Tammareddy: ఒక్క జూనియర్ ఎన్టీఆర్‌కి తప్పితే ఇప్పుడున్న చాలామంది హీరోలకి తెలుగు రాదు

ABN , First Publish Date - 2022-08-29T23:40:23+05:30 IST

తెలుగు భాషా దినోత్సవం (Telugu Bhasha Dinotsavam) సందర్భంగా మన తెలుగు సినిమాల్లో తెలుగు (Telugu) పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి చూస్తే, మనం ఎంత దిగజారిపోయామో అర్థం అవుతోంది. ఇప్పుడు అందరూ..

Tammareddy: ఒక్క జూనియర్ ఎన్టీఆర్‌కి తప్పితే ఇప్పుడున్న చాలామంది హీరోలకి తెలుగు రాదు

“తెలుగు భాషా దినోత్సవం (Telugu Bhasha Dinotsavam) సందర్భంగా మన తెలుగు సినిమాల్లో తెలుగు (Telugu) పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి చూస్తే, మనం ఎంత దిగజారిపోయామో అర్థం అవుతోంది. ఇప్పుడు అందరూ పాన్ ఇండియా (Pan India) మోజులో పడి, తెలుగుని పూర్తిగా విస్మరిస్తున్నారు.”

“తెలుగు రాని, సరిగ్గా పలకలేని గాయకులచేత తెలుగు పాటలు పాడిస్తున్నారు. చాలామంది సంగీత దర్శకులకు కూడా తెలుగు రాకపోవటం వల్ల ఆ గాయకులూ ఏమి పాడుతున్నారో వారికి అర్థం కావటం లేదు. ఇంకా ఆశ్చర్యం ఏంటి అంటే, మన తెలుగు వచ్చిన గాయకులు కూడా అటువంటి తెలుగు రాని గాయకులని అనుకరించటం, ఇవన్నీ చూస్తే, కొన్నాళ్ళకు మనం తెలుగు పూర్తిగా మర్చిపోతాం..." 

ఇవి దర్శక- నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Tammareddy Bharadwaja) అభిప్రాయాలు. 


కమ్యూనిస్టు నేపథ్యం, సినీ వారసత్వం రెండూ ఉన్న మేధావి, చింతనాశీలిగా పేరొందిన తమ్మారెడ్డి ముక్కుసూటిగా మాట్లాడతారు. కుండబద్దలు కొట్టినట్టు తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు.  

“ఇప్పుడు తెలుగు సినిమా ఎక్కడుందీ? అందరూ పాన్ ఇండియా అంటున్నారు, తెలుగు పదాలకు బదులు ఏవేవో పరభాషా పదాలు తగిలిస్తున్నారు. అస్సలు అలాంటి డైలాగ్స్ రాసే వాళ్ళకి బుద్ధిలేదు,” అంటున్నారు.

ఇప్పటి యువతరం కూడా అదే మిడిమాలపు భాషని అనుకరిస్తున్నారంటూ, ఇంకా ముందు ముందు ఇలాంటివి ఎన్ని చూడాలో అని వాపోయారాయన.

“యాక్టర్స్‌కి తెలుగు రాదు, సెట్స్‌లో ఎక్కువమందికి తెలుగు రాదు.. ఆ యాక్టర్‌కి తెలుగు డైలాగ్స్ డబ్బింగ్ చెప్పిస్తున్నారు కదా అనుకుందామంటే, అది కూడా తెలుగు రాని వాళ్ళతో డబ్బింగ్ చెప్పిస్తున్నారు. ‘కల్లు’కి, ‘కళ్లు’కి తేడా తెలియకుండా పాడారు ఓ గాయని ఈమధ్య. ఇలాంటివి ఎవరూ కరెక్ట్ చేయడం లేదు.. ఇదంతా మన దౌర్భాగ్యం” అన్నారు తమ్మారెడ్డి.


“చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ (Balakrishna), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR).. వంటి యాక్టర్స్ తప్పితే ఎవరూ కూడా తమ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా తెలుగు మాట్లాడటం లేదు. అసలు చాలామంది హీరోస్‌కి తెలుగు చదవటమే రాదు. ఇంకా వాళ్ళు తెలుగులో ఎందుకు మాట్లాడతారు. దానికి తోడు ఈ పాన్ ఇండియా అన్న పిచ్చి బాగా తలకెక్కడంతో, కొనఊపిరితో వున్న ఆ కాస్త తెలుగుని కూడా మార్చేస్తున్నారు.

