నాన్న మణిమండప నిర్మాణానికి ప్రభుత్వ సాయం కోరతా -ఎస్పీ చరణ్‌

ABN , First Publish Date - 2021-09-26T07:01:52+05:30 IST

తన తండ్రికి మణిమండపం నిర్మిస్తామని, ఇందుకు ప్రభుత్వ సాయం కోరతానని గానగంధర్వుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రమణ్యం కుమారుడు చరణ్‌ పేర్కొన్నారు. ఎస్పీబీ తొలి వర్ధంతిని పురస్కరించుకుని తిరువళ్లూరు జిల్లా తామరైపాక్కంలో....

నాన్న మణిమండప నిర్మాణానికి ప్రభుత్వ సాయం కోరతా -ఎస్పీ చరణ్‌

తన తండ్రికి మణిమండపం నిర్మిస్తామని, ఇందుకు ప్రభుత్వ సాయం కోరతానని గానగంధర్వుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రమణ్యం కుమారుడు చరణ్‌ పేర్కొన్నారు. ఎస్పీబీ తొలి వర్ధంతిని పురస్కరించుకుని తిరువళ్లూరు జిల్లా తామరైపాక్కంలో వున్న ఆయన సమాధి వద్ద కుటుంబీకులు, అతికొద్దిమంది అంజలి ఘటించారు. ఈ సందర్భంగా తామరైప్పాక్కం వద్ద ఎస్పీ చరణ్‌ విలేకరులతో మాట్లాడుతూ... కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణా ఆంక్షలు అమల్లో ఉన్న కారణంగా తన తండ్రి సమాధివద్దకు ఆయన అభిమానులను, సామాన్య ప్రజానీకం వచ్చేందుకు జిల్లా పోలీసులు అనుమతి ఇవ్వలేదన్నారు. తన తండ్రి తమకు దూరమై యేడాది అయిందని, ఈ కాలం ఎంతో భారంగా, హృదయవేదనతో గడిచిపోయిందన్నారు. ఆయన ఉన్నపుడు ప్రారంభించిన అనేక పనులను తాను కొనసాగిస్తున్నట్టు చెప్పారు. అదేసమయంలో తన తండ్రికి మణిమండపం నిర్మించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలను చేపట్టినట్టు తెలిపారు.


ఇందుకోసం పక్కా ప్రణాళికతో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిసి సాయం కోరుతామన్నారు. ప్రభుత్వంతో కలిసి మణిమండపాన్ని నిర్మించేందుకు కృషి చేస్తానని తెలిపారు. తామరైప్పాక్కంలో మణిమండపంతో పాటు మ్యూజియం, థియేటర్‌ను నిర్మించేందుకు చర్యలు చేపడుతామన్నారు. ఇదిలావుంటే, తమ అభిమాన గాయకుడు ఎస్పీబీకి తొలి వర్థంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు అనేక మంది తామరైప్పాక్కంలోని సమాధి వద్దకు తరలివచ్చారు. అయితే, కరోనా ఆంక్షల నేపథ్యంలో ఎవ్వరినీ లోపలకు అనుమతించలేదు. దీంతో వారంతా తీవ్ర నిరుత్సాహంతో వెనుదిరిగారు. 


చెన్నై(ఆంధ్రజ్యోతి) 

Updated Date - 2021-09-26T07:01:52+05:30 IST