తల్లితండ్రులపై కేసు పెట్టిన హీరో విజయ్‌

ABN , First Publish Date - 2021-09-20T12:35:10+05:30 IST

తమిళ హీరో విజయ్‌ తన తల్లిదండ్రులపై కేసు పెట్టారు. విషయం ఏమిటంటే గత యేడాది విజయ్‌ తండ్రి, సీనియర్‌ దర్శకుడు ఎస్‌.ఏ.చంద్రశేఖర్‌ సొంతంగా ‘ఆల్‌ ఇండియా దళపతి విజయ్‌ మక్కల్‌ ఇయ్యక్కం’ అనే పేరుతో ఓ రాజకీయ పార్టీని...

తల్లితండ్రులపై కేసు పెట్టిన హీరో విజయ్‌

తమిళ  హీరో విజయ్‌ తన తల్లిదండ్రులపై కేసు పెట్టారు.  విషయం ఏమిటంటే గత యేడాది విజయ్‌ తండ్రి, సీనియర్‌ దర్శకుడు ఎస్‌.ఏ.చంద్రశేఖర్‌ సొంతంగా ‘ఆల్‌ ఇండియా దళపతి విజయ్‌ మక్కల్‌ ఇయ్యక్కం’ అనే పేరుతో ఓ రాజకీయ పార్టీని స్థాపించారు. ఈ పార్టీకి విజయ్‌ తండ్రి ప్రధాన కార్యదర్శిగాను, తల్లి శోభా చంద్రశేఖర్‌ కోశాధికారిగా ఉన్నారు. అలాగే, మరికొంతమందికి ఇతర పదవులను అప్పగించారు. ఇదిలావుంటే రాష్ట్రంలో 9 జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీచేసింది. ఈ ఎన్నికల్లో హీరో విజయ్‌కు చెందిన ‘విజయ్‌ మక్కల్‌ ఇయ్యక్కం’ పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ ఎన్నికల్లో ఇయ్యక్కం పేరుగానీ, విజయ్‌ పేరుగాని ఉపయోగించరాదని తీర్మానించారు. అదేసమయంలో స్వతంత్రంగా బరిలోకి దిగాలని, మొత్తం 20 జిల్లాలకు చెందిన విజయ్‌ మక్కల్‌ ఇయ్యక్కం నిర్వాహకులు నిర్ణయించారు. ఫలితంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 128 మంది విజయ్‌ అభిమానులు వివిధ పదవులకు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్‌, తల్లి శోభా చంద్రశేఖర్‌ తన పేరుగాని, తన అభిమాన సంఘం పేరును గాని ఉపయోగించకుండా స్టే విధించాలని కోరుతూ మొత్తం 11 మందిపై చెన్నై సిటీ సివిల్‌ కోర్టులో విజయ్‌ తరపు న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ ఈ నెలాఖరులో జరుగనుంది. తల్లిదండ్రులపై హీరో విజయ్‌ కేసు పెట్టడం ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.  

- ఆంధ్రజ్యోతి చెన్నై 


Updated Date - 2021-09-20T12:35:10+05:30 IST