స్ట్రెయిట్‌ ఎంట్రీ!

కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో అగ్రహీరోలుగా ఎదిగారు. అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తెలుగునాట అభిమాన గణాన్ని, మార్కెట్‌ను పెంచుకొని ఇప్పుడు తెలుగులో స్ట్రెయిట్‌ చిత్రాలు చేస్తున్నారు. పలువురు దక్షిణాది హీరోలు తెలుగు చిత్రాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తున్నారు. ఏదైనా స్ట్రైయిట్‌ ఎంట్రీతో వచ్చే కిక్కే వేరు అంటున్నారు. 


20 ఏళ్లలో తొలి తెలుగు చిత్రం

తమిళనాట అగ్రహీరోల్లో ఒక రు ధనుష్‌. ఇప్పటివరకూ ఆయన నటించిన ప్రతి చిత్రం తెలుగులో అనువాదమై విడుదలవుతోంది. పాత్రల పరంగా వైవిఽధ్యం ప్రదర్శిస్తూ విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్న ధనుష్‌కు  జయాపజయాలతో సంబంధం లేకుండా ఽతెలుగు నాట కూడా అభిమానగణం ఏర్పడింది. తమిళ,  మలయాళ, హిందీ భాషల్లో నటించిన ధనుష్‌  ఇంతకుముందు  ‘ద ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్‌ ఫకీర్‌’ అనే ఆంగ్ల చిత్రంలో కూడా  నటించారు. ప్రస్తుతం ‘ద గ్రే మ్యాన్‌’ హాలీవుడ్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటిదాకా   ధనుష్‌  తెలుగులో స్ట్రెయిట్‌ చిత్రం చేయలేదు. ఆ లోటు తీర్చడానికా అన్నట్లు  దాదాపు 20 ఏళ తన ్ల కెరీర్‌లో తొలిసారిగా  తెలుగులో  ఓ చిత్రం చేయనున్నారు. నారాయణ్‌దాస్‌ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు దీనికి నిర్మాతలు. పాత్రల్లోని భావోద్వేగాల్ని తెరపై అద్భుతంగా ఆవిష్కరిస్తారనే పేరున్న శేఖర్‌ కమ్ముల ఈ చిత్రానికి దర్శకుడు. తెలుగుతో పాటు, తమిళ, మలయాళ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకురానున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. అయితే ఈ ఏడాది, లేదంటే కొత్త సంవత్సరం ఆరంభంలో ధనుష్‌ స్ట్రెయిట్‌ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించడం ఖాయం.


తొలి తమిళేతర చిత్రం

తమిళనాట మాస్‌ ఫాలోయింగ్‌తో అగ్రహీరోగా వెలుగొందుతున్న హీరో  విజయ్‌. ఇటీవల ‘మాస్టర్‌’తో ఘన విజయాన్ని అందుకున్నారు. ఆయన  సినిమాలు దాదాపు అన్నీ తెలుగులోకి డబ్‌ అవుతున్నాయి.  ‘మెర్సల్‌’ తెలుగులో ‘అదిరింది’ పేరుతో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది. విజయ్‌ సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయంటే తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి ఉంటుంది.  1984లో విజయ్‌కాంత్‌ హీరోగా నటించిన ‘వెట్రి’ చిత్రంతో బాలనటుడిగా విజయ్‌ అరంగేట్రం చేశారు. ఆతర్వాత హీరోగా తమిళంలో బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ ఇచ్చారు. అజయ్‌ దేవ్‌గణ్‌ కథానాయకుడిగా నటించిన ‘రౌడీ రాథోడ్‌’ చిత్రంలో గెస్ట్‌రోల్‌ తప్ప ఇన్నేళ్లలో మరే భాషలోనూ సినిమా చేయని విజయ్‌ తొలిసారి తెలుగులో స్ట్రెయిట్‌ చిత్రంతో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. విజయ్‌ ప్రస్తుతం నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో ‘బీస్ట్‌’ చిత్రం చేస్తున్నారు. దీని తర్వాత ఆయన చేయబోయేది తెలుగు స్ట్రెయిట్‌ చిత్రమే. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకుడు. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంలో ద్విభాషా చిత్రంగా రూపొందుతోంది. 


