స్పెషల్‌: ఎస్‌.పి.బాలు ముందు నిలవలేకపోయారు!

‘బహుముఖ ప్రజ్ఞాశాలి’ మాటకు సరైన నిర్వచనం
చేతనైన పనే చేసిన సంపూర్ణమైన మనిషి..
ఆయన ప్రతిభ ముందు నిలవలేకపోయారు..
ఎవరినీ తొక్కేయలేదు!!

(నేడు పద్మవిభూషణ్‌ ఎస్‌పీబీ 75వ జయంతి)

ఆయన గొంతు అన్ని స్వరాలనూ పలికిస్తుంది. అప స్వరాన్ని తప్ప – అన్న గుర్తింపు తెచ్చుకున్నారు గాన గంధర్వుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం. పాటకి, మాటకి, మంచి వ్యక్తిత్వానికి మారుపేరుగా నిలిచారు. నేపథ్య గాయకుడిగా చలనచిత్ర పరిశ్రమలో 45 వసంతాలు పూర్తి చేసుకున్న ఆయన గత ఏడాది కరోనాతో పోరాడి పరమపదించారు. నేడు ఆయన 75వ జయంతి. ఈ సందర్భంగా ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుందాం.

అక్కడ ఉండలేక తిరుగు ప్రయాణం...
శ్రీపతి పండితారాధ్యుల వంశంలో పుట్టిన బాల సుబ్రహ్మణ్యాన్ని తెలిసిన వారంతా  ‘బాలు’ అని పిలుస్తుంటే, ఆప్తమిత్రులు మాత్రం ‘మణి’ అని పిలుస్తుండేవారు. చిన్నప్పటి నుంచి సంగీతమంటే ప్రీతి. ఐదు సంవత్సరాల వయసులోనే తండ్రి వేసిన ‘భక్త రామదాసు’ నాటకంలో రామదాసు కొడుకు వేషం వేసి, చక్కని పాటలు పాడి ప్రేక్షకుల్ని మెప్పించారు. నాటకాలలో వేషాలు వేస్తూ, స్టేజీ మీద పాటలు పాడుతూనే ఉండేవారాయన. అయితే ‘నేనేనాడూ ప్లేబ్యాక్‌ సింగర్‌ అవుతానని అనుకోలేదు. అసలా ఆలోచన కూడా నాకు అప్పట్లో కలగలేదు’’ అని అనేవారు బాలు. నెల్లూరులో కాలేజ్‌ చదువు ముగించుకుని, అనంతపురంలో ఇంజనీరింగ్‌లో చేరారు. అలవాటైన నెల్లూరు గాలి ఆయన్ను అక్కడ నిలవనీయలేదు. నెల్లూరులో మిత్రులతో పెన్నా నది ఒడ్డున వ్యవహారాలయిన నాటకాలు, పాటలు వీటిని వదిలి ఉండేలేక ఏడాది తిరగకుండానే అనంతపురం నుంచి తిరిగి వచ్చేశారు. అప్పుడు ఏం చేయాలా అని మదనపడిన తండ్రి బాలుని ఒప్పించి మద్రాసు పంపి ఎం.ఐ.యిలో చేర్పించారు. ఒక విధంగా మద్రాస్‌ జీవితమే బాలు జీవితాన్ని మలుపు తిప్పిందని చెప్పవచ్చు. మద్రాసులో మిత్రులతో కలిసి పాటలు పాడుతూ, పోటీలతో పాల్గొంటూ, తనకు తెలియకుండానే తన జీవిత సౌభాగ్యానికి పునాదులు వేసుకున్నారు.

