టక్ జగదీష్... మన ఇంటి సినిమా
ABN , First Publish Date - 2021-09-02T05:42:17+05:30 IST
‘‘బయట పరిస్థితులు అనుకూలంగా లేవని ‘టక్ జగదీష్’ను ఓటీటీలో విడుదల చేస్తున్నాం. కొంతమంది పెద్దలు నా సినిమాలను బ్యాన్ చేస్తాం అన్నారు. వాళ్లపై నాకు కోపం లేదు....

‘‘బయట పరిస్థితులు అనుకూలంగా లేవని ‘టక్ జగదీష్’ను ఓటీటీలో విడుదల చేస్తున్నాం. కొంతమంది పెద్దలు నా సినిమాలను బ్యాన్ చేస్తాం అన్నారు. వాళ్లపై నాకు కోపం లేదు. కానీ అంతా బాగున్నా కూడా ఓటీటీకి వెళ్లాల్సి వస్తే నా సినిమాలను నేనే బ్యాన్ చేసుకుంటాను. నన్ను బయట వాణ్ణి చేసి అలా మాట్లాడారు కానీ నేనూ వాళ్లలో ఒకణ్ణే. ‘టక్ జగదీష్’ చిత్రం సగటు ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. ఇది మన ఇంటి సినిమా. అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి’’ అని నాని అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన ‘టక్ జగదీష్’ చిత్రం వినాయక చవితి సందర్భంగా ఈ నెల 10న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో నానీ ట్రైలర్‌ను విడుదల చేశారు. భూ కక్షలు లేని భూదేవి పురం చూడాలనే నాన్న కల నెరవేర్చడం కోసం టక్ జగదీష్ ఏం చేశాడనేది చిత్ర కథ. ‘కుటుంబం ఓడిపోతే నేను ఓడిపోయినట్టే’ లాంటి డైలాగ్‌లు కదిలించాయి. జగపతి బాబు పాత్రలో భిన్న ఛాయలు ఆకట్టుకున్నాయి. నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది, చిత్ర దర్శకుడు శివ నిర్వాణ, కథానాయిక రీతూవర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు.