దళిత సినిమా దరువేస్తోంది!

ABN , First Publish Date - 2021-08-01T17:55:27+05:30 IST

కళ్లు జిగేల్‌మనే కలర్‌ఫుల్‌ వెండితెర క్రమక్రమంగా ఇప్పుడు ‘నలుపు’ రంగు పులుముకుంటోంది. తెర మీద ఆ రంగు సరికొత్త ‘కళ’తో ఒకింత తీవ్రంగా కనిపిస్తూ అనేక ప్రశ్నలను సంధిస్తోంది. సృజనాత్మక ఆలోచనలకు రెక్కలు తొడుగుతోంది...

దళిత సినిమా దరువేస్తోంది!

కళ్లు జిగేల్‌మనే కలర్‌ఫుల్‌ వెండితెర క్రమక్రమంగా ఇప్పుడు ‘నలుపు’ రంగు పులుముకుంటోంది. తెర మీద ఆ రంగు సరికొత్త ‘కళ’తో ఒకింత తీవ్రంగా కనిపిస్తూ అనేక ప్రశ్నలను సంధిస్తోంది. సృజనాత్మక ఆలోచనలకు రెక్కలు తొడుగుతోంది. వెండితెరపై దళిత కథానాయకుడు అంబేద్కర్‌ ఆశయాలకు ప్రతిరూపంగా కనిపిస్తున్నాడు. సమాజంలో తమ స్థానం కోసం సాధికారికంగా పోరాటం చేస్తున్నాడు. బడుగులు... బలహీనవర్గాలు అనే కప్పదాటు పడికట్టు పదాలను దాటుకుని సూటిగా, స్పష్టంగా ‘దళిత’ శంఖం పూరిస్తున్నాడు. కొన్ని దశాబ్దాలుగా కలలు కల్లలవుతున్న చోట... ‘కళ’నే ఆయుధంగా చేసుకుని, తమ ఆలోచనలను ప్రపంచానికి చాటేందుకు నేటితరం దళిత యువకులు దర్శకులుగా, సృజనశీలురుగా మారి మెయిన్‌స్ట్రీమ్‌ తెరపై దళిత సినిమా చూపిస్తున్నారు. దళిత సాహిత్యం బలంగా ఉన్నచోట దళిత సినిమా సూపర్‌స్టార్‌గా అవతరించేందుకు ఇప్పుడిప్పుడే పునాదులు పడుతున్నాయి. వాటిపై నలుపు భావజాలాల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. మేధోపరమైన చర్చలు సాగుతున్నాయి. భారతీయ సినిమా ప్రపంచంలో ఇదొక కొత్త ప్రభంజనం... 


‘కబాలి’లో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కనిపించే ప్రారంభ దృశ్యం మీకు గుర్తుందా? నీలి దుస్తులు ధరించి, తెల్లగడ్డంతో ఉన్న కబాలి జైలు గదిలో పుస్తకం చదువుతూ కనిపిస్తాడు. పోలీసులు వచ్చిన అలికిడి... జైలు ఊచల వెనుక నుంచి ఆయన భుజాల మీదుగా కెమెరా జూమ్‌ చేస్తే... చదువుతున్న ఆ పుస్తకాన్ని మూస్తాడు తలైవార్‌. అప్పటిదాకా ఆయన చదువుతున్నది ‘మై ఫాదర్‌ బాలయ్య’. వివక్షకు గురవుతున్న దళిత వర్గానికి చెందిన ఒక తండ్రి తన కొడుకులకు విద్య ద్వారానే ఉన్నతమైన జీవితం లభిస్తుందని తెలిపే పుస్తకం అది. 



తరం మారింది...

