హీరోల తనయులు నట వారసులుగా వెండితెర అరంగేట్రం చేసి
వెలిగి పోవడం ఎప్పుడూ ఉన్నదే. ఇప్పుడు పరిస్థితి కొంచెం మారింది.
హీరోల కుమార్తెలు కూడా హీరోయిన్లుగా వెండితెరపై అడుగు
పెడుతున్నారు. అయితే వారిలో కొద్దిమంది మాత్రమే తమ ప్రతిభతో హీరోయిన్లుగా పరిశ్రమలో నిలదొక్కుకుంటున్నారు.
దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ రాణిస్తున్న అలాంటి కథానాయికలపై ఓ లుక్కేద్దాం!
కమల్ హాసన్ వారసురాలు శృతీ
స్టార్ హీరో కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకున్నారు శృతీహాసన్. కమల్‌హాసన్, సారిక దంపతుల కూతురుగా కాకుండా తనదైన ప్రతిభతో ఆమె పరిశ్రమలో నిలదొక్కుకున్నారు. ‘హే రామ్’ చిత్రంలో వల్లబాయ్ పటేల్ కూతురు పాత్రలో ఆమె తొలిసారి తెరపై కనిపించారు. 2009లో వచ్చిన బాలీవుడ్ చిత్రం ‘లక్’తో హీరోయిన్గా అరంగేట్రం చేశారు. ఇక అప్పటి నుంచి హిందీతో పాటు పలు దక్షిణాది భాషా చిత్రాల్లోనూ నటిస్తూ టాప్ హీరోయిన్లలో ఒకరుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆమె తమిళంలో ‘లాభం’, పాన్ ఇండియా చిత్రం ‘సలార్’లో ప్రభాస్ సరసన ఆమె కథానాయికగా నటిస్తున్నారు. శృతీహాసన్‌కు సంగీతంలోనూ మంచి ప్రవేశం ఉంది. ఆమె సోదరి అక్షరాహాసన్ కూడా పలు తమిళ, హిందీ చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నారు.
హీరోయిన్గా వరలక్ష్మి శరత్‌కుమార్
నటిగా దాదాపు దశాబ్దం కెరీర్‌ను పూర్తి చేసుకున్నారు వరలక్ష్మి శరత్‌కుమార్. తమిళ అగ్ర నటుల్లో ఒకరైన శరత్‌కుమార్‌కు ఆమె కూతురు. మైక్రోబయాలజీలో డి గ్రీ చదివి ఆసక్తితో నటనవైపు వచ్చారు. 2012లో ‘పోడా పోడి’ తమిళ చిత్రంతో ఆమె కథానాయికగా పరిచయమయ్యారు. కొన్నాళ్లు కథానాయికగా నటించిన తర్వాత నటనకు ఆస్కారమున్న పాత్రల్లోనూ కనిపిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లోనూ ఆమె విభిన్న పాత్రలు పోషిస్తున్నారు.
హీరోగా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన కన్నడ నటుడు అర్జున్. ఆయన కూతురు ఐశ్వర్యా అర్జున్ పలు తమిళ, కన్నడ చిత్రాల్లో కథానాయికగా నటించారు. ప్రస్తుతం ఆమె కొత్త చిత్రాలేవీ అంగీకరించలేదు.
రాజశేఖర్ తనయ కథానాయిక
నటుడు, నిర్మాత రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక రాజశేఖర్ 2019లో వచ్చిన ‘దొరసాని’ చిత్రంతో ఆనంద్ దేవరకొండ సరసన హీరోయిన్గా అరంగేట్రం చేశారు. తను మంచి గాయని కూడా. రాజశేఖర్ పెద్ద కూతురు శివానీ రాజశేఖర్ త్వరలోనే హీరోయిన్గా అరంగ్రేటం చేయనున్నారు. అడవి శేష్ సరసన ఆమె నటించే ‘టూ స్టేట్స్’ చిత్రం ప్రారంభమైనా మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఆమె ప్రస్తుతం తమిళంలో ఉదయనిధి స్టాలిన్ సరసన హీరోయిన్గా ఎంపికయ్యారు. బాలీవుడ్ చిత్రం ‘ఆర్టికల్ 15’కు ఇది తమిళ రీమేక్. ఈ చిత్రంలో శివానీ గ్రామీణ యువతి పాత్రలో కనిపించనున్నారు.
నటుడు, నిర్మాత నాగబాబు తనయ నిహారికా కొన్ని చిత్రాల్లో హీరోయిన్గా కనిపించి ఆకట్టుకున్నారు. తొలుత కొన్ని టీవీ షోలకు ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరించారు. తర్వాత వెబ్‌సిరీ్‌సలో నటించారు. 2015లో ‘ఒక మనసు’ చిత్రంలో నాగశౌర్య సరసన ఆమె హీరోయిన్గా అరంగ్రేటం చేశారు. ‘ఒరు నాళ్ల నాల్ పాత్తు సొల్రేన్’ తమిళ చిత్రంలో ఒక హీరోయిన్గా కనిపించారు. ఆ తర్వాత ‘సూర్యాకాంతం’, ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాల్లో కీలకపాత్రలు పోషించారు.
సైఫ్ కుటుంబం నుంచి సారా
సైఫ్ అలీఖాన్, అమృతాసింగ్ దంపతుల కుమార్తె సారా అలీఖాన్ ఇప్పుడు బాలీవుడ్ అగ్రతారల్లో ఒకరు. నాలుగేళ్ల వయసున్నప్పటి నుంచే ఆమె వాణిజ్య ప్రకటనల్లో నటించారు. ఐశ్వర్యారాయ్ స్ఫూర్తితో హీరోయిన్గా మారినట్టు సారా పలు సందర్భాల్లో చెప్పారు. హీరోయిన్గా నాజుకైన శరీరం కోసం ఆమె చాలా కష్టపడి బరువు తగ్గారు. న్యూయార్క్ కొలంబియా యూనివర్సిటీలో చరిత్ర, రాజనీతిశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. 2018లో అభిషేక్కపూర్ కథానాయకుడుగా వచ్చిన ‘కేదార్నాథ్’ చిత్రంతో ఆమె బాలీవుడ్ అరంగేట్రం చేశారు. సినిమా ప్లాపయినా ఆమె నటనకు మంచి పేరొచ్చింది. ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ‘సింబా’, ‘లవ్ ఆజ్ కల్’, ‘కూలీ నంబర్ వన్’ చిత్రాలతో హీరోయిన్గా నిలదొక్కుకున్నారు. వీరే కాకుండా విజయ్ సేతుపతి కూతురు శ్రీజా సేతుపతి ఇటీ వల ఓ వెబ్ చిత్రంలో కీలకపాత్రలో నటించారు.
మిథున్ చక్రవర్తి తనయ దిశానీ చక్రవర్తి త్వరలోనే కథానాయికగా బాలీవుడ్ అరంగేట్రం చేయనున్నారు. షారూఖ్‌ఖాన్ కూతురు సుహానాఖాన్, ఆమిర్‌ఖాన్ తనయ ఇరాఖాన్ కూడా త్వరలోనే కథానాయికలుగా కెరీర్ ప్రారంభిస్తారని బాలీవుడ్ సమాచారం.