తెలుగమ్మాయిలు ఎక్కడైనా సత్తా చాటగలరు!

ABN , First Publish Date - 2021-08-11T06:29:30+05:30 IST

‘‘నాకు తెలుగు చిత్రాలంటే ఇష్టం, ప్రేమ. చిన్నతనం నుంచి చూస్తూ పెరిగాను. తెలుగు హీరోలను చూసినప్పుడు నాకు ఓ హై వస్తుంది....

తెలుగమ్మాయిలు ఎక్కడైనా సత్తా చాటగలరు!

ప్రియాంకా జవాల్కర్‌

‘‘నాకు తెలుగు చిత్రాలంటే ఇష్టం, ప్రేమ. చిన్నతనం నుంచి చూస్తూ పెరిగాను. తెలుగు హీరోలను చూసినప్పుడు నాకు ఓ హై వస్తుంది. అలాగే, తెలుగులో నటించినప్పుడు! అందుకని, నా తొలి ప్రాధాన్యం తెలుగు చిత్రాలకే! ఇతర భాషల్లో అవకాశాలు వస్తే... చేయడానికి సిద్ధమే. తెలుగు  అమ్మాయిలు ఎక్కడైనా సత్తా చాటగలరు’’ అని ప్రియాంకా జవాల్కర్‌ అన్నారు. ‘తిమ్మరుసు’, ‘ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం’... ఆమె నటించిన రెండు చిత్రాలు వారం వ్యవధిలో థియేటర్లలో విడుదలయ్యాయి. ‘గమనం’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ప్రియాంకా జవాల్కర్‌ చెప్పిన విశేషాలివీ...


‘తిమ్మరుసు’ హిట్‌ అన్నారంతా! ‘ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం’ చిత్రానికి తొలుత మిశ్రమ స్పందన లభించింది. కానీ, తర్వాత వసూళ్లు బావున్నాయి. గతేడాది ఆగస్టులో విడుదల కావాల్సిన చిత్రమిది. కొవిడ్‌ వల్ల ఆలస్యమైంది. ఇంట్లోనే ఏడాది ఖాళీగా ఉన్నాను కదా! వారం వ్యవధిలో రెండు చిత్రాలు విడుదలవుతున్నాయంటే నిద్ర పట్టలేదు. ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? రారా? అని టెన్షన్‌ పడ్డా. రెండిటికీ మంచి స్పందన లభిస్తోండటం హ్యాపీ.


కరోనా వల్ల వచ్చిన విరామంలో... ప్రతి వారం ఏదో ఒక కథ వింటూనే ఉన్నా. సుమారు పాతికకు పైగా కథలు విని ఉంటా. వాటిలో నచ్చినవి ఎంపిక చేసుకుంటా. నేను చేసే ప్రతి సినిమా నిర్మాతలకు లాభం తీసుకురావడంతో పాటు నాకూ మంచి పేరు తెచ్చిపెట్టాలి. వరుస చిత్రాలు చేయడం కంటే నన్ను మర్చిపోని మంచి పాత్రలు చేయాలనేది నా అభిమతం.


‘తిమ్మరుసు’ విడుదల తర్వాత కొంతమంది ‘బాడీ, కెరీర్‌ గురించి కేర్‌ తీసుకోవడం లేదా?’ అని కామెంట్స్‌ చేశారు. ఆరోగ్య సమస్యల వల్ల నేను బరువు పెరిగా. ఎందుకనేది నాకూ తొలుత తెలియలేదు. రక్త పరీక్షలు చేశాక... థైరాయిడ్‌, ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ ఉందన్నారు. జాగ్రత్తలు తీసుకుని మళ్లీ బరువు తగ్గాను. నాకంటే నా కెరీర్‌ గురించి ఎవరూ ఎక్కువ కేర్‌ తీసుకోరు. అందుకని, ‘తిమ్మరుసు’ ఫంక్షన్‌లో ‘నేను మోడల్‌ కాదు, నటి’ అని మాట్లాడాను.


‘గమనం’ చిత్రీకరణ పూర్తయింది. అందులో సహజత్వానికి దగ్గరగా, అభినయానికి ఆస్కారమున్న ఉన్న పాత్ర చేశా. ఓటీటీ అవకాశాలు వస్తున్నాయి. హిందీ, నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్‌లకు ఆడిషన్స్‌ ఇచ్చాను. కథ, పాత్ర నచ్చితే ఎటువంటి స్ర్కిప్ట్‌లోనైనా నటిస్తా. నాకంటూ పరిమితులు పెట్టుకోలేదు. ప్రస్తుతం ఓ తమిళ చిత్రం అంగీకరించా. కన్నడ చిత్రాలు చర్చల్లో ఉన్నాయి.

Updated Date - 2021-08-11T06:29:30+05:30 IST