Teachers Day Special: రాజబాబు నుంచి సుకుమార్ వరకు.. ఉపాధ్యాయ వృత్తి నుంచి సినీ రంగంలోకి వచ్చిన ప్రముఖులు వీళ్లే..

Twitter IconWatsapp IconFacebook Icon
Teachers Day Special: రాజబాబు నుంచి సుకుమార్ వరకు.. ఉపాధ్యాయ వృత్తి నుంచి సినీ రంగంలోకి వచ్చిన ప్రముఖులు వీళ్లే..

డాక్టర్ కాబోయి యాక్టర్‌ను అయ్యాను.. అంటూ చాలా మంది నటీనటులు ఇంటర్వ్యూల్లో చెబుతూ ఉంటారు. కానీ కొందరు మాత్రం వృత్తిరీత్యా బడి పంతుళ్లు అయినా సినిమా రంగం అంటే మోజుతో, సినీ ఇండస్ట్రీలోనూ కొత్త పాఠాలు చెప్పాలన్న తపనతో ఉపాధ్యాయుడిగా ఉద్యోగానికి గుడ్ బై చెప్పారు. సినీ ఇండస్ట్రీ తలరాతనే మార్చేశారు. బోర్డు మీద అక్షరాలు రాయాల్సిన చేతులే సినిమా పాటలు రాశాయి. పవర్ ఫుల్ డైలాగులను కూడా పేల్చాయి. స్కూల్లో పాఠాలు వల్లెవేయించాల్సిన వారే.. హీరోలకు నటనలో కొత్త ఓనమాలు నేర్పించారు. మెగా ఫోన్‌ను పట్టుకుని డైరెక్షన్ చేశారు. బెత్తం పట్టుకుని మరీ విద్యార్థులను సరైన మార్గంలో నడిపించిన టీచరమ్మలే.. సినీ ఇండస్ట్రీకి వచ్చి హీరోయిన్లుగా మారిన వాళ్లూ ఉన్నారు.. తెరమీద నటనాభినయంతో ప్రేక్షకులకు ఆనందాన్ని కూడా పంచిపెట్టారు. ఆ సినీరంగ ఉపాధ్యాయుల గురించే ఈ ప్రత్యేక కథనం..

Teachers Day Special: రాజబాబు నుంచి సుకుమార్ వరకు.. ఉపాధ్యాయ వృత్తి నుంచి సినీ రంగంలోకి వచ్చిన ప్రముఖులు వీళ్లే..

సి. నారాయణ రెడ్డి

తెలుగు కవి, సాహితీవేత్త. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవ ఎనలేనిది. ఆయన పూర్తి పేరు సింగిరెడ్డి నారాయణ రెడ్డి. 1988లో ఆయన రచించిన ‘విశ్వంభర’ కావ్యానికి ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. సికింద్రాబాద్‌లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసిన సి. నారాయణ రెడ్డి.. అటు తర్వాత నిజాం కళాశాలలోనూ అధ్యాపకుడిగా పని చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయములో ఆచార్యునిగా పనిచేస్తూ అనేక ఉన్నత పదవులు, బహుమతులు అందుకున్నారు. విశ్వనాధ సత్యనారాయణ తర్వాత జ్ఞానపీఠ పురస్కారం పొందిన తెలుగు సాహీతీకారుడు ఆయనే. తెలుగు చలన చిత్ర రంగంలో ఆయన రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందడమే కాకుండా.. ఇప్పటికీ అవి మానవ జాతిపై ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి.

Teachers Day Special: రాజబాబు నుంచి సుకుమార్ వరకు.. ఉపాధ్యాయ వృత్తి నుంచి సినీ రంగంలోకి వచ్చిన ప్రముఖులు వీళ్లే..

