రమేష్ బాబు: మధ్యలోనే ఆగిపోయిన జానపద చిత్రాలు

సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు హీరోగా మొత్తం 15 చిత్రాల్లో నటించారు. ఇవి కాకుండా మరో మూడు జానపద చిత్రాల్లో ఆయన నటించారు. అయితే ఆ చిత్రాలు వివిధ కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయాయి. వాటి వివరాలివే..


సూపర్ స్టార్ కృష్ణ, రమేష్ బాబు హీరోలుగా 1996 సెప్టెంబర్‌లో ‘అహో విక్రమార్క’ షూటింగ్ మొదలైంది. హీరో కృష్ణతో ‘జగదేక వీరుడు’ వంటి సోషియో ఫాంటసీ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు సాగర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆయనకు ఇదే తొలి జానపద చిత్రం. రమ్యకృష్ణ స్పెషల్ క్యారెక్టర్ పోషించిన ఈ చిత్రంలో సత్యన్నారాయణ, సుధాకర్, తనికెళ్ల భరణి, ఆలి, మల్లికార్జునరావు, బాబూమోహన్ ఇతర తారాగణంగా ఎన్నికయ్యారు. రమేష్ బాబు సరసన కీర్తి, రక్ష కథానాయికలు. నవలా రచయిత సూర్యదేవర రామమోహనరావు అందించిన కథకు మరుధూరి రాజా మాటలు రాశారు. పద్మాలయా స్టూడియోలో సెట్స్ వేసి కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. మూడు షెడ్యూల్స్‌లో షూటింగ్ పూర్తి చేసి 1997 జనవరిలో విడుదల చేయాలనుకున్నారు. అయితే రెండు షెడ్యూల్స్ అతి కష్టం మీద పూర్తి చేయగలిగారు నిర్మాతలు. రమేష్ బాబు మార్కెట్ కొంచం డల్‌గా ఉన్న సమయం అది. హీరో కృష్ణ సహాయ సహకారాలు అందించినా అడుగు ముందుకు వేయడం కష్టం అయింది నిర్మాతలకు. దాంతో అహో విక్రమార్క షూటింగ్ ఆగిపోయింది.

ఆ తర్వాత 1996లోనే విజయదశమి సందర్భంగా అక్టోబర్ 21న రమేష్ బాబు హీరోగా మరో జానపద చిత్రం ‘భూలోక రంభ’ మొదలైంది. జానపద బ్రహ్మ విఠలాచార్య తనయుడు శ్రీనివాస్ దీనికి దర్శకుడు. ఇందులో కథానాయికగా రంభ పాత్రకు ఇంద్రజ ఎంపికయ్యారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ నెలాఖరు వరకు హైదరాబాద్‌లో జరిగింది. నరసింహరాజు కీలక పాత్రధారి. ఆర్థిక కారణాల వల్ల భూలోక రంభ షూటింగ్ కూడా ఆగిపోయింది.


ఆ తర్వాత అంటే మూడేళ్ళ తర్వాత భూలోక రంభ చిత్రం పేరును మార్చి మళ్లీ అంటే 1999 జూన్ 24న షూటింగ్ ప్రారంభించారు. ఆ సమయంలో ఇంద్రజ హీరోయిన్‌గా మంచి పొజిషన్‌లో ఉండడంతో ‘భూలోక వీరుడు జగదేక సుందరి’ అని టైటిల్ మార్చారు. కొన్ని రోజులు షూటింగ్ జరిగిన తర్వాత ఈ షూటింగ్ కూడా ఆగిపోయింది.

-వినాయకరావు

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.