కొంచెం డిఫరెంట్‌గా...

తెరపై కనిపించాల్సిన హీరో టిక్కెట్‌ కౌంటర్‌లో కనిపిస్తే?

వెబ్‌సిరీస్‌ విడుదల తేదీని ప్రకటించకుండా ప్రేక్షకుల ఊహలకే వదిలేస్తే? 

సినిమాలో ఏదో ఒక అంశంతో ప్రేక్షకులను ముడిపెడుతూ

సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కల్పిస్తే.. ఆ సినిమాకు మంచి ప్రచారం ఖాయం. 

సామాజిక మాధ్యమాల్లో తమ సినిమాను వినూత్నంగా ప్రచారం చేయటం

చాలా కాలంగా ఉన్నదే అయినా కొందరు మాత్రం కొంచెం డిఫరెంట్‌గా చేస్తున్నారు. 


సినిమా కోసం సింధూరం దిద్దారు

సినిమా కథలు, చిత్రీకరణతో పాటు ప్రచారంపైనా ప్రత్యేక శ్రద్ధ పెడతారు బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌. గతేడాది చివరిలో ఓటీటీలో విడుదలైన ‘లక్ష్మి’ సినిమా కోసం ‘అబ్‌ హమారీ బారీ హై’ అనే ప్రచార కార్యక్రమాన్ని చిత్రబృందం చేపట్టింది. ఈ చిత్రంలో అక్షయ్‌ కుమార్‌ పోషించిన హిజ్రా పాత్రకు నుదుట పెద్ద సింధూరం బొట్టు ఉంటుంది. దాన్నే ఆయన తన సినిమా ప్రచారానికి ఉపయోగించుకున్నారు. ‘లాల్‌బిందీ ధరించి, హిజ్రాలకు మద్దతుగా నిలవండి’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో అక్షయ్‌ ఇచ్చిన పిలుపుకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఇందులో ఇన్‌స్టాగ్రామ్‌ ఫిల్టర్‌ను ఉపయోగించి నుదుట కాసంత సింఽధూరం బొట్టును ధరించిన ఫొటోలను పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు, క్రీడా ప్రముఖులు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. దీనివల్ల హిజ్రాలను చిన్నచూపు చూడకుండా, మనలో ఒకరిలా చూడాలనే సామాజిక ప్రయోజనంపై నెటిజన్లలో అవగాహన కల్పించడంతో పాటు ‘లక్ష్మి’ సినిమాకు కొన్ని రోజుల పాటు సామాజిక మాధ్యమాల్లో మంచి ప్రచారం లభించింది. 


విడుదల తేదీ ఊహించండి

మనోజ్‌ బాజ్‌పాయ్‌, సమంతా ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్‌ ‘ద ఫ్యామిలీ మ్యాన్‌ 2’. తొలుత ఈ వెబ్‌సిరీస్‌ను ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. అయితే తేదీని నేరుగా ప్రకటించకుండా టీజర్‌లో 2021 అనే చిన్న క్లూను వదిలి రిలీజ్‌ డేట్‌ను డీకోడ్‌ చేసే అవకాశాన్ని ప్రేక్షకులకే వదిలారు. దాంతో నెటిజన్లు క్లూను బట్టి విడుదల తేదీని ఊహిస్తూ సామాజిక మాధ్యమాల్లో చర్చించారు. దానివల్ల విడుదలకు ముందే వెబ్‌సిరీస్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగి మంచి ప్రచారం లభించింది. చివరకు ప్రేక్షకులు 12-02 (ఫిబ్రవరి 12)న ‘ద ఫ్యామిలీ మ్యాన్‌ 2’ను విడుదల చేస్తున్నట్టు ఊహించారు. తర్వాత కొన్ని రోజులకు అమెజాన్‌ ప్రైమ్‌ కూడా అదే తేదీని అధికారికంగా ప్రకటించింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ తేదీకి విడుదల చేయలేకపోయినా కావలసినంత ప్రచారం మాత్రం పొందారు. 


పదిమంది దర్శకులతో పాత్తు తల

శింబు కథానాయకుడుగా ఎన్‌. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ చిత్రం ‘పాత్తు తల’ (పది తలలు). కన్నడ సూపర్‌ హిట్‌ మూవీ ‘ముఫ్తీ’కి ఇది రీమేక్‌. ఈ చిత్రం టైటిల్‌ ప్రకటనను ట్విట్టర్‌లో గ్రాండ్‌గా ప్లాన్‌ చేసింది చిత్రబృందం. మొత్తం పదిమంది దర్శకులు ఈసినిమా టైటిల్‌ను ఏకకాలంలో ట్విట్టర్‌లో ప్రకటించారు. వెంకట్‌ ప్రభు, ఆనంద్‌ శంకర్‌, పా రంజిత్‌, అశ్వత్‌ మారిముత్తు, శామ్‌ ఆంటన్‌, విఘ్నేశ్‌ శివన్‌, విజయ్‌ మిల్టన్‌, కార్తిక్‌ సుబ్బరాజ్‌, సంతోష్‌ జయకుమార్‌, యమ్‌ రాజేష్‌లు ‘పాత్తు తల’ టైటిల్‌ను ప్రకటించారు. పలువురు ప్రముఖ దర్శకులు విడుదల చేయటంతో సినిమా టైటిల్‌పై ఆసక్తిని పెంచటంతో పాటు మంచి ప్రచారం లభించింది. 


హీరోనే టిక్కెట్లు అమ్మాడు

తెరపైన చూడాల్సిన హీరోను టిక్కెట్‌ కౌంటర్‌లోనే ప్రేక్షకులకు చూపించడం కూడా ఓ రకమైన పబ్లిసిటీ. గతేడాది కరోనా లాక్‌డౌన్‌ తర్వాత థియేటర్లలో వందశాతం ఆక్యుపెన్సీతో అనుమతించాక విడుదలైన కొన్ని చిత్రాల్లో ‘రూహీ’ ఒకటి. జాన్వీకపూర్‌, రాజ్‌కుమార్‌ రావు జంటగా నటించారు. కరోనా భయంతో సంశయిస్తున్న ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు రాజ్‌కుమార్‌ రావు స్వయంగా రంగంలోకి దిగారు. ఢిల్లీలో ‘రూహీ’ చిత్రం విడుదలైన పలు మల్టీఫ్లెక్స్‌ థియేటర్లకు వెళ్ళి కౌంటర్‌లో టిక్కెట్లు విక్రయించారు. తెరపై కనిపించాల్సిన హీరో టిక్కెట్‌ కౌంటర్‌లోనే కనిపించడంతో ప్రేక్షకులు ఆశ్చర్యానందాలకు గురయ్యారు. రాజ్‌కుమార్‌ రావు సినిమా టిక్కెట్లు అమ్ముతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. దీంతో ‘రూహీ’ చిత్రానికి పబ్లిసిటీ వచ్చింది.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.