కోదండపాణిని ఆకట్టుకున్నారు..
1963లో మద్రాస్‌ సోషల్‌ కల్చరల్‌ క్లబ్‌లో పాటల పోటీలు జరిగాయి. ఆ పోటీల్లో బాలు కూడా పాల్గొన్నారు. ఆనాటి పోటీలకు ఘంటసాల వెంకటేశ్వరరావు, పెండ్యాల నాగేశ్వరరావు, సుసర్ల దక్షిణామూర్తి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఆ రోజు ఆ ఉత్సవానికి సంగీత దర్శకుడు కోదండపాణి కూడా వచ్చారు. పోటీలో బాలు వాణి విజృంభించి విన్యాసాలు చేసింది. హాజరైన సినీ సంగీత ప్రముఖుల ప్రశంసలతోపాటు బహుమతి కూడా గెలుచుకున్నారు. అయితే అక్కడ అందరి ప్రశంసలు అందుకోవడం ఒక ఎత్తు. కోదండపాణిని ఆకర్షించడం మరొక ఎత్తు. బాలు గాత్ర మాధుర్యం ఆయనను ఎంతోగాను ఆకర్షించింది. బాలుని ప్రశంసించడమే కాకండా సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని కూడా మాటిచ్చారు. అన్నట్లే కోదండపాణి ఎస్‌పీబీని 18 ఏళ్ల వయసులో నిర్మాత భావనారాయణ ఆఫీసుకి తీసుకెళ్లి పరిచయం చేశారు. బాలు పాడిన పాట విన్నారాయన. వాయిస్‌ మెచ్చూర్డ్‌గా లేదని తర్వాతి చిత్రంలో ప్రయత్నిద్దామని చెప్పారు. బాలు నిరాశ పడ్డారు. కోదండపాణి మాత్రం బాలుని మరచిపోలేదు. మూడేళ్లకు అంటే 1966లో బాలుని హాస్యనటుడు, నిర్మాత పద్మనాభం దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడు ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న’ చిత్రం తెరకెక్కిస్తున్న సమయమది. పద్మనాభం బాలు పాట విని గొంతు నచ్చిందన్నారు. దాంతో మర్యాదరామన్న చిత్రంలో పాడే ఛాన్స్‌ ఇచ్చారు. ఆ సినిమాకు సంగీతదర్శకుడు కోదండపాణే. అందులో సుశీలతో కలిసి ‘ఏమి ఈ వింత మోహము’ అనే పాట పాడారు. ఆ పాట కోదండపాణితోపాటు అందరికీ నచ్చింది. ఆనాడే బాలు గొప్ప గాయకుడు అవుతాడని ఊహించారట. ఆ తర్వాత ప్రతి సంగీత దర్శకుడితో బాలు గురించి చెబుతుండేవారు పాణి. ఆ విధంగా బాల సుబ్రహ్మణ్యాన్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ ఆయన అభివృద్ధికి తోడ్పడ్డాడు కోదండపాణి, ఆ కృతజ్ఞతా భావంతోనే మద్రాసులో తను నిర్మించి స్టూడియోకు కోదండపాణి పేరే పెట్టారు బాలు.

