త్యాగరాజ కీర్తన వంటి షావుకారు జానకి!

ABN , First Publish Date - 2022-01-26T20:00:25+05:30 IST

షావుకారు జానకిని త్యాగరాజ కీర్తనతో పోల్చారు ఆరుద్ర. ఎందుకా పోలిక? ఏమిటా సందర్భం? మహావాగ్గేయకారుడైన త్యాగరాజ స్వామి వారి ఏ కీర్తన లాగా ఉంటుంది జానకి?

త్యాగరాజ కీర్తన వంటి షావుకారు జానకి!

‘షావుకారు’ జానకిగా గుర్తించబడే మన శంకరమంచి జానకి -

హాస్య... అద్భుత... కారుణ్య రసాభినయాల 'సుబ్బులు'...

సునిశిత శృంగారాల సమధికోత్సాహాల 'సరోజ'...

 వీర రౌద్ర బీభత్స రస నటనా పాటవాల 'రాధ'...

 లలి లవంగ హృదయ లావణ్య లోచనదీప్తుల కుసుమపేశల శాంతమూర్తి 'లలిత'...

 తప్త నిర్లిప్త నిష్కపట నటనల బొమ్మ బుగులుకళ్ల 'బుచ్చమ్మ'...

 ఒక కంట రౌద్రం- మరో కంట శాంతం... ఒక చెంప అద్భుతం- ఆ చెంప బీభత్సం... ఒక వైపు వెలుగు- ఇంకో వైపు చీకటిగా వర్తించిన, నర్తించిన 'మానసాదేవి'...

నిరాడంబర, నిరాలంకార, నియోరియలిస్టిక్ నిసర్గ రసవైదుష్యాల 'రామి'... 

... ఇంకా ప్రాంతాల ఎల్లలు దాటి, భాషల అంతరాలు లేని సాంఘిక,జానపద, పౌరాణిక ప్రక్రియల అన్నింటా, శృంగార వీర కరుణ అద్భుత హాస్య భయానక బీభత్స రౌద్ర శాంత రసాలు, రతి ఉత్సాహ శోక విస్మయ హాస  భయ  జుగుప్స  క్రోధ శమ స్థాయీభావాలు అలవోకగా అభినయించిన 'మల్లిక', 'కాత్యాయిని', 'గుణవతి', 'ఎరుకలసాని', 'తులసమ్మ'... 'తాయారమ్మ'... 'చిలకమ్మ'!


అటువంటి షావుకారు జానకిని త్యాగరాజ కీర్తనతో పోల్చారు ఆరుద్ర. ఎందుకా పోలిక? ఏమిటా సందర్భం? మహావాగ్గేయకారుడైన త్యాగరాజ స్వామి వారి ఏ కీర్తన లాగా ఉంటుంది జానకి? కీర్తన లాగా ఉండటం కాదు, త్యాగరాజ కీర్తన వంటిది అని ఆరుద్ర పోల్చిన సందర్భం వేరు. త్యాగయ్య మన తెలుగువాడైనా ఆయనకు విశేష ప్రాచుర్యాన్ని తెచ్చింది తమిళులే. ఆయన తంజావూరులో ఉండబట్టి ఆ కీర్తనలు భద్రంగా ఉన్నాయి గానీ, అదే తెలుగునాట ఉన్నట్టైతే ఎప్పుడో చెదలపాలయ్యేవి అంటారు. ఆయనకి తమిళులు ఎలా పేరు తెచ్చి పెట్టారో, తెలుగు నటీమణి అయిన షావుకారు జానకి అనబడే శంకరమంచి జానకికి కూడా వారే పేరు తెచ్చారు అనే ఉద్దేశంతో ఆరుద్ర అన్నారట. షావుకారు జానకి నటనా ప్రతిభను తెలుగువారికంటే, తమిళులే బాగా గుర్తించి ఆమెకు భిన్న విభిన్నమైన పాత్రలలో నటించేలా చేశారని ఆరుద్ర భావం.


నిజమే, అది నిన్న కూడా రుజువయ్యింది. కేంద్రప్రభుత్వం నిన్న ప్రకటించిన పద్మ అవార్డుల్లో మన అచ్చతెలుగు ‘షావుకారు’ జానకికి తమిళనాడు తరఫున పద్మశ్రీ దక్కింది. కాబట్టి ‘షావుకారు’ జానకి కచ్చితంగా త్యాగరాజ కీర్తన వంటిదే!

Updated Date - 2022-01-26T20:00:25+05:30 IST