దక్షిణాది సినిమాలతో తెరంగేట్రం చేసి, బాలీవుడ్లో సత్తా చాటుతున్న తాప్పీ పన్ను ప్రతిభావంతురాలైన నటిగా పేరు తెచ్చుకున్నారు. ఇటీవల తాప్సీ పన్ను తన వ్యక్తిగత వివరాలను మీడియాతో పంచుకున్నారు. తన పెళ్లి గురించి తన తల్లిదండ్రులు తెగ ఆందోళన పడిపోతున్నారని, ఎవరినో ఒకరిని తీసుకువచ్చి, ఇతనినే పెళ్లి చేసుకుంటానని చెబుతాననుకుంటున్నారని, లేకపోతే అస్సలు పెళ్లే చేసుకోనేమోనని బెంగ పెట్టుకుంటున్నారని తాప్సీ తెలిపారు. మా అమ్మానాన్నలతో సరైన సంబంధాలు లేని వ్యక్తిని నేను వివాహం చేసుకోను. నేను పెళ్లి చేసుకుంటే ఆ వ్యక్తికి కొంత సమయం కేటాయిస్తాను.
అయితే ఇప్పట్లో నాకు ఎవరితోనూ టైమ్ స్పెండ్ చేయాలని లేదు. అయితే మా అమ్మానాన్నలు ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోమని పోరు పెడుతున్నారని, నేను త్వరగా పెళ్లి చేసుకోవాలని వారు కోరుకుంటున్నారని తాప్సీ తెలిపారు. కాగా ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నారని తాప్సీని అడగగా, నేను ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండటానికి నేను చేసిన కృషే కారణం. ఈ ఇండస్ట్రీలో నాకు ఎవరూ గాడ్‌ఫాదర్ లేరు. అందుకే ఎవరినీ మోసం చేయకుండా, జీవితంలో కష్టపడి పైకి వచ్చిన వ్యక్తినే పెళ్లాడాలనుకుంటున్నాను. నిజాయితీ కలిగిన వ్యక్తిని కోరుకుంటున్నాను. కాగా ప్రస్తుతం తాప్సీ బ్యాడ్మెంటన్ క్రీడాకారుడు మాథియాస్ బోతో డేటింగ్లో ఉన్నారు. వీరిద్దరూ తరచూ జంటగా కనిపిస్తున్నారు.