స్వర్ణ స్వరం

Twitter IconWatsapp IconFacebook Icon
స్వర్ణ స్వరం

కాశీకి పోయాను రామాహరి గంగ తీర్ధమ్ము తెచ్చాను రామాహరి

అంచెలంచెలు లేని మోక్షం

విన్నావా నూకాలమ్మా.. 

ఏమిటీ అవతారం... 

రత్తమ్మో రత్తమ్మో 

చక్కనిదానా చిక్కని దానా..

కొత్త పెళ్ళి కూతురా రారా.. 

ఏమయ్యా రామయ్య ఇలా రావయ్యా.. 

లాంటి పాటలు వింటే.. 

ఆ పాటల్లోని చమత్కారానికి, 

ఆ గాత్రంలోని గడుసుతనానికి ఇట్టే నవ్వొస్తుంది.  

ఒకప్పుడు తెలుగు చిత్రాల్లోని ఈ హాస్య గీతాల్ని ఘంటసాల, మాధవపెద్ది, పిఠాపురం, జి.గోపాలం లాంటి ఉద్దండ గాయకులు ఆలపించినప్పటికీ.. వారందరితోనూ గొంతుకలిపిన ఏకైక గాయని మాత్రం స్వర్ణలత. అప్పటి తరానికి ఉత్తేజితమైన పేరు. ఇప్పటి తరానికి స్ఫూర్తి నిచ్చే పేరు. తెలుగు సినిమా స్వర్ణ యుగపు పాటల తోటలో స్వర సౌరభాలెన్నో వెదజల్లిన ఆమె 1950 నుంచి 1970 మధ్యలో ఎన్నో హాస్యగీతాల్ని పాడారు. కేవలం తెలుగులోనే కాకుండా.. తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం ఎన్నో మధురమైన గీతాల్ని ఆలపించారు. నేడు (మార్చ్ 10) ఆమె జయంతి. ఈ సందర్భంగా ఆమె పాటల విశేషాల్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం.. 

స్వర్ణ స్వరం

సినీ స్వర్ణయుగాన విరబూసిన స్వర పుష్పలత 

స్వర్ణలత అసలు పేరు మహాలక్ష్మి. అప్పటి హాస్యనటుడు కస్తూరి శివరావు సిటాడెల్ ప్రొడక్షన్స్ పేరిటి నిర్మించి దర్శకత్వం వహించిన ‘పరమానందయ్య శిష్యులు’ చిత్రంతో స్వర్ణలతను తెలుగు చిత్ర రంగానికి గాయనిగా పరిచయం చేస్తూ ఆవిడ పేరును స్వర్ణలతగా మార్చారు. ఆ తర్వాత అదే ఏడాది విడుదలైన ‘మాయారంభ’ చిత్రంలోనూ శివరావు అవకాశమిచ్చారు. ఆమె పేరుకు తగ్గట్టుగానే మెడనిండా బంగారు నగల్ని అలంకరించుకొని రికార్డింగ్ కు హాజరయ్యేవారు. రెండు చేతులకు నలభై బంగారు గాజులు ధరించడం ఆమెకు ఎంతో ఇష్టం.   

స్వర్ణ స్వరం

స్వర్ణలత మహాలక్ష్మే కాదు సంతాన లక్ష్మి కూడా..

కర్నూలు జిల్లా చాగలమర్రిలో 1928, మార్చ్ 10న జన్మించారు స్వర్ణలత. చిన్నతనంలో ఎనిమిదేళ్ళపాటు సంగీతాన్ని అభ్యసించారు. నాట్యం కూడా నేర్చుకున్నారు. పౌరాణిక నాటకాల్లో పద్యాలు చదువుతూ నటించేవారు. గాత్ర కచేరీలు చేసేవారు. ఆమెకు మొత్తం తొమ్మిది మంది సంతానం. ఆరుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు. పెద్ద కుమారుడు ఆనందరాజ్.. ముద్దుల మామయ్య (గజ ), గ్యాంగ్ లీడర్, బాషా, రాఘవేంద్ర’ లాంటి మరెన్నో చిత్రాల్లో విలన్ గా నటించి మెప్పించారు. ప్రస్తుతం హాస్య పాత్రలు పోషిస్తున్నారు. నలుగురు కొడుకులు అమెరికాలో డాక్టర్లు గా స్థిరపడ్డారు. ఇంకొక కొడుకు డ్యాన్సర్ అనిల్ రాజ్. స్వర్ణలత పిల్లలపై ఎంతో వాత్సల్యం చూపించేవారు. వారి పుట్టిన రోజు వేడుకల్ని ఎంతో ఘనంగా జరిపేవారు. 

