రమేష్ బాబు ‘సాహసయాత్ర’ చిత్రం అలా ఆగిపోయింది

‘సామ్రాట్’ చిత్రంతో హీరోగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు ‘బజారు రౌడీ, కలియుగ కర్ణుడు, ముగ్గురు కొడుకులు’ వంటి హిట్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకొన్నారు. అయితే ఆ తర్వాత ఆయన నటించిన చిత్రాలు అంతగా ఆడలేదు. ఇక నటన తన వల్ల కాదనుకుని, ‘ఎన్‌కౌంటర్’ చిత్రం తర్వాత నటించడం మానుకున్నారు. సినిమాల మీద మంచి అవగాహన ఉన్న ఆయన తర్వాత నిర్మాతగా మారారు. తండ్రి పేరు మీద కృష్ణ ప్రొడక్షన్స్ సంస్థను నెలకొల్పి ‘అర్జున్, అతిథి’ చిత్రాలు మహేష్ హీరోగా నిర్మించారు. అలాగే మహేష్ నటించిన ‘దూకుడు, ఆగడు’ చిత్రాలకు సమర్పకుడిగా వ్యవహరించారు. అయితే రమేష్ హీరోగా ప్రారంభమై, మధ్యలోనే ఆగిపోయిన చిత్రాలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో ‘సాహసయాత్ర’ సినిమా గురించి ప్రముఖంగా చెప్పాలి. ఈ చిత్రానికి ఇద్దరు దర్శకులు మారడం విశేషం. అయినా కూడా ఆర్థిక కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. 

‘సాహసయాత్ర’ సినిమా గురించి పూర్తి వివరాలు:

ఈ సినిమాకు మొదట దర్శకుడు వంశీ పనిచేశారు. రచయిత సాయినాథ్‌తో అరకు వెళ్ళి, కథాచర్చలు జరిపి, పూర్తి అడ్వెంచరేస్ చిత్రంగా స్టోరీ లైన్ తయారు చేశారు వంశీ. మబ్బు చంద్రశేఖర రెడ్డి సమర్పణలో నూరా నరేంద్ర రెడ్డి, టి.వి.ఎస్.రెడ్డి సాహస యాత్ర చిత్రం ప్రారంభించారు. వంశీ తయారు చేసిన కథను హీరో కృష్ణకు వినిపించారు. ఆయన ఓకే చెప్పడంతో 1987 జనవరి 30న చెన్నై లోని ప్రసాద్ థియేటర్ లో పాటల రికార్డింగ్ ప్రారంభించారు. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో సీతారామశాస్త్రి రాసిన పాటను రికార్డ్ చేశారు. హీరోయిన్ ఎంపిక కాలేదు కానీ విలన్ వేషానికి అమ్రేశ్‌పురిని సెలెక్ట్ చేశారు. ఏప్రిల్, మే నెలల్లో సినిమాని పూర్తి చేయాలనుకొని షెడ్యూల్స్ కూడా వేశారు. అయితే ఆ తర్వాత నిర్మాతలకు, దర్శకుడు వంశీకి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి, వంశీ పక్కకు తప్పుకున్నారు. కొన్ని నెలల పాటు ప్రాజెక్ట్‌లో ఎలాంటి కదలికలు లేవు. మళ్ళీ నవంబర్‌లో ముందడుగు పడింది. నిర్మాతలు హీరో కృష్ణ దగ్గరకు వెళ్ళి పరిస్థితి వివరించారు. వెంటనే ఆయన జోక్యం చేసుకొని, దర్శకుడు కే.ఎస్.ఆర్. దాస్ తో మాట్లాడి సాహసయాత్రకు దర్శకుడిగా ఎంపిక చేశారు. దర్శకుడు మారడంతో కథ దగ్గర నుంచి అన్నీ మారిపోయాయి. కథ తయారు చేసి, మాటలు రాసే బాధ్యతను పరుచూరి సోదరులకు అప్పగించారు కృష్ణ. హీరోయిన్లుగా గౌతమి, రమ్యకృష్ణ, రూపిణీ, మహా లక్ష్మిలను ఎంపిక చేశారు. ఇళయరాజా ప్లేస్ లోకి రాజ్ కోటి వచ్చారు. కొత్త టీమ్‌తో 1987 అక్టోబర్ 23న సాహస యాత్ర షూటింగ్ మొదలైంది.


ఈ సినిమా తొలి షెడ్యూల్ అండమాన్‌లో జరిగింది. రమేశ్ బాబు, గౌతమి మీద ఒక పాట.. రమేశ్ బాబు, మహా లక్ష్మి మీద మరో పాట చిత్రీకరించారు. ఒక ఫైట్, కొన్ని సీన్లు కూడా చిత్రీకరించారు. అండమాన్ షెడ్యూల్ కోసం మద్రాస్ నుంచి 150 మంది యూనిట్ సభ్యులను తీసుకెళ్ళి చాలా రిచ్‌గా షూటింగ్ చేశారు. ఆ తర్వాత షెడ్యూల్స్ తలకోన, సిమ్లా, బికనీర్ లో తీయాలని ప్లాన్ చేసారు కానీ ఆర్థిక కారణాల వల్ల అనుకున్నట్లుగా జరగలేదు. దాంతో సినిమా ఆగిపోయింది. రమేశ్ బాబు మార్కెట్ కూడా డల్ కావడంతో ఈ భారీ ప్రాజెక్ట్ కు ఫైనాన్స్ దొరకలేదు.

-వినాయకరావు

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.