నిజానికి కమర్షియల్‌ సినిమాకు దళిత, బహుజన పదాలు సరిపడవు. ఒకవేళ ఆ పదాలను వాడాలనుకుంటే... వ్యాపారాత్మక ధోరణిలోకే వాటిని తీసుకొస్తారు. అంటే హీరో రిక్షావాడిగా వేసినా, చెప్పులు కుట్టేవాడిగా ఉన్నా పాత్రచిత్రణలో తేడా ఏమీ ఉండదు. అలాంటప్పుడు మూస కథలు, మూస పాత్రలే పుట్టుకొస్తాయి కానీ కొత్తదనం కనిపించదు. అలాగే కొన్ని పాత్రలు, సన్నివేశాలు, డైలాగులు పెట్టినంత మాత్రానా అది అచ్చమైన దళిత, బహుజన సినిమా అనిపించుకోదనేది తెలిసిందే. సాహిత్యంలో తమ స్థానం కోసం దళితులు, బహుజనులు పోరాడి సాధించుకున్నట్టే... సినిమా అనే సృజనాత్మక ప్రక్రియ ద్వారా భావజాల వ్యాప్తి జరగాలని ఈతరం దళిత, బహుజనులు కోరుకుంటున్నారు. అందుకే ఇటీవల కాలంలో దళితుల సినిమాలను దళితులే తీస్తున్నారు. ఈ ట్రెండ్‌ ఇటీవలే సీరియస్‌గా మొదలైనట్టు కనిపిస్తోంది. మిగతా భాషల కన్నా తమిళంలో ఈ ప్రయత్నం జోరుగా సాగుతోంది. చాలామంది దర్శకులు దళిత భావజాలాన్ని సృజనాత్మక కథలుగా మలుస్తున్నారు. మెయిన్‌ స్ట్రీమ్‌ సినిమాల్లోకి దళిత కాన్సెప్ట్‌ను పకడ్బందీ కథనాలతో చూపించి, అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. వీరి బాటలోనే మలయాళం, మరాఠీ దర్శకులు అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు వీళ్లు చెబుతున్న దళిత కథలు విని, అందులో నటించేందుకు స్టార్లు కూడా ఉత్సాహం చూపుతున్నారు. 


‘‘ఇవి కేవలం దళితుల పట్ల సానుభూతి కలిగించే సినిమాలు కావు. అణగారిన వర్గాల నుంచి వచ్చిన వారే, అణచివేతకు గురవుతున్న వారి జీవితాలు... హక్కులపై చేస్తున్న సినిమాలు. సినిమాల ద్వారా దళిత విముక్తి కోసం సాగుతున్న సృజనాత్మక ఉద్యమం ఇది. ఈ సరికొత్త సినిమాలు దళిత జీవన విధానాన్ని ప్రధానంగా ఫోకస్‌ చేస్తున్నాయి. ఇంతకుముందు కేవలం దళిత అనుకూల చిత్రాలు మాత్రమే వచ్చేవి. ఇలాంటివి సానుభూతిని మాత్రమే చూపుతాయి. కానీ ఇప్పుడు రాజకీయంగా చర్చించే సినిమాలు వస్తున్నాయి’’ అంటున్నారు దర్శకుడు వెట్రిమారన్‌. 2015లో ఈయన తీసిన ‘విసరనై’ సినిమా ఒక దళితుడిపై పోలీసుల దౌర్జన్యకాండ గురించి చర్చిస్తుంది. మానవ హక్కుల కోణంలో అనేక ప్రశ్నలను సంధిస్తుంది. 2019లో వెట్రిమారన్‌ తీసిన ‘అసురన్‌’ (ఇటీవల తెలుగులో వచ్చిన వెంకటేశ్‌ ‘నారప్ప’కు మాతృక) కూడా దళిత కుటుంబానికి సంబంధించిన కథనే. 


