సినిమా రివ్యూ : శ్యామ్ సింగరాయ్

ABN , First Publish Date - 2021-12-24T21:02:52+05:30 IST

చురల్ స్టార్ నానీ గత చిత్రాలు ‘వి, టక్ జగదీష్’ రెండూ ఓటీటీలో విడుదలయ్యాయి. అందుకే నానీ తదుపరి చిత్రం శ్యామ్ సింగరాయ్ థియేటర్స్ లో భారీ ఎత్తున విడుదలవుతుండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇండియా స్థాయిలో ఈ చిత్రం ఈ రోజే (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన ఈ సినిమా వారి అంచనాల్ని ఏ మేరకు నిలబెట్టింది? ఈ సినిమా ప్రత్యేకతలేంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే.. రివ్యూలోకి వెళ్ళాల్సిందే.

సినిమా రివ్యూ : శ్యామ్ సింగరాయ్

చిత్రం : శ్యామ్ సింగరాయ్ 

విడుదల తేదీ : 24 డిసెంబర్ 2021

నటీనటులు : నానీ, సాయిపల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్, మురళీ శర్మ, జిషు సేన్ గుప్తా, రాహుల్ రవీంద్ర, శుభలేఖ సుధాకర్ తదితరులు 

సంగీతం : మిక్కీ జే మేయర్ 

సినిమాటోగ్రఫీ : సను జాన్‌వర్గీస్

ఎడిటింగ్ : నవీన్ నూలి

నిర్మాణం : నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ 

కథ : సత్యదేవ్ జంగా

స్ర్కీన్ ప్లే దర్శకత్వం : రాహుల్ సాంకృత్యన్ 

నేచురల్ స్టార్ నానీ గత చిత్రాలు ‘వి, టక్ జగదీష్’ రెండూ ఓటీటీలో విడుదలయ్యాయి. అందుకే నానీ తదుపరి చిత్రం శ్యామ్ సింగరాయ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో చిత్రం ఈ రోజే (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలకు ముందే ఆసక్తిని పెంచిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాల్నిఏ మేరకు నిలబెట్టింది? ఈ సినిమా ప్రత్యేకతలేంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే.. రివ్యూలోకి వెళ్ళాల్సిందే.


కథ

ఘంటా వాసుదేవ్ (నానీ) మంచి అభిరుచి కలిగిన ఫిల్మ్ మేకర్. ముందుగా ఓ మంచి షార్ట్ ఫిల్మ్ తీసి.. ఆపై సినిమా ఛాన్సులు అందుకొవాలనే దృఢ నిశ్చయంతో షార్ట్ ఫిల్మ్ కోసం ఆడిషన్స్ మొదలు పెడతాడు. కానీ తన కథకు తగ్గ అమ్మాయి ఎవరూ దొరకరు. అయితే ఒక కాఫీ షాప్ లో చూసిన శ్రుతి (కృతి శెట్టి)  అనే అందమైన అమ్మాయిని  తన షార్ట్ ఫిల్మ్ కు హీరోయిన్ అని ఫిక్స్ అయిపోతాడు. దీనికి ఎంత మాత్రం అంగీకరించని ఆ అమ్మాయి చేత ఎలాగైతేనేం ఓకే అనిపించుకొని ఆమెతో షార్ట్ ఫిల్మ్ తీస్తాడు.  దానికి మంచి పేరు రావడంతో వాసుదేవ్ రాసిన ఆ కథను సినిమాగా తీయడానికి ముందుకొస్తాడు ఒక ప్రొడ్యూసర్. ‘ఊనికి’ పేరుతో విడుదలైన ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది. దాంతో ఆ సినిమాకు బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి వాసుదేవ్ కి ఆఫర్ వస్తుంది. ఆ సినిమా అనౌన్స్ మెంట్ రోజున వాసుదేవ్ ను పోలీసులు కాపీ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తారు. వాసుదేవ్ ఎప్పుడో 50 ఏళ్ళ క్రితం ‘శ్యామ్ సింగరాయ్’ అనే బెంగాలి రచయిత రాసిన కథను మక్కికి మక్కీ కాపీ కొట్టి దాన్నే సినిమాగా తీశాడని ‘శ్యామ్ సింగరాయ్’ వారసులు అతడి మీద కేసు పెడతారు. కానీ వాసుదేవ్ తనకి బెంగాలీ రాదని,  ఈ కథను తన సొంత ఆలోచనలతోనే రాసుకున్నానని, లై డిటెక్షన్ టెస్ట్ కి కూడా తను సిద్ధమని చెబుతాడు.   టెస్ట్ లో వాసుదేవ్ నిజమే చెప్పాడని రుజువవుతుంది. అయినా సరే అది సాక్ష్యంగా చెల్లదంటారు. ఇంతకీ శ్యామ్ సింగరాయ్ ఎవరు?  అతడికి, వాసుదేవ్ కి ఉన్న లింకేంటి? చివరికి వాసుదేవ్ ఆ కేస్ లో ఎలా గెలిచాడు? అన్న విషయాలు రివ్యూలో చూద్దాం. 