తండ్రి పాటకు తొలి బాణీ..
సంగీత దర్శకుడిగా బాలు తొలి చిత్రం ‘కన్యాకుమారి’(1977). దానికి దాసరి దర్శకుడు. అయితే, అంతకు ముందు తెరపై తొలిసారి ‘తెలుగు తల్లి’కి స్వరకర్తగా పేరు పడింది. దానికి నేపథ్య సంగీతంతో పాటు ఓ పాట చేశారు. అది పేకేటి శివరామ్‌ దర్శకత్వం వహించిన డాక్యుమెంటరీ. ‘తెలుగు తల్లి’కి, ‘కన్యాకుమారి’కి మధ్య ప్రాణమిత్రుడు యోగి పట్టుపట్టడం, పైగా దర్శకునిగా స్నేహితుని తొలి చిత్రం కావడంతో కాదనలేక ‘యువకుల్లారా లేవండి’ చిత్రానికి స్వరసాయం చేయడానికి ఒప్పుకొన్నారు. రెండు పాటల రికార్డింగ్‌ పూర్తయ్యాక సినిమా ఆగిపోయింది. ఇక, ఆ తర్వాత దాసరి ‘కన్యాకుమారి’తో వెండితెరకు సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. అందులోని ‘ఇది తొలి పాట...’ ఎస్పీబీ స్వరపరిచిన తొలి గీతం కావడం విశేషం.  పువ్వు పుట్టగానే పరిమళించిందన్నట్టు... పుట్టుకతో బాలూకి స్వరకళ అబ్బిందని చెప్పుకోవాలి. ఎక్కడా సంగీతం నేర్చుకోని ఆయన, చిన్నతనం నుంచి బాణీలు కట్టడం, పాటలు రాయడం ప్రారంభించారు. ఆలిండియా రేడియో పోటీల కోసం 1961–62లో తండ్రి సాంబమూర్తి రాసిన పాటలకు తొలిసారి బాణీలు కట్టారు. ‘పాడవే వల్లకీ...’, ‘పచ్చని వెచ్చని పచ్చిక సుడిలో...’ పాటలకు స్వరకల్పన చేశారు. బాలు గాత్రానికి, బాణికీ ‘పాడవే పల్లకీ...’ మంచి పేరు తీసుకొచ్చింది. తర్వాత 1963లో మద్రాస్‌ కల్చరల్‌ క్లబ్‌లో పాటల పోటీల కోసం స్వీయ రచనలో ‘రాగమో... అనురాగమో’ పాటకు ఆయనే స్వరకల్పన చేశారు.

‘తూర్పు వెళ్లే రైలు’తో గుర్తింపు...
సినిమా రంగానికి వస్తే... ‘కన్యాకుమారి’ తర్వాత ‘కెప్టెన్‌ కృష్ణ’, ‘రారా క్రిష్ణయ్య’ చిత్రాలకు సంగీతం అందించారు. ఆ తర్వాత ‘తూర్పు వెళ్లే రైలు’ ఆయనకు సంగీత దర్శకుడిగా పేరు తీసుకొచ్చింది. సంగీత దర్శకుడిగా బాలూని బాపు–రమణలు ఎంతో ప్రోత్సహించారు. బాలు–బాపు కలయికలో ‘జాకీ’, ‘సీతమ్మ పెళ్లి’ తదితర చిత్రాలొచ్చాయి. అలాగే, బాలు–జంధ్యాల కలయికలో ‘పడమటి సంధ్యారాగం’, ‘వివాహ భోజనంబు’, ‘నీకూ నాకూ పెళ్లంట’ చిత్రాలు వచ్చాయి. ఆర్‌. నారాయణమూర్తి హీరోగా నటించిన ‘సంగీత’, గొల్లపూడి రాసిన నాటకం ఆధారంగా తీసిన ‘కళ్లు’ చిత్రాలకు ఆయనే సంగీత దర్శకుడు. ‘మయూరి’కి సంగీత దర్శకుడిగా నంది పురస్కారం అందుకున్నారు.

