ఒకే ఒక సిరివెన్నెల...

సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒక విలక్షణమైన సినీ గీత రచయిత! ఎందరో గొప్ప గొప్ప సినీకవులు ఉన్నారు గానీ, సిరివెన్నెల వంటి లిరిసిస్టు మరొకరు లేరు. ఏమిటి ఆయన ప్రత్యేకత?


అసలు సినిమా పాట అంటే ఏమిటి? ఎవరో చెప్పిన సందర్భానికి, ఎందుకో కుదిర్చిన సన్నివేశానికి, ఎలానో కూర్చిన రాగాలకి అనుగుణంగా కలాన్ని కొంకర్లు తిప్పి రాసే పాట; కాసులకోసం రాసే పాట! తన ఇష్టాయిష్టాలతో, రాగద్వేషాలతో సంబంధం లేకుండా సినిమా పాట రాయాల్సి ఉంటుంది ఏ సినీకవి అయినా. అన్ని పరిమితులు ఉన్నప్పటికీ ఆ సినిమా పాటలో కూడా తన లోతైన తత్వాన్ని ఇమడ్చగలిగిన ఏకైక సినీ గేయరచయిత కావడమే సిరివెన్నెల విశిష్టత. 


కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'ఖడ్గం' సినిమాలో ఒక పబ్ సాంగ్ ఉంటుంది- "ముసుగు వెయ్యొద్దు మనసు మీద... వలలు వెయ్యొద్దు వయసు మీద..."


అరాకొర బట్టలేసుకొని కుర్రకారు గంతులేసే ఆ సన్నివేశానికి ఆ పాట రాసింది సిరివెన్నెల. చరణంలో ఇలా రాస్తారాయన: 


"కొంత కాలం నేలకొచ్చాం అతిథులై ఉండి వెళ్ళగ

కోటలైనా కొంపలైనా ఏవీ స్థిరాస్థి కాదుగా

కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా

అంతకన్నా సొంతమంటూ ప్రపంచపటంలో లేదుగా... "


ఈ రోజు స్వర్గస్థులైన సిరివెన్నెల చెప్పిన తాత్వికత, ఆచరించిన ఆదర్శం అదే. అతిథిలా ఈ లోకానికి వచ్చారు ఆయన, స్నేహవాత్సల్యాలు తప్ప మరే ఆస్తులు మిగిల్చుకోకుండా వెళ్లిపోయారు.  


ఆ పాట సాహిత్యం వింటే, అదొక క్లబ్ సాంగ్ అని అనిపిస్తుందా? అదీ సిరివెన్నెల మార్క్! ఆ విలక్షణత ఆయనకే సొంతం. 

ముసుగు వెయ్యొద్దు మనసు మీద

వలలు వెయ్యొద్దు వయసు మీద

ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తూఫాను వేగాలతో

ఎవరి ఆనందం వారిదంటే ఒప్పుకోలేరా

అనుభవించందే తెలియదంటే తప్పు అంటారా

మనసు చెప్పిందే మనకు వేదం కాదనే వారే లేరురా

మనకు తోచిందే చేసి చూద్దాం ఎవరు ఏమంటే ఏంటిరా


సూర్యుడైనా చూపగలడా రేయి చాటున్న రేపుని

చీకటైనా ఆపగలదా వచ్చే కలల్ని వద్దని

తిరిగిపడదా కప్పగలరా ఉరకలేస్తున్న ఆశని

దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావని

ఎన్నో అందాలు స్వాగతిస్తూ కళ్ళముందుండగా

అందుకోకుండ ఆగిపోతూ ఉసూరుమంటే ఎలా

ఏ ఉడుకు ఏ దుడుకు ఈ వెన్నక్కి తిరగని పరుగు

ఉండదుగా కడవరకు ఈ వయస్సునిలాగే కరిగిపోనీకు


కొంత కాలం నేలకొచ్చాం అతిధులై ఉండి వెల్లగ

కోటలైనా కొంపలైనా ఏవీ స్థిరాస్థి కాదుగా

కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా

అంతకన్నా సొంతమంటూ ప్రపంచపటంలో లేదుగా 

నిన్నలేమైనా గుర్తుకొస్తే తీపి అనిపించనీ

ఉన్నకొన్నాళ్ళు గుండె నిండా సరదాలు పండించనీ

నువ్వెవరో నేనెవరో ఈ క్షణాన కలిసి నడిచాం

సావాసం సంతోషం ఇవి అందించి అందరిలో నవ్వు నింపుదాం

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.