Ticket Price: టాలీవుడ్ నిర్మాతలు మేల్కొన్నారు

ABN , First Publish Date - 2022-05-19T23:10:39+05:30 IST

కరోనాతో కుదేలు అయిపోయిన చిత్ర పరిశ్రమ దార్లోకి రావాలన్నా, భారీ బడ్జెట్‌ చిత్రాలు లాభాల బాటలో నడవాలన్నా టికెట్‌ రేట్లు పెరగడమే శరణ్యం అని భావించారు బడా సినీ నిర్మాతలంతా(ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో). వారి కోరిక మేరకు ప్రభుత్వం చుట్టూ రెండు మూడుసార్లు తిరిగి ఏదోలా టికెట్‌ ధరలు పెరిగేలా చేశారు.

Ticket Price: టాలీవుడ్ నిర్మాతలు మేల్కొన్నారు

కరోనాతో కుదేలు అయిపోయిన చిత్ర పరిశ్రమ దార్లోకి రావాలన్నా, భారీ బడ్జెట్‌ చిత్రాలు లాభాల బాటలో నడవాలన్నా టికెట్‌ రేట్లు (Ticket rates)పెరగడమే శరణ్యం అని భావించారు బడా సినీ నిర్మాతలంతా(ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో). వారి కోరిక మేరకు ప్రభుత్వం చుట్టూ రెండు మూడుసార్లు తిరిగి ఏదోలా టికెట్‌ ధరలు పెరిగేలా చేశారు. భారీ బడ్జెట్‌ చిత్రాలకు పలు వెసులుబాటులు కూడా కల్పించారు. రెండు రాష్ట్రాల్లోనూ సినిమా విడుదలైన పది రోజుల వరకూ మల్టీప్లెక్స్‌లకు ఒక రేటు, సాధారణ ఏసీ థియేటర్‌కు ఒక రేటు ఏర్పాటు చేశారు. ప్రత్యేక షోను ఏర్పాటు చేశారు. 


టికెట్‌ రేట్ల పెంపు జీవో వచ్చాకే భారీ చిత్రాలు ‘రాధేశ్యామ్‌’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ఆచార్య’, ‘సర్కారు వారి పాట’ చిత్రాలు వరుసగా క్యూ కట్టాయి. భారీగా పెంచిన రేట్లతో భారీ బడ్జెట్‌తో తీసిన చిత్రాలకు రికవరీ తీసుకు రావాలనుకున్నారు. కొన్ని చిత్రాలు మంచి టాక్‌తో వసూళ్ల వర్షం కురిపించగా, మరికొన్ని చతికిలపడ్డాయి. దానికి కారణం అధిక టికెట్‌ రేటు ఓ కారణం. రూ.200, 300, 400 పెట్టి సినిమా చూసేందుకు సామాన్య ప్రజలు వెనకడుగు వేస్తున్నారు. తాజాగా విడుదలైన చిత్రాలే అందుకు ఉదాహరణ. ఈ విషయాన్ని పలువురు నిర్మాతలు గమనించారు కూడా. అందుకే రాజశేఖర్‌ హీరోగా తెరకెక్కిన ‘శేఖర్‌’ సినిమాను మామూలు రేట్లకే, పాత జీవోలో ఏ రేట్లు అయితే ఉన్నాయో అదే రేట్లకు సినిమా చూడొచ్చని జీవితా రాజశేఖర్‌ (Jeevitha rajasekhar) ఇటీవల తెలిపారు. 


ఇప్పుడు అగ్ర నిర్మాత దిల్‌ రాజు(Dil raju) కూడా దిగొచ్చారు. అధిక రేట్ల వల్ల ఉన్న ప్రమాదాన్ని గమనించిన ఆయన విడుదలకు సిద్ధంగా ఉన్న ‘ఎఫ్‌3’ చిత్రాన్ని సాధారణ రేట్లకే థియేటర్లతో చూడొచ్చని ప్రకటించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ‘‘ఎఫ్‌ 3’ సినిమాకి టికెట్‌ రేట్లు పెంచలేదు. పాత జీవో ప్రకారమే రేట్లు నిర్ణయించాం.  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘కేజీఎఫ్‌ 2’ లాంటి భారీ చిత్రాలకు రేట్లు పెంచి దానికి సరిపడా రికవరీ చేయడానికి ప్రయత్నాలు చేశాం. అందులో కొంతవరకూ సక్సెస్‌ అయినట్లే! ఇక్కడ మరో ప్రమాదాన్ని గమనించాం. చాలా మంది ప్రేక్షకులు థియేటర్‌కి రావడం తగ్గిస్తున్నారు. రిపీట్‌ ఆడియన్స్‌ సంఖ్య కూడా తగ్గింది. అప్పర్‌ క్లాస్‌ ఆడియన్స్‌ వరకూ ఓకే కానీ, మిడిల్‌ క్లాస్‌, లోవర్‌ మిడిల్‌ క్లాస్‌ ఆడియన్స్‌ థియేటర్లకు రావడం తగ్గించేశారు. టికెట్‌ ధరలు వారికి అందుబాటులో లేకపోవడమే దీనికి కారణం. ‘ఎఫ్‌3’ F3 అన్ని వర్గాల ప్రేక్షకులు చూసే సినిమా. అందుకే ధరలు అందుబాటులో ఉంచాలనే పాత ధరలకే టికెట్‌ రేట్లు తగ్గించాం’’ అని అన్నారు. 


‘‘దిల్‌ రాజు లాంటి అగ్ర నిర్మాత, డిస్ర్టిబ్యూటర్‌ తన కొత్త సినిమాకు పాత రేట్లే ఉంటాయని నొక్కి నొక్కి చెప్పడం చూస్తుంటే టికెట్ల పెంపు టాలీవుడ్ ని ఎంతగా డ్యామేజ్ చేసిందో అర్థమైపోతుంది’’ అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. 


Updated Date - 2022-05-19T23:10:39+05:30 IST