30 వసంతాల ‘పెద్దింటల్లుడు’!

సుమన్‌ హీరోగా శరత్‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రాలన్నీ చక్కని విజయం సాధించాయి. ఈ క్రేజీ కాంబినేషన్లో శ్రీఅన్నపూర్ణ సినీ చిత్ర బ్యానర్‌ పై టి.ఆర్‌.తులసి నిర్మించిన చిత్రం ‘పెద్దింటల్లుడు’. 1991లో విడుదలైన ఈ చిత్రంతో నగ్మా తెలుగు తెరకు కథానాయుకగా పరిచయమయ్యారు. ఈ సినిమా సక్సెస్‌ తరువాత నగ్మా తెలుగులో వరుస అవకాశాలు అందుకుని స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు. సుమన్‌ ఓ వైపు మాస్‌ యాక్షన్‌ సినిమాలు చేస్తూనే మరోవైపు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తూ కుటుంబ కథా చిత్రాలపై ఎక్కువ ఆసక్తి చూపేవారు. ఆ తరుణంలో ఈ సినిమా అవకాశం వచ్చింది. ఈ చిత్రంలో మోహన్‌ బాబు కీ రోల్‌ చేశారు. వాణిశ్రీ బాలా త్రిపుర సుందరిగా వైవిధ్యమైన పాత్రతో ఆకట్టుకున్నారు. మంచి కథ, కథనాలతోపాటు వినోదం ప్రధానంగా సాగిన ఈ సినిమా విడుదలై 30 వసంతాలు పూర్తయింది. 

ఈ సందర్బంగా సుమన్‌ మాట్లాడుతూ ఈ సినిమా జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ‘‘కథ విన్నప్పుడే నా కెరీర్‌కు వెరైటీ సినిమా అవుతుందనుకున్నా. ఇందులో ఓల్డ్‌ గెటప్‌ వేయడం, మోహన్‌ బాబు గారి కాంబినేషన్‌ కుదరడం, వాణిశ్రీగారు ఓ పవర్‌ఫుల్‌ పాత్ర పోషించడం గొప్ప అనుభూతినిచ్చింది. పి వాసు దర్శకత్వంలో తమిళంలో హిట్టైన ‘నడిగర్‌’ సినిమాకు రీమేక్‌ ఇది. శరత్‌ దర్శకత్వంలో అద్భుతంగా మలిచి మంచి విజయాన్ని అందించారు. నేను కామెడీ కూడా చేయగలనని నిరూపించింది. వెర్సటైల్‌ యాక్టర్‌గా పేరు తెచ్చిన సినిమా ఇది. ఈ సక్సెస్‌ నాకు అందించిన కాట్రగడ్డ ప్రసాద్‌ గారికి, దర్శకుడు శరత్‌ గారికి, ఎప్పటికీ రుణపడి ఉంటా’’ అని తెలిపారు.  ‘‘30 సంవత్సరాల క్రితం  మా ‘పెద్దింటల్లుడు’ విడుదలై పెద్ద విజయాన్ని అందుకుంది. అందుకు కారణమైన అందరినీ గుర్తు చేసుకోవాలి. సత్యరాజ్‌ హీరోగా తమిళంలో ‘నడిగర్‌’ అనే పేరుతో విడుదలైంది. ఈ హక్కులు తీసుకుని మా కాంపౌండ్‌ హీరో తమ్ముడు సుమన్‌తో సినిమా తీయాలనుకున్నా. ‘అల్లుడుగారు’ సినిమా సిల్వర్‌ జూబ్లీ వేడుకలో మోహన్‌ బాబు నన్ను పిలిచి ఈ సినిమాలో నేను ప్రత్యేక పాత్ర చేస్తానని చెప్పారు. అది నాకు జాక్‌పాట్‌గా మారి సినిమా మొదలెట్టాను. తమిళ సినిమా చూసి వాణిశ్రీగారు కూడా బాలా త్రిపుర సుందరి పాత్ర పోషిస్తా అన్నారు. శరత్‌ దర్శకత్వంలో నేను తీసిన ‘కాలేజీ బుల్లోడు’, ‘అత్తా కోడలు’, ‘పెద్దింటల్లుడు’ మూడు సినిమాలు సూపర్‌ హిట్‌ అయ్యాయి. అప్పటి నుంచి సుమన్‌ మాకు పర్మినెంట్‌ హీరో అయ్యాడు. ఈ కథ నాకు ఇచ్చి ప్రోత్సహించిన పి.వాసుగారికి ధన్యావాదాలు’’ అని కాట్రగడ్డ ప్రసాద్‌ అన్నారు. 


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.