“పర భాషా నటులు ప్రకాష్ రాజ్ (Prakash Raj), సిద్ధార్థ్ (Siddharth) లాంటి యాక్టర్స్ తెలుగు నేర్చుకొని, తెలుగు చక్కగా మాట్లాడుతుంటే, మనవాళ్ళు తెలుగుని మరిచిపోతున్నారు. ‘ఒరేయ్’, ‘ఒసేయ్’ అన్న పదాలు అవమానకరంగా వుండేవిగా భావించే వాళ్ళం, కానీ ఇప్పుడు ఆ పదాలు వాడుక పదాలు అయ్యాయి” అని అన్నారాయన.


పాన్ ఇండియా సినిమా ఇప్పుడేదో కొత్తగా వచ్చినట్టు అందరు మాట్లాడుతున్నారని, అది కొన్ని దశాబ్దాల కిందటే ఉందని అంటారు తమ్మారెడ్డి. భానుమతి (Bhanumathi)గారు అప్పట్లో ‘చండీరాణీ’ (Chandirani) అన్న సినిమాని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేశారని, కానీ ఆమె అన్ని భాషల్లోనూ విడివిడిగా వివిధ భాషల నటులతో 35 రోజుల్లో.. ఏ భాషకి ఆ భాష విడివిడిగా షూటింగ్ చేసి తీసిన సినిమా అని ఆయన చెప్పుకొచ్చారు. 

“ఇప్పుడు పాన్ ఇండియా అని మూడు వందల రోజులు తీస్తారు, తీరా తీశాక, అందులో వివిధ భాషలు ఉంటాయి, ఎవరు ఏమి మాట్లాడుతున్నారో తెలీదు.. తీరా చూశాక, అది డబ్బింగ్ సినిమానా, లేక ఇంకేమైనానా.. అని ఆలోచించాలి. అదీ ఇప్పటి పరిస్థితి,” అన్నారు. ఏమైనా అంటే ‘వాట్ లగా దేంగే' అని ఏవేవో చిత్రవిచిత్ర పదాలు చొప్పించి జనాలని చంపుతున్నారు. అయినా, రాసే వాళ్లకైనా కూడా బుద్ధి ఉండాలి కదా. ఈ పాన్ ఇండియా అప్పట్లోనే ఉండేది అని, అదేదో ఇప్పుడు కొత్తగా కనిపెట్టినట్టు ప్రతీవాడూ మాట్లాడుతున్నారు,” అన్నారు తమ్మారెడ్డి. 


జెమినివారి ‘చంద్రలేఖ’ మూడు భాషల్లో తీశారని, అలాగే ఇంకా కొన్ని సినిమాలు అప్పట్లో మూడు భాషల్లో తీసి విడుదల చేశారని, ఇవన్నీ కొత్తగా ఉండేవి కావని అన్నారు. తమిళ్‌లో అందరూ అదే భాష మాట్లాడుతారని, సినిమా పేర్లు కూడా తమిళ్ భాషలోనే పెడుతున్నారని, మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఆంగ్ల భాష పేర్లు పెడుతున్నారని అన్నారు. “తెలుగు భాష రాని వాళ్ళే మన తెలుగు సినిమాల్లో ఎక్కువ నటిస్తున్నారు, అటువంటిది  ఇంకా తెలుగు మాట్లాడటం గురించి ఏం అనుకోగలం?” అంటారు తమ్మారెడ్డి. 


చిరంజీవి, బాలకృష్ణ.. లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని, అందరూ తెలుగులో మాట్లాడుతూ, తెలుగు పదాలే ఎక్కువ మన తెలుగు చిత్రాల్లో పెడుతూ ఉంటే బాగుంటుంది అని, ఇతర భాషల్లో విడుదల చేసినప్పుడు వాళ్ళకి అనుగుణంగా భాషని మార్చుకోవచ్చని అన్నారాయన. అంతే కానీ అన్ని భాషల్లో తీస్తున్నాం అని, తెలుగులో కూడా ఏదేదో పదాలు వాడితే, ఇప్పుడున్న యువత ఏవో పదాలు పట్టుకుంటున్నారు, పాడయిపోతున్నారు అని నిస్పృహ వ్యక్తం చేశారు తమ్మారెడ్డి భరద్వాజ. (Telugu Bhasha Dinotsavam Special)

-సురేష్ కవిరాయని



Updated Date - 2022-08-29T23:40:23+05:30 IST