‘ఇష్క్’ మూవీ రివ్యూ

ABN , First Publish Date - 2021-07-31T00:47:47+05:30 IST

కొవిడ్ సెకండ్ వేవ్ త‌ర్వాత విడుద‌లవుతున్న సినిమాల విషయంలో ఎలాంటి ఫలితాలు వ‌స్తాయ‌నేది అంద‌రిలో ఆస‌క్తి రేపిన త‌రుణంలో.. థియేట‌ర్స్‌లో ‘తిమ్మ‌రుసు’తో పాటు ‘ఇష్క్’ సినిమా కూడా సంద‌డి చేయ‌డానికి సిద్ధ‌మైంది. ఇందులో ఇష్క్ సినిమా విష‌యానికి వ‌స్తే..

‘ఇష్క్’ మూవీ రివ్యూ

చిత్రం: ‘ఇష్క్‌’

సెన్సార్‌: యు/ఏ

బ్యాన‌ర్స్‌: మెగా సూప‌ర్ గుడ్ ఫిలింస్‌

న‌టీన‌టులు: తేజ స‌జ్జా, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌, ర‌వీంద‌ర్ త‌దిత‌రులు

సినిమాటోగ్ర‌ఫీ: శ్యామ్ కె.నాయుడు

సంగీతం: మ‌హ‌తి సాగ‌ర్

ఎడిటింగ్‌: ఎ.వ‌ర‌ప్ర‌సాద్‌

నిర్మాత‌లు: ఎన్‌.వి.ప్ర‌సాద్‌, ప‌రాస్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్

ద‌ర్శ‌క‌త్వం: ఎస్‌.ఎస్‌.రాజు


తెలుగు సినిమా రేంజ్ పాన్ ఇండియా రేంజ్‌కు చేరి, క్ర‌మంగా తెలుగులో పాన్ ఇండియా సినిమాల సంఖ్య పెరుగుతున్న క్రమంలో సినీ రంగ ప‌రిశ్ర‌మతో పాటు యావ‌త్ ప్ర‌పంచంపై అనుకోని పిడుగులా ప‌డింది క‌రోనా వైర‌స్‌. ప్రముఖంగా సినీ ప‌రిశ్ర‌మ విష‌యానికి వ‌స్తే కరోనా రెండు వేవ్స్ కార‌ణంగా తెలుగు సినిమా డీలా ప‌డింది. ఫ‌స్ట్ వేవ్‌కు, సెకండ్ వేవ్‌కు మ‌ధ్య విడుద‌లైన సినిమాల‌న్నీ మంచి ఫ‌లితాల‌ను రాబ‌ట్టుకున్నాయి. ఈ త‌రుణంలో ఇప్పుడు కొవిడ్ సెకండ్ వేవ్ త‌ర్వాత విడుద‌లవుతున్న సినిమాల విషయంలో ఎలాంటి ఫలితాలు వ‌స్తాయ‌నేది అంద‌రిలో ఆస‌క్తి రేపిన త‌రుణంలో.. థియేట‌ర్స్‌లో ‘తిమ్మ‌రుసు’తో పాటు ‘ఇష్క్’ సినిమా కూడా సంద‌డి చేయ‌డానికి సిద్ధ‌మైంది. ఇందులో ఇష్క్ సినిమా విష‌యానికి వ‌స్తే.. ‘జాంబిరెడ్డి’ త‌ర్వాత తేజ స‌జ్జా హీరోగా న‌టించిన చిత్ర‌మిది. వింకీ బ్యూటీ ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌ హీరోయిన్‌గా న‌టించింది. ప్రేమ క‌థతో పాటు ఆస‌క్తిక‌ర‌మైన మ‌రేదో అంశం ఉంద‌నేలా ట్రైల‌ర్ ఆస‌క్తిని రేపిన విషయం తెలిసిందే. మ‌రి ‘ఇష్క్’ ఇటు తేజ స‌జ్జా‌, అటు ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌కి ఎలాంటి స‌క్సెస్‌ను అందించిందో తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం.


క‌థ‌:

విశాఖ ప‌ట్టణంలో ఉండే సిద్ధు (తేజా స‌జ్జా).. అన‌సూయ‌(ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌) ప్రేమ‌లో ఉంటారు. సిద్ధు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అనుకి బ‌ర్త్ డే రోజున స‌ర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన సిద్ధు ఆమెతో లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేస్తాడు. ట్రిప్ బాగా ఎంజాయ్ చేసిన వారిద్ద‌రు కారులో ఉన్న‌ప్పుడు అనుని సిద్ధు ఓ ముద్దు అడుగుతాడు. అదే వారికి స‌మ‌స్య‌ల‌ను తెచ్చి పెడుతుంది. సిద్ధు, అను స‌న్నిహితంగా ఉండ‌టాన్ని మాధ‌వ్‌(ర‌వీంద‌ర్‌) ఫొటోలు, వీడియో తీసి త‌నొక పోలీస్ ఆఫీస‌ర్ అని చెప్పి ఇద్ద‌రినీ బ్లాక్ మెయిల్ చేస్తాడు. సిద్ధు డ‌బ్బులు తీసుకుని వ‌దిలేయ‌మ‌ని చెప్పినా విన‌డు. కారులో రాత్రంతా వారితోనే ట్రావెల్ చేస్తాడు. అనుతో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించి ఆమెపై అఘాయిత్య ప్ర‌య‌త్నం చేస్తాడు. చివ‌ర‌కు సిద్ధు త‌న ద‌గ్గ‌రున్న డ‌బ్బులివ్వ‌డంతో ఇద్ద‌రూ ప‌రిస్థితి నుంచి బ‌య‌ట‌ప‌డ‌తారు. మ‌రుస‌టి రోజు ఉద‌యం సిద్ధుకి ఓ షాకింగ్ నిజం తెలుస్తుంది. ఇంత‌కీ సిద్ధుకి తెలిసే నిజం ఏంటి? మాధ‌వ్ మీద సిద్ధు ఎలా ప్ర‌తీకారం తీర్చుకుంటాడు? వంటి విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


