పాటకు చీకటి మిగిల్చిన సిరివెన్నెల

ABN , First Publish Date - 2021-12-01T05:30:00+05:30 IST

పాట రాయడం... పురుడు పోసుకోవడం ఆయనకు రెండూ ఒక్కటే.పాప పుట్టినప్పుడు ఉండే ఉద్వేగం - పాటతోనూ చూశారాయన...

పాటకు చీకటి మిగిల్చిన సిరివెన్నెల

పాట రాయడం... పురుడు పోసుకోవడం ఆయనకు రెండూ ఒక్కటే.పాప పుట్టినప్పుడు ఉండే ఉద్వేగం - పాటతోనూ చూశారాయన!అలా ఒకటా, రెండా? వేల సార్లు ‘తల్లి’లా భావాల గర్భాలు మోశారు. ఆడ పిల్లకు ముస్తాబు చేసినట్టు.. పాటకు పదాల పరికిణీ చుట్టారు. భావుకత బొట్టు అద్దారు. మాటల మందారాలు కొప్పులో పెట్టారు. అత్తారింటికి సాగనంపినట్టు తెలుగు సినిమాకు అప్యాయంగా అప్పజెప్పారు. వేటూరి తరవాత తెలుగు పాట భారాన్ని, బాధ్యతని తన భుజాన మోశారు. తెలుగు పాటకు కావ్య వైభవం తీసుకొచ్చారు. తెలుగు మాట విలువ పెంచారు. ఆ ప్రయాణంలో నందులొచ్చినా, పద్మలు పలకరించినా - నవ్వుతూనే ఆహ్వానించారు. వాటికీ తన అక్షరాలతో అభిషేకం చేశారు. వచ్చిన పని అయిపోయిందనుకున్నారేమో.. తెలుగు పాట వేలు విచిడి - హఠాత్తుగా మాయమయ్యారు. సిరి వెన్నెల నిష్క్రమణతో ఇప్పుడు తెలుగు పాటని చీకటి కమ్ముకుంది. పురిటినొప్పుల బాధ తెలిసిన రచయిత.. ఇప్పుడు చిత్రసీమకు గర్భశోకం మిగల్చడం... ఎన్నటికీ, ఎప్పటికీ మర్చిపోని విషాదం.



ఎక్కడ మాట మూగబోతుందో.. అక్కడ పాట అవసరం. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. అందుకే నా దగ్గరకు వచ్చే నిర్మాతలకు - పాటలెందుకు.. ఆ ఖర్చు మిగులుతుంది కదా.. అంటుంటాను. ప్రస్తుతం ఒక పాట తీయాలంటే తక్కువలో తక్కువ కనీసం 20 లక్షలవుతుంది. అంటే ఆరుపాటలుంటే 1.2 కోట్లు. పాటలు లేకపోతే ఆ డబ్బులన్నీ మిగులుతాయి కదా.


స్వర్ణకమలంలో ‘శివపూజకు చిగురించిన..’ పాటకు పదిహేను రోజులు నేను పడిన సంఘర్షణ అంతా ఇంతా కాదు. దీనిలో హీరో కళాకారుడు. హీరోయిన్‌కు కళలంటే విరక్తి. ఈ ద్వైదీభావాల మధ్య సంఘర్షను పాటగా రాయాలి. అది కూడా ఏ ఒక్కరి వాదన తక్కువగా ఉండకూడదు. కానీ రాసేవాడిని నేనొక్కడినే కదా..


సినీ కవిత్వం రాసేవారెవ్వరూ అసమర్థులు కాదు. అయితే ఈ ప్రపంచం ఎవరి కోసం ఆగదు. ప్రతి రోజు ఒక కొత్తే. ప్రతి పగలులోను ఇరవై సూర్యోదయాలుంటాయి. వాటిని ఊహించి, శ్వాసించి రాయాల్సిన బాధ్యత కవిదే. ప్రతి పాట ఒక ఆరంభమే.


నేను ఒక అన్వేషిని. కానీ ప్రపంచానికి దూరంగా ఉండను. ప్రపంచంతో ఉంటూనే అన్వేషణ సాగిస్తా. ‘ఎంతవరకూ ఎందుకొరకు..’ పాటలో తత్వమే నాది. నేను ఎవరి కోసమో.. ఎవరిలాగానో ఉండను. నాకోసం..నాలా ఉంటా.