హిందీలో క్రెడిట్‌ ఇవ్వలేదు..
తమిళంలో రజనీకాంత్‌ ‘టుడిక్కం కరంగళ్‌’, బాలచందర్‌ నిర్మించిన ‘శిగరం’ సహా ఐదు చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. ‘శిగరం’ తర్వాత ‘అడగన్‌’కి సంగీతం అందించాల్సిందిగా బాలూని కోరారు బాలచందర్‌. అయితే, గాయకుడిగా బిజీగా ఉండటంతో వీలు పడదని చెప్పారు. కీరవాణితో చేయించుకోమని అతణ్ణి బాలచందర్‌కి పరిచయం చేశారు. ‘మరకతమణి’ పేరుతో కీరవాణి సంగీతం అందించారు. తర్వాత బాలచందర్‌ మరో చిత్రానికీ కీరవాణి పని చేశారు. కానీ, బాలూకి మాత్రం బాలచందర్‌ చిత్రానికి సంగీతం అందించే అవకాశం రాలేదు. కన్నడలో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన కొన్ని చిత్రాలు సహా సుమారు తొమ్మిది చిత్రాలకు బాలు సంగీతం అందించారు. సోమశేఖర స్వీయ దర్శక–నిర్మాణంలో రూపొందిన ‘బేబీ’ కోసం మద్రాసు ఆర్కెస్ట్రాను బెంగళూరు తీసుకువెళ్లి నేపథ్య సంగీతం చేశారు. మద్రాసు నుంచి బెంగళూరుకి కన్నడ చిత్ర పరిశ్రమ తరలివెళ్లిన తర్వాత ఆ ప్రయత్నం చేసిన తొలి సంగీత దర్శకుడు ఆయనే. ‘మనవూరి పాండవులు’ హిందీ రీమేక్‌ ‘హమ్‌పాంచ్‌’కి లక్ష్మీకాంత్‌–ప్యారేలాల్‌ ద్వయం స్వరాలు సమకూర్చగా, ఎస్పీబీ నేపథ్య సంగీతం అందించారు. ‘మయూరి’ని హిందీలో ‘నాచే మయూరి’గా రీమేక్‌ చేసినప్పుడు తెలుగులో తాను స్వరపరిచిన ‘ఈ పాదం యిలలోన నాట్య వేదం’ పాటను హిందీ కోసం మరోసారి బాలు కంపోజ్‌ చేశారు. అయితే, ఆయనకు లక్ష్మీకాంత్‌–ప్యారేలాల్‌ క్రెడిట్‌ ఇవ్వలేదు. పైగా, పాటకు అవార్డు వస్తే వాళ్లే తీసుకున్నారు.

బాలు స్వరకల్పనలో
ప్రముఖుల స్వరాలాపన!
సంగీత దర్శకులు ఎమ్మెస్‌ విశ్వనాథన్‌, ఇళయరాజా స్వరపరిచిన పలు గీతాలను ఎస్పీబీ ఆలపించారు. అవి ఆయనకు ఎంతో పేరు తీసుకొచ్చాయి. అయితే, వాళ్లిద్దరి చేత ఓ పాట పాడించిన ఘనత మాత్రం ఎస్పీబీదే. తనయుడు చరణ్‌ నిర్మించిన తమిళ చిత్రం ‘ఉన్నై శరణడైన్దేన్‌’ (2003)లో తాను స్వరపరిచిన ‘పానక్కు నిలమూడు’ పాటను దిగ్గజ సంగీత దర్శకులిద్దరి చేత ఆయన పాడించారు. తాను సంగీతం అందించిన చిత్రాల్లోని పాటలను పలువురి ప్రముఖుల చేత బాలు పాడించారు. ‘కొంగుముడి’లో ‘రాదా మళ్లీ వసంతకాలం...’ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు రమేశ్‌ నాయుని చేత, తమిళ చిత్రం ‘శిగరం’ టైటిల్‌ సాంగ్‌ను జె. ఏసుదాసు, అందులో మరో పాటను మంగళంపల్లి బాలమురళీ కృష్ణతో, ‘కళ్లు’ చిత్రంలో ‘తెల్లారింది లెగండోయ్‌...’ను ఆ పాట రాసిన సిరివెన్నెల చేత పాడించారు. అన్నిటికంటే ముఖ్యమైనది కన్నడ చిత్రం ‘మద్దినమావ’లో కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌తో పాడించడం. ‘మామగారు’కి కన్నడ రీమేక్‌ అది. తెలుగులో దాసరి పోషించిన పాత్రను కన్నడలో బాలు చేశారు. ఆ చిత్రానికీ సంగీతమూ అందించారు. హీరో పాత్రకు మూడు పాటలూ తాను పాడటంతో తన పాత్రకు రాజ్‌కుమార్‌ చేత పాడిస్తే బావుంటుందని ఆయన్ని అడిగి పాడించారు. అలా, రాజ్‌కుమార్‌ గాత్రంలో బాలు నటించారు కూడా.

