో విలన్లుగా నటించి మెప్పించారు. తెలుగు ప్రజల మెగాస్టార్ చిరంజీవి ఒక తమిళ సినిమాలో విలన్‌గా నటించారు. చిరంజీవి మాత్రమే కాదు.. జగపతి బాబు, గోపీచంద్, నవీన్ చంద్ర, కార్తికేయ వంటి హీరోలు సైతం తమిళ తెరపై నెగిటివ్ రోల్స్‌లో మెరిశారు. 


చిరంజీవి


నాలుగు దశాబ్దాలుగా తెలుగు తెరపై తిరుగులేని స్టార్‌డమ్ అనుభవిస్తున్న మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ ఆరంభంలో విలన్‌గానే నటించారు. పలు తెలుగు సినిమాల్లో నెగిటివ్ రోల్స్ చేసిన చిరంజీవి.. 1981లో తమిళంలో తెరకెక్కిన `రణువ వీరన్` సినిమాలో విలన్‌గా నటించారు. ఈ సినిమాలో సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరో కాగా.. చిరంజీవి ప్రతినాయకుడిగా కనిపించారు. ఎస్పీ ముత్తురామన్ ఈ సినిమాను తెరకెక్కించారు.


 జగపతి బాబు


ఫ్యామిలీ హీరోగా తెలుగునాట మహిళా ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్న జగపతి బాబు ఆ తర్వాత విలన్‌గా మారిపోయారు. కరుడు గట్టిన విలన్‌గా ఎన్నో సినిమాల్లో నటిస్తున్న జగపతి బాబుకు ఇతర భాషల నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి. ముఖ్యంగా తమిళ స్టార్ హీరోల సినిమాల్లో విలన్ పాత్రలు జగపతినే వరిస్తున్నాయి. `లింగా`, `భైరవ`, `విశ్వాసం` వంటి సినిమాల్లో జగపతి బాబు విలన్‌గా కనిపించి మెప్పించారు. మలయాళం సినిమాల్లో కూడా జగపతి సత్తా చాటుతున్నారు.


నవీన్ చంద్ర


2012లో విడుదలైన `అందాల రాక్షసి` సినిమాతో నవీన్ చంద్ర తెలుగునాట మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత తెలుగుతోపాటు తమిళంలో కూడా పలు సినిమాలు చేశాడు. తమిళ ప్రముఖ హీరో ధనుష్‌కు ప్రతినాయకుడిగా చేసిన `పటాస్` సినిమా నవీన్ చంద్రకు మంచి పేరు తీసుకొచ్చింది. 


గోపీచంద్


`తొలివలపు` సినిమాతో తెరంగేట్రం చేసిన హీరో గోపీచంద్ ఆ తర్వాత `జయం`, `నిజం` వంటి సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించాడు. `జయం` తమిళ రీమేక్‌లో కూడా విలన్‌గా నటించి మెప్పించాడు. అనంతరం యాక్షన్ హీరోగా మారి తెలుగులోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.


 కార్తికేయ


`ఆర్ఎక్స్100` సినిమాతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చాడు యంగ్ హీరో కార్తికేయ. ఆ తర్వాత పలు యూత్‌ఫుల్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు చేరువయ్యాడు. నాని నటించిన `గ్యాంగ్‌లీడర్` సినిమాలో విలన్‌గా నటించిన కార్తికేయ.. ఓ భారీ తమిళ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. అజిత్ హీరోగా తెరకెక్కుతున్న `వాలిమై` సినిమాతో కార్తికేయ తమిళ తెరంగేట్రం చేయనున్నాడు. ఈ సినిమాలో కార్తికేయ విలన్‌గా నటిస్తున్నాడు. 


 

Updated Date - 2021-09-25T16:43:07+05:30 IST