కొంగర జగ్గయ్య

మేఘ గంభీరమైన కంఠం కారణంగా నటుడు కొంగర జగ్గయ్య ‘కంచు కంఠం’ జగ్గయ్యగా, ‘కళా వాచస్పతి’గా పేరు పొందారు. భారత ప్రభుత్వం 1992లో ప్రతిష్ఠాత్మకమైన పద్మభూషణ్ అవార్డ్‌తో ఆయనను సత్కరించింది. నటుడిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించిన జగ్గయ్య.. ఉపాధ్యాయ వృత్తి నుండే సినీ ఇండస్ట్రీకి వచ్చారు. డిగ్రీ పూర్తవగానే తెనాలి దగ్గర ఉన్న దుగ్గిరాలలో ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఆయన పని చేశారు. అప్పుడు కూడా పాఠశాల పని పూర్తవగానే.. రైల్లో బెజవాడకు వెళ్ళి నాటకాల రిహార్సల్స్ చేయడం, నాటకాలు వేయడం చేస్తుండేవారు. దుగ్గిరాల ఉన్నత పాఠశాలలో జమున ఆయన స్టూడెంట్, ఆమెతో ఢిల్లీ రాజ్య పతనం అనే నాటకంలో వేషం వేయించారు జగ్గయ్య. అలా ఉపాధ్యాయ వృత్తి నుండి నటుడిగా మారిన జగ్గయ్య.. ఎన్నో పాత్రలలో నటించి.. నటుడిగా విశిష్టస్థానాన్ని అందుకున్నారు. 

Teachers Day Special: రాజబాబు నుంచి సుకుమార్ వరకు.. ఉపాధ్యాయ వృత్తి నుంచి సినీ రంగంలోకి వచ్చిన ప్రముఖులు వీళ్లే..

రాజబాబు

ఓ తరాన్ని తన హాస్యంతో ఉర్రూతలూగించిన హాస్యనటుడు రాజబాబు. ఆయన స్ఫూర్తితో ఎందరో కమెడియన్స్‌గా మారారు. తెలుగు వాకిళ్ళలో రాజబాబు పండించిన హాస్యం తాలూకు నవ్వులు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. అయితే రాజబాబు కూడా కొద్దికాలం పాటు ఉపాధ్యాయ వృత్తిని అలంకరించిన వారే. నిడదవోలులో పాఠశాల చదువు చదువుతూనే బుర్రకథ నేర్చుకోవడానికి శ్రీ అచ్యుత రామయ్యగారి దగ్గర చేరారు. ఇంటర్మీడియట్ పూర్తయిన తరువాత ఉపాధ్యాయ శిక్షణ కోర్సు ముగించి తెలుగు ఉపాధ్యాయుడుగా కొంతకాలం పాటు ఆయన పనిచేశారు. ఆ తర్వాత ఆయన సినీ రంగంవైపు అడుగులు వేసి.. గొప్ప హాస్యనటుడిగా చెక్కుచెదరని స్థానాన్ని అందుకున్నారు.

Teachers Day Special: రాజబాబు నుంచి సుకుమార్ వరకు.. ఉపాధ్యాయ వృత్తి నుంచి సినీ రంగంలోకి వచ్చిన ప్రముఖులు వీళ్లే..

భానుమతి

దక్షిణ భారత సినిమా నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు.. ఇలా అనేక శాఖలలో అనుభవమున్న బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి. ఆమె తండ్రి బొమ్మరాజు వెంకట సుబ్బయ్య శాస్త్రీయ సంగీత కళాకారుడు. తండ్రి దగ్గర సంగీతం అభ్యసించిన ఆమె పదమూడేళ్ళ వయసులోనే ‘వరవిక్రయం’ అనే సినిమాతో బాల నటిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించి, ఎన్నో సినిమాలను నిర్మించి తనదంటూ ఒక ముద్రను.. తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపును పొందారు. MGR హయాంలో తమిళ నాడు చెన్నై సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌గా ఆమె బాధ్యతలను నిర్వహించారు.