అమెరికాలో ఆ రికార్డు ఆయనదే!
అమెరికాలో తొలి తెలుగు పాట రికార్డు చేసిన ఘనత బాలూదే. ‘ఆనందభైరవి’ విజయోత్సవానికి అగ్రదేశం వెళ్లినప్పుడు జంధ్యాల దర్శకత్వంలో ప్రవాసాంధ్రులు ఓ సినిమా నిర్మించాలని సంకల్పించారు. అదే ‘పడమటి సంధ్యారాగం’. ఆ టైటిల్‌ సూచించింది బాలూనే. యాదృశ్ఛికంగా అప్పటికప్పుడు తనతో కచేరి చేయడానికి అమెరికా వచ్చిన వాద్య బృందంతో ‘పిబరే రామరసం...’ గీతానికి కొత్త హంగులు అద్ది వాషింగ్టన్‌ డి.సి.లోని ఒమేగా స్టూడియోలో రికార్డు చేశారు. అలాగే, ఆ సినిమాలో ‘లైఫ్‌ ఈజ్‌ షాబీ–వితౌట్‌ యు బేబీ’ పాటలో బాలు సినీ గేయ రచయితగానూ మారారు.

స్టేజీపై రఘురాముడు...
పాటే కాదు... ప్రత్యేకంగా నటించే కళ కూడా బాల్యంలో బాలూకి అవలీలగా వచ్చిందేమో! తండ్రి రామదాసు పాత్ర అయితే... బాలూది రఘురాముడి పాత్ర. దాంట్లో ఆయన పద్యాలు పాడుతుంటే ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. తర్వాత వెండితెరపైనా తనదైన నటనతో మిగతా నటుల మధ్య ప్రత్యేకంగా నిలిచారు. ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. వెండితెరపై ఎస్పీబీ తొలిసారి కనిపించిన చిత్రం ‘మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌’ (1972). ఆ తర్వాత ఐదేళ్లకు దాసరి దర్శకత్వంలో ‘కన్యాకుమారి’లో కనిపించారు. నటుడిగా పాత్ర నిడివి గురించి ఆయనెప్పుడూ ఆలోచించలేదు. మనసుకు నచ్చితే, తన శరీరానికి నప్పుతుందనుకుంటే నటించారు. సుమారు 60 చిత్రాల్లో ఆయన కనిపించారు.

హీరోకి తగ్గట్టుగా...
ఓ తరం అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌... నలుగురితోనూ తెరను పంచుకున్నారు. ‘పవిత్ర బంధం’లో వెంకటేశ్‌కి తండ్రి పాత్ర ఆయనకు బాగా నచ్చినది. అదే పాత్ర తమిళం, కన్నడలోనూ ఆయనే చేశారు. ‘ప్రేమికుడు’లో ప్రభుదేవాకి తండ్రిగా చేసిన పాత్ర తనకు నచ్చిందన్నారు. ‘వివాహ భోజనంబు’లో సంగీత ప్రియుడైన పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌గా సంగీతాన్ని పలికిస్తూ, వినోదాన్ని పండించారు. చిరంజీవి ‘ఇంద్ర’లో నిజజీవిత పాత్ర పోషించారు. అతిథి పాత్రలో ఎస్పీబీగా కనిపించారు. అలాగే... ‘కళ్లు’, ‘చెన్నపట్నం చిన్నోళ్లు’, ‘రూమ్మేట్స్‌’ చిత్రాల్లో అతిథిగా నిజజీవిత పాత్రల్లో కనిపించారు. ‘గొప్పింటి అల్లుడు’లో బాలకృష్ణకి, ‘రాక్షసుడు’లో నాగార్జునకి, ‘ప్రేమదేశం’లో టబుకి, ‘ఆరో ప్రాణం’లో వినీత్‌కి, ‘మనసు పడ్డాను కానీ’లో రాశీకి తండ్రిగా నటించారు. ఆయన నటించిన చిత్రాల్లో ‘మైనా’ (1996) విడుదల కాలేదు.