శింబు హీరో ఎంట్రీ

తెలుగులోనూ మంచి క్రేజ్‌ ఉన్న హీరో శింబు. ‘ఏ మాయ చేశావే’, ‘దొంగాట’ చిత్రాల్లో అతిథి పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు శింబు. ఇప్పుడు ‘మహా’ చిత్రంతో హీరోగా తెలుగులోకి అరంగేట్రం చేయనున్నారు. ఆయన సరసన హన్సిక కథానాయికగా నటిస్తున్నారు. 


విలన్‌గా తెలుగులోకి..

సినిమా సినిమాకు తనలోని నటుణ్ణి కొత్తగా ఆవిష్కరిస్తూ మలయాళంలో అగ్ర హీరోగా ఎదిగారు ఫహద్‌ ఫాజిల్‌. ‘సూపర్‌ డీలక్స్‌’, ‘ట్రాన్స్‌’ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. 2017లో ‘వేలైకారన్‌’ చిత్రంతో తమిళ సినిమాల్లోకి అడుగుపెట్టారు. తాజాగా అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘పుష్ప’ చిత్రంతో తెలుగు సినిమా అరంగేట్రానికి సిద్ధమయ్యారు. మలయాళంలో అగ్రహీరో అయిన ఫాజిల్‌ ‘పుష్ప’ చిత్రంలో అవినీతి పరుడైన పోలీసాఫీసర్‌గా కనిపించడం విశేషం.  


అరుదైన అవకాశం

మలయాళంలో చేసిన ఒక్క చిత్రంతోనే తెలుగులో గ్రాండ్‌ ఎంట్రీ ఇస్తున్నారు హీరో దేవ్‌మోహన్‌. ఆయన టైటిల్‌ రోల్‌లో ‘సూఫియం సుజాతయుం’ చిత్రంతో గతేడాదే మలయాళ సినిమాల్లోకి అడుగుపెట్టారు. తొలి చిత్రంతోనే తన ప్రతిభను నిరూపించుకొని తెలుగు ఎంట్రీకి సిద్ధమయ్యారు. సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘శాకుంతలం’లో అవకాశం దక్కించుకున్నారు.  ఇందులో సమంతకు జోడీగా దుష్యంతుడి పాత్రలో దేవ్‌మోహన్‌ కనిపించనున్నారు.  


కన్నడ హీరో తెలుగు సినిమా

ఉపేంద్ర, సుదీప్‌, యశ్‌,  దర్శన్‌, ధృవ్‌ సర్జా లాంటి కన్నడ హీరోలు కొందరు తెలుగు స్ట్రెయిట్‌ సినిమాల్లో నటిస్తున్నారు. కన్నడంలో ఇప్పుడిప్పుడే  స్టార్‌గా ఎదుగుతున్న హీరో రిషి. ‘పరేషన్‌ అలమేలమ్మ’ చిత్రంతో శాండల్‌వుడ్‌లో హీరోగా పేరుతెచ్చుకున్నారు. ‘కావలుధారి’ (తెలుగులో - కపటధారి)తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టారు. ఇప్పుడు ఆయన హీరోగా తెలుగులో ‘వద్దురా సోదరా’ అనే చిత్రం తెరకెక్కుతోంది. రిషి. ధన్య బాలకృష్ణన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. 


తెలుగు చిత్రంతో రీ ఎంట్రీ


ఈసారి పూర్తిస్థాయి హీరో పాత్రలో...

గతంలోనే ఒకటి అరా తెలుగు చిత్రాల్లో నటించిన తమిళ నటులు కూడా తిరిగి తెలుగులో స్ట్రెయిట్‌ చిత్రాలు చేస్తున్నారు. ఈ తరం దక్షిణాది హీరోల్లో టాలీవుడ్‌లోనూ తనకంటూ ఓ ప్రత్యేస్థానం దక్కించుకున్నారు మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌. పలు అనువాద చిత్రాలతో ఆయన తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. 2018లోనే కీర్తిసురేష్‌ టైటిల్‌ రోల్‌లో నటించిన ‘మహానటి’ చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేశారు. ‘కనులు కనులను  దోచాయంటే’ చిత్రంతో మంచి హిట్‌ అందుకున్నారు. అయితే తెలుగు స్ట్రెయిట్‌ చిత్రంలో పూర్తి స్థాయి హీరో పాత్రలో కనిపించలేదనే లోటు ఉంది. ఈసారి మంచి యాక్షన్‌ చిత్రంతో హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. వైజయంతి మూవీస్‌ సమర్పణలో హనూ రాఘవపూడి దర్శకత్వంలో ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో మద్రాస్‌ ఆర్మీ ఆఫీసర్‌ లెఫ్టినెంట్‌ రామ్‌గా దుల్కర్‌ కనిపించనున్నారు. 