‘‘మా తరంలో వాళ్లకి సిగరెట్‌ కాల్చడం ఫ్యాషన్‌. నా వ్యసనం కూడా అలాగే మొదలైంది. ఇంత అహంకారినైన నేను ప్రతిసారీ ఒక సిగరెట్‌ ముందు తలవంచుతున్నాను. నాకు చేతగాకనే ఈ వ్యసనాన్ని వదల్లేకపోతున్నాను’’


ఒకప్పడు కవులే సినిమా పాటల రచయితలుగా మారారు. నన్నే తీసుకోండి. నేను ఒక కవిని. కానీ నాకు ఛందస్సు రాదు కాబట్టి పద్యాలు రాయలేను. వచన కవిత్వంపై పెద్ద అనురక్తి లేదు. నా ఆలోచనలను వ్యక్తీకరించటానికి పాట వేదికయింది. కథా గమనానికి పాట అడ్డుతగుతుందని నాకు తెలుసు. అయినా తప్పనిసరి కాబట్టి- అది ప్రత్యేకంగా ఉండాలి. అందుకే సినిమా పరిధిని దాటి వెళ్లా. కొంత భావుకత.. ప్రపంచాన్ని చూసే మనదైన ప్రత్యేక కోణం ఉంటే చాలు పాట రాయవచ్చు. మీకో ఉదాహరణ చెబుతా. హీరో, హీరోయిన్ల మీద డ్యూయెట్‌ రాయాలనుకుందాం. ఇప్పటికే 45 వేల డ్యూయెట్లు వచ్చేసాయి. మళ్లీ కొత్తగా ఎలా రాయాలి? ఇదే విధంగా ఒక క్లబ్బులో తప్పతాగి చిందులు వేస్తున్నవారికో పాట రాయాలనుకుందాం..నాకీ క్లబ్బులు..పబ్బులు తెలియవు. అందుకే- ‘‘ముసుగు వేయొద్దు మనసు మీద..’’ అని రాశా. అయితే ఇలా రాయటానికి.. రాయించుకోవటానికి నిబద్ధత కావాలి. ఉదాహరణకు ‘కొండగాలి వీచింది..’ పాట వినడానికి ఎంత హాయిగా ఉంటుంది. నన్ను చంపేశావే, కోసేశావే, ముక్కలు ముక్కలు పారేయకే.. అని పాటలొస్తున్నాయి ఇప్పుడు. అదేదో హత్యాకాండలా.. అందుకే పాత పాటలను కొందరు ఇష్టపడుతున్నారు.


‘‘ప్రతిరంగంలోనూ అందరిలోనూ అంతా గొప్పే ఉండదు. ఆయా విద్యలో ఉండే అద్భుతత్వాన్ని గ్రహిస్తానే తప్ప నటుల్లోగానీ, రచయితల్లోగానీ ’ఒకళ్లు‘ అంటూ ప్రత్యేకంగా నాకెవరూ లేరు. అయినా నా తత్వ దృష్టి కోణంలోంచి ఆలోచిస్తే నాకు ఒక్కళ్లే అంటే.. విశ్వనాథ సత్యనారాయణ తప్ప ఎవరూ లేరు. ప్రతిభాపరంగా చూస్తే.. దేవులపల్లి కృష్ణశాస్త్రి, వేటూరి, సి.నారాయణరెడ్డి.. నా సమకాలీకుల్లో కూడా చాలా మందే ఉన్నారు. అలాగే.. చంద్రబోస్‌, రామజోగయ్యశాస్త్రి, అనంతశ్రీరామ్‌, భాస్కరభట్ల.


‘‘నాకు చిన్నప్పటి నుంచి చదవడం బాగా అలవాటు. కొన్ని వేల పుస్తకాలు చదివాను. అలాగే.. చిన్నప్పుడు నాకు బాగా పాడాలని కోరిక. నేనో పెద్ద గాయకుడినన్న ఫీలింగ్‌. రెండుమూడుసార్లు పాడాక నేను దానికి పనికిరానని నాకు తెలిసింది. దీంతో.. లలలా అనుకునేవాణ్ని. అలా ఎంతసేపు? అందుకే ఏవో పదాలు జోడించేవాణ్ని. అవి విని మా తమ్ముడు... ’అన్నయ్యా కవిత్వం బాగా రాస్తున్నావు‘ అన్నాడు. తర్వాత ఏవీ కృష్ణారావు అని.. ఆయన ప్రోత్సహించారు. నేను రాసిన పాటలు విశ్వనాథ్‌గారి చెవిలో పడటంతో ’సిరివెన్నెల‘ అవకాశం వచ్చింది.


