ఆ పాటని పట్టుకు వదలనన్నదె..!
ABN , First Publish Date - 2022-07-23T05:54:08+05:30 IST
సంగీత సంచలనం... తమన్. తెలుగులో ఇప్పుడు ఏ పెద్ద సినిమా పేరు చెప్పినా, సంగీత దర్శకుడిగా తమన్ పేరే వినిపిస్తోంది.

సంగీత సంచలనం... తమన్. తెలుగులో ఇప్పుడు ఏ పెద్ద సినిమా పేరు చెప్పినా, సంగీత దర్శకుడిగా తమన్ పేరే వినిపిస్తోంది. తన పాటలతో, నేపథ్య సంగీతంతో దర్శకుడి కథని, ఆలోచనల్ని మరో స్థాయికి తీసుకెళ్లి నిలబెడుతున్నారు తమన్. సంగీత దర్శకుడిగా వంద సినిమాల అనుభవం తమన్ సొంతం. తన ఖాతాలో చాలా అవార్డులు వచ్చి చేరాయి. ఇప్పుడు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు కూడా తమన్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోని పాటలకు గానూ... తమన్ ఈ పురస్కారం అందుకోబోతున్నారు.
2020 సంక్రాంతికి విడుదలైన ‘అల వైకుంఠపురములో’ సంలచన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్ హిట్టే. ముఖ్యంగా ‘నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు...’ చాట్ బస్టర్‌గా నిలిచింది. ఈ యేడాది విడుదలైన పాటల్లో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించుకొంది. ‘బుట్టబొమ్మా.. బుట్టబొమ్మా’ పాట కూడా యువతరాన్ని ఒక ఊపు ఊపింది. శ్రీకాకుళ జానపదం ‘సిత్తరాల సిరపడు’ మరో సూపర్ హిట్. ఆ పాటని సినిమాలో వాడుకొన్న విధానం కూడా అబ్బురపరిచింది. ఈ సినిమాలోని ఒక్కో పాటా ఒక్కో విధంగా సాగి, తమన్‌లోని స్వర వైవిధ్యాన్ని ఆవిష్కరించింది. త్రివిక్రమ్ సినిమా అనగానే తమన్ చెలరేగిపోతుంటారు. ఈసారీ అదే జరిగింది. వాటిని తెరకెక్కించిన విధానం పాటలకు మరింత వన్నె తెచ్చాయి. ఈ సినిమా, అందులోని పాటలు.. తమన్‌ని టాలీవుడ్‌లో నంబర్ వన్ స్థానంలో కూర్చోబెట్టాయి.