మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కెరీర్లో 154వ చిత్రంగా ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) (వర్కింగ్ టైటిల్) ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోంది. బాబీ (Bobby) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతోంది. తమిళ బ్యూటీ శ్రుతిహాసన్ (Shruthi Haasan) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ (Devisri Prasad) సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు ట్విట్టర్ వేదికగా మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో మాస్ మహారాజా రవితేజ ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నట్టు అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయింది. ప్రస్తుతం చిరు, రవితేజలపై కీలక దృశ్యాల చిత్రీకరణ జరుగుతోంది.
ఇక మెగా 154 చిత్రం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే. ఈ సినిమాతో ఒకప్పటి అందాల కథానాయిక సుమలత (Sumalatha) రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు టాక్. అప్పట్లో అందమైన అభినయానికి, అభినయానికే వన్నె తెచ్చే అందానికి సుమలత చిరునామాగా నిలిచిపోయారు. చిరంజీవి సరసన ఆమె కథానాయికగా నటించిన చిత్రాల్లో చాలా వరకూ సూపర్ హిట్స్‌గా నిలిచాయి. ఆఖరుగా తెలుగులో ఆమె నటించిన చిత్రం అల్లు శిరీష్ హీరోగా నటించిన ‘శ్రీరస్తు శుభమస్తు’ (Srirasthu Shubhamastu). ఆ తర్వాత మళ్ళీ ఆమె తెలుగు తెరపై కనిపించలేదు. దాదాపు ఆరేళ్ళ తర్వాత ఆమె మెగాస్టార్ చిత్రంతో టాలీవుడ్లో రీఎంట్రీ ఇవ్వనుండడం విశేషంగా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో సుమలత రవితేజకు తల్లిగా నటిస్తోందని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
ఇప్పటికే రవితేజ ఈ సినిమా సెట్స్‌లో బిజీగా ఉన్నారు. త్వరలో సుమలత కూడా షూటింగ్లో జాయిన్ కానున్నట్టు సమాచారం. రవితేజతో ఆమె నటించే సన్నివేశాలు ఎమోషనల్‌గా టచ్ చేస్తాయని చెబుతున్నారు. ఈ చిత్రంలో రవితేజ పాత్ర చనిపోతుందని, ఆ పాత్ర మరణంతోనే చిరు పాత్రలో మార్పు వస్తుందని తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరూ ఈ సినిమాలో అండర్ కవర్ కాప్స్గా నటిస్తున్నట్టు ఇదివరకే వార్తలొచ్చాయి. వాల్తేరు బీచ్ నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన కథాకథనాలతో ఈ సినిమా అభిమానులకు మంచి మాస్ ఫీస్ట్ ఇస్తుందని మేకర్స్ చెబుతున్నారు.