మరో దర్శకుడు మారి సెల్వరాజ్‌ ఇప్పటిదాకా తీసింది రెండు సినిమాలే. అయితే అవి రెండు కూడా దళిత సమస్యలను ఫోకస్‌ చేశాయి. తొలి సినిమా ‘పరియేరుం పెరుమాళ్‌’ తర్వాత మూడేళ్లకు ఇటీవల ధనుష్‌ హీరోగా ‘కర్ణన్‌’ను తీసి మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. 1995లో కొడియాంకులం అనే గ్రామంలో జరిగిన కుల ఘర్షణ నేపథ్యాన్ని ఈ సినిమాకు కథగా ఎంచుకున్నాడు. ఆ ఊరికి బస్సు రాదు. పొలిమేరల్లో నుంచే బస్సు వెళ్తుంది. ఆ ఊళ్లో ఉండేదంతా అణగారిన వర్గాలే. తమ జాతివాళ్ల కోసం ‘కర్ణన్‌’ చేసే పోరాటం ఈ సినిమా ఇతివృత్తం. సినిమాలో దేవుళ్లు, జాతరలు, ఊరి వాతావరణం ద్వారా దళితుల జీవన విధానాలను ఉన్నదున్నట్టుగా చూపిస్తాడు దర్శకుడు.



ఉస్మానియా యూనివర్శిటీలో కెమిస్ట్రీ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ వై.బి.సత్యనారాయణ రాసిన ‘మై ఫాదర్‌ బాలయ్య’ దళితుడైన యువ దర్శకుడు పా.రంజిత్‌కు బాగా నచ్చింది. అతడు ‘కబాలి’లో రజనీకాంత్‌ ఓపెనింగ్‌ సీన్‌లో ‘మై ఫాదర్‌ బాలయ్య’ పుస్తకం చదువుతున్నట్టు చూపడం ద్వారా దళిత భావజాలాన్ని ప్రపంచానికి చాటాలనుకున్నాడు. అతడి అంచనా ఫలించింది. ‘కబాలి’ సినిమా విడుదలైన తర్వాత ఆ ప్రారంభ దృశ్యం పతాక శీర్షికలకు ఎక్కింది. దాంతో ‘మై ఫాదర్‌ బాలయ్య’ అనే దళిత సాహిత్యం అందరి దృష్టినాకర్షించింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, బెంగాలీతో పాటు అనేక భాషల్లోకి అనువాదమయ్యింది. అప్పటిదాకా లైబ్రరీకే పరిమితమైన పుస్తకం తెరపై రజనీకాంత్‌ చేతిలో కనపడటంతో అందరి డ్రాయింగ్‌ రూమ్‌ల్లోకి వచ్చింది. ఈ ఆలోచన వెనుక పా.రంజిత్‌తో పాటు ‘కబాలి’కి అతడితో పాటు పనిచేసిన చాలామంది దళిత యువతీ యువకుల భావజాలం ఉంది.


‘నీ చిన్నతనం నుంచి నీకు ఎన్నో కథలున్నాయి. కానీ నాకు ఒక్కటి కూడా లేదు. నేను 12వ తరగతి అయిపోగానే డిగ్రీ కాలేజీకి వచ్చానంతే...’ జ్యోతి మహాలక్ష్మి ఉరఫ్‌ జో అనే అగ్రకులానికి చెందిన అమ్మాయి దళిత యువకుడైన ‘పరియేరుం పెరుమాళ్‌’ ఉరఫ్‌ పరియన్‌తో అంటుంది. అతడి పేరు టైటిల్‌గా కనిపించే ఈ సినిమా ప్రారంభ సన్నివేశంలో కురుప్పి (తమిళంలో నలుపు అని అర్థం) అనే కుక్కను ప్రేమగా పెంచుకున్న పరియన్‌ ముందరే కొందరు పాశవికంగా చంపుతారు. అగ్రకుల ఆధిపత్యానికి అది సంకేతం. రాజ్యాంగ సృష్టికర్త బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకుని పరియన్‌ న్యాయ కళాశాలలో చేరుతాడు. అక్కడే సహవిద్యార్థి జో అతడికి పరిచయం అవుతుంది. 