Teachers Day Special: రాజబాబు నుంచి సుకుమార్ వరకు.. ఉపాధ్యాయ వృత్తి నుంచి సినీ రంగంలోకి వచ్చిన ప్రముఖులు వీళ్లే..

శాంత కుమారి

శాంతకుమారి అసలు పేరు వెల్లాల సుబ్బమ్మ. 1936లో ‘శశిరేఖా పరిణయం’ సినిమాతో నటజీవితం ప్రారంభించి వందకు పైగా సినిమాల్లో నటించారు. ఆమె తండ్రి పేరు వెల్లాల శ్రీనివాసరావు. ఆయనకు కళలంటే ఎంతో ఇష్టం. అందుకే.. కూతురైన సుబ్బమ్మకు కర్ణాటక సంగీతం, వయొలిన్ నేర్పించారు. డి.కె. పట్టమ్మాళ్.. సుబ్బమ్మకు సహాధ్యాయిని. పదమూడేళ్ళ వయసులోనే సుబ్బమ్మ కర్ణాటక సంగీతంలో ఉత్తీర్ణురాలయ్యింది. పదహైదేళ్ళ వయసులో వయొలిన్‌లో ఉత్తీర్ణురాలైంది. తరువాత గురువుగారితో కలసి దక్షిణ భారతదేశం అంతా ఎన్నో కచేరీలు చేసింది. పదహారేళ్ళ వయసులోనే విద్యోదయా స్కూలులో ఆమె పిల్లలకు సంగీతం నేర్పి.. గురువుగా ఎందరినో తీర్చిదిద్దింది.

Teachers Day Special: రాజబాబు నుంచి సుకుమార్ వరకు.. ఉపాధ్యాయ వృత్తి నుంచి సినీ రంగంలోకి వచ్చిన ప్రముఖులు వీళ్లే..

రాజ సులోచన

ఉపాధ్యాయ వృత్తి నుంచి సినీరంగంలోకి వచ్చిన వారిలో అలనాటి తెలుగు సినిమా నటి, కూచిపూడి, భరత నాట్య నర్తకి రాజ సులోచన. 1953లో కన్నడ చిత్రం ‘గుణసాగరి’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన రాజ సులోచన.. దాదాపు అన్ని భాషలలోని అప్పటి అగ్ర నటులతో నటించారు. ఆమె సుమారు 275 చిత్రాలలో నటించారు. ఆమెకున్న గొప్పతనం ఏమిటంటే.. ఆమె నటించిన ప్రతి భాషలోనూ తన పాత్రకు స్వయంగా డైలాగ్స్ చెప్పుకునేవారు. 1963లో ఆమె పుష్పాంజలి నృత్య కళాకేంద్రం అనే శాస్త్రీయ నృత్య పాఠశాల ప్రారంభించింది. అది ఇప్పటికీ నడుస్తున్నది. రమ్యకృష్ణ, భానుప్రియ వంటి వారు ఆమె శిష్యులే.

Teachers Day Special: రాజబాబు నుంచి సుకుమార్ వరకు.. ఉపాధ్యాయ వృత్తి నుంచి సినీ రంగంలోకి వచ్చిన ప్రముఖులు వీళ్లే..

మోహన్ బాబు

టాలీవుడ్‌లో కలెక్షన్ కింగ్‌గా పేరున్న మోహన్ బాబు అసలు పేరు భక్తవత్సలం నాయుడు. సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకడిగా ఇప్పటికీ గుర్తింపు పొందుతున్న మోహన్ బాబు.. నటుడిగా, నిర్మాతగా సినీ రంగంలో తనదైన ముద్రను చాటుకున్నారు. అయితే సినీ రంగంలోకి ప్రవేశించక ముందు కొంతకాలం పాటు ఆయన వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. సినీ రంగంలోకి వచ్చిన తర్వాత ఎన్నో కష్టాలను అనుభవించి.. ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నట్లుగా ఆయన చెబుతుంటారు. దర్శకరత్న దాసరి నారాయణరావు తనకి గురువుగా ఆయన చెప్పుకుంటారు.

