సినిమా రివ్యూ : ‘స్కైలాబ్’

ABN , First Publish Date - 2021-12-04T19:45:07+05:30 IST

చరిత్రలో జరిగిన ఒక సంఘటని సరికొత్త కోణంలో ఈ తరం ప్రేక్షకులకి అందించడం నిజంగా అభినందించదగ్గ విషయం. ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితం సంచలనం సృష్టించిన ‘స్కైలాబ్’ ను కథావస్తువుగా తీసుకొని కొత్త దర్శకుడు విశ్వక్ ఖండేరావు టాలీవుడ్ ప్రేక్షకులకు అందించిన చిత్రం ‘స్కైలాబ్’. ఈ సినిమా ఈ రోజే(శనివారం) థియేటర్స్ లోకి వచ్చింది. విలక్షణ హీరో సత్యదేవ్, టాలెంటెడ్ నటీమణి నిత్యామీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాని వాస్తవిక సంఘటలకి, ఫిక్షన్ ను జోడించి తెరకెక్కించారు.

సినిమా రివ్యూ : ‘స్కైలాబ్’

చిత్రం : ‘స్కైలాబ్’ 

విడుదల తేదీ : డిసెంబర్ 4, 2021

నటీనటులు : సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ, సుబ్బరాయ శర్మ, తనికెళ్ళ భరణి, అరిపిరాల సత్యప్రసాద్, నారాయణరావు, తులసి, తరుణ్ భాస్కర్ తదితరులు

సంగీతం : ప్రశాంత్ ఆర్.విహారి

సినిమాటోగ్రఫీ : ఆదిత్య జవ్వాది

ఎడిటింగ్ : రవితేజ గిరిజాల

నిర్మాణం : బ్రైట్ ఫీచర్స్, నిత్యామీనన్ కంపెనీ

రచన, దర్శకత్వం : విశ్వక్ ఖండేరావు

చరిత్రలో జరిగిన ఒక సంఘటని సరికొత్త కోణంలో ఈ తరం ప్రేక్షకులకి అందించడం నిజంగా అభినందించదగ్గ విషయం. ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితం సంచలనం సృష్టించిన ‘స్కైలాబ్’ ను కథావస్తువుగా తీసుకొని కొత్త దర్శకుడు విశ్వక్ ఖండేరావు టాలీవుడ్ ప్రేక్షకులకు అందించిన చిత్రం ‘స్కైలాబ్’. ఈ సినిమా ఈ రోజే(శనివారం) థియేటర్స్ లోకి వచ్చింది. విలక్షణ హీరో సత్యదేవ్, టాలెంటెడ్ నటీమణి నిత్యామీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాని వాస్తవిక సంఘటలకి,  ఫిక్షన్ ను జోడించి తెరకెక్కించారు. ఇంతకీ ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ విధంగా మెప్పిస్తుంది? ఆ సినిమాకి ఎంత వరకూ కనెక్ట్ అవుతారు? అనే  విషయాలు రివ్యూలో చూద్దాం.


కథ 

జర్నలిస్ట్ గౌరి (నిత్యామీనన్) హైదరాబాద్‌లో ప్రతిబింబం అనే పత్రికలో జర్నలిస్ట్ గా పనిచేస్తూ ఉంటుంది. కొన్ని కారణాల వల్ల ఆమెను ఉద్యోగం నుంచి తీసేస్తారు. దాంతో ఆమె తన సొంత ఊరైన బండ్లలింగంపల్లికి వస్తుంది. అదే ఊరికి చెందిన డాక్టర్ ఆనంద్ (సత్యదేవ్) ఉద్యోగం నుంచి సస్పెండై.. సొంత ఊళ్ళో క్లినిక్ పెట్టుకోవాలని ఆశతో వస్తాడు. మరో వైపు రామారావు సుబేదార్ (రాహుల్ రామకృష్ణ) తన ఫ్యామిలీ అప్పులు తీర్చడం కోసం నానా తంటాలు పడుతుంటాడు. ఒక బ్రేక్ కోసం ఎదురు చూస్తుంటారు ఈ ముగ్గురూ. ఇంతలో సాంకేతిక లోపాలు తలెత్తి నాసా అంతరిక్షంలో నిర్మించిన స్కైలాబ్ భూమ్మీద పడుతుందని, అది కూడా కరీంనగర్ జిల్లాలోని బండ్లలింగం పల్లిలో పడి పెను ప్రమాదం సృష్టించబోతోందని రేడియో వార్తలొస్తాయి. దీంతో ఆ గ్రామ ప్రజలు భయంతో ఒణికిపోతారు. మరి నిజంగానే స్కైలాబ్ బండ్లలింగంపల్లిలో పడిందా? దాని కారణంగా గ్రామస్థుల్లో కలిగిన ఫీలింగ్సేంటి? దాని వల్ల గౌరి, ఆనంద్, రామారావు జీవితాలు ఎలా మలుపు తిరిగాయి అన్నదే మిగతా కథ.