అప్పదాసు అద్భుత:
బాలు నటించిన సినిమా ఒకెత్తు. తనికెళ్ల భరణి దర్శకత్వంలో నటించిన ‘మిథునం’ మరో ఎత్తు. అందులో అప్పదాసుగా చిరస్థాయిగా నిలిచే నటన కనబరిచారు. ఆ చిత్రానికి నటుడిగా స్పెషల్‌ జ్యూరీ అవార్డు అందుకున్నారు. తాను ఫ్రొఫెషనల్‌ నటుణ్ణి కాదని చెప్పే ఆయన, తన భారీ పర్సనాలిటీపై ‘నేను 70ఎంఎం నటుణ్ణి’ అని జోకులు వేసేవారు. ఎస్పీబీ నటించిన చివరి చిత్రం నాగార్జున–నానిల ‘దేవదాస్‌’. అందులో మెడికల్‌ యూనివర్సిటీ డీన్‌గా కనిపించారు.


సరస్వతి దేవి సంపూర్ణ కటాక్షంతో..
‘బహుముఖ ప్రజ్ఞాశాలి’ అన్న పదాన్ని చాలామందికి ఉపయోగిస్తాము. ఆ పదానికి సరైన నిర్వచనం, ప్రతిరూపం ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం. గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా వ్యాఖ్యాతగా, న్యాయ నిర్ణేతగా ఇలా ఏ పని చేసిన దానికి న్యాయం జరిగేలా చేసేవారు. ‘నేను చేయగలను’ అన్న పని వైపే ఆయన దృష్టి ఉండేది. ఆయనతో కాని పని వైపు కన్నెత్తి కూడా చూసేవారు కాదు. పాటను వృత్తిగా, ప్రవృత్తిగా ఆయన ఎప్పుడూ అనుకోలేదు. ఒక తపస్సుగా ఆచరించారు. అందుకే  సరస్వతీ దేవి ఆయన్ను సంపూర్ణంగా కటాక్షించి గొప్ప గాయకుడిని చేసింది. ఆయన పాడిన పట వింటే  ‘నేను ఇంత బాగా రాశానా’ అన్న భావన రచయితకు కలిగేలా పాడేవారు. నా ట్యూన్‌ ఇంత అద్భుతంగా కుదిరిందా అని సంగీత దర్శకుడు అనుకునేలా ఉంటుంది. డాన్స్‌ బాగా చేయాలనే తపన నటుడికీ, అద్భుతంగా చిత్రీకరించాలనే ఆలోచన దర్శకుడికీ కలుగుతుంది. పాటల రికార్డింగ్‌ జరుగుతున్న సమయంలో వంశీలాంటి దర్శకులు దగ్గరికొచ్చి ‘బాలుగారూ కాస్త మా ప్రతిభ కూడా బయటకు కనిపించే ఛాన్స్‌ ఇవ్వండి సార్‌.. మీ పాటే మొత్తం క్రెడిట్‌ తీసేసుకునేలా ఉంది’ అని సరదగా అంటుండేవారు.