20 ఏళ్లకు

‘శివపుత్రుడు’, ‘అపరిచితుడు’ చిత్రాలతో తెలుగు హీరోలకు ధీటుగా టాలీవుడ్‌లో మార్కెట్‌ ఉన్న నటుడు  విక్రమ్‌. 1993లోనే ‘చిరునవ్వుల వరమిస్తావా’ చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత ‘బంగారు కుటుంబం’, ‘9 నెలలు’ తదితర సినిమాల్లో నటించారు.  2001లో చివ రిసారి తెలుగులో ‘యూత్‌’ అనే చిత్రంలో నటించారు. ఆ తర్వాత ఇప్పటిదాకా తెలుగులో స్ట్రెయిట్‌ చిత్రం చేయలేదు. ప్రస్తుతం ఆయన ‘కోబ్రా’ సినిమాలో నటిస్తున్నారు. దీని తర్వాత తెలుగు, తమిళ భాషల్లో విక్రమ్‌ ఓ చిత్రం ప్రకటించారు. సెవెన్‌ స్ర్కీన్‌ స్టూడియోస్‌ పతాకంపై ఆర్‌ అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ వేగంగా జరుగుతోంది.


పదేళ్ల విరామం వీడి

2008లోనే హీరో విశాల్‌ తొలి తెలుగు చిత్రం ‘సెల్యూట్‌’లో  నటించారు. పదేళ్ల తర్వాత ఇప్పుడు విశాల్‌ మళ్లీ తెలుగు చిత్రం చేస్తున్నారు. లఘు చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శరవణన్‌తో ఆయన ద్విభాషా చిత్రం చేస్తున్నారు. ఇటీవలె పూజా కార్యక్రమాలతో చె న్నైలో ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది. 


సూర్య, కార్తీ సిద్ధం

‘రక్త చరిత్ర 2’తో సూర్య తెలుగులో హీరోగా అరంగేట్రం చేశారు. తమిళంలో బిజీ కావడంతో తెలుగు సినిమాలు చేయలేకపోతున్నానని చెప్పిన సూర్య మళ్లీ ఇన్నాళ్లకు తెలుగు చిత్రం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇద్దరు తెలుగు అగ్రదర్శకులు సూర్యకు కథ చెప్పారని సమాచారం. అందులో ఓ స్ర్కిప్ట్‌  సూర్యకు నచ్చడంతో త్వరలోనే సెట్స్‌ పైకి వెళ్లే అవకాశం ఉందని చెపుతున్నారు. సూర్య సోదరుడు కార్తీ 2015లో ‘ఊపిరి’ చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ఆయన కూడా తెలుగులో ఓ చిత్రం చేయాలని  భావిస్తున్నారట. 


కేజీఎఫ్‌ స్టార్‌ టాలీవుడ్‌లో?

వీరేకాకుండా దక్షిణాదికి చెందిన పలువురు నటులతో తెలుగులో స్ట్రెయిట్‌ సినిమాలు చే సేందుకు ఇక్కడి నిర్మాతలు, దర్శకులు ప్రయత్నిస్తున్నారు. ‘కేజీఎఫ్‌’తో పాన్‌ ఇండియా  స్టార్‌గా ఎదిగిన యశ్‌కు   తెలుగులో కూడా స్టార్‌ హీరో ఫాలోయింగ్‌ ఏర్పడింది. దీంతో ఆయనతో  తెలుగులో స్ట్రెయిట్‌ చిత్రం చేసేందుకు  కొందరు నిర్మాతలు  సంప్రదించారని సమాచారం. సరైన కథ దొరికితే యశ్‌  కూడా తెలుగులో చేసేందుకు ఆసక్తి  చూపుతున్నారు.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.