KS Chitra: సాధనతో సాధించారు!

ABN , First Publish Date - 2021-07-27T19:50:18+05:30 IST

దయ, కరుణ, వీరత్వం, భయానకం, రౌద్రం, శృంగారం ఇలా పాట జానర్‌ ఏదైనా ఆ సంగీత, సాహిత్యాలకు ఆమె గొంతు కలిస్తే ఆ పాటను అమృతమనే అనొచ్చు. ఆమే మెలోడీ క్వీన్‌, నైటింగేల్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా కె.ఎస్‌. చిత్ర. మంగళవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా గాయనిగా ఆమె జర్నీని గుర్తు చేసుకుందాం.

KS Chitra: సాధనతో సాధించారు!

‘కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే’ అంటే ప్రియుడి మదిలో ప్రేమ ఉప్పొంగాల్సిందే! 

‘మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది’ పాట చెవిన పడగానే.. స్ఫూర్తి కలగాల్సిందే.

‘ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వానా’ వింటే చిలిపి అల్లరు గుర్తు రావాల్సిందే! 

‘వేణువై వచ్చాను భువనానికి’ పాట వింటే ఎలాంటి హృదయమైనా ద్రవించాల్సిందే!

‘అసలేం గుర్తుకురాదు’ అంటే శృంగార భావన కలగాల్సిందే....

పాటలు ఎన్నైనా.. వీటి వెనకున్న గొంతు ఒక్కరిదే.

ఆమె స్వరం మాధుర్యాన్ని పంచుతుంది. ఆమె పాటలో ప్రశాంతత ఉంటుంది. 

దయ, కరుణ, వీరత్వం, భయానకం, రౌద్రం, శృంగారం ఇలా పాట జానర్‌ ఏదైనా ఆ సంగీత, సాహిత్యాలకు ఆమె గొంతు కలిస్తే ఆ పాటను అమృతమనే అనొచ్చు. ఆమే మెలోడీ క్వీన్‌, నైటింగేల్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా కె.ఎస్‌. చిత్ర. మంగళవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా గాయనిగా ఆమె జర్నీని గుర్తు చేసుకుందాం.


కేరళలోని ట్రివేండ్రమ్‌లో సంగీత కళాకారుల కుటుంబంలో చిత్ర జన్మించారు. ఆమె తండ్రి కృష్ణన్‌ నాయర్‌ చిత్రకు తొలి గురువు. సంగీత గురువు ఓమనకుట్టి అన్నయ్య ఎంజీ రాధాకృష్ణన్‌ 1979లో ఓ ప్రైవేట్‌ ఆల్బమ్‌లో చిత్రతో పాడించారు. అయితే అది విడుదల కాలేదు. 1982లో మరోసారి అవకాశం ఇచ్చారు. అది కె.జె ఏసుదాసుతో పాడిన పాట. ఆ పాట విడుదలయ్యాక ఏసుదాసుతో ఎవరో చిన్న పిల్ల పాడిందట అనే విమర్శలొచ్చాయి. పెద్ద సింగర్‌లతో పాడటానికి పనికిరాదు అనే మార్కు వేశారు. అయితే ఇళయరాజా అవేమీ పట్టించుకోకుండా తన సినిమాలో పాడే అవకాశం ఇచ్చారు. అనువాద చిత్రం ‘సింధు భైరవి’ సినిమాలో ‘పాడలేను పల్లవైనా’ పాటతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమాయ్యరు చిత్ర. నాటి నుంచి నేటి వరకూ  తన పాటలతో అలరిస్తూనే ఉన్నారు. సంగీత ప్రపంచంలో అడుగుపెట్టి ఓ వంద పాటలు పాడేశాం.. రావలసిన దానికంటే ఎక్కువ గుర్తింపే వచ్చింది ఇక చాలు’ అన్న ఆలోచన కొంచెం కూడా రానివ్వకుండా ఇప్పటికీ నిత్య విద్యార్థిలా సాధన చేస్తుంటారు. ఎంచుకున్న వృత్తి పట్ల నిబద్ధత, ప్యాషన్‌ ఇంకా ఏదో సాధించాలనే తపనతో ఎదిగారు చిత్ర. సుశీలమ్మ, జానకమ్మ అగ్ర స్థానంలో ఉన్న సమయంలో డిఫరెంట్‌ వాయిస్‌తో సంగీత ప్రియులను ఆకట్టుకున్నారు చిత్ర. గాయనిగా 42 ఏళ్ల కెరీర్‌లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఒడియా, తుళు, బెంగాలీ వివిధ భాషల్లో 25 వేలకు పైగా పాటలు పాడారు ఈ మెలోడీ క్వీన్‌. అరబిక్ లో కూడా చిత్ర ఒక పాట పాడారు.


విమర్శల్ని పట్టించుకోలేదు.. 

