సాంకేతికత ఓ సాధనం మాత్రమే.. అదే సంగీతం కాదు!

ABN , First Publish Date - 2022-08-28T05:56:59+05:30 IST

చిత్ర... ఒక గంధర్వ గాయని. ఆమె పాడితే లోకమంతా ఆడుతుంది. బాధపడితే కన్నీరు కారుస్తుంది.

సాంకేతికత ఓ సాధనం మాత్రమే.. అదే సంగీతం కాదు!

చిత్ర... ఒక గంధర్వ గాయని. ఆమె పాడితే లోకమంతా ఆడుతుంది. బాధపడితే కన్నీరు కారుస్తుంది. లతా మంగేష్కర్‌, ఆశాభోంస్లే, సుశీల, జానకి, వాణీజయరామ్‌ వంటి దిగ్గజ గాయనీమణుల సరసన నిలబడగలిగే ప్రావీణ్యమున్న చిత్ర... ‘మా టీవీ’లో ప్రసారమవుతున్న ‘సూపర్‌ సింగర్స్‌’కు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె తన సంగీత ప్రస్థానాన్ని, అనుభవాలను ‘నవ్య’తో పంచుకున్నారు. 


కొవిడ్‌ తర్వాత బాగా బిజీ అయిపోయినట్లున్నారు.. 

వును. కొవిడ్‌ అందరికీ ఒక మరచిపోలేని అనుభవం. మొదట్లో కొద్దికాలం బానే ఉంది. మన కోసం కొంత సమయం దొరికింది. ఆ తర్వాత కొద్దిగా ఆందోళన మొదలయింది. మళ్లీ ఎప్పుడు మామూలు స్థితికి చేరుకుంటామా? అనే భయం ఉండేది. కొవిడ్‌ ఫేజ్‌ అయిపోయిన తర్వాత నెమ్మదిగా ప్రోగ్రామ్‌లు మొదలయ్యాయి. ఇప్పుడైతే బాగా బిజీ అయిపోయా! రికార్డింగ్‌లు, రియాల్టీ షోలు.. కొద్దిగా తీరిక దొరికితే మా అమ్మాయి పేరు మీద ఏర్పాటు చేసిన ఫౌండేషన్‌ కార్యక్రమాలు చేస్తూ ఉంటా! 


‘సూపర్‌ సింగర్‌’ వంటి కార్యక్రమాలకు జడ్జీగా వ్యవహరిస్తున్నారు కదా.. ఇప్పటి తరం గాయకుల మీద మీ అభిప్రాయమేమిటి?

చాలా మంది బాగా పాడుతున్నారు. మా తరంలో ఇలాంటి పోటీలు కొన్నే ఉండేవి. ఇన్ని అవకాశాలు లేవు. ఈ పోటీల్లో పాల్గొనేవారిని చూస్తుంటే ముచ్చటేస్తుంది. మొదటి రౌండ్‌కి.. చివరి రౌండ్‌కి మధ్య వారిలో గుణాత్మకమైన మార్పు ఉంటోంది. అయితే ఇక్కడ నేను ఇంకో విషయం కూడా చెప్పాలి... మా చిన్నప్పుడు పోటీల్లో మొత్తం పాటలు పాడేవాళ్లం. ఆ తర్వాత సినిమాల్లో అవకాశం వస్తే.. రికార్డింగ్‌కు వెళ్లినప్పుడు కూడా ప్రాక్టీసు చేసేవాళ్లం. చిన్న తప్పు చేస్తే మళ్లీ టేక్‌ తీసుకోవాల్సి వచ్చేది. అందువల్ల ఎప్పుడూ అప్రమత్తంగా ఉండేవాళ్లం. ఇప్పుడు పోటీల్లో మాత్రమే పల్లవులు, చరణాలు పూర్తిగా పాడుతున్నారు. రికార్డింగ్‌ల్లో తప్పు జరిగినా పర్వాలేదు. పదాలే కాదు.. అక్షరాలను కూడా మళ్లీ కలిపేసుకోవచ్చు. ఆ విధంగా చూస్తే ఇప్పటి తరం వారికి అంత 

టెన్షన్‌ లేదు. 


సినీ నేపథ్య సంగీతాన్ని టెక్నాలజీ కమ్మేస్తోందనే వాదన బలంగా వినిపిస్తూ ఉంటుంది.. దీనిపై మీ అభిప్రాయం..?