మాటలు లేవు, పాటలు లేవు!
బాలుకు లౌక్యం ఎక్కువనే పేరుంది. ఎవరినీ నొప్పించకుండా, చాకచక్యంగా తను పని చేసుకుపోయిన ప్రతిభాశాలి ఆయన. వివాదాలకు ఆమడదూరంలో ఉండే బాలుకు,  హీరో కృష్ణకు ఒకానొక సందర్భంలో గొడవ ఏర్పడిందనీ, దీని కారణంగా రెండేళ్ల పాటు  కృష్ణ బాలుతో కాకుండా మరో గాయకుడితో పాటలు పాడించుకున్నారనీ వింటే ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ప్రారంభంలో బాలును ఎంకరేజ్‌ చేసిన ఏకైక హీరో కృష్ణ. కొత్తగా వచ్చిన గాయకుడు రామకృష్ణను ఎంకరేజ్‌ చేస్తూ ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, శోభన్‌బాబు, కృష్ణంరాజు ఆయనతో పాటలు పాడించుకోవడంతో బాలుకు  అవకాశాలు తగ్గాయి.  హీరోలకు పాటలు పాడే అవకాశం లేకపోవడంతో వేరే మార్గంలేక  హాస్యనటులకు పాడేవారు బాలు. అటువంటి సమయంలో ఆయనకు అండగా నిలిచారు కృష్ణ. బాలుని పిలిపించి, ‘మీకు సినిమాలు తగ్గాయని బాధ పడవద్దు. నాకు మీరే పాడాలి. నేను సంవత్సరానికి కనీసం నాలుగు సినిమాలు చేస్తుంటాను. నా సినిమాల్లో అన్ని పాటలూ మీరే పాడతారు’ అని అభయం ఇచ్చారు. కృష్ణకు పాడాలంటే బాలసుబ్రహ్మణ్యమే పాడాలి అనిపించేలా ఈ కాంబినేషన్‌ చాలా కాలం కొనసాగింది. అటువంటి గాత్రానుబంధం కలిగిన ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య ఓ విషయం కారణంగా అభిప్రాయ భేదాలు ఏర్పాడ్డాయి. ఒక సినిమా పారితోషికం విషయం గురించి ఓ నిర్మాత, బాలు మాట్లాడుకొన్న మాటల్ని ఆ నిర్మాత హీరో కృష్ణకు మరోరకంగా చెప్పడంతో కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేయడం, ‘మీరు పాడకపోతే నా సినిమాలు విజయవంతం కావా’ అని నిలదీయడం,  ‘మీకు పాడకపోయినా నేను ఎలాగోలా బతకగలను’ అని బాలు సమాధానం చెప్పడంతో వ్యవహారం ముదిరింది. ఈ సంఘటన కారణంగా  రెండేళ్ల పాటు  వాళ్ల మధ్య మాటలు లేవు, పాటలు లేవు. ఆ తర్వాత గేయ రచయిత వేటూరి సుందరరామమ్మూర్తి, సంగీత దర్శక ద్వయం రాజ్‌–కోటి చొరవ తీసుకుని మళ్లీ వీళ్లిద్దరినీ కలపవడంతో ‘రౌడీ నంబర్‌ వన్‌’ సినిమా నుంచి తిరిగి కృష్ణకు పాటలు పాడడం ప్రారంభించారు బాలు.

మా మనిషే అనుకున్నారు...

తమిళ ప్రజలంతా బాలు తమిళనాడుకి చెందిన వ్యక్తనే అనుకుంటారు. తెలుగువాడు, నెల్లూరువాసీ అంటే నమ్మరు. ఏ భాషలో అయినా ఆయన పాడిన పాట, భాష మీద ఆయనకు ఉన్న పట్టు అంతటి గొప్ప ముద్ర వేశాయి. ఏ నటుడికి ఎలా పాడితే బావుంటుందో బాగా తెలిసిన వ్యక్తి బాలు. ఆ మెళకువలు తెలిసిన అతి తక్కువమంది గాయకుల్లో బాలు ఒకరు. రికార్డింగ్‌ థియేటర్‌లోకి వెళ్లేటప్పుడు చెప్పులు బయట వదిలేసినట్లుగా ఎన్ని టెన్షన్లు గడప బయటే వదిలి మైక్‌ ముందు హాయిగా పాట పాడేవారు. కుభేరుడైనా, కుచేలుడైనా బాలు పలకరించే తీరు ఒకేలా ఉంటుంది.

కొట్టిన సందర్భాలూ ఉన్నాయి...

ఎదుటివారిని కారణం లేకుండా ఏమీ అననివ్వడు. ఆయనకు అత్యంత ఇష్టమైన వ్యక్తుల్ని ఏమన్నా అంటే అసలే ఊరుకోడు. ఆయనకు ఇష్టమైనవారి లిస్ట్‌ చాలా పెద్దది ఉంటుంది. ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ అంటే బాలుకి చాలా ఇష్టం. ఇండియన్‌ టీమ్‌ బరిలో దిగిందీ అంటే గెలిచి తీరాలనే అనేవాడు. ఎవరన్నా క్రికెట్‌ టీమ్‌ను ఏమన్నా అంటే కొట్టిన సందర్భాలూ ఉన్నాయి.

