Shooting Bandh: ‘మా’ భరోసా ఏది?

ABN , First Publish Date - 2022-08-03T00:06:10+05:30 IST

ఇన్నేళ్ల తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్నడూ లేనిది.. తొలిసారి స్వయంగా నిర్మాతలే షూటింగ్స్ బంద్‌కు పిలుపు నిచ్చి.. రిపేర్లు మొదలెట్టారు. ఒకప్పుడు సినిమా అంటే నిర్మాత చెప్పినట్టే జరిగేది. ఆ తర్వాత దాసరి నారాయణరావు (Dasari Narayana Rao), రాఘవేంద్రరావు..

Shooting Bandh: ‘మా’ భరోసా ఏది?

ఇన్నేళ్ల తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్నడూ లేనిది.. తొలిసారి స్వయంగా నిర్మాతలే షూటింగ్స్ బంద్‌కు పిలుపు నిచ్చి.. రిపేర్లు మొదలెట్టారు. ఒకప్పుడు సినిమా అంటే నిర్మాత చెప్పినట్టే జరిగేది. ఆ తర్వాత దాసరి నారాయణరావు (Dasari Narayana Rao), రాఘవేంద్రరావు (Raghavendra Rao) వంటి వారు మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు వారి హవా మొదలైంది. దర్శకుడు కెప్టెన్ ఆఫ్ ది షిప్‌గా మారిపోయాడు. ఆ తర్వాత ఇండస్ట్రీ.. హీరోల చేతిలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ‘పాన్ ఇండియా’ (Pan India) క్రేజ్ నడుస్తుండటంతో.. సినిమాకి సంబంధించి నిర్మాణ వ్యయం కూడా అధికం కావడం, నిర్మాణ వ్యయమే కాకుండా.. ఇతరత్రా ఖర్చులు కూడా పెరిగిపోవడంతో.. ఒకటి రెండు సినిమాలు మినహా.. తీసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూస్తుండటంతో.. చేసేది లేక నిర్మాతలంతా ఒక్కటై.. ఇప్పుడు టాలీవుడ్‌(Tollywood)లో రిపేర్లు మొదలెట్టారు. ఈ నేపథ్యంలో షూటింగ్స్ బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్ ఎలా జరుగుతుందీ అనేది పక్కన పెడితే.. టాలీవుడ్‌లో ఈ ప్రభావంతో చాలా వరకు షూటింగ్స్ మాత్రం ఆగిపోయాయి. అయితే నిర్మాత సైడ్ నుంచి ఫస్ట్ రిపేర్.. హీరోల, ఇతర నటీనటుల రెమ్యూనరేషన్‌పై అనేది ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. 


‘మా’ ఎన్నికల తర్వాత.. హెల్త్‌ చెకప్‌కి సంబంధించి ఏదో రెండు మూడు అప్‌డేట్స్ మినహా..  మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ (Movie Artistes Association) తరపు నుంచి ఎటువంటి వర్క్ జరుగుతున్నట్లుగా అయితే సమాచారం లేదు. అదేమంటే, మీడియాకి చెప్పాల్సిన అవసరం లేదని, ఇది ‘మా’దని కబుర్లు చెబుతుంటారు. ఇంతకు ముందు టికెట్ల రేట్ల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నప్పుడు కూడా.. అది ‘మా’కు సంబంధించిన వ్యవహరం కాదని  సైలెంట్‌గానే ఉంది తప్ప.. ముందుకు వచ్చి బాధ్యత తీసుకోలేదు. అలాగే ఎన్నికలప్పుడు ఇచ్చిన ‘మా’ ప్రత్యేక భవనం హామీ ఎంత వరకూ వచ్చిందో తెలియదు. ‘మా’ భవనం గురించి మీడియా ఎప్పుడైనా లేవనెత్తితే.. అప్పుడేదో హడావుడి చేయడం తప్ప.. ఆ వ్యవహారం ఎంత వరకు వచ్చిందీ అనేది క్లారిటీ లేదు. తాజాగా ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ (Open Heart with RK)లో పాల్గొన్న సహజనటి జయసుధ (Jayasudha) కూడా ‘మా’ బిల్డింగ్ నిమిత్తం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా 25 సంవత్సరాలైనా అది పూర్తవుతుందో.. లేదో అన్నట్లుగా ఆమె మాట్లాడారు. అదలా ఉంటే, ఇప్పుడు నటీనటుల రెమ్యూనరేషన్ పరంగా నిర్మాతలు డైరెక్ట్‌గా హీరోలతో మంతనాలు జరపడం ఏమిటో.. ఈ విషయమై ‘మా’ అసోసియేషన్ ఎందుకు భరోసా ఇవ్వలేకపోతుందో..  అనేది ఆ అసోసియేషన్ పెద్దలకే తెలియాలి. అసోసియేషన్‌లో ఉన్న నటీనటులందరితో చర్చలు జరిపి.. ‘మా’ తరపు నుండి నిర్మాతలకు ఎందుకు భరోసా ఇవ్వలేకపోతున్నారు? నటీనటుల రెమ్యూనరేషన్ వ్యవహారం కూడా.. ‘మా’కెందుకులే ఇది మా సమస్య కాదు అని ‘మా’ పక్కన పెట్టేసిందా? అనే సందేహాలు వ్యక్తమవుతుండటం గమనార్హం. 


నిర్మాత దిల్ రాజు (Dil Raju), హీరోలు తమ రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలంటూ రామ్ చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (NTR), అల్లు అర్జున్‌(Allu Arjun)లను సంప్రదించినట్లుగా.. వారు అందుకు సుముఖత వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అంతే కాదు, ఇతర హీరోలతో రెమ్యూనరేషన్ తగ్గించే విషయమై.. రామ్ చరణ్ స్వయంగా మంతనాలు జరుపుతానని మాటిచ్చినట్లుగా కూడా ఇండస్ట్రీ వర్గాల నుండి బయటికి వచ్చింది. అయితే.. హీరోలైనా, ఇతర ఆర్టిస్టులెవరైనా.. రెమ్యూనరేషన్ పరంగా ‘మా’ (MAA) ఇంత వరకు ఈ విషయంలో స్పందించకపోవడం కొందరు విశేషంగా చెప్పుకుంటున్నారు. మరి ఇలాంటి విషయాలలో కూడా ‘మా’ ఇన్‌వాల్వ్ కానప్పుడు.. అసలెందుకీ అసోసియేషన్ అనేలా.. కొందరు నటీనటులు కూడా కామెంట్స్ చేస్తున్నారంటే.. ఈ విషయాలేవీ ‘మా’కి పట్టవా? కేవలం ‘మా’ ఎన్నికల సమయంలోనేనా హడావుడి అంతా? అందుకేనా అసోసియేషన్.. అనేలా కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతున్నాయి.

Updated Date - 2022-08-03T00:06:10+05:30 IST