ఒక అగ్రకులానికి చెందిన అమ్మాయితో దళిత యువకుడు స్నేహంగా ఉండొద్దా? అనేక సంఘర్షణల తర్వాత పరియన్‌ పెంపుడు కుక్క కురుప్పిలాగే అతడిని కూడా చంపాలని చూస్తారు. కానీ బతికి బయటపడతాడు. చివరికి జో తండ్రి మారినట్టే కనిపిస్తాడు. కానీ ‘‘మీరలాగే ఉండి, నేను కుక్కలా ఉండాలని ఆశించినంతవరకు ఏమీ మారదు’’ అనేది పరియన్‌ సమాధానం.


‘పరియేరుం పెరుమాళ్‌’ దర్శకుడు మారి సెల్వరాజ్‌. 2018లో ఈ సినిమా ప్రచార పోస్టర్‌ మీద కాలర్‌ ఉండి మెడ చుట్టూ పట్టీ ఉన్న కుక్క ఫొటో... దాని వెనుక సిల్హౌట్‌లో కొంతమంది ఉన్నట్టుగా వేయడం అప్పట్లో సంచలనం. తొలి సినిమానే దళిత కోణంలో చెప్పి, హిట్‌ కొట్టాడు దర్శకుడు మారి సెల్వరాజ్‌. 


వీటితో పాటు... ఒక ‘సైరాట్‌’, ఒక ‘కాలా’, ఒక ‘విసరనై’, ఒక ‘అట్టకత్తి’, ఒక ‘అసురన్‌’, ఒక ‘పలాస’... ఈ సినిమాలన్నీ దళిత కోణంలో రూపుదిద్దుకున్నవే. కుల వివక్ష అనేది భారతీయ సినిమాకు కొత్తేం కాదు. అలనాటి ‘అచ్చుత్‌ కన్య’ (1936) నుంచి ఇటీవలి ‘సైరాట్‌’ దాకా అన్ని భాషల్లో కొన్ని వందల సినిమాలు సమాజంలో నెలకొన్న కుల వివక్షను చూపించాయి. అయితే వాటిలో వేళ్ల మీద లెక్కపెట్టేవి మాత్రమే ఈ సమస్యను అర్థవంతంగా చర్చించాయి. చాలామంది దర్శకులు వయా మీడియాగా ఆయా పాత్రలకు కులాన్ని ఆపాదించి, చివర్లో ‘కులం... మతం’ అంటూ సందేశాలు ఇచ్చే ప్రయత్నం చేసి చేతులు దులుపుకుంటారు. 


బడుగు, బలహీనవర్గాలు అంటూ జనరలైజ్‌ చేశారే కానీ దళితుల జీవనవిధానాన్ని, ఆలోచనా విధానాన్ని మరింత లోతులకు వెళ్లి చర్చించలేదు. మన సినిమాల్లో హీరోలు ఎప్పుడూ అగ్రకులాలకు ప్రతినిధులుగానే కనిపిస్తారు. ఒకవేళ బడుగు, బలహీన వర్గాలవారిగా కనిపించినా అది ‘సినిమాటిక్‌’ ముఖచిత్రమేగానీ... భావజాలం బలంగా వినిపించదు. కేవలం రాజకీయ అవసరాల కోసం, భవిష్యత్తులో దళితుల ఓట్ల కోసం అగ్రహీరోలు ‘కింది కులస్థుడు’ అనే ముద్ర వేసుకుని హీరోయిజం చూపించారేగానీ... సీరియస్‌గా, ఆలోచనాత్మకంగా దళితుల సమస్యలు తెరపై చర్చించింది చాలా తక్కువ. గతంలో వచ్చిన చాలా సినిమాలు విప్లవకోణంలో, ప్రతీకార కోణంలో రూపుదిద్దుకున్నవే కానీ సామాజిక కోణంలో వారి నిజ జీవితాలను ఆవిష్కరించలేదనే చెప్పాలి. 


