కోలీవుడ్ మీడియాను క్షమాపణలు కోరిన జక్కన్న

ABN , First Publish Date - 2021-11-27T23:17:56+05:30 IST

దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి బ్రహ్మాండంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి మరో పాటను శుక్రవారం విడుదల చేశారు. ‘ఉయిరే’ అనే తమిళ సాంగ్‌ను ప్రత్యేకంగా చెన్నై మీడియాకు ప్రదర్శించారు. దేశభక్తిని చాటే విధంగా చిత్రీకరించిన..

కోలీవుడ్ మీడియాను క్షమాపణలు కోరిన జక్కన్న

కోలీవుడ్: దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి బ్రహ్మాండంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి మరో పాటను శుక్రవారం విడుదల చేశారు. ‘ఉయిరే’ అనే తమిళ సాంగ్‌ను ప్రత్యేకంగా చెన్నై మీడియాకు ప్రదర్శించారు. దేశభక్తిని చాటే విధంగా చిత్రీకరించిన ఈ పాటలో జూనియర్‌ ఎన్టీఆర్‌ చాలా బాధతో కనిపిస్తాడు. రాంచరణ్‌ బ్రిటిష్‌ సైనికుడి యూనిఫాంలో ఒకసారి, మరో షాట్‌లో పోరాటం చేసే పాత్రలో కనిపిస్తారు. అయితే, చెర్రీ పాత్ర ఏంటి అనేది సస్పెన్స్‌గా ఉంచారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గన్‌ను పోరాటయోధుడుగా చూపించారు. ఈ సందర్భంగా చెన్నై నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర దర్శకుడు రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య, లైకా ప్రొడక్షన్‌ ప్రతినిధి తిరుకుమరన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి ముందుగా తమిళ మీడియాను క్షమాపణలు కోరారు. గత మూడేళ్ళుగా ఒక్కటంటే ఒక్క ప్రెస్‌మీట్‌ కూడా ఏర్పాటు చేసి మీడియాను కలుసుకోలేక పోయానంటూ ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెప్పారు. వచ్చే నెలలో మరో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, మీరు అడిగే ప్రతి ప్రశ్నలకు సమాధానమిస్తానని వెల్లడించారు. 


ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘ఉయిరే’ పాట ఈ చిత్రానికి ఆత్మ (సోల్‌) వంటిదన్నారు. ఈ పాట కోసం మరగదమణి (ఎంఎం.కీరవాణి) రెండు నెలల పాటు శ్రమించి రూపకల్పన చేశారన్నారు. ఈ ట్యూన్‌ వినగానే మదన్‌ కార్గే కన్నీరు కార్చారని, ఆ తర్వాత ఆయనే గేయరచన చేశారన్నారు. కేవలం మీడియా ప్రతినిధులకు ముందుగా చూపించాలన్న ఏకైక ఉద్దేశంతోనే మొదట ప్రదర్శించామన్నారు. ఇది ప్రమోషనల్‌ ఈవెంట్‌ కానేకాదన్నారు. వచ్చే నెలలో చిత్ర ట్రైలర్‌తో పాటు ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను భారీగా ప్లాన్‌ చేస్తున్నట్టు వెల్లడించారు. చిత్రంలోని నటీనటులతో పాటు టెక్నీషియన్లు, చిత్ర బృందం మొత్తం ఇందులో పాల్గొంటుందన్నారు. కాగా, టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు జూనియర్‌ ఎన్టీఆర్‌, రాంచరణ్‌ కలిసి నటిస్తున్న ఈ పాన్‌ ఇండియా మూవీని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించగా, తమిళంలో లైకా ప్రొడక్షన్‌ అధినేత సుభాస్కరన్‌ జనవరి 7న రిలీజ్‌ చేస్తున్నారు.

Updated Date - 2021-11-27T23:17:56+05:30 IST