Teachers Day Special: రాజబాబు నుంచి సుకుమార్ వరకు.. ఉపాధ్యాయ వృత్తి నుంచి సినీ రంగంలోకి వచ్చిన ప్రముఖులు వీళ్లే..

శోభన

నాట్యంలోనూ, నటనలోనూ ప్రసిద్ధి చెందిన లలిత, పద్మిని, రాగిణిల మేనకోడలు శోభన. 1980లలో భారతదేశంలో ప్రతిభావంతులైన కళాకారిణులలో ఆమె కూడా ఒకరు. అందంలోనూ, నటనలోనే కాక నాట్యంలో కూడా అద్భుతంగా రాణించిన శోభన.. 1994లో కళార్పణ అనే సంస్థకు అంకురార్పణ చేసింది. ఈ సంస్థ యొక్క ముఖ్యోద్దేశం భరతనాట్యంలో శిక్షణ, భారతదేశమంతటా నృత్యవార్షికోత్సవాలు నిర్వహించడం.

Teachers Day Special: రాజబాబు నుంచి సుకుమార్ వరకు.. ఉపాధ్యాయ వృత్తి నుంచి సినీ రంగంలోకి వచ్చిన ప్రముఖులు వీళ్లే..

పరుచూరి గోపాలకృష్ణ

పరిచయం అక్కరలేని పేరు పరుచూరి గోపాలకృష్ణ. రైటర్‌గా ఎన్నో చిత్రాలకు తన సోదరుడితో కలిసి పనిచేశారు. సినిమాలకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. అయితే ఆయన సినీ రంగంలోకి రాక ముందు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. పత్తేపురంలోని మూర్తిరాజు కళాశాలలో ఆయన లెక్చరర్‌గా పని చేశారు. నటుడు ఎమ్.ఎస్. నారాయణకి గురువు, ఆ తర్వాత ఆయనకి సహోద్యోగి కూడా. విశేషం ఏమిటంటే.. ఎమ్మెస్- తన క్లాస్ మేట్ కళాప్రపూర్ణను ప్రేమిస్తే పరుచూరి దగ్గరుండి పెళ్ళి కూడా చేయించారు. కథా రచయితగా సినిమాలు విజయవంతం కావడంతో సినీరంగంలోనే భవిష్యత్తుని నిర్ణయించుకుని.. ఉపాధ్యాయుడిగా ఉద్యోగాన్ని వదిలేశారు. సినీరంగంలో పనిచేసిన, చాన్నాళ్లకు తిరిగి తల్లికోరిక మీద పీహెచ్‌డీ చేసి డాక్టరేట్ పట్టా పొందారు. ఆ క్రమంలోనే తెలుగు సినిమా సాహిత్యం కథ-కథనం-శిల్పం అనే సిద్ధాంత గ్రంథాన్ని ఆయన రచించారు. ఇప్పటికీ యూట్యూబ్ వేదికగా పరిచూరి పాఠాలు అంటూ.. సినిమా నిర్మాణానికి సంబంధించిన పాఠాలు చెబుతూ.. తన ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తున్నారు. 

Teachers Day Special: రాజబాబు నుంచి సుకుమార్ వరకు.. ఉపాధ్యాయ వృత్తి నుంచి సినీ రంగంలోకి వచ్చిన ప్రముఖులు వీళ్లే..

