సినిమా సెట్లకు తుపాను కాటు

ఓ పక్క కరోనా సినీ పరిశ్రమను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సగంలోనే నిలిచిపోయిన సినిమా షూటింగ్స్‌, థియేటర్లలో సినిమాల విడుదలకు అవకాశం లేని పరిస్థితి... కోట్ల రూపాయల ఖర్చు పెట్టిన నిర్మాతను కుదేలు చేస్తోంది. ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి నిర్మించిన సినిమా సెట్లలో షూటింగ్స్‌ చే సే అవకాశం లేకపోయింది. దాంతో నెలల తరబడి వాటి నిర్వహణ, అద్దె చెల్లింపులు భారంగా మారాయి. ఇప్పుడు కరోనాకు తోడు తుపాను చిత్ర పరిశ్రమను కకావికలం చేస్తోంది. భారీ వర్షాలు, గాలుల ధాటికి సెట్లు పాడవడంతో అనుకున్న సమయానికి షూటింగ్‌ పూర్తికాక నిర్మాతలు ఆర్థికంగా నష్టపోతున్నారు. 


శ్యామ్‌ సింగరాయ్‌కి తీవ్ర నష్టం

నానీ కథానాయకుడుగా నటిస్తున్న ‘శ్యామ్‌సింగరాయ్‌’ సినిమా సెట్‌ తుపాను ధాటికి తీవ్రంగా దెబ్బతింది. హైదరాబాద్‌ శివార్లలో పది ఎకరాల విస్తీర్ణంలో రూ. 6.50 కోట్లతో దీన్ని నిర్మించారు. పాత కోల్‌కతా నగరం సెట్‌ వేసి అందులో చిత్రీకరణ చేస్తున్నారు. ఇంకా కొంత షూటింగ్‌ మాత్రమే మిగిలి ఉండగా ఇటీవల వర్షాలకు సెట్‌ బాగా దెబ్బతింది. కొంతభాగం నేలకొరిగింది. కోట్లలో నష్టం వాటిల్లింది. తిరిగి మళ్లీ సెట్‌ను నిర్మించాలంటే అది నిర్మాతకు అదనపు ఖర్చు. 


చత్రపతికి చేదు అనుభవం

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కథానాయకుడిగా రూపొందుతున్న ‘చత్రపతి’ హిందీ రీమేక్‌కు తుపాను తీవ్ర నష్టం మిగిల్చింది. ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో ఆరున్నర ఎకరాల్లో సెట్‌ నిర్మించారు. లాక్‌డౌన్‌తో షూటింగ్‌ ప్రారంభంకాలేదు. ఇటీవల వర్షాలకు తీవ్రంగా దెబ్బతింది. షూటింగ్‌ కూడా ప్రారంభం కాకుండానే కోట్లలో నష్టం మిగిల్చింది.


మైదాన్‌పై మొదటి దెబ్బ

బాలీవుడ్‌లో తుపాను తొలి దెబ్బ ‘మైదాన్‌’ సినిమా సెట్‌పై పడింది. అజయ్‌ దేవగణ్‌ ప్రధాన పాత్రలో ఫుట్‌బాల్‌ క్రీడ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దీనికోసం భారీ ఫుట్‌బాల్‌ స్టేడియంను ముంబై శివార్లలో నిర్మించారు. మే నెల ఽమధ్యలో వచ్చిన తౌక్టే తుపానుకు సెట్‌ తీవ్రంగా దెబ్బతింది. గతేడాది ఒకసారి దెబ్బతింటే మళ్లీ నిర్మించారు. ఇప్పుడు మరోసారి సెట్‌ ద్వంసం అయింది. సినిమా షూటింగ్‌ ఇప్పటికి సగమే పూర్తయిన నేపథ్యంలో మరోసారి ఈ సెట్‌ను పునర్నిర్మించాల్సిరావడం నిర్మాతకు భారీ నష్టమే. ఫుట్‌బాల్‌ మైదానం సెట్‌ పాడవడం వల్ల రూ. 30 కోట్లు నష్టం వాటిల్లినట్లు నిర్మాత బోనీకపూర్‌ తెలిపారు.


కొత్త సెట్‌లోకి..

సల్మాన్‌ ఖాన్‌, కట్రినా కైఫ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘టైగర్‌ 3’. కరోనా నేపథ్యంలో విదేశాల్లో షూటింగ్‌కు అవకాశాలు లేకపోవడంతో కొన్ని కీలకసన్నివేశాలను ఇక్కడే తెరకెక్కించాలనుకున్నారు. గుర్‌గావ్‌లో దుబాయ్‌ మార్కెట్‌ సెట్‌ వేశారు. కట్రినాకు కరోనా రావడంతో ఆసెట్‌లో షూటింగ్‌ నిలిచిపోయింది. తుపానుకు ఈ సెట్‌ తీవ్రంగా దెబ్బతింది. వర్షాకాలం ప్రారంభమవడం, మరోవైపు సినిమా షూటింగ్స్‌కు అనుమతులు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితుల నేపథ్యంలో నిర్మాత ఆదిత్యాచోప్రా ఈసెట్‌ను కూల్చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అనుమతులు వచ్చాక కొత్త సెట్‌ను నిర్మించాలనుకుంటున్నారు. 


కాపాడుకునే ప్రయత్నం

అలియాభట్‌ ప్రధాన పాత్రలో సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గంగూబాయ్‌ కతియావాడి. తౌక్టే ధాటికి ఈ సినిమా కోసం ముంబైలో వేసిన కామాటిపురా సెట్‌ తీవ్రంగా దెబ్బతింది. ఇంకా కొన్ని రోజుల షూటింగ్‌ మాత్రమే మిగిలి ఉంది. అనుమతులు వచ్చేదాకా సెట్‌పై పాస్టిక్‌ షీట్లు కప్పి కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అలియా, రణ్‌వీర్‌ జంటగా నటిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ సెట్‌ కూడా వర్షాలకు దెబ్బతింది.


వేసిన సెట్‌ తొలగించారు

అక్షయ్‌ కుమార్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘పృథ్విరాజ్‌’. గతేడాది మార్చిలో భారీ రాజప్రాసాదాల సెట్లను నిర్మించారు. నెలల తరబడి వాటి నిర్వహణ భారంగా మారటం, వర్షాకాలం ప్రవేశించడంతో అప్పుడు ఉన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఇంకా చిత్రీకరణ చేయల్సి ఉన్నా యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ ఆ సెట్లను తొలగించింది. 


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.