మరింత ఆలోచనాత్మకంగా... 

ఇన్నేళ్లుగా తమకు ఏమాత్రం అవకాశం లేని సినిమారంగంలో సృజనాత్మక ఆలోచనలే పెట్టుబడిగా చాలామంది యువ దర్శకులు, రచయితలు అవకాశాలను చేజిక్కించుకుంటున్నారు. సరికొత్త కథలను హీరోలకు వినిపిస్తున్నారు. ఒకవైపు కొత్తవారితో బలమైన దళిత కథలను తెరకెక్కిస్తూనే, మరోవైపు స్టార్ల ద్వారా దళిత, బహుజన భావజాల వ్యాప్తికి ప్రయత్నిస్తున్నారు. మరాఠీలో కూడా ఇలాంటి ప్రయత్నం జోరుగానే సాగుతోంది. పరువు హత్యల నేపథ్యంలో ‘సైరాట్‌’ అనే ప్రేమకథను సూపర్‌హిట్‌ చేసి... దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన దళిత దర్శకుడు నాగ్‌రాజ్‌ మంజులే ఈ రంగంలోకి రావాలనుకుంటున్న ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. 


బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ భావజాలాన్ని అణువణువున నింపుకున్న నాగ్‌రాజ్‌ మహారాష్ట్రలో తను పెరిగిన దళిత వాతావరణాన్ని, దళితుల ఆలోచనా విధానాల్ని సినిమాల్లో బలంగా చూపుతున్నాడు. 2013లో ఆయన తీసిన తొలి సినిమా టైటిల్‌ ‘ఫండ్రీ’... అంటే పంది అని అర్థం. పందుల్ని పట్టి జీవించే ఒక తక్కువ జాతి నుంచి వచ్చిన 13 ఏళ్ల జాంబవంత కచ్రూ అనే పిల్లాడి దృష్టికోణంలో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాకు ఆయన జాతీయ అవార్డు అందుకున్నారు. తన సినిమాలతో అమితాబ్‌ను మెప్పించిన నాగ్‌రాజ్‌ ఆయనతో ‘ఝుండ్‌’ అనే సినిమా తీస్తున్నారు. ఇది కూడా ఆయన మార్కు సినిమానే. 


భావజాలం ముఖ్యం...

మెయిన్‌స్ట్రీమ్‌లో దళిత సినిమాలను పాపులర్‌ చేసేందుకు చాలా ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ పా.రంజిత్‌ రాకతో ఒక్కసారిగా సీన్‌ ఊపందుకుంది. తొమ్మిదేళ్ల క్రితమే తొలిచిత్రం ‘అట్టకత్తి’తో తన రూట్‌మ్యాప్‌ స్పష్టంగా వేసుకున్న రంజిత్‌ 2016లో ‘కబాలి’, 2018లో ‘కాలా’ వంటి వరుస సినిమాలను ఏకంగా రజనీకాంత్‌తో తీసి సంచలనం సృష్టించాడు. దళిత వాదం గురించిన స్పష్టమైన ఆలోచనలకు స్ర్కిప్టు రూపం ఇచ్చి ఆయన సూపర్‌స్టార్‌ను మెప్పించడం గొప్ప విజయంగా చూడొచ్చు. ‘కబాలి’లో రజనీకాంత్‌ ఒకచోట అన్నట్టుగా... ‘పాత సినిమాల్లో గాటు పెట్టుకుని, మీసం తిప్పుకుంటూ, లుంగీ కట్టుకుని పాత విలన్‌ ‘ఏ కబాలీ’ అని పిలవగానే ఒంగొని వినయంగా ‘ఎస్‌ బాస్‌’ అని నిలబడతారే... ఆ కబాలి అనుకుంటున్నార్రా.... ‘కబాలి’రా...’ అనే డైలాగ్‌ను కోటు వేసి మరీ చెప్పించి ఒప్పించాడు రంజిత్‌. ఈ డైలాగ్‌తోనే దళితులు ఎలా ఉండాలనుకుంటున్నారో చూపించాడు. 


