‘శ్రీదేవి సోడా సెంటర్’ రివ్యూ

ABN , First Publish Date - 2021-08-27T21:38:40+05:30 IST

తెలుగు సినిమాల్లో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రాజ‌కీయాలు, ప్రేమ‌లు, గొడ‌వ‌లు వంటి కాన్సెప్ట్‌ల‌తో వ‌చ్చే సినిమాలు పెరుగుతున్నాయి. క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో పాటు ఓ రా కంటెంట్‌ను మేక‌ర్స్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించే ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌టంతో ప్రేక్ష‌కులు సినిమాల‌ను ఆదరిస్తున్నారు. అలాంటి ఓ బ్యాక్‌డ్రాప్‌తో హీరో సుధీర్‌బాబు చేసిన ప్ర‌య‌త్నం `శ్రీదేవి సోడాసెంట‌ర్‌`.

‘శ్రీదేవి సోడా సెంటర్’ రివ్యూ

చిత్రం:  శ్రీదేవి సోడా సెంట‌ర్‌

న‌టీన‌టులు:  సుధీర్ బాబు, ఆనంది, వి.కె.నరేశ్, పావుల్ల నవగీతమ్, సత్యం రాజేశ్, రఘుబాబు త‌దిత‌రులు

సెన్సార్‌:  యు/ఎ

బ్యాన‌ర్‌:  70 ఎం.ఎం.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌

ద‌ర్శ‌క‌త్వం: క‌రుణ కుమార్‌

నిర్మాత‌లు:  విజ‌య్ చిల్లా, శ‌శిదేవి రెడ్డి

సంగీతం:  మ‌ణిశ‌ర్మ‌

సినిమాటోగ్ర‌ఫీ:  శామ్‌ద‌త్ సైనుద్దీన్‌

ఎడిట‌ర్‌:  శ్రీక‌ర్ ప్ర‌సాద్‌

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌:  రామ‌కృష్ణ‌, మోని


తెలుగు సినిమాల్లో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రాజ‌కీయాలు, ప్రేమ‌లు, గొడ‌వ‌లు వంటి కాన్సెప్ట్‌ల‌తో వ‌చ్చే సినిమాలు పెరుగుతున్నాయి. క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో పాటు ఓ రా కంటెంట్‌ను మేక‌ర్స్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించే ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌టంతో ప్రేక్ష‌కులు సినిమాల‌ను ఆదరిస్తున్నారు. అలాంటి ఓ బ్యాక్‌డ్రాప్‌తో హీరో సుధీర్‌బాబు చేసిన ప్ర‌య‌త్నం ‘శ్రీదేవి సోడాసెంట‌ర్‌’. ప‌లాస సినిమాను తెర‌కెక్కించి హిట్ కొట్టిన ద‌ర్శ‌కుడు క‌రుణ్ కుమార్ అలాంటి త‌ర‌హాలోనే శ్రీదేవి సోడా సెంట‌ర్‌ను తెర‌కెక్కించిన‌ట్లు అర్థం అవుతుంది. అయితే దీనిలో ప్రేమ అనే ఓ కోణాన్ని ఎక్కువ‌గా ఎలివేట్ చేసిన‌ట్లు ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. మ‌రి శ్రీదేవి సోడా సెంట‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు ఆక‌ట్టుకుందో తెలుసుకోవాలంటే సినిమా క‌థేంటో చూద్దాం...


క‌థ‌:

అమ‌లాపురంలో సూరిబాబు(సుధీర్‌బాబు) పేరున్న ఎల‌క్ట్రీషియ‌న్‌. పెళ్లి చేసుకోకూడ‌ద‌ని అనుకునే సూరిబాబు.. త‌న గ్రామంలో వీర‌భ‌ద్ర ఉత్స‌వాల్లో శ్రీదేవి(ఆనంది)ని చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు.  శ్రీదేవి సోడా సెంట‌ర్ య‌జ‌మాని సంజీవ‌రావు(వి.కె.న‌రేశ్‌) ఒక్క‌గానొక్క కూతురే శ్రీదేవి. ఆమె కూడా సూరిబాబుని ప్రేమిస్తుంది. విష‌యం సంజీవ‌రావుకి తెలుస్తుంది. అయితే కులాలు వేరు కావ‌డంతో సంజీవ‌రావు వారి ప్రేమ‌కు ఒప్పుకోడు. అదే స‌మ‌యంలో సూరిబాబు, ఆ ఊరి పెద్ద కాశీ(పావుల్ న‌వ‌గీత‌మ్‌)కి.. వల‌క‌ట్ల వ‌ల్ల గొడ‌వ‌లు అవుతాయి. స‌మ‌యం కోసం ఎదురుచూసిన కాశీ.. త‌న మ‌నిషితో సూరి తండ్రిని అవ‌మానిస్తాడు. సూరికి విష‌యం తెలియ‌డంతో గొడ‌వ పెద్ద‌ద‌వుతుంది. గొడ‌వ‌లో కాశీ మ‌నిషిని సూరి స్క్రూ డ్రైవ‌ర్‌తో పొడిచేస్తాడు. అయితే సూరి తండ్రి చొర‌వ తీసుకుని కాంప్ర‌మైజ్ చేస్తాడు. కేసును కొట్టేస్తార‌నుకుంటున్న స‌మ‌యంలో సూరి చేత గాయ‌ప‌డ్డ కాశీ మ‌నిషి హాస్పిట‌ల్‌లో చ‌చ్చిపోతాడు. దాంతో సూరి జైలుకెళ‌తాడు... జైలులోని సూరికి షాకింగ్ నిజం తెలుస్తుంది. అదేంటి?  సూరి జైలు కెళ్లిన తర్వాత శ్రీదేవికి ఏమౌతుంది?  నిజం తెలిసిన సూరి ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడు?  అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 