ఐదు నిమిషాల్లో రాయవచ్చు. కొన్ని రోజులు కష్టపడి రాయవచ్చు. నేను ఈ కష్టాన్నే ఇష్టంగా ఎంచుకుంటా. నేను రాకముందు 45 వేల పాటలున్నాయి. వాటిలో భావం కాకుండా కొత్తగా ఏదో ఇవ్వాలి.. ఆ తపన ముందుకు నడిపిస్తుంటుంది. ఇప్పటి కుర్రాళ్లకు కూడా నేనిదే చెప్తుంటా. రాసే ప్రతి పదాన్ని ప్రశ్నించాలి. అప్పుడే కొత్తదనం సాధ్యమవుతుంది. 


సిరివెన్నెల భావకుడు.. తాత్వికుడు. తనలో ఓ వేదాంతి కనిపిస్తాడు. ఓ సన్యాసి దర్శనమిస్తాడు. మనసు తలుపు తడితే ఎన్నో భావాలు. లోతైన జల పాతాలు. ఆయనకు జీవితమే పాట. పాటే జీవితం. ఈరెండింటి గురించీ ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే, నవ్యలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో చెప్పిన కొన్ని సంగతులు మళ్లీ ఓసారి గుర్తు తెచ్చుకుంటే..


పాటకెన్నిచ్చావో సీతారాముడా..!

మీ పేరేంటి...?

‘సిరివెన్నెల....’

కదా..? మరి ఈ చీకటేంటి...? లోలోపల ఈ బాధేమిటి? మా గుండెలమీద టన్నుల కొద్దీ బరువేమిటి?

మీరేం చేయాలి?

‘పాటలు రాయాలి’


కదా.. కానీ అది రాయకుండా ఓ పాఠం రాస్తే, ఆ పేరు చెప్పి పేజీలపై మా బతకు గీస్తే, అక్షరాల్ని మాపై గుట్టగా పోసి, మీ భావాలతో ఊపిరి ఆడనివ్వకుండా చేస్తే... ఏమైపోయేది? అప్పుడు బాగానే ఉంది. పాట వింటున్నప్పుడు, దాన్ని మళ్లీ మళ్లీ తలచుకుంటున్నప్పుడు, నిజంగా వెన్నెల్లో, చందమామ గొడుగు కింద, అమ్మ ఒడిలో ఆడుకుంటున్నట్టే ఉండేది. నాన్న వేలు పట్టుకుని ధీమాగా నడిచినట్టు, స్నేహితుడి భుజం మీద చేయి వేసి దగ్గరకు తీసుకున్నట్టు.. ప్రియురాలి చెవిలో ఊసులేవో చెబుతున్నట్టే అనిపించేది. కానీ ఇప్పుడే ఇంత చీకటి.. కటిక చీకటి. కార్చీకటి.పాటంటే పాటలా కదా ఉండాలి. మీ పాటేంటి కావ్యంలా కనిపిస్తుంది. 

పాటంటే అక్షరాలు పేర్చాలి కదా.. మీరేంటి మా మనసుకీ మీ మనసుకీ దారం కట్టేసి ముడేస్తారు. ఎవరిచ్చారంత చనువు..? ఎప్పుడొచ్చిందా హక్కు?

పాట రాయాలంతే. అర్ధరాత్రి ఉదయించే సూర్యుడిలా, రాత్రంతా మేల్కొని దానికి ప్రాణం పోస్తారా? లాలిస్తారా? పాలిస్తారా? స్నేహం చేస్తారా? మూడు నాలుగు నెలలు ఆ పాటని మీ దగ్గరే ఉంచి, పెంచి పెద్ద చేసి, విశ్వమంత భావజాలాన్ని అందులో నూరి పోసి, ఈ లోకంలోకి వదలడం ఏమిటి? అదొచ్చి మాపై అధికారం చెలాయించడం ఏమిటి? నిద్ర పాడు చేస్తూ, కొత్త ప్రశ్నలతో వేధించడం ఏమిటి? 