తరతరాలుగా వస్తున్న సినిమాల్లోలాగా డబ్బున్నోళ్లు, లేనోళ్లు, అంటరానివారు... అని సాఽధారణీకరించే కప్పదాటు కమర్షియల్‌ వ్యవహారంలా కాకుండా... ఈమధ్య కాలంలో వస్తున్న సినిమాల్లో దళితులను చూపించే విధానంలో స్పష్టమైనా తేడా ఉంటోంది. అది రియలిస్టిక్‌గా, నిజాయితీగా, నిటారుగా కనిపిస్తోంది. దళిత భావజాలాన్ని బలంగా వినిపిస్తోంది. ఉదాహరణకు ‘కబాలి’లో రజనీకాంత్‌ కోటు వేసుకోవడానికి బలమైన కారణం ఉంటుంది. అది అక్షరాలా అంబేద్కర్‌ భావజాలమే. దర్శకుడు పా.రంజిత్‌ ‘కబాలి’లో ఒకరకంగా దళితులను ఎడ్యుకేట్‌ చేస్తే, ‘కాలా’లో పోరాటం చేయాలని సూచించాడు. ‘నలుపు’లో ఎన్ని వర్ణాలుంటాయో, ఎక్కడ అందంగా కనిపిస్తుందో ‘కాలా’ నోటి వెంట చెప్పించాడు. అలాగే ‘కాలా’ను మోటార్‌బైక్‌ ఎక్కించుకుని తీసుకెళ్లే కుర్రాడు ‘భీమ్‌జీ’ ప్రస్థావన తీసుకొస్తాడు. అదేవిధంగా హరిదాదా (నానాపటేకర్‌) ధారావికి వచ్చినప్పుడు అక్కడి మురికివాడలను నలుపు రంగులో చూపిస్తాడు. హరిదాదాను ఎటాక్‌ చేసినప్పుడు ఎరుపు రంగులో, చివరికి విజయం సాధించిన తర్వాత నీలి రంగులను వెదజల్లుతాడు. ఇదంతా కూడా సృజనాత్మక ఆలోచనల పరంపరే.


ఈ దర్శకులంతా సినిమాకు అవసరమైన సృజనాత్మకతను ప్రదర్శిస్తూనే రాజకీయంగా, సామాజికంగా జరగాల్సిన మార్పులను మేధోపరంగా చర్చిస్తున్నారు. ఇది సినిమాల్లో ఇంతకు ముందెన్నడూ కనిపించని కోణం. ‘‘ఎవరైనా సరే, వేరొకరి భావజాలాన్ని ఆక్రమించాలనుకుంటే... అంతకన్నా హింస మరొకటి ఉండదు. మన దేశంలో 2000కు పైగా దళితజాతికి చెందిన కులాలున్నాయి. వీరిలో కొందరు మాత్రమే కనీసం మాట్లాడగలుగుతున్నారు. మిగతావారి గొంతు కూడా వినాలనే కోరిక ఉంది. వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి కదా. నేను ఆ ప్రయత్నమే చేస్తున్నా’’ అన్నారు పా.రంజిత్‌. అందుకోసం నిర్మాతగా కూడా మారి, అనేకమంది దళిత యువకులకు ఆయా విభాగాల్లో అవకాశాలు కల్పిస్తున్నారు. దళిత రచయిత, స్కాలర్‌ అయిన స్టాలిన్‌ రాజంగంను ‘కబాలి’కి సహరచయితగా ఎంచుకున్నారు. 