స‌మీక్ష‌:

ఇష్క్‌.. నాట్ ఎ ల‌వ్‌స్టోరి అనే టైటిల్‌తోనే ద‌ర్శ‌కుడు రాజు ల‌వ్‌స్టోరితో పాటు మ‌రేదో చెప్ప‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ని అర్థ‌మ‌వుతుంది. మ‌న చుట్టూ ఉన్న యువ‌తీ యువ‌కులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ను ద‌ర్శ‌కుడు చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. ప్రేమ జంట‌పై ఎవ‌రో అఘాయిత్యం చేశార‌నో, ప్రేమికుల‌కు చేదు అనుభ‌వ‌మ‌నో మ‌నం చ‌దివే ఉంటాం. అలాంటి ఓ పాయింట్‌ను తీసుకున్న ద‌ర్శ‌కుడు దాన్ని ఓ క‌థ‌గా మ‌ల‌చ‌డానికి ప్ర‌య‌త్నించాడు. సినిమాలో ర‌వీంద్ పాత్ర ఎంట్రీ త‌ర్వాత అస‌లు ప్ర‌ధాన‌మైన క‌థేంటి? అనే దానిపై ఓ క్లారిటీ అయితే వ‌చ్చేస్తుంది. అయితే ద‌ర్శ‌కుడు సినిమాను ఎలా ముందుకు న‌డిపాడ‌నేది ముఖ్యం. ఫ‌స్ట్ హాఫ్ చూసిన ప్రేక్ష‌కుడికి ఈ సినిమాలో చెప్ప‌డానికి ఏముంది.. అనే ఆలోచ‌నైతే త‌ప్ప‌కుండా వ‌స్తుంద‌న‌డంలో సందేహం లేదు. ఇక అస‌లు క‌థ ద్వితీయార్థంలోనే స్టార్ట్ అవుతుంది. అయితే ప్రేక్ష‌కుడిని అప్ప‌టి వ‌ర‌కు ఎంగేజ్ చేసే ఎలిమెంట్స్ ఉన్నాయా? అంటే లేవ‌నే చెప్పాలి. ఇక ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ అభిమానులేమైనా ప్ర‌త్యేకంగా ఉంటే చెప్పలేం. మ‌ల‌యాళంలో వ‌చ్చిన మెసేజ్ ఒరియెంటెడ్ మూవీ ఇది. ఇది వ‌ర‌కు ప్రియా ప్ర‌కాశ్ నటించిన మ‌ల‌యాళ చిత్రం ల‌వ‌ర్స్ డే సెకండ్ హాఫ్‌ మెయిన్ పాయింట్ కూడా ఇదే స్టైల్ ఆఫ్ ఫార్మేటే. మ‌రోసారి ప్రియా ప్ర‌కాశ్ అలాంటి క‌థ‌లోనే నటించింది. ఫ‌స్టాఫ్ అంతా సిద్ధు, అను కారులోని స‌న్నివేశాల‌తోనే ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో హీరోకి ర‌వీంద‌ర్ పోలీస్ కాద‌నే విష‌యం తెలిసి అత‌నింటికి వెళ్ల‌డం, ర‌వీంద‌ర్ పాత్ర‌ను అత‌ని భార్య పిల్ల‌ల ముందు అవ‌మానించ‌డం.. వంటి స‌న్నివేశాల‌తో న‌డుస్తుంది. ఇక క్లైమాక్స్‌లో ద‌ర్శ‌కుడు నిజ‌మైన ప్రేమ‌కు అర్థం చెప్పే క్ర‌మంలో అలాంటి ముగింపు ఇచ్చాడా? అని అనుకునేలానే ప్రేక్ష‌కుడికి ఓ ప్ర‌శ్న‌ను మిగిల్చాడు. సినిమా నిడివి త‌క్కువ‌గా ఉండ‌టం ప్ల‌స్ పాయింటే. ఒక పాట ఓకే.. నేప‌థ్య సంగీతం బాగానే ఉంది. ఎడిట‌ర్ ఇంకాస్త నిడివి త‌గ్గిస్తే సినిమా ఏమ‌వుతుందేన‌ని ఆలోచించాడేమో.. కానీ సినిమాను మ‌రింత ఎడిట్ చేస్తే బాగుండేది. నటుడిగా తేజ పాత్ర‌లో ఒదిగిపోయాడు. ఫ‌స్టాఫ్‌లో ఓ భ‌యానికి లోన‌య్యే ల‌వ‌ర్‌గా, సెకండాఫ్‌లో రివేంజ్ తీర్చుకునే వ్య‌క్తిలా క‌నిపించాడు. ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ పాత్ర‌కు పెద్ద‌గా స్కోప్ లేక‌పోయినా, ఉన్నంతలో ఓకే అనిపించింది. ప్ర‌తి నాయ‌క పాత్ర‌లో న‌టించిన ర‌వీంద‌ర్ న‌టుడిగా మంచి మార్కుల‌నే సంపాదించుకున్నాడు.

బోట‌మ్ లైన్‌: టైముంటే చూడొచ్చు

Updated Date - 2021-07-31T00:47:47+05:30 IST