మేం కూడా ఏం తక్కువ చేయలేదు. పాట విని వదిలేయాలి. మహా అయితే నాలుగు స్టెప్పులు వేయాలి. కానీ మేం మాత్రం దత్తత తీసేసుకున్నాం. మనసులో, మెదడులో చెత్తంతా బయట పారేసి, మీ పాటే నింపుకున్నాం.

‘ప్రాగ్దిశ వీణియ పైన దినకర మయూఖ తంత్రులపైన’ అని రాస్తే, ‘ఏదో గ్రాంధికంలే’ అనుకోలేదు. అర్థాల కోసం శబ్ద రత్నాకరాలు కొనుక్కున్నాం. మా తెలుగెంత తీపో అనుకున్నాం. మొహమాటపడి పాటన్నారు గానీ, కొన్ని పాశుపతాస్త్రాలు. సిగ్గులేని సమాజాన్ని నిగ్గదీసి అడిగి, కడిగే నిప్పులాంటి నిజాలు. 

‘సమూహ క్షేమం పట్టని స్వార్థపు ఇరుకుతనంలో ముడచుకుపోతూ మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోని’ మా మూర్ఖత్వాన్ని గుడ్డలూడదీసి నిలబెట్టిన సందర్భాలు.

‘తెల్లారింది లెగండోయ్‌ కొకొరొక్కో..’ అంటూ మా బద్ధకాన్ని బెత్తం పుచ్చుకుని తరిమిన అపురూప క్షణాలు. 

‘మూసుకున్న రెప్పలిరిసి సూపులెగరనీయండి..’ అంటూ పరుగులు పెట్టించిన మరపురాని వైనాలు.

‘క్లాసు రూములో తపస్సు చేయుట వేస్టురా గురూ..’ అని మీరు సరదాగానే అనుంటారు. మేం మాత్రం సీరియస్‌గానే తీసుకున్నాం. ‘బోడి చదువులు వేస్టు.. మీ బుర్రంతా భోం చేస్తూ’ అని కాలేజీ గేటు దాటేశాం. బోటనీ పాఠం పక్కన పెట్టి మాటనీ ఆట కోసం పరుగులు పెట్టాం. 

‘పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్లూ..

పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలు..’ అన్నప్పుడల్లా ‘పెళ్లింటే ఇదీ’ అనిపిస్తుంది. సరిగ్గా అప్పుడే ‘పులిలాగే పెళ్లికి కూడా లెటర్సు రెండేరా.. ఫర్వాలేదని పక్కకు వెళ్తే పలారమైపోరా’ అని స్పీడు బ్రేకరు వేసిన మీ పాటే గుర్తొస్తుంది. ఏమిటీ మాయ..?

‘ఎలుకనెక్కిన ఏనుగు కథ.. చిత్రం కదా..’ గణేశుని చరిత్ర రెండు ముక్కల్లో చెప్పిన నీ పిసినారితనం ఏమని చెప్పుకోవాలి..? దశావతారాలనూ ఒకే పాటలో ఇరికించిన మీ మేధస్సుని ఎలా కొలవాలి?

మీ పాటల్లో కరెంటు ఉంటుంది. అణుబాంబులాంటి విస్ఫోటనం కనిపిస్తుంది.

‘దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకన్న సైన్యముండునా’ అని ధైర్యం నూరిపోసినప్పుడు నరాల్లో నిప్పుల వాన. కొండల్ని పిండి చేసేంత పౌరుషం. ఇవన్నీ మీ మాటలకు ఎవరు నేర్పారు? ఓటమి.. భయం.. పిరికితనం.. నిస్సహాయత.. నైరాశ్యం... వీటన్నింటినీ తరిమికొట్టాలని మీ పాటలకెవరు చెప్పారు?

హీరో ఇంట్రడక్షన్‌ పాటో, డ్యూయట్టో, రొమాన్సో.. న్యూసెన్సో.. నాన్సెన్సో.. ఎలాంటి సందర్భం వదిలినా - దాన్ని పద్ధతిగా, పాటకట్టి, ఆ పాటని శాసనంగా మార్చి, వ్యక్తిత్వ వికాస విహంగాన, విహరించే పక్షుల్లా అలా ఏమార్చేస్తారెందుకు..?