‘‘రజనీకాంత్‌తో కబాలి డైలాగ్‌ చెప్పించడాన్ని కేవలం సినిమా డైలాగ్‌లాగే చూడొద్దు... దానికి ప్రధాన కారణం... చాలాకాలంగా అలాంటి క్యారెక్టర్లను సరిగా చూపించకపోవడమే’’ అంటున్నారు రాజంగం. 2012లో తమిళనాడులోని దళిత గ్రామాలపై (ధర్మపురి కులఘర్షణలు) జరిగిన దాడుల ఆధారంగానే ‘కబాలి’కి రచన చేసినట్టు ఆయన చెబుతున్నారు. తాజాగా టీఎస్‌ జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రూపొందనున్న ‘జై భీమ్‌’ సినిమాలో హీరో సూర్య లాయర్‌గా దళితుల పక్షాన అంబేద్కర్‌ ఆశయాలకు ప్రతినిధిగా కనిపించనున్నాడు. 


కేరళలో కూడా దళిత, బహుజన సినిమా బలమైన అడుగులు వేస్తోంది. మన దేశంలో తొలి దళిత హీరోయిన్‌గా చెప్పుకునే పీకే రోసీ మలయాళం సినిమాల ద్వారానే ప్రపంచానికి పరిచయం అయ్యింది. ఇటీవల మలయాళీ యువనటి షౌన్‌ రోమీ రెండు సినిమాల్లో (కమ్మటిపాదం, కిస్మత్‌) దళిత అమ్మాయిగానే కనిపించింది. మరో నటి కనీ కుస్రుతి ‘బిరియానీ’ సినిమాలో నటనకు కేరళ రాష్ట్రం నుంచి ఉత్తమనటి అవార్డు అందుకుని, దానిని తొలి దళిత నటి పీకే రోసీకి అంకితం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. 


మమ్ముట్టి, మోహన్‌లాల్‌ వంటి సూపర్‌స్టార్లు కూడా సవాలు విసిరే దళిత పాత్రల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, మిగతా భాషలతో పోలిస్తే తెలుగులో దళిత సినిమా ఆలోచనలకు ఇప్పటిదాకా సరైన బీజం పడలేదనే చెప్పాలి. ‘పలాస’ వంటి ఒకటీ అరా సినిమాల్లో పరిమితంగా అంబేద్కర్‌ భావజాలాన్ని చూపే ప్రయత్నాలు జరిగినప్పటికీ ఇంకా మెయిన్‌స్ట్రీమ్‌ దాకా రాలేదు.


ఏదేమైనా ఇప్పుడు దళిత సినిమాల్లో డప్పులు దరువేస్తున్నాయి. వీధి కుక్కలు హీరోల పక్కన కనిపిస్తున్నాయి. జానపదాలు కొత్త రాగాలు అందుకుంటున్నాయి. ఊరి దేవతలు, స్థానిక భాష, యాసలతో పాటు... దళితులు, బహుజనులకు ప్రతిబింబాలుగా నలుపు, నీలి రంగుల్లో స్ర్కీన్‌ మెరిసిపోతోంది. అంబేద్కర్‌ భావజాలం ఆలోచింపజేస్తోంది. దళిత పాత్రల్లో కనిపించేందుకు స్టార్లు ముందుకు వస్తున్నారంటేనే కథలు ఎంత చిక్కగా, కొత్తగా తయారవుతున్నాయో అర్థమవుతోంది. అయితే దర్శకుడు గోపీ నైనర్‌ అంటున్నట్టుగా ‘సినిమా వ్యాపారధోరణికి దళిత సినిమా కూడా ట్రాప్‌ అవుతుందా? లేదా?’ అనే ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మరికొన్నాళ్లు వేచి చూడక తప్పదు.