కెరీర్‌ బిగినింగ్‌లో చిత్ర పాటల్లో మలయాళ వాసన తగులుతుందనే విమర్శలు ఎదురయ్యాయి. గాయనిగా నిలదొక్కుకోవడం కష్టం అన్న మాటలూ వినిపించాయి. మృదు స్వభావం గల చిత్ర ఆ విమర్శలకు కుంగిపోలేదు. సవాల్‌గా తీసుకుని తెలుగు నేర్చుకుని పదాలపై పట్టు సాధింది పాడేవారు. అలాగే ఏ భాషలో పాడిన పదాలను నేర్చుకోవడం, భాషకు తగ్గట్లు తనని తను మలుచుకోవడంతో పాడడం పట్ల చిత్రకు ఉన్న ప్యాషన్‌ ఏంటో తెలుస్తుంది. అప్పట్లో సీనియర్‌ సింగర్లు కె.జె.ఏసుదాసు, ఎస్‌.పి.బాలు, సుశీల, జానకీలతోపాటు ఇళయరాజా, కోటి, ఏ.ఆర్‌.రెహమాన్‌ వంటి సంగీత దర్శకులు ‘కొత్తగా వచ్చిన అమ్మాయి బాగా పాడుతుంది’ అంటూ చిత్రకు సపోర్ట్‌గా నిలిచారు. తన కృషితోపాటు సాటి గాయనీగాయకుల ప్రోత్సాహంతో చిత్ర లెజండరీ సింగర్‌ అయిందని చెబుతుంటారు. చిత్ర ఎక్కిన ప్రతి మెట్టులోనూ ఇళయరాజా సపోర్ట్‌ ఉందనేది తెలిసిందే! 


1000 పాటల జాబితాలో...

‘రోజా’ సినిమాలోని ‘నాగమణీ.. నాగమణీ’ పాటను ఎ.ఆర్‌.రెహమాన్‌తో చిత్ర కాంబినేషన్‌ సెట్‌ అయింది. ఈ కలయికలో వచ్చిన వందల పాటలు సూపర్‌హిట్టే. బొంబాయి’ సినిమాలోని ‘కన్నానులే కలలు’ అంటూ సాగే సూఫీ సాంగ్‌నే ‘చనిపోయేలోపు వినాల్సిన 1000 పాటల జాబితాలో చేర్చింది ఓ ఆంగ్ల పత్రిక. ‘ఈ కాంబినేషన్‌కి దక్కిన పెద్ద గౌరవంగా చిత్ర చెబుతుంటారు. మణిశర్మ, కీరవాణి, కోటి, దేవిశ్రీప్రసాద్‌, తమన్‌, మిక్కీజె.మేయర్‌ వంటి సంగీత దర్శకులతోనూ చిత్ర పనిచేశారు. హీరోకి బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టు బాలు ఎలాగైతే పాడేవారో... అలాగే చిత్ర కూడా హీరోయిన్‌కి తగ్గట్లు పాడుతుంటారు. ఒకానొక సమయంలో ఒక్క రోజుల్లో చిత్ర 16 పాటలు రికార్డ్‌ చేశారట. అలసిపోయి ఇంటికి వస్తే తన తల్లి ‘ఆరోగ్యం గురించి కూడా చూసుకోవాలి కదమ్మా’ అని తిట్టారట. చిత్ర సినిమా పాటలు పాడాలనే కోరిక ఆమె తండ్రిది. అయితే ఆమె జాతీయ అవార్డు తీసుకునే సమయంలో కేన్సర్‌తో బాధపడుతున్న తన తండ్రి రాలేకపోవడం చాలా బాధ కలిగించిందని భావోద్వేగానికి లోనయ్యారు. 



’తెలుగు పాటతో మొదటి నంది అవార్డు...

‘సీతారామయ్యగారి మనవరాలు’లో ‘కలికి చిలకల కొలికి మాకు మేనత్త’ పాటతో చిత్ర తొలి నంది అవార్డు అందుకున్నారు. ఇప్పటికీ ఆమెను 11 నందులు వరించాయి. 2005 పద్మశ్రీ పురస్కారం స్వీకరించిన చిత్ర ఈ ఏడాది  పద్మభూషన్‌ అందుకున్నారు. అయితే అవార్డులు వచ్చినప్పుడు పొంగిపోవడం, విమర్శలు వచ్చినప్పుడు కుంగిపోవడం ఆమెకు అలవాటు లేదు. పైగా ఆమెకు ఓ సెంటిమెంట్‌ ఉంది. ఓవర్‌ ఎగ్జైట్‌ అయిన ప్రతిసారి ఏదో ఒక చెడు జరుగుతుందనే భయం ఆమెను కొంతకాలంగా వెంటాడుతుందట. అందుకే ఆమె ఎప్పుడూ ఎగ్జైట్‌ కానని చెబుతుంటారు. 


కడుపు కోత ఇప్పటికీ మరచిపోలేదు...

చిత్రకు పెళ్లైన చాలా కాలానికి నందన జన్మించింది. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. దుబాయ్‌లో ఎ.ఆర్‌.రెహమాన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఓ కాన్సెర్ట్‌కు వెళ్లిన చిత్ర తన బిడ్డను వెంట తీసుకెళ్లారు. అక్కడ స్విమ్మింగ్‌ పూల్‌లో పడి చిత్ర తనయ మరణించింది. ఇప్పటికీ తను మరణించిన రోజును తలుచుకుంటూ చిత్ర రోదిస్తుంటారు. ఈ కడుపు కోత ఎప్పటికీ తీరేది కాదని ఆమె అంటారు. 


సేవా కార్యక్రమాలు ఎక్కువే...

1995లో చిత్ర ఆడియో ట్రాక్స్‌ మ్యూజిక్‌ కంపెనీ ప్రారంభించారు. నాన్‌ ఫిల్మ్‌ ఆల్బమ్స్‌, చిత్ర చేసే ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ను ఈ సంస్థ ప్రొడ్యూస్‌ చేస్తుంది. అలాగే రిటైర్‌ అయిన మ్యుజీషియన్స్‌ కోసం తన కూతురు స్నేహ నందన పేరుతో ఓ ఫౌండేషన్‌ ప్రారంభించి వారికి సహాయం చేస్తున్నారు. 












Updated Date - 2021-07-27T19:50:18+05:30 IST