ప్రేమతో కూడిన వివాదం...

రాయల్టీ విషయంలో రాజాకు, బాలుకి వచ్చిన వివాదం ఆలుమగల మధ్య జరిగే చిన్న గొడవ లాంటిది. అది వారిద్దరూ మరీ వ్యక్తిగతంగా తీసుకోలేదు. కొద్దిరోజులకు అది సర్దుకుంది. పాలసీ మేటర్‌ కోసం  కృష్ణగారికి బాలు పాడలేదు కానీ... బయట ఎక్కడన్నా కనిపిస్తే వాళ్ల స్నేహం ఏ మాత్రం చెదరనట్టే ఉండేవారు. ఆ వివాదం విషయం తప్ప అన్నీ మాట్లాడుకునేవారు.

తొక్కేశాడన్న మాట అబద్ధం..


బాలు ఎంతోమందిని తొక్కేసి పైకొచ్చాడనే మాటలు వినబడుతూనే ఉంటాయి. అందులో నిజం లేదు. ఆయనలా అద్భుతంగా, వేగంగా పాడే గాయకుడు మరొకరు ఉంటే సంగీత దర్శకులు బాలునే ఎందుకు పిలిపించి పాడించుకుంటారు. పి.బి.శ్రీనివాస్‌కి బాలు అంటే చాలా ఇష్టం. నేను ఎస్‌పీబీ, మీరు పీబీఎస్‌ అని ఇద్దరూ ఒకరినొకరు ఆటపట్టించుకునేవారు. బాలు ఎంటర్‌ అయ్యాక ఘంటసాల గారికి పాటలు పెద్దగా తగ్గలేదు. పి.బి.శ్రీనివాస్‌కే తగ్గాయి. కానీ ఆయనకు బాలు అంటే ప్రాణం. కర్ణాటకలో ఓ సభలో బాలు గురించి మాట్లాడుతూ ‘‘బ్రహ్మ మంచి సృష్టి చేశాడు. కానీ బ్రెయిన్‌ పెట్టడం మరిచిపోయాడు’ అన్నారు. ఇదేంటి ఇలా అన్నాడు అని అందరూ షాక్‌ తిన్నారు. ‘బ్రెయిన్‌కి బదులు కంప్యూటర్‌ పెట్టాడు’ అన్నారు. తొకేశాడన్న మాటలు పిచ్చివాళ్లు చెప్పుకునేవి. ఆయన ప్రతిభ ముందు ఎవరూ నిలవలేకపోయారన్న మాట వాస్తవం. సంగీత పోటీలు నిర్వహించి ఎంతోమంది యువ గాయనీగాయకులను బాలు తయారు చేశారు. 


పద్మభూషణుడు...
గాన గంధర్వుడిగా ఇంత ఖ్యాతి రావడం వెనక బాలు చేసిన కృషి ఎంతో ఉంది. భగవద్గీతలోని కొన్ని ఎంపిక చేసిన శ్లోకాలను అర్థసహితంగా ‘పుహలేంది’ సంగీత దర్శకత్వంలో ఆలపించి గాయకుడిగా మరో మెట్టు ఎదిగారు బాలు. తొలిసారిగా ఉత్తమ నేపథ్యగాయకుడిగా 1979లో శంకరాభరణం చిత్రానికి జాతీయ అవార్డు అందుకున్నారు బాలు. ఆ తర్వాత వరుసగా 1981, 1983, 1988, సంవత్సరాల్లో కూడా – ఉత్తమగాయకుడిగా నేషనల్‌ అవార్డ్‌ ఆయనకే వచ్చింది. సంగీత రంగానికి ఆయన అందించిన సేవలకు గానూ పద్మశ్రీ, పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌ పురస్కారాలను అందుకున్నారు. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.