బ్రహ్మానందం

ఈ పేరు వింటేనే ముఖంపై తెలియకుండానే చిరు నవ్వు వికసిస్తుంది. అంతలా ప్రేక్షకులలో ఆనందాన్ని నింపిన బ్రహ్మానందం కూడా.. సినీ రంగంలోకి రాక ముందు ఓ టీచరే. బ్రహ్మానందం భీమవరం డి.ఎన్.ఆర్. కాలేజీలో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసారు. గుంటూరు పీజీ సెంటర్లో తెలుగు సాహిత్యంలో ఎమ్మే పట్టా పుచ్చుకొన్నారు. అత్తిలిలో తొమ్మిది సంవత్సరాలు లెక్చరర్‌గా పని చేశాక సినీరంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ.. తనదైన మార్క్‌తో హాస్యబ్రహ్మగా చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పుడొస్తున్న కమెడియన్లకు కూడా ఆయనే స్ఫూర్తి, గురువు.. అంటే ఎంతగా ఆయన ప్రభావం పరిశ్రమలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

Teachers Day Special: రాజబాబు నుంచి సుకుమార్ వరకు.. ఉపాధ్యాయ వృత్తి నుంచి సినీ రంగంలోకి వచ్చిన ప్రముఖులు వీళ్లే..

ఎమ్.ఎస్. నారాయణ

తనదైన తరహా హాస్యంతో దాదాపు 17 సంవత్సరాల కెరీర్లో 700 పైగా సినిమాల్లో నటించిన కమెడియన్ ఎమ్.ఎస్. నారాయణ. సినీ రంగంలోకి రాకముందు ఆయన కూడా టీచర్‌గా పనిచేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కె.జి.ఆర్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసి,. కళారంగంపై ఉన్న ఆస్తకితో అధ్యాపకుడి పదవికి రాజీనామా చేశారు. మొదట సినీ రచయితగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి.. ఆ తర్వాత నటుడిగా, కమెడియన్‌గా గుర్తింపును పొందారు. రచయితగా ఆయన ఎనిమిది చిత్రాలకు పనిచేశారు. 

Teachers Day Special: రాజబాబు నుంచి సుకుమార్ వరకు.. ఉపాధ్యాయ వృత్తి నుంచి సినీ రంగంలోకి వచ్చిన ప్రముఖులు వీళ్లే..

తనికెళ్ళ భరణి

మల్టీ టాలెంటెడ్ వ్యక్తి తనికెళ్ల భరణి. నటుడిగా, దర్శకుడిగా, గేయ రచయితగా.. ఇలా ప్రతి శాఖపై పట్టున్న వ్యక్తులలో తనికెళ్ల భరణి ఒకరు. ఆయన సినీ రంగానికి రాక ముందు ఉపాధ్యాయుడిగా చేయలేదు కానీ.. అప్పట్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ట్యూషన్లు చెప్పేవాడినని పలుమార్లు ఆయన ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో ముకాభినయం (మైమ్)పై ఏడాది పాటు ఆయన క్లాసులు నిర్వహించారు. 

Teachers Day Special: రాజబాబు నుంచి సుకుమార్ వరకు.. ఉపాధ్యాయ వృత్తి నుంచి సినీ రంగంలోకి వచ్చిన ప్రముఖులు వీళ్లే..

జయ ప్రకాశ్ రెడ్డి

రాయలసీమ యాసలో డైలాగ్ చెప్పాలంటే ముందుగా గుర్తొచ్చే పేరు జయ ప్రకాశ్ రెడ్డి. ఆయన చెప్పే సంభాషణలకు ప్రత్యేక అభిమానులున్నారు. దాదాపు 300కి పైగా సినిమాలలో నటించిన జయ ప్రకాశ్ రెడ్డి.. ఎక్కువగా ప్రతినాయక, హాస్య పాత్రలనే చేశారు. అయితే ఆయన సినీ రంగానికి రాక ముందు మ్యాథ్స్ టీచర్‌గా బాధ్యతలు నిర్వహించారు. డిగ్రీ తర్వాత ఉపాధ్యాయ శిక్షణ తీసుకున్న ఆయన.. 1979 నుంచి 1981 వరకు నల్లగొండలోని సెయింట్ ఆల్ఫోన్సస్ హైస్కూల్లో మ్యాథ్స్ టీచర్‌గా పని చేశారు. సినిమా అవకాశాలతో రెండింటిపై దృష్టి పెట్టలేక ఉపాధ్యాయ వృత్తి నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) తీసుకున్నారు.

