‘షూట్ ఎట్ సైట్(ఉత్తర్వు)’ రివ్యూ

ABN , First Publish Date - 2020-04-19T02:00:02+05:30 IST

మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాల‌ను ఆద‌రించ‌డంలో మ‌న ప్రేక్ష‌కులు ఎప్పుడూ ముందుంటారు. అందుక‌నే ప‌ర‌భాషా చిత్రాల‌ను తెలుగులోకి అనువాదం చేసి విడుద‌ల చేస్తుంటారు. ఆ కోవ‌లో గ‌త ఏడాది జూన్‌లో త‌మిళంలో...

‘షూట్ ఎట్ సైట్(ఉత్తర్వు)’ రివ్యూ

న‌టీన‌టులు:  విక్రాంత్‌, అతుల్య ర‌వి, మిస్కిన్‌, సుశీంద్ర‌న్‌, జేకే రితేష్‌, మ‌హిమ త‌దిత‌రులు

ద‌ర్శ‌క‌త్వం:  రామ్ ప్ర‌కాశ్ రాయ‌ప్ప‌

నిర్మాత‌:  రాజ‌శేఖ‌ర్ అన్న‌భీమోజు

సినిమాటోగ్ర‌ఫీ:  సుజిత్ సారంగ్‌

సంగీతం:  జేక్స్ బిజోయ్‌

ఎడిటింగ్‌:  జి.రామారావు

విడుద‌ల‌:  అమెజాన్ ప్రైమ్‌


మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాల‌ను ఆద‌రించ‌డంలో మ‌న ప్రేక్ష‌కులు ఎప్పుడూ ముందుంటారు. అందుక‌నే ప‌ర‌భాషా చిత్రాల‌ను తెలుగులోకి అనువాదం చేసి విడుద‌ల చేస్తుంటారు. ఆ కోవ‌లో గ‌త ఏడాది జూన్‌లో త‌మిళంలో విడుద‌లైన ‘సుట్టు పిడిక్క ఉత్త‌ర్వు’ సినిమాను తెలుగులోకి ‘షూట్ ఎట్ సైట్‌(ఉత్త‌ర్వు)’ పేరుతో రీమేక్ చేశారు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో సినిమా థియేటర్స్ బంద్ అయ్యాయి. లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ కార‌ణంగా సినిమాను డిజిట‌ల్ మాధ్య‌మం అయిన అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌ల చేశారు. థియేట‌ర్స్ అందుబాటులోకి లేక‌పోవ‌డంతో ప్రేక్ష‌కులు డిజిట‌ల్ మాధ్య‌మంలోనే సినిమాల‌ను ఎక్కువ‌గా చూస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో ‘షూట్ ఎట్ సైట్’ చిత్రాన్ని ప్రేక్ష‌కులు అమెజాన్‌లో వీక్షించ‌వ‌చ్చా?  సినిమా  ప్రేక్ష‌కుల‌ను ఎలా మెప్పించింది? అనే సంగ‌తులు తెలుసుకోవాలంటే క‌థ‌లోకి వెళ‌దాం...


కథ:

అశోక్‌(విక్రాంత్), సెల్వ‌(సుశీంద్ర‌న్‌) స‌హా మ‌రో ఇద్ద‌రు స్నేహితులు క‌లిసి పెద్ద మాల్‌లో ఉండే బ్యాంకులో డ‌బ్బును దొంగిలిస్తారు. దాంతో వారిని పోలీసులు వెంబ‌డిస్తారు. వారు అక్క‌డి నుండి త‌ప్పించుకుని ద‌గ్గ‌రలో ఉండే  స్ల‌మ్ ఏరియాలోకి పారిపోతారు. దాంతో పోలీసులు ఆ ఏరియానంత‌టినీ లాక్‌డౌన్ చేస్తారు. దొంగ‌త‌నం చేసినవారి చేతిలో మిష‌న్‌గ‌న్స్ ఉండ‌టంతో వారు కాల్పులు జరుపుతారు. ఆ కాల్పుల్లో కొంద‌రు పోలీసులు, పౌరులు చ‌నిపోతారు. క‌మీష‌న‌ర్ ఇబ్ర‌హీం(మిస్కిన్‌) స‌హా ఇత‌ర‌ పోలీసులు, స్నైప‌ర్స్ రంగంలోకి దిగుతారు. బ్యాంకు దోపిడీ చేసిన వారు ఏరియాలో ప‌రుగులు తీస్తుంటే వారిని ప‌ట్టుకోవ‌డానికి పోలీసులు విశ్వ‌ప్ర‌య‌త్నం చేస్తుంటారు. అదే ఏరియాలో కొంద‌రు టెర్ర‌రిస్టులు ఓ బ్లాస్ట్ ప్లాన్ చేస్తుంటారు. వారికీ ఈ బ్యాంకు దొంగ‌ల వ‌ల్ల పోలీసులు రావ‌డంతో పెద్ద స‌మ‌స్య వ‌చ్చిప‌డుతుంది. పోలీసుల నుండి  బ్యాంకు దొంగ‌లు త‌ప్పించుకోవ‌డానికి ఏం చేస్తారు?  వారిని పోలీసులు ఎలా ప‌ట్టుకున్నారు?  చివ‌ర‌కు క‌థ ఎలాంటి మ‌లుపులు తీసుకుంది?  అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


