అభిమాన హీరోని డైరెక్ట్ చేసే అవకాశం.. బంపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు

ABN , First Publish Date - 2022-02-02T00:28:30+05:30 IST

కోదండరామిరెడ్డి దగ్గర ఎక్కువగా అంటే 20 సినిమాలకు వర్క్‌ చేశారు. ఆ సమయంలోనే ఆ నాటి టాప్‌ స్టార్స్‌ అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, కమల్‌హాసన్‌, శ్రీదేవి వంటివారితో పనిచేసే అవకాశం లభించింది. అతనికి వ్యక్తిగతంగా హీరో కృష్ణ అంటే ఇష్టం..

అభిమాన హీరోని డైరెక్ట్ చేసే అవకాశం.. బంపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు

దర్శకుడు కాకముందు ముప్పలనేని శివ ఆనాటి అగ్ర దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, ముత్యాల సుబ్బయ్యల దగ్గర అసోసియేట్‌గా పనిచేశారు. కోదండరామిరెడ్డి దగ్గర ఎక్కువగా అంటే 20 సినిమాలకు వర్క్‌ చేశారు. ఆ సమయంలోనే ఆ నాటి టాప్‌ స్టార్స్‌ అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, కమల్‌హాసన్‌, శ్రీదేవి వంటివారితో పనిచేసే అవకాశం లభించింది. శివకు వ్యక్తిగతంగా హీరో కృష్ణ అంటే ఇష్టం. ఆయన కృష్ణ హీరోగా నటించిన ‘ఘరానా అల్లుడు’ చిత్రంతోనే దర్శకుడిగా పరిచయం కావడం విశేషం. హీరో కృష్ణ సినిమాలో ఎటువంటి అంశాలు ఉంటే తనలాంటి అభిమానులకు నచ్చుతుందో శివకు బాగా తెలుసు. అందుకే అది దృష్టిలో పెట్టుకుని కథ తయారు చేసి, తన అభిమాన హీరోకు వినిపించారు. హీరో కృష్ణకు ఆ కథ నచ్చడంతో ఓకే అనేశారు. అలా 1993 నవంబర్‌ 10న ‘ఘరానా అల్లుడు’ చిత్రం షూటింగ్‌ మొదలైంది. 


టీజింగ్‌ డ్రామాతో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో హీరో కృష్ణ సరసన మాలాశ్రీ తొలిసారిగా నటించారు. అలాగే కృష్ణ చిత్రానికి సంగీత దర్శకుడు కీరవాణి పనిచేయడం అదే తొలిసారి. అభిమానులు మెచ్చే విధంగా ఆరు పాటలను ఆయన స్వరపరిచారు. హీరోయిన్‌ తండ్రిగా, కృష్ణకు మామగా కోట శ్రీనివాసరావు నటించారు. ‘భలే కృష్ణుడు’, ‘జతగాడు’ చిత్రాల్లో కృష్ణ సరసన నటించిన ‘ముత్యాలముగ్గు’ సంగీత.. ‘ఘరానా అల్లుడు’ సినిమాలో ఆయనకు తల్లిగా నటించారు. ‘నంబర్‌ వన్‌’ సినిమాతో హీరోగా మళ్లీ పూర్వ వైభవం పొందిన కృష్ణ ఖాతాలో మరో విజయాన్ని ‘ఘరానా అల్లుడు’ చిత్రం జత చేసింది.

-వినాయకరావు



Updated Date - 2022-02-02T00:28:30+05:30 IST