సినీ నేపథ్య సంగీతంలో అనేక మార్పులు వచ్చిన సంగతి వాస్తవమే. నేను కొత్తగా పరిశ్రమకు వచ్చిన రోజుల్లో ఆర్కేస్ట్రాతో రిహార్సల్స్‌ ఉండేవి. అందరూ కలిసి ప్రాక్టీసు చేసేవాళ్లం. ఆ తర్వాతి కాలంలో సింగర్స్‌ ఎవరి భాగం వారు పాడితే దానిని మిక్స్‌ చేసేవారు. ఇప్పుడైతే రికార్డింగ్‌ స్టూడియోకు కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. మన లైన్స్‌ పాడేసి పంపితే చాలు. అయితే మార్పును అందరం ఆహ్వానించాలి. దానిలో ఉన్న మంచిని తీసుకోవాలి. ఒకప్పుడు పూర్తి పాటను ప్రాక్టీస్‌ చేసి పాడే మా తరం వారికి ఇదంతా కొత్తగానే ఉంటుంది. ఇప్పుడు నాకు అలవాటు 

అయిపోయింది. 


సినిమాలో పాటలు ఎవరైనా పాడేయవచ్చని చాలా మంది భావిస్తున్నారు.. మీరేమంటారు?

కొద్దిగా సంగీత జ్ఞానం లేనివారు కూడా పాడవచ్చేనేది నిజమే! శ్రుతి, లయ లేకుండా పాడినా వాటిని సరిచేసే టెక్నాలజీలు వచ్చేశాయి. అయితే అందరూ అలా పాడుతున్నారనేది నా ఉద్దేశం కాదు. టెక్నాలజీని సంగీతాన్ని మెరుగుపరిచే ఒక సాధనంగా వాడుకోవాలి తప్ప సాంకేతికతోనే సంగీతాన్ని సృష్టించే పరిస్థితికి రాకూడదు. అలాగని నేను టెక్నాలజీకి వ్యతిరేకం కాదు. ఒక మంచి గాయని అన్ని మార్పులకు తట్టుకొని నిలబడాలి. అన్ని రకాల పాటలూ పాడగలగాలి. 


ఈ తరం వారిలో మీకు నచ్చిన గాయకులు ఎవరు?

ఒకప్పుడు అందరం కలిసి ప్రాక్టీసు చేసేవాళ్లమని చెప్పాను కదా! అప్పుడు అందరికీ అందరితో పరిచయం ఉండేది. ఇప్పుడు అంత అవకాశం లేదు. పోటీలకు వచ్చినప్పుడు చూడటం తప్ప సింగర్స్‌ను కలిసే అవకాశం ఉండటం లేదు. యువతరం గాయకుల్లో హేమచంద్ర, శ్రీకృష్ణ నాతో సన్నిహితంగా ఉంటారు.


అనేక మంది సంగీత దర్శకులతో పనిచేశారు కదా.. వారిలో ఎవరితో పనిచేయటం కష్టం?

రాజాసర్‌, కీరవాణిగారు, రహమాన్‌గారు.. ఇలా  అనేక మంది సంగీత దర్శకులతో కలిసి పనిచేశా. అందరూ సంగీతజ్ఞులే! ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్‌. అందరి దగ్గరా కఠినమైన పాటలు పాడా! ఉదాహరణకు ‘అరుంధతి’ సినిమాలో ఒక పాట ఉంటుంది. చాలా హైపిచ్‌లో పాడాలి. ఆ పాట పాడిన తర్వాత మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఇక రాజాసర్‌ దగ్గర అనేక వందల పాటలు పాడా. ఆయన దగ్గర ఫుల్‌ ఆర్కెస్ట్రాతో పాడాల్సి ఉంటుంది. అదో ఛాలెంజ్‌. ఇక రహమాన్‌ సర్‌ టెక్నాలజీకి పెద్ద పీట వేస్తారు. ఆయన దగ్గర ఆర్కెస్ట్రాలు ఉండవు. తనకు ఏం కావాలో చెబుతారు. అది ఓకే అయిపోయిన తర్వాత- ‘‘మీరు ఇంప్రూవ్‌ చేయాలనుకుంటే చేయండి..’’ అంటారు. మనం ఎన్ని రకాలుగా పాడినా రికార్డు చేస్తారు. వాటిలో చాలా బావున్నది తీసుకుని మిక్స్‌ చేస్తారు. అయితే పాట బయటకు వచ్చేదాకా అది ఎలా ఉంటుందో తెలియదు. సస్పెన్స్‌. అలా అనేకమైన అద్భుతమైన పాటలు వచ్చాయి. మిగిలిన సంగీత దర్శకుల దగ్గర పాట ఎలా ఉందో రికార్డింగ్‌ అయిపోయిన వెంటనే తెలిసిపోతుంది. 




మీరు రెండు కచేరీలు చేశారు కదా.. ఆ అనుభవం ఎలా ఉంది? 

