ఆరు నెలల తర్వాతే...
ABN , First Publish Date - 2022-12-06T07:10:17+05:30 IST
మహేశ్, దర్శకుడు రాజమౌళి.. ఈ కాంబినేషన్‌లో వచ్చే సినిమా కోసం అభిమానులే కాదు ప్రేక్షకులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు...

మహేశ్, దర్శకుడు రాజమౌళి.. ఈ కాంబినేషన్‌లో వచ్చే సినిమా కోసం అభిమానులే కాదు ప్రేక్షకులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం గురించి అప్పుడప్పుడు వచ్చే అప్‌డేట్స్ అంచనాలను మరింత పెంచుతున్నాయి. ప్రస్తుతం మహేశ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అది పూర్తయిన వెంటనే రాజమౌళి సినిమా మొదలవుతుంది. అంటే వచ్చే ఏడాది జూన్ నాటికి ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కుతుందన్నమాట. ఈ విషయాన్ని చిత్ర రచయిత విజయేంద్రప్రసాద్ ఇటీవల వెల్లడించారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యాక్షన్ , అడ్వెంచర్ అంశాలతో రూపుదిద్దుకోబోయే ఈ సినిమా షూటింగ్ ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో జరుగుతుందని ఆయన చెప్పారు.
‘మహేశ్ ఇంటెన్సిటీ ఉన్న నటుడు. అతను నటించిన యాక్షన్ సన్నివేశాలు చూస్తే ఆ ఇంటెన్సిటీ కనిపిస్తుంది. ఎన్నో రోజుల నుంచి రాజమౌళి ఇలాంటి సాహసోపేతమైన కథను తీయాలనుకుంటున్నాడు. ఈ కథకు మహేశ్ సరిగ్గా సరిపోతాడని అతనిని ఎంపిక చేసుకున్నాడు. మహేశ్‌ను దృష్టిలో పెట్టుకునే కథ రాశాను’ అని విజయేంద్రప్రసాద్ చెప్పారు.