తొలిసినిమా స్ర్కిప్టు తొలిపేజీలోనే అంబేద్కర్‌ ఫొటో పెట్టుకుని పరిశ్రమలోకి వచ్చిన అరుదైన దర్శకుడు పా.రంజిత్‌. ఈ దళిత యువకుడు తొలి రెండు చిత్రాలతోనే (అట్టకత్తి, మద్రాస్‌) రజనీకాంత్‌ దృష్టిలో పడ్డాడు. ‘కబాలి’, ‘కాలా’ తర్వాత ఇటీవల ‘సార్పట్ట’ తీశాడు. 



నటుడు కావాలనుకుని దర్శకుడిగా మారిన దళిత యువకుడు మారి సెల్వరాజ్‌ 2018లో తొలిచిత్రం ‘పెరియేరుమ్‌ పెరుమాళ్‌’తో సత్తా చాటుకున్నాడు. ధనుష్‌తో ‘కర్ణన్‌’ తీసి మరో హిట్‌ కొట్టిన సెల్వరాజ్‌ గీత రచయిత, గాయకుడు కూడా. 



మహారాష్ట్రలోని దళిత కుటుంబానికి చెందిన నాగ్‌రాజ్‌ మంజులే 2013లో మరాఠీలో తీసిన ‘ఫండ్రీ’తో అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. ‘సైరాట్‌’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. అమితాబ్‌తో ‘ఝుండ్‌’ను తెరకెక్కిస్తున్నాడు.




వెట్రిమారన్‌ తమిళసినిమా తురుపుముక్క. ‘విసరనై’, ‘అసురన్‌’ చిత్రాలతో దళిత సమస్యలను సమర్థవంతంగా  తెరకెక్కించిన వెట్రిమారన్‌ ఇటీవల ఓటీటీ కోసం తీసిన ‘ఓరు ఇరవు’ కూడా పరువు హత్యల నేపథ్యంలో సాగుతుంది.



మహారాష్ట్రలో పుట్టి, హైదరాబాద్‌లో పెరిగిన నీరజ్‌ ఘేవన్‌  ప్రముఖ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ శిష్యుడు. శ్మశానంలో శవాలను కాల్చే వాడి జీవితం చుట్టూ అల్లుకున్న కథతో ‘మసాన్‌’ సినిమా తీసి జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందాడు. 



దళిత సాహిత్యంలో విశేష కృషి చేస్తున్న యువ రచయిత , పరిశోధకుడు స్టాలిన్‌ రాజంగం. దళిత సమస్యలతో అతడు రాసిన అనేక పుస్తకాలు తమిళంలో మంచి ఆదరణ పొందాయి. . ‘కబాలి’ సినిమాకు రచన చేశాడు.



దళిత్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌

ఒకవైపు దళిత సినిమాలు ఆవిష్కృతమవుతుంటే... మరోవైపు దళిత ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌ కూడా జరుగుతున్నాయి. కొవిడ్‌కు ముందు అంటే 2019లో న్యూయార్క్‌లో ‘దళిత్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌’ ఘనంగా జరిగింది. ఈ చిత్రోత్సవాన్ని విదేశాల్లోని అంబేద్కరైట్‌ ఆర్గనైజర్స్‌ నిర్వహించారు. ఈ వేడుకలకు మనదేశం నుంచి పా.రంజిత్‌, నాగ్‌రాజ్‌ మంజులే, సుబోధ్‌ వాగ్ధేవి (బోలే ఇండియా జై భీమ్‌ దర్శకుడు), నీరజ్‌ గావాన్‌ (మసాన్‌), జయంత్‌ చౌరియన్‌ (పపిలియో బుద్ధ) వంటి చాలామంది సృజనశీలురు హాజరయ్యారు. ఫెస్టివల్‌లో భాగంగా మరాఠీ, మలయాళం, తమిళం, నేపాలీలో వచ్చిన దళిత సినిమాలను ప్రదర్శించారు. దళిత సాహిత్యం, పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ కూడా ఏర్పాటుచేశారు. 


- చల్లా శ్రీనివాస్‌

Updated Date - 2021-08-01T17:55:27+05:30 IST