Teachers Day Special: రాజబాబు నుంచి సుకుమార్ వరకు.. ఉపాధ్యాయ వృత్తి నుంచి సినీ రంగంలోకి వచ్చిన ప్రముఖులు వీళ్లే..

సుకుమార్

తెలుగు సినిమా అగ్ర దర్శకులలో సుకుమార్ ఒకరు. అయితే ఆయన దర్శకుడిగా అడుగులు వేయక ముందు మ్యాథ్స్ లెక్చరర్‌గా కొంతకాలం పాటు ఉపాధ్యాయ వృత్తిని నిర్వహించారు. ఆయన చదువుకునే సమయంలో కళాశాలలో గణితం బోధించే అధ్యాపకులు లేకపోవడంతో సుమారు పది మైళ్ళ దూరం వెళ్ళి వేరే అధ్యాపకుడి దగ్గర మ్యాథ్స్ నేర్చుకున్నారు. అలా డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తయ్యే సరికి.. ఆయనకి లెక్కల మీద మంచి పట్టు వచ్చింది. తర్వాత తనే జూనియర్లకు మ్యాథ్స్ నేర్పించడం మొదలుపెట్టారు. ఒక వైపు చదువుకుంటూ.. రాజోలులో ట్యూషన్లు చెప్పేవారు. తర్వాత 1998లో కాకినాడ ఆదిత్య కాలేజ్‌లో మ్యాథ్స్ లెక్చరర్ ఉద్యోగం వచ్చింది. నెలకు 75 వేలు జీతం. ఈ ఉద్యోగంలో బాగా నిలదొక్కుకున్నా మనసు మాత్రం సినిమాలవైపు లాగుతుండటంతో.. 2000 సంవత్సరంలో సినీ రంగం వైపు అడుగులు వేసి.. ఈ రోజు దర్శకుడిగా తన దైన ముద్రను వేసుకోగలిగారు.

Teachers Day Special: రాజబాబు నుంచి సుకుమార్ వరకు.. ఉపాధ్యాయ వృత్తి నుంచి సినీ రంగంలోకి వచ్చిన ప్రముఖులు వీళ్లే..

త్రివిక్రమ్ శ్రీనివాస్

అందరూ మాటల మాంత్రికుడని పిలుచుకునే త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈ రోజు టాలీవుడ్ అగ్ర దర్శకులలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఆయన రాసే డైలాగ్స్‌కు ప్రత్యేక అభిమానులున్నారు. సాహిత్యంపై ఉన్న పట్టుతో.. రచయితగా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన త్రివిక్రమ్.. ఇప్పుడు దర్శకుడిగానూ తనదైన మార్క్ చాటుతున్నారు. త్రివిక్రమ్, హాస్యనటుడు సునీల్ ఒకే కళాశాలలో చదువుకున్నారనే విషయం తెలిసిందే. అయితే త్రివిక్రమ్ వెనుక టీచర్ హిస్టరీ లేదు కానీ.., ఆర్థిక సమస్యల వల్ల కెరీర్ ప్రారంభంలో నటుడు గౌతంరాజు కుమారునికి ట్యూషన్లు చెప్పేవాడినని ఆయనే ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. 


ఇలా మరికొందరు.. నటనపై ఉన్న ప్యాషన్‌తో తమ ఉపాధ్యాయ వృత్తిని పక్కన పెట్టి సినిమా రంగంవైపు అడుగులు వేశారు. ఇక్కడ సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ని సాగించిన వారున్నారు. అలాగే ఈ రంగంలో ఇమడలేక వెనుదిరిగిన వారూ ఉన్నారు. వారు ఏ రంగంలో ఉన్నా కూడా.. గురువుగా బాధ్యతలు చేపట్టిన వారే కనుక వారందరికీ గురుపూజోత్సవ శుభాకాంక్షలు.

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.