నేను శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నా. సంగీతం నేర్చుకున్నవారికి కచేరీ చేయటమనేది ఒక పెద్ద కల. నాకు కూడా అంతే. సినిమాల్లోకి వచ్చిన చాలా కాలం తర్వాత నా మొదటి కచేరి చేశా. ఆ తర్వాత మరొకటి చేశా. కచేరీ చేయటానికి చాలా క్రమశిక్షణ ఉండాలి. నేను ఎక్కువ సేపు కూర్చోవటానికి ఇబ్బంది పడ్డా! రికార్డింగ్‌లు.. టూర్స్‌ వల్ల కుదరటం లేదు. మళ్లీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తా! 


ఇన్నేళ్ల అనుభవం.. ఇన్ని వేల పాటల తర్వాత కూడా మీరు ప్రతి రోజూ సాధన చేస్తారా? 

నాకు సమయం దొరికినప్పుడు తప్పకుండా చేస్తూ ఉంటా. చాలాసార్లు టూర్ల వల్ల.. రికార్డింగ్‌ల వల్ల సమయం కుదరదు. ఎంత గొప్ప గాయకుడికైనా సాధన తప్పనిసరిగా ఉండాలి. అదే వారిని ముందుకు నడిపిస్తుంది. క్రమశిక్షణలో ఉంచుతుంది. 

సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌ 



దిగివచ్చిన గంధర్వుడాయన...

ఈ భూమిపైకి వచ్చిన గంధర్వుడు బాలసుబ్రమణ్యంగారు. ఆయన లేరు అనే విషయాన్ని ఇప్పటికీ నేను జీర్ణించుకోలేకపోతున్నా! ఆయన రికార్డింగ్‌కు వస్తే ఒక పండగలా ఉండేది. అప్పటి దాకా ఉన్న వాతావరణమంతా మారిపోయేది. ఆయన వచ్చిన వెంటనే ఆర్కెస్ట్రాలో ఉన్న వారందరినీ పేరుపేరునా పలకరించేవారు. వారి కుటుంబ సభ్యుల గురించి అడిగేవారు. ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారు. నాకు మొదట్లో తెలుగు అంత బాగా వచ్చేది కాదు. నా ఉచ్ఛారణలో ఏవైనా తప్పులు వస్తే ఆయన వెంటనే సరిచేసేవారు. కేవలం ఉచ్ఛారణ మాత్రమే కాదు.. ఒక పాటను ఎంత శ్రద్ధగా పాడాలి? భావాలను ఎలా పలికించాలి? అనే విషయాన్ని ఆయన దగ్గర నేర్చుకున్నా. రాజా సర్‌ అసిస్టెంట్‌లను ఆయన ఆట పట్టించిన అనేక సందర్భాలు ఇంకా నాకు గుర్తున్నాయి. 


మా మంచి మాస్టారు 

నేను పాడిన తొలి పాట దాసన్‌(ఏసుదాసు)తోనే! ఆయన ఒక సంగీత నిధి. నన్ను సొంత బిడ్డలా చూసుకుంటారు. మేము అమెరికా టూర్స్‌కు వెళ్లినప్పుడు వీకెండ్‌లో కన్సర్ట్స్‌ ఉండేవి. మిగిలిన నాలుగు రోజులు ఖాళీగా ఉండేవాళ్లం. దాసన్‌ దగ్గర ఒక పుస్తకం ఉంటుంది. దానిలో త్యాగరాజ కృతులన్నీ ఉంటాయి. వాటిని ఆయన సాధన చేస్తూ ఉండేవారు. ‘‘నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు నా దగ్గరకు వస్తే కీర్తనలు నేర్పుతా’’ అనేవారు. ఆయనకు సంగీతమంటే అంత పిచ్చి! ఆయనతో కలిసి పాడే అదృష్టం రావటం నా పూర్వజన్మ సుకృతం. 


అరుంధతి సినిమాలో ఒక పాట ఉంటుంది. చాలా హైపిచ్‌లో పాడాలి.  ఆ పాట పాడిన తర్వాత మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఇక రాజాసర్‌ దగ్గర అనేక వందల పాటలు పాడా. ఆయన దగ్గర ఫుల్‌ ఆర్కెస్ట్రాతో పాడాల్సి ఉంటుంది. అదో ఛాలెంజ్‌. రహమాన్‌ సర్‌ టెక్నాలజీకి పెద్ద పీట వేస్తారు. ఆయన దగ్గర ఆర్కెస్ట్రాలు ఉండవు. 


Updated Date - 2022-08-28T05:56:59+05:30 IST