విశ్లేషణ:

శ్రీదేవి సోడా సెంట‌ర్.. గురించి చెప్పాలంటే మ‌నుషులు సాంకేతికంగా ఎదుగుతున్నాం. కానీ కులం, మ‌తం విష‌యంలో ఇంకా చిన్న‌గానే ఆలోచిస్తున్నామ‌నే ఓ పాయింట్‌తో తెర‌కెక్కిన చిత్రం. ప‌రువు హ‌త్య‌లు అనే ఓ విష‌యాన్ని ఇండియన్ సినిమాల్లో ప‌లు సంద‌ర్భాల్లో ప‌లు ర‌కాలుగా ట‌చ్ చేశారు. రీసెంట్‌గా టాలీవుడ్‌లో సెన్సేష‌న‌ల్ విజ‌యం సాధించిన ఉప్పెనలో ఇలాంటి అంశ‌మే. గొప్ప కులం, త‌క్కువ కులం అనే పాయింట్‌తో ప‌లాస 1978 సినిమాను తెరెక్కించిన ద‌ర్శ‌కుడు క‌రుణ కుమార్‌.. శ్రీదేవి సోడాసెంటర్‌లో అదే పాయింట్‌ను ప్ర‌ధానంగా ట‌చ్ చేశాడు. దీనికి తోడు ప‌రువు హ‌త్య అనే మ‌రో అంశాన్ని కూడా మిక్స్ చేసి సినిమాను తెర‌కెక్కించాడు. సినిమా ఫ‌స్ట్ హాఫ్ అంతా.. హీరో, అత‌ని జీవన శైలి, స్నేహితులు, ప్రేమ‌, అనుకోకుండా జ‌రిగే గొడ‌వ‌ల్లో జైలుకెళ్ల‌డమ‌నే సీన్స్‌తో ర‌న్ అవుతుంది. ఇక సెకండాఫ్ విష‌యానికి వ‌చ్చేస‌రికి, అస‌లు ట్విస్టులు, టర్నుల‌తో క‌థ న‌డుస్తుంది. జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన హీరో శ్రీదేవి  ఎక్క‌డుంది..ఏమైంది? అనే అన్వేషించుకున్న‌ప్పుడు న‌డి చే క‌థ‌నం ఆస‌క్తికరంగా, ఎమోష‌న‌ల్‌గా ఉంటుంది. సెకండాఫ్‌లో ప్ర‌ధానాంశం, పావ క‌థైగ‌ల్ అనే వెబ్‌సిరీస్‌లో ప్ర‌కాశ్‌రాజ్‌, సాయిప‌ల్ల‌వి మ‌ధ్య న‌డిచే ఎమోష‌న్స్‌ను గుర్తుకు తెస్తాయి. దీనికి ద‌ర్శ‌కుడు క‌రుణ కుమార్ హీరోయిజం, యాక్ష‌న్‌, ల‌వ్ అనే అంశాల‌ను జోడించి సినిమాగా తెర‌కెక్కించాడు. హీరో, హీరోయిన్ ల‌వ్ ట్రాక్‌లో కొత్త‌ద‌నం ఏమీ ఉండ‌దు. మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ చేసిన చుక్క‌ల మేళం.. పాట‌తో పాటు మందులోడా సాంగ్ ఆక‌ట్టుకుంటాయి. అలాగే నేప‌థ్య సంగీతం సినిమాకు ఎసెట్‌గా నిలిచింది. శామ్‌ద‌త్ సైనుద్దీన్ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. సినిమా యాక్ష‌న్ స‌న్నివేశాల గురించి చెప్పాలంటే నేచుర‌ల్‌గా చూపించే ప్ర‌య‌త్నం చేశారు. యాక్ష‌న్ స‌న్నివేశాల కోసం సుధీర్ చేసిన సిక్స్ ప్యాక్ లుక్ బావుంది. ఇక ఫ‌స్టాఫ్‌లో వ‌చ్చే వ‌ల‌క‌ట్ల స‌న్నివేశం చాలా బావుంది. 


ఇక న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే... లైటింగ్ సూరిబాబుగా సుధీర్ బాబు పాత్ర‌లో ఒదిగిపోయాడు. యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు త‌గ్గ‌ట్లు త‌న ఆహార్యం, గోదావరి యాస‌లో త‌ను చెప్పిన డైలాగ్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటాయి. ఇక ఆనందికి తెలుగులో చాలా మంచి పాత్ర దొరికింద‌నే చెప్పాలి. పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉండే శ్రీదేవి పాత్ర‌లో ఆమె చ‌క్క‌గా న‌టించింది. ఇక సినిమాకు ప్ర‌ధానంగా నిలిచిన వి.కె.న‌రేశ్ పాత్ర కూడా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. సెకండాఫ్‌లో వ‌చ్చే ఎమోష‌న్స్‌.. భ‌ర్త ఆత్మ‌హ‌త్య చేసుకుంటుంటే భార్య అన్నం తిన‌డం ఇవ‌న్నీ ప్రేక్ష‌కుడికి ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ అవుతాయి. పెద్ద మ‌నిషి అనేవాడు ముద్ద పెట్టాలి కానీ, చేతిలో ఉన్న‌ది లాక్కోకూడ‌దు.. మంచోడే కానీ మ‌నోడు కాదు.. అంటూ సంద‌ర్భానుసారం వ‌చ్చే డైలాగ్స్ ఆక‌ట్టుకుంటాయి. 


బోట‌మ్ లైన్‌: ప‌రువు కంటే  ప్రేమ గొప్ప‌ద‌ని చెప్పే ‘శ్రీదేవి సోడా సెంట‌ర్‌’

Updated Date - 2021-08-27T21:38:40+05:30 IST