ఏది ముందు... ఏది ఆ తర్వాత!?

కథానాయకుల జోరుకు...

కరోనా కళ్లెం వేసింది!

కాస్త విశ్రాంతి ఇచ్చింది!

దీంతో కొత్త చిక్కు వచ్చింది.

రెండు మూడు షూటింగ్స్‌ చేస్తున్న హీరోలు...

ఏది ముందు? ఏది ఆ తర్వాత?

చేయాలని ఆలోచించాల్సిన 

పరిస్థితి వచ్చింది.

షూటింగ్స్‌  మళ్లీ రీ షెడ్యూల్‌ 

చేయాల్సి వస్తోంది


తెలుగులో స్టార్‌ హీరోలందరి చేతిలో ఒకటి కంటే ఎక్కువ చిత్రాలే ఉన్నాయి. సెట్స్‌ మీదకు వెళ్లకపోవచ్చు కానీ... స్ర్కిప్ట్స్‌తో సిద్ధంగా హీరోల కోసం దర్శకులు ఎదురు చూస్తున్నారు. చిరంజీవికి ‘ఆచార్య’ తర్వాత ‘లూసిఫర్‌’ రీమేక్‌, కె.ఎస్‌. రవీంద్ర(బాబి)తో చిత్రం, ‘వేదాలం’ రీమేక్‌, బాలకృష్ణకు ‘అఖండ’ తర్వాత దర్శకుడు గోపీచంద్‌ మలినేనితో సినిమా, నాగార్జునకు ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో సినిమా తర్వాత ‘బంగార్రాజు’, మహేశ్‌బాబుకు ‘సర్కారు వారి పాట’ తర్వాత త్రివిక్రమ్‌తో సినిమా, రవితేజకు ‘ఖిలాడి’ తర్వాత దర్శకులు శరత్‌ మండవ, త్రినాథ్‌ రావు నక్కినతో చిత్రాలు, జూనియర్‌ ఎన్టీఆర్‌కు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత కొరటాల శివతో సినిమా, ‘విరాటపర్వం’ విడుదలకు ఎదురుచూస్తున్న రానాకు ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ రీమేక్‌ తర్వాత ఆచంట గోపినాథ్‌, సీహెచ్‌ రాంబాబు నిర్మాణంలో ఓ సినిమా, అఖిల్‌ అక్కినేనికి ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ తర్వాత ‘ఏజెంట్‌’, నితిన్‌కు ‘మేస్ట్రో’ తర్వాత ‘పవర్‌పేట’... ఈ విధంగా హీరోలందరికీ కథలు లేదా దర్శకులు సిద్ధమే.


‘నారప్ప’, ‘హరి హర వీరమల్లు’, ‘రాధే శ్యామ్‌’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘గని’ - ఈ చిత్రాలకు కరోనా రెండుసార్లు బ్రేకులు వేసింది. గత ఏడాది ఒకసారి... ఇప్పుడు ఇంకోసారి! ఈ చిత్రాల తర్వాత హీరోలు వేర్వేరు చిత్రాలు ప్రారంభించారు. ఇప్పుడు ఇవీ సెట్స్‌ మీద ఉన్నాయి. అవీ సెట్స్‌ మీద ఉన్నాయి. మళ్లీ షూటింగులు మొదలైన తర్వాత ముందు ఏ సినిమా మొదలుపెట్టి, ఏది పూర్తి చేయాలని ఆలోచిస్తున్నారట. సినిమా ఒక్కరితో ముడిపడిన వ్యవహారం కాదు. కాంబినేషన్‌ సన్నివేశాలకు ఇతర నటీనటుల కాల్‌షీట్లు కూడా కావాలి. అందుకని, ఆర్టిస్టుల డేట్లు... లొకేషన్లు... అన్నీ చెక్‌ చేసుకుని షూటింగ్‌ కు రీ-షెడ్యూల్స్‌ చేసుకోవాలి.