ఇప్పుడు ఆ చతురత.. ఆ ఆలోచన, ఆ ఆవేశం, ఆ దరహాసం ఎవరిలో చూడాలి? ఎక్కడ వెదకాలి?

ఆ అక్షరాలనే అణుబాంబులు మాకు కావాలి.

మీ భావకన్యలతో మళ్లీ ఆటలాడుకోవాలి.

మీ పాటతో.. మాటతో స్నేహం చేయాలి.

ఈ చీకటిని సిరి వెన్నెలతో నింపాలంటే.. మీ పాటే మళ్లీ కావాలి!

మీరు రాసినట్టు మీది జగమంత కుటుంబమే.

కానీ ఏకాకి జీవితం మాత్రం కాదు. ఎందుకంటే ఆ జీవితం మాది. మా జీవితం మీ పాటది.

మీరన్నట్టు... తెలుగు పాట అంపశయ్యపై ఉంది. మీ పాటతో చికిత్స చేయాల్సిన వేళ, అలా ఒంటరిగా, అనాథగా వదిలేసి వెళ్లిపోతే ఎలా? అందుకే..

‘ఆది భిక్షువు వాడి నేమి కోరేది

బూడిదిచ్చినవాడి నేమి అడిగేది...’

అనుకున్నా సరే, ఆ ఈశ్వరుడి ముందు పాట మోకరిల్లుతోంది.

తనకు ఇన్నిచ్చిన మా సీతారాముడ్ని మళ్లీ మాకిచ్చేయ్‌మని..!!

                                                                                   అన్వర్‌



ఎప్పుడొచ్చి తీసుకుంటారు...?

శ్రీశ్రీ ఎక్కడ ఆగాడో నువ్వక్కడ మొదలుపెట్టావ్‌ నాన్నా... 

నా కవిత్వం చూసి సిరివెన్నెల గారన్నమాట చాలా రోజులు నిద్రపట్టనివ్వలేదు నన్ను.. 

ఎంతటి మహానుభావుడు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు!.. ఆయన నోటివెంట మెచ్చుకుంటూ నాలుగు మాటలొచ్చేసరికి పిచ్చెక్కిపోదా ఎవరికైనా.. జీవితాన్ని 360 డిగ్రీల్లో కాచివడబోసి, వాటిని తేటతెనుగు పదాల ముత్యాలకు చేర్చి ఆయన అందించిన తెలుగు సినిమా సాహిత్యం సూర్యచంద్రులున్నంతవరకు శాశ్వతంగా ఉంటుంది.. తెలుగు సినిమా పాటకి కావ్యస్థాయిని అందించిన మహాకవి సిరివెన్నెల.. 

ఆయనతో ఎన్నో గంటలు, రోజులు, ఎన్నెన్నో జ్ఞాపకాలు.. 

ఒకసారైతే ఇద్దరం దాదాపు 14 గంటలు ఏకధాటిగా మాట్లాడుకుంటూనే ఉన్నాం, తిండి పనీ అన్నీ మానేసి.. కురుక్షేత్ర ప్రాంగణంలో కూర్చుని భగవద్గీతని కృష్ణార్జునుల కంటే కూలంకషంగా చర్చించుకున్నాం.. ప్రపంచంలో ఉన్న ఎన్నో విషయాలు, కావ్యాల్లో బాహ్యార్ధాలు, అంతరార్ధాలు ఆరా తీసుకున్నాం.. రాత్రి రెండు గంటలకు సెలవనుకుని వెళ్తే, మరుసటిరోజు ఉదయం 6 గంటలకే మళ్ళీ ఇంటికి పిలిచి ‘ఎవడ్రా నువ్వు’? అన్నారు.. నేను నమ్రతతో ‘మీరే కదా నేను’ అన్నాను.. ఉద్వేగంతో లేచి కౌగలించుకున్నారు.. ఇలాంటి ఆధ్యాత్మిక క్షణం ఎలా మర్చిపోగలను..? 