విశ్లేషణ 

పునర్జన్మలపై గతంలో చాలా సినిమాలొచ్చాయి. ‘మగధీర’ లాంటి సినిమాలు ఈ తరం ప్రేక్షకుల్ని కూడా అలరించాయి. ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా కూడా ఇదే కథాంశంతో రూపొందింది. అయితే లైన్ అదే అయినా.. తన స్ర్కీన్ ప్లే బ్రిలియన్సీతో ఆసక్తికరమైన ట్రీట్‌మెంట్ తో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు రాహుల్. ఫస్టాఫ్ అంతా వాసుదేవ్ అనే ఫిల్మ్ మేకర్ పాత్రతో వినోదాత్మకమైన సన్నివేశాలతో కథను నడిపించి .. సెకండాఫ్ అంతా ‘శ్యామ్ సింగరాయ్’ పాత్రను ఎలివేట్ చేస్తూ ఆసక్తికరమైన సన్నివేశాలతో మెప్పించాడు. నిజం చెప్పాలంటే..  సినిమా టైటిల్ కు జెస్టిఫికేషన్ ఈ పాత్రతోనే అద్భుతంగా ఇచ్చాడు. ఆ పాత్ర చుట్టూ అల్లుకున్న సన్నివేశాలన్నీ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. వాసుదేవ్ పాత్రని గతంలోకి తీసుకెళ్తూ.. ‘శ్యామ్ సింగరాయ్’ పాత్ర  ఎంట్రీ ఇవ్వడం.. బెంగాల్ వాతావరణంలో ప్రజల హక్కు కోసం పోరాటం, రోసీ (సాయిపల్లవి) అనే పాత్ర పరిచయం, ఆమె చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు, విప్లవ రచయితగా మారి గొప్పవాడైన తీరు అద్బుతం అనిపించకమానదు. తను చెప్పాలనుకున్న కథను ఎక్కడా డీవియేషన్స్ లేకుండా.. ప్రేక్షకుల్లో ఆసక్తి సడలకుండా.. సినిమాను ఆద్యంతం రక్తికట్టించాడు.  క్లైమాక్స్ లో వచ్చే కోర్ట్ సీన్ అయితే.. సినిమాకిదే బెస్ట్ ముగింపు అనిపిస్తుంది. బెంగాలీ బ్యాక్ డ్రాప్ లోని కథైనా.. బెంగాల్ డైలాగ్స్ వచ్చిన చోట తెలుగు సబ్ టైటిల్స్ వేస్తూ ఆడియన్స్ అంటెన్షన్ ను సినిమావైపే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. 


వాసుదేవ్ గా, శ్యామ్ సింగరాయ్ గా రెండు వేరియేషన్స్ చూపిస్తూ నానీ చెలరేగిపోయాడు. ముఖ్యంగా శ్యామ్ సింగరాయ్ పాత్రలో అయితే నట విశ్వరూపమే చూపించాడు. నానీ కెరీర్ లో ఇదే ది బెస్ట్ కేరక్టర్ అని చెప్పాలి. బెంగాలీ వ్యక్తిగా ఆయన అభినయం, ఆహార్యం, ఆంగికం, వాచకం మెప్పిస్తాయి. ఇక సాయిపల్లవి పోషించిన మైత్రేయ ( రోజీ) పాత్ర గురించి ఏం చెప్పాలి? మామూలు కేరక్టర్ అయితేనే చెలరేగిపోయే ఆమె .. దేవదాసి లాంటి అరుదైన పాత్ర దొరికితే ఇంకెన్ని అద్భుతాలు చేస్తుంది. అలాంటి అవకాశం ఈ సినిమాలో దొరికింది ఆమెకి. అద్భుతమైన నటన తో ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేసింది.  సినిమా చూస్తున్నంత సేపు సాయిపల్లవి ఎక్కడా కనిపించదు. మైత్రేయ (రోసీ) పాత్రే కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రణవ లయ అనే పాటలో అయితే ఆమె నాట్యం, అభినయం ప్రేక్షకుల్ని మెప్పి్స్తాయి. అలాగే శ్రుతి పాత్రలో కృతి శెట్టి అందం, అభినయం ఆకట్టుకుంటాయి. ఇక ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన మరో మంచి పాత్ర రాహుల్ రవీంద్రది. శ్యామ్ సింగరాయ్ చిన్న అన్నయ్యగా గుర్తుండిపోయే పాత్ర పోషించారు. అలాగే.. ఈ సినిమా క్లైమాక్స్ కి అతడి పాత్ర చాలా కీలకం. ఆ పాత్రకి ఏరికోరి అతడ్నే ఎన్నుకొన్నందుకు దర్శకుడ్ని అభినందించాలి.  మిక్కీ జె మేయర్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటాయి. అలాగే. సినిమాటోగ్రఫీ కూడా మెప్పిస్తుంది. ఇక ఈ సినిమాకి సంబంధించి మరో ముఖ్యమైన అంశం ఆర్ట్ డిపార్ట్ మెంట్. బెంగాలీ నేపథ్యంలోని సెట్స్ ఈ సినిమాకే హైలైట్. కోల్ కత్తాలో కొంత పార్టే చిత్రీకరించినా.. అత్యధిక శాతం హైద్రాబాద్ లో వేసిన సెట్స్ లోనే చిత్రీకరించడం విశేషం. ముఖ్యంగా విజయదశమి రోజున కాళికా మాత విగ్రహం బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఫైట్ సీన్ సినిమాకే హైలైట్. మొత్తం మీద శ్యామ్ సింగరాయ్ సినిమా నానీ కెరీర్ లో క్లాసిక్ అనదగ్గ సినిమా అని చెప్పుకోవచ్చు. ఆ పాత్రతో ముడిపడి ఉన్న సన్నివేశాలన్నీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. 

ట్యాగ్ లైన్ : నానీకి పునర్జన్మ 

Updated Date - 2021-12-24T21:02:52+05:30 IST