‘నారప్ప’ తర్వాత వెంకటేశ్‌ ప్రారంభించిన చిత్రం ‘దృశ్యం-2’. అందులో ఆయన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయ్యిందని తెలిసింది. మిగతావారిపై సీన్లు తీయాలట. ‘నారప్ప’ తర్వాతే వెంకటేశ్‌ ‘ఎఫ్‌ 3’ ప్రారంభించారు. ప్రస్తుతానికి ఈ రెండూ సెట్స్‌ మీద ఉన్నాయి. ‘నారప్ప’ చిత్రీకరణ చాలావరకూ పూర్తయ్యింది. అయితే, జనసమూహంలో చిత్రీకరించాల్సిన కొన్ని సన్నివేశాలు మాత్రమే ఉన్నాయి. కరోనా తీవ్రత తగ్గిన తర్వాత వాటిని తీస్తారట. ‘ఎఫ్‌ 3’ మరో హీరో వరుణ్‌తేజ్‌. ఆయన దీంతో పాటు బాక్సింగ్‌ నేపథ్యంలో ‘గని’ చేస్తున్నారు. వెంకటేశ్‌, వరుణ్‌ - మూడు సినిమా యూనిట్స్‌ ఓ అండర్‌స్టాండింగ్‌తో షెడ్యూళ్లు వేసుకోవాలి.


‘వకీల్‌ సాబ్‌’తో ఏప్రిల్‌లో థియేటర్లలోకి వచ్చిన పవన్‌కల్యాణ్‌, దాంతో పాటు చిత్రీకరణ చేసిన మరో సినిమా ‘హరి హర వీరమల్లు’. చారిత్రక నేపథ్యంలో రూపొందుతోంది. అదింకా పూర్తి కాలేదు. దాని తర్వాత మలయాళ హిట్‌ ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ రీమేక్‌ ప్రారంభించారు. ఇందులో రానా మరో హీరో. దీని తర్వాతే కొత్త సినిమాలు సెట్స్‌కు తీసుకు వెళ్లాలని ఆయన భావిస్తున్నారట. అందువల్ల, ముందు-వెనుక రెండు చిత్రాలను చకచకా పూర్తి చేసే ఛాన్స్‌ ఉంది. ఎందుకంటే... ఈ రెండిటి తర్వాత హరీశ్‌ శంకర్‌తో ఓ సినిమా, సురేందర్‌రెడ్డితో మరో సినిమా అంగీకరించారు. కొంత విరామం తర్వాత వేగంగా చిత్రాలు చేయాలనుకున్న పవన్‌ కల్యాణ్‌కు కరోనా రూపంలో అడ్డంకి ఎదురవుతోంది.


‘బాహుబలి’ రెండు భాగాలు, ‘సాహో’ - ప్రభాస్‌ డైరీలో ఆరేడేళ్లు సమయాన్ని తీసుకున్నాయి. అంత ఆసల్యం చేయకూడదని ‘రాధే శ్యామ్‌’, ‘ఆదిపురుష్‌’, ‘సలార్‌’ - మూడు చిత్రాలను సెట్స్‌ మీదకు తీసుకువెళ్లాడు. అతని వేగానికి కరోనా కళ్లెం వేసి విశ్రాంతి ఇచ్చింది. ముంబైలో లాక్‌ డౌన్‌ కారణంగా హైదరాబాద్‌లో ‘ఆదిపురుష్‌’ చేయాలనుకున్నారు. కరోనా వల్ల అదీ వీలు పడటం లేదు. ఆయన డేట్స్‌ ఎలా అడస్ట్‌ చేస్తారన్నది ఆసక్తికరం. ‘రాధే శ్యామ్‌’ చిత్రీకరణ చివరకు వచ్చింది కాబట్టి... దానికి కొన్నిరోజులు ఇస్తే చాలు. ఆపై, నెలలో మిగతా రెండు చిత్రాలకు సగం సగం కేటాయించాలనుకుంటున్నారట.


‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో పాటు చిరంజీవి ‘ఆచార్య’లో రామ్‌చరణ్‌ నటిస్తున్న సంగతి తెలిసింది. తండ్రి చిత్రంలో ఆయనది ప్రత్యేక పాత్ర. అయితే, చిత్రీకరణ ఇంకా పూర్తి కాలేదు. రెండు చిత్రాలకు డేట్స్‌ అడ్జస్ట్‌ చేయాలి. సాధారణంగా హీరోయిన్లకు డేట్స్‌ అడ్జస్ట్‌ సమస్య ఎదురవుతూ ఉంటుంది. రెండు మూడు భాషల్లో ఒకటి కంటే ఎక్కువ చిత్రాలు చేస్తుంటారు కనుక. మన హీరోలు ఎక్కువ చిత్రాలు చేయాలని వేగం పెంచడం, అనూహ్యంగా కరోనా రావడంతో వాళ్లకూ ఇప్పుడీ సమస్య ఎదురవుతోంది.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.