‘ముడుచుకున్న రెక్కలిడిసి పిట్టచెట్టు ఇడిసింది, మూసుకున్న రెపలిడిసి చూపులెగరనీయండి’ అన్న సిరివెన్నెల మాట విని ఎందరి బద్దకం గాల్లో ఎగిరి జీవితాన్ని ఆస్వాదించారో.. అలాంటి వారిలో నేనూ ఒకడ్ని.. ప్రత్యక్షంగా ఆయన పరిచయం ఒక వరమైతే, ఎన్నో అనుభవాలు అనుభూతులు పంచుకోవడం నాకీ జన్మకి దక్కిన అదృష్టం. 

పుట్టుక నుంచి మరణం వరకు ఆయన పాట రాయని సందర్భం లేదు.. 

ఏదైనా క్లిష్టమైన సందర్భం ఎదురై ముందుకెళ్లడానికి జంకితే... ‘ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటోవైపు..’ అని కొత్తదారిలో ధైర్యంగా నడవమంటాడు.. 

రెండునెలల ముందే నా ఆఫీసుకి సతీసమేతంగా వచ్చి ఆశీర్వదించి, నా టేబుల్‌ చూసి ‘నాన్నా అచ్చం ఇలాంటిదే నాకూ కొనిపెట్టు, బావుంది’ అన్నారు.. నేను షాప్‌ వాళ్ళని అడిగితే ‘టైమ్‌ పడుతుంది’ అన్నారు.. నా టేబుల్‌ మీద మహాప్రస్థానం పెద్ద పుస్తకం చూసి ‘నాకొకటి ఆర్డర్‌ పెట్టు’ అన్నారు.. 

‘గురువు గారూ.... ఆ నల్లని గ్లాస్‌ టేబుల్‌, దానిపైన మీరడిగిన మహాప్రస్థానం పుస్తకం వారం పదిరోజుల్లో రెడీ అంటున్నారు.. ఎప్పుడొచ్చి తీసుకుంటారు?’


                                                                               మీ సమాధానం కోసం ఎదురుచూస్తూ....

                                                                                    లక్ష్మీ భూపాల (సినీ రచయిత)



మా అమ్మలాంటి అమ్మ ఉండదు

నాకూ మా అమ్మ సుబ్బలక్ష్మికి పోలికలు ఎక్కువ. ఒక చెట్టుతోనో, నదితోనో ఆమెను పోల్చవచ్చు. అంత సాధువు. అందుకే మా అమ్మలాంటి అమ్మ ఎవ్వరికీ ఉండదని గర్వంగా చెప్పుకుంటా. సేవ, భక్తి, మంచితనం- ఇలా మనం చెప్పుకొనే గుణాలన్నీ ఆవిడలో ఉన్నాయి. ఆ గుణాలకు అలాంటి పేర్లు ఉంటాయని కూడా ఆమెకి తెలియదు. మాది అనకాపల్లి దగ్గరున్న ఒక చిన్న కుగ్రామం. మా తాతలు మఽధ్యప్రదేశ్‌లో రైల్వేలో పనిచేసేవారు. మేము కూడా అక్కడే ఉండేవాళ్లం. అమ్మ ఎప్పుడూ పనిచేస్తూ ఉండేది. ఒక్కోసారి ఇంట్లో లేకుండా పక్కవాళ్లింటికి వెళ్లి పప్పు రుబ్బి వచ్చేది. ‘వాళ్లు అడగకుండా నువ్వెందుకు చేస్తావు?’ అని అడిగేవాడిని. ‘పాపం ఆవిడకి నడ్డి నొప్పిరా..’ అనేది. ఉదయాన్నే లేచి రాత్రి నిద్రపోయే వరకు ఏదో ఒక పనిచేస్తూ ఉండేది. బహుశా అందుకే ఆమె 78 ఏళ్ల వయసులో కూడా అంత ఆరోగ్యంగా ఉంది. ఆమెకు మా మీద ఆధారపడటం ఇష్టం ఉండదు. ఆమె ఇప్పటి దాకా 29 సార్లు కాశీ వెళి ్లవచ్చింది. ఒక్కసారి కూడా నేను కానీ.. మా తమ్ముడు కానీ తీసుకువెళ్లలేదు. ఇప్పటికీ తన పని తానే చేసుకుంటుంది.


Updated Date - 2021-12-01T05:30:00+05:30 IST