సిల్కే శృంగారమాయెనే
ABN , First Publish Date - 2022-12-03T06:46:57+05:30 IST
స్మిత అసలు పేరు విజయలక్ష్మి. ఏలూరు దగ్గరున్న కొవ్వలి స్వగ్రామం. 1960 డిసెంబర్ 2న నిరుపేద రైతుకుటుంబంలో శ్రీరామమూర్తి, నరసమ్మ దంపతులకు జన్మించింది...

స్మిత అసలు పేరు విజయలక్ష్మి. ఏలూరు దగ్గరున్న కొవ్వలి స్వగ్రామం. 1960 డిసెంబర్ 2న నిరుపేద రైతుకుటుంబంలో శ్రీరామమూర్తి, నరసమ్మ దంపతులకు జన్మించింది. దగ్గర బంధువు అన్నపూర్ణమ్మ దత్తత తీసుకోవడంతో విజయలక్ష్మి మకాం ఏలూరుకు మారింది. చిన్నతనం నుంచీ విజయలక్ష్మి కి సినిమాలంటే తెగపిచ్చి. అందుకే సినిమాల్లో రాణించాలని కోరికతో, 18 ఏళ్ల వయసులో తల్లిని వెంటబెట్టుకొని మద్రాస్ చేరుకొంది. ‘ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్’ అంటూ చాలామంది నిర్మాతలను కలసి అభ్యర్ధించింది. అయితే ఏ నిర్మాతకీ ఆమెలో నిద్రాణంగా ఉన్న నటి కనిపించలేదు. నీ మొహంలో గ్లామర్ లేదన్నారు. నీకు వేషాలు ఇస్తే ఇక అంతే సంగతులు అన్నవారూ ఉన్నారు. మొత్తానికి అందరు కలసి ఆమె నటిగా పనికిరాదని తేల్చేశారు.. మరొకరైతే ఆ అవమానాన్ని తట్టుకోలేక సొంతూరికి తిరిగి వెళ్ళిపోయేవారేమో. కానీ విజయ అలాంటి వ్యక్తి కాదు. చావో రేవో మద్రాసులో నే అని గట్టిగా అనుకుని తన ప్రయత్నాలు మాత్రం ఆపలేదు.
నిజం చెప్పాలంటే హీరోయిన్ కు కావాల్సిన అందచందాలు అప్పట్లో విజయలక్ష్మికి లేవు. ఆమె నల్లగా, బొద్దుగా ఉండేది. పైగా మాట్లాడడం కూడా సరిగ్గా రాదు. కానీ ఆమెలో ఏదో తెలియని ఆకర్షణ ఉండేది. హీరోయిన్ కు కావాల్సిన నాజూకు లక్షణాలు విజయలక్ష్మిలో లేకపోవడం, నల్లగా ఉండడం ఆమెకు మైనస్ అయింది. అయినా ప్రయత్నాలు ఆపలేదు. ఇంట్లో ఊరికే ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేక జూనియర్ ఆర్టి్‌స్టగా నటించడానికి కూడా సిద్ధపడింది. తన పేరును విజయగా కుదించుకొని కొన్ని చిత్రాల్లో గుంపులో గోవిందా వేషాలు వేసింది. ‘నీకు ఇంతకన్నా గొప్ప వేషాలు ఎవరు ఇస్తారు’ అనే వారి మాటలు పట్టించుకునేది కాదు. భవిష్యతు మీద మాత్రం ఎంతో ఆశ తో ఉండేది. సరిగ్గా అలాంటి సమయంలోనే మలయాళంలో నటించే అవకాశం విజయకు వచ్చింది. మలయాళ దర్శక నిర్మాతలకు భాషతో, టాలెంట్ తో పనిలేదు. అందాలు ఆరబోయడానికి వెనుకాడని యువతులు కావాలి. అంతే. పూర్తిగా సెక్స్ అప్పీల్ ఉన్న ఆ పాత్ర పోషించడానికి విజయ మొదట తటపటాయించింది. తెలుగు లో ఎవరూ అవకాశాలు ఇవ్వడం లేదు. వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి.. అంతా నటనే అయినపు ్పడు పరిధులు, హద్దులు ఎందుకు అనుకుని విజయ తెగించేసింది . విలువల తో పాటు వలువలు వదిలేసింది . అంతే తొలి మలయాళ చిత్రం తోనే విజయ అందరినీ ఆకట్టు కొంది. తమిళ నిర్మాతల దృష్టి కూడా ఆమెమీద పడింది.
తమిళం లో విజయ నటించిన తొలి చిత్రం ‘వండి చక్రం’. ఆ సినిమాతో విజయ పేరే కాదు ఆమె జాతకం కూడా మారిపోయింది. ‘సిల్క్ స్మిత’గా సెక్సీ డాన్సులతో ముందుకు వచ్చిన విజయను చూసి ప్రేక్షకులు పిచ్చెక్కి పోయారు. ‘వండి చక్రం’ సినిమాను తెలుగులో ‘ఘరానా గంగులు’ పేరుతో రీమేక్ చేశారు. శోభన్ బాబు హీరో. తమిళంలో చేసిన పాత్రనే తెలుగులో కూడా స్మిత పోషించింది. నిషా కళ్ళతో సెక్సీగా కనిపించిన స్మితకు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఇక అప్పటినుంచి హీరో ఎవరైనా సినిమాలో స్మిత డాన్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే.. అది ప్రేక్షకుల, డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్ కావడంతో నిర్మాతలు నోరెత్తకుండా పాటించేవారు.
ఒకప్పుడు స్మిత నిర్మాతల చుట్టూ తిరిగింది. ‘చిన్న వేషమైనా ఇవ్వండి ప్లీజ్’ అని బతిమాలింది. కానీ ఎవరూ ఆమెను పట్టించుకోలేదు. నటిగా ఆమె ఎదిగిన తర్వాత ఆ నిర్మాతలే ఆమె చుట్టూ తిరగడం ప్రారంభించారు. కేవలం ఓ డాన్స్ సీన్ కోసం స్మిత 50 వేల రూపాయలు డిమాండ్ చేసినా ‘అంత రేటా’ అని ఎవరూ వెనక్కి పోలేదు మాకు కాల్షీట్లు ఎప్పుడు ఇస్తావు అని మాత్రమే అడగడం స్మితకు ఉన్న డిమాండ్ కు ఒక నిదర్సనం. 1981 నుంచి 1996 వరకు స్మిత కెరీర్ ఉజ్వలంగా వెలిగిపోయింది. తెలుగులోనే కాదు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 450 కి పైగా చిత్రాల్లో నటించింది కాదు కాదు నర్తించింది. ఇంత సుదీర్ఘమైన కెరీర్ కలిగిన లేడీ డాన్సర్ మరెవరు లేరు
కొంతమంది జీవిత కధలను పరిశీలిస్తే ఇది నిజమేనా అనిపిస్తుంది. ఇంతలో ఇంత మార్పు సాధ్యమేనా అని కూడా అనిపిస్తుంది. కానీ సిల్క్ వంటి కొంతమంది తారల గురించి విన్నప్పుడు చిత్ర పరిశ్రమలో ఎలాంటి విచిత్రమైనా జరగవచ్చు అనిపిస్తుంది.