విశ్లేషణ 

వాస్తవిక సంఘటనల ఆధారంగా ఎంచుకున్న కాన్సెప్ట్స్ కు చక్కటి డ్రామా, ఎమోషన్స్ యాడైతే సినిమా మరింతగా రక్తికడుతుంది. ‘స్కైలాబ్’ సినిమా విషయంలో కొత్త దర్శకుడు ఆ ప్రయత్నమే చేశాడు. స్కైలాబ్ అనే భయాన్ని క్రియేట్ చేయడం వల్ల గ్రామస్థుల్లో చోటుచేసుకున్న మార్పుల్ని, వారి భావోద్వేగాల్ని రాబట్టడానికి మంచి ఎఫెర్ట్స్ పెట్టాడు. అలా అని చెప్పి సినిమాని పూర్తిగా సీరియస్ గా నడపకుండా.. వినోదాత్మకంగా నడపడం వల్ల సినిమా ఫస్టాఫ్ అంతా చాలా సాఫీగా సాగుతుంది. ఆ క్రమంలో ఆ గ్రామంలోని డిఫరెంట్ కేరక్టర్స్ ఎస్టాబ్లిష్ అవుతాయి. 40 ఏళ్ళ క్రితం నాటి వాతావరణం, గ్రామస్థుల్లోని అమాయకత్వం, మూఢనమ్మకాలు, కట్టుబాట్లు లాంటివాటిని చాలా సహజంగా ఆవిష్కరించారు. అయితే వాటిలో కొన్ని లోపాలు కనిపిస్తాయి. అప్పటి న్యూస్ పేపర్స్ ను బాగానే చూపించినా..  ఆ సమయంలో ఆఫ్ సెట్ ప్రింటింగ్ లేదు. ఫ్లెక్సీలు లేవు. అలాగే.. టైపు రైటర్ లో తెలుగు టైప్ చేస్తే కంప్యూటర్ లో టైప్ చేసిన ప్రింట్ కనిపిస్తుంది. ఇంకా ‘ప్రతిబింబం’ పత్రిక కవర్ పేజ్ ఇప్పటి మేగజైన్స్ డిజైనింగ్ తోనే కనిపిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న లోపాలు మినహాయిస్తే ఈ సినిమాకి రెట్రో లుక్ బాగానే తెప్పించాడు దర్శకుడు. అయితే కథ మీద ఇంకొంచెం కసరత్తు చేసి, స్ర్కీన్ ప్లేను ఇంకొంచెం బలంగా రాసుకొని ఉంటే బాగుండనిపిస్తుంది. 


జర్నలిస్ట్ గౌరి గా నిత్యామీనన్ అభినయం, మేకోవర్ అద్భుతం. ఆ పాత్రకు తను మాత్రమే యాప్ట్ అనిపించుకున్నారు.  డాక్టర్ ఆనంద్ గా సత్యదేవ్ నటన చాలా సహజంగా ఉంటుంది.  రాహుల్ రామకృష్ణ అమాయకత్వంతో కూడిన పంచ్ డైలాగ్స్, కుటుంబ సభ్యుల వ్యవహారంతో విసిగిపోయినప్పుడు చూపించే అసహనం చాలా నేచురల్ గా అనిపిస్తాయి. ఈ ముగ్గురి నటన ఈ సినిమాకి ప్రాణం పోశాయి. ఇంకా సత్యదేవ్ తండ్రిగా అరిపిరాల సత్యప్రసాద్ కనిపించింది తక్కువే అయినా చాలా బాగా నటించారు. తాతగా తనికెళ్ళ భరణి తనదైన స్థాయిలో తన పాత్రను రక్తికట్టించారు. నిత్యా మీనన్ తల్లిదండ్రులుగా  తులసి, నారాయణరావు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇంకా నిత్యామీనన్ ఇంట్లో పనివాడుగా నటించిన కుర్రాడు చక్కటి నటనతో ఆకట్టుకుంటాడు.  ఇక పతాక సన్నివేశాల్లో గ్రామస్థుల ఎమోషన్స్ తెరకెక్కించిన తీరు బాగుంది.  ఫస్టాఫ్ లో కొంత సాగతీత కనిపించినా.. సెకండాఫ్ లో దాన్ని కవర్ చేశారు. ఇక సంగీతం, సినిమాటోగ్రఫీ,  నిర్మాణ విలువలు, డైలాగ్స్  బాగున్నాయి. మొత్తం మీద ‘స్కైలాబ్’ చిత్రం ప్రేక్షకులకి మంచి వినోదాన్నే అందిస్తుంది. 

ట్యాగ్ లైన్ : సముద్రంలోకి స్కైలాబ్.. భూమ్మీదకి వినోదం

Updated Date - 2021-12-04T19:45:07+05:30 IST