స‌మీక్ష‌:

క‌థ ప‌రంగా చెప్పాలంటే చాలా సింపుల్‌.  బ్యాంకు రాబ‌రీ చేసిన వారిని ప‌ట్టుకోవ‌డానికి పోలీసులు ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేశారు. వారి నుండి త‌ప్పించుకోవ‌డానికి దొంగ‌లు ఏం చేశారు?  అనేదే క‌థాంశం. ఓ చిన్న పాయింట్‌ను రాసుకుని దాని చుట్టూనే సినిమాను గ్రిప్పింగ్‌గా న‌డిచేలా స‌న్నివేశాలను అల్లుకున్నారు. బ్యాంకులో దొంగ‌త‌నం చేయ‌డం.. ఆ దొంగ‌త‌నానికి ఓ కార‌ణాన్ని చూపెట్టాడు. దాని వ‌ల్లే క‌థ ర‌న్ అవుతున్న‌ట్లు సినిమా చివ‌రి వ‌ర‌కు తీసుకుపోయారు. ఫస్టాప్‌లో అంతా బ్యాంకు దొంగ‌ల‌ను ప‌ట్టుకునే ప్ర‌య‌త్నంలో ఓ ఏరియాను పోలీసులు లాక్ డౌన్ చేయ‌డం వ‌ర‌కు సాగుతుంది. ఇక సెకండాఫ్ అంతా.. అంటే ప్రీ క్లైమాక్స్ వ‌ర‌కు కూడా అదే ఫార్మేట్‌లో సినిమా ర‌న్ అవుతుంది. ఇక సినిమాలో చివ‌ర‌లో వ‌చ్చే క్లైమాక్స్ అప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన క‌థ‌ను మ‌రో రేంజ్‌లో తీసుకెళుతుంద‌నే చెప్పాలి. డైరెక్ట‌ర్ మిస్కిన్ పోలీస్ క‌మీష‌న‌ర్ పాత్ర‌లో న‌టించాడు. అలాగే మెయిన్ రోల్ చేసిన అశోక్ పాత్ర‌లో విక్రాంత్ న‌టించారు. ఈ రెండు ముఖాలు కాస్తో  కూస్తో త‌ప్ప మ‌రే పాత్ర తెలుగు ప్రేక్ష‌కుడికి తెలియ‌నివే. సినిమాలో మ‌రో కీల‌క పాత్ర‌లో న‌టించిన కానిస్టేబుల్‌, యాంక‌ర్ పాత్ర‌లో నటించిన అమ్మాయి కాస్త న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశారు కానీ.. ఆ కామెడీ ఏదీ పెద్ద‌గా న‌వ్వించదు. ప్రీ క్లైమాక్స్ ముందు వ‌ర‌కు కొన్ని స‌న్నివేశాలు మిన‌హా మిగ‌తాదంతాస్లో మ‌రీ లాగిన‌ట్లు అనిపిస్తుంది. సుజిత్ సారంగ్ సినిమాటోగ్ర‌ఫీ, జేక్స్ బిజోయ్ నేప‌థ్య సంగీతం బావుంది. సినిమా లెంగ్త్ త‌క్కువ‌గా ఉండ‌టం, పాట‌లు లేక‌పోవ‌డం కూడా సినిమాకు క‌లిసొచ్చింద‌నే చెప్పాలి. ప్ర‌స్తుతం థియేట‌ర్స్‌కు ప్రేక్ష‌కుడు వెళ్లే ప‌రిస్థితిలో లేడు క‌నుక‌.. ప‌రిమిత బ‌డ్జెట్‌లో చేసిన ఈ థ్రిల్లింగ్ ప్ర‌య‌త్నాన్ని ఓసారి చూడొచ్చు


బోట‌మ్ లైన్‌‘షూట్ ఎట్ సైట్‌’.. ఓకే అనిపించే థ్రిల్ల‌ర్‌


రేటింగ్:  2.5/5

Updated Date - 2020-04-19T02:00:02+05:30 IST