1950 లో విడుదలైన ‘మాయారంభ’ చిత్రం నుంచి 1965 లో వచ్చిన ‘సుమంగళి’  చిత్రం వరకూ ఆమె పాడిన దాదాపు 7 వేల పాటలు ఎంతో జనరంజకమయ్యాయి. ఎక్కువగా హాస్య గీతాలు ఆలపించడం వల్లనో ఏమో గానీ ఆమెకి సెస్సాఫ్ హ్యూమర్ కూడా బాగానే ఒంటపట్టింది. ‘మాయారంభ, పెళ్ళి చేసి చూడు, హరిశ్చంద్ర, మాయాబజార్, అత్తాఒకింటి కోడలే, అప్పు చేసి పప్పుకూడు, రాణీ రత్నప్రభ, జగదేకవీరుని కథ, వెలుగునీడలు, కులగోత్రాలు, ఆరాధన, శ్రీకృష్ణార్జున యుద్ధం, గురువును మించిన శిష్యుడు, లక్షాధికారి, చదువుకున్న అమ్మాయిలు, దాగుడు మూతలు, బొబ్బిలి యుద్ధం’ లాంటి చిత్రాల్లో ఆమె పాడిన పాటలు ఇప్పటికీ ఏదో మూల మారుమోగుతునే ఉంటాయి. 

పుట్టిన రోజునాడే మరణం

స్వర్ణలత మాధవపెద్ది, ఏపీ కోమలితో కలిసి అమెరికా, లండన్ లాంటి దేశాల్లో కచేరీలు చేసేవారు. 1997లో కచేరి ముగించుకొని మన దేశం చేరుకున్నాక పెద్ద కుమార్తెను చూడాలనే కోరికతో చిన్న కొడుకు అనిల్ రాజ్ తో కలిసి కార్లో కడప బైలుదేరారు స్వర్ణలత. మార్గమధ్యంలో దోపిడీ దొంగలు కారుపై దాడిచేసి ఆమెను, అనిల్ రాజ్ ను, డ్రైవర్ ను గాయపరిచి.. ఖరీదైన నగలు, పెద్ద మొత్తంలోని నగదుతో పరారయ్యారు. ముగ్గురునీ కడప ఆసుపత్రిలో చేర్పించారు. విషయం తెలుసుకున్న పి.సుశీల, యస్.జానకి హాస్పిటల్ కు వెళ్ళి ఆమెను పరామర్శించేవారు. మార్చ్ 9 సాయంత్రం యస్.జానకి ఫోన్ లో స్వర్ణలతతో కాసేపు మాట్లాడారు. ఆ మర్నాడు స్వర్ణలత  పుట్టిన రోజు కావడంతో స్వయంగా వచ్చి కలుస్తానని చెప్పి జానకి వెళ్ళిపోయారు. ఆ మర్నాడు మార్చ్ 10న పూలబొకేతో హాస్పిటల్ కు చేరిన యస్.జానకి ఆమె మరణ వార్త విని తట్టుకోలేకపోయారు. ఆ సమయంలో ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. అలా పుట్టినరోజు నాడే కన్నుమూసి తెలుగు వారి హృదయాల్లో మధురమైన పాటగా మిగిలిపోయారు స్వర్ణలత.

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

మీకు తెలుసా !..Latest Telugu Cinema Newsమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.