జెమిని గణేశన్ నుంచి ధనుష్ వరకు.. కోలీవుడ్‌లో పెరుగుతున్న ‘విడాకుల’ సంస్కృతి
ABN , First Publish Date - 2022-01-21T23:39:15+05:30 IST
కోలీవుడ్‌లో మాంగల్య బంధం బీటలు వారుతుంది. ఎంతో మంది అభిమానులకు స్ఫూర్తి, మార్గదర్శకంగా ఉండే స్టార్ సెలెబ్రిటీలు తమ సంసార జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. తమ వైవాహిక జీవితంలో ఏర్పడే చిన్నపాటి పొరపచ్ఛాలను పెద్దవి చేసుకుని

కోలీవుడ్‌లో మాంగల్య బంధం బీటలు వారుతుంది. ఎంతో మంది అభిమానులకు స్ఫూర్తి, మార్గదర్శకంగా ఉండే స్టార్ సెలెబ్రిటీలు తమ సంసార జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. తమ వైవాహిక జీవితంలో ఏర్పడే చిన్నపాటి పొరపొచ్చాలను పెద్దవి చేసుకుని చివరకు విడాకుల వరకు వెళుతున్నారు. అలనాటి మేటి తమిళ నటుడు ‘కాదల్‌మన్నన్’ జెమినిగణేశన్ నుంచి నేటి యువ నటుడు ధనుష్ వరకు పొసగని దాంపత్యంతో భార్యలకు విడాకులిచ్చిన వారెందరో ఉన్నారు. జెమినిగణేశన్ ‘కాదల్ మన్నన్’ (ప్రేమచక్రవర్తి) అనే పేరుకు తగ్గట్లే నలుగురు భార్యలతో కాపురం చేశారు. ఆ నలుగురిలో మహానటి సావిత్రి కూడా ఉండటం విశేషం. 1997లో వృద్ధాప్యంలో జూలియనా ఆండ్రియా అనే విదేశీ యువతితో వివాహ సంబంధం ఏర్పరచుకున్న ఘనత ఆయనకే దక్కింది. ఇక ఆయనతో పాటు బాలనటుడిగా చిత్రసీమలో ప్రవేశించిన విశ్వ నటుడు కమల్ హాసన్-సారిక దంపతులు మొదలుకుని ఇపుడు ధనుష్ - ఐశ్వర్య దంపతుల వరకు వచ్చింది. తమిళ చిత్రసీమలో ఇప్పటివరకు విడాకులు తీసుకున్న సెలెబ్రిటీల జంటల వివరాలను పరిశీలిస్తే.
విశ్వనటుడు కమల్‌హాసన్ తన మొదటి భార్య వాణి (1978-1988), రెండో భార్య సారిక (1988-2004)లకు విడాకులిచ్చారు. ఆ తర్వాత నటి గౌతమితో సహజీవనం చేశారు. ఆ తర్వాత ఆమెకు కూడా దూరమయ్యారు.

దర్శకనటుడు, హీరో పార్తీబన్ నటి సీతను పెళ్ళి చేసుకున్నారు. ‘పుదియపాదై’ అనే చిత్ర షూటింగ్ సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 1990-2001 వరకు భార్యభర్తలుగా జీవించారు. వీరికి ముగ్గురు పిల్లలు కూడా. ఆ తర్వాత ఈ జంట విడిపోయింది.

1980 దశకంలో అగ్రహీరోలు రజనీకాంత్, కమల్ హాసన్‌కు పోటీగా గ్రామీణ సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొందిన హీరో రామరాజన్. నటి నళినీని ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. 1987-2000 వరకు కలిసిమెలసి ఉండి ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. వీరికి అరుణ్, అరుణ అనే ఇద్దరు పిల్లలున్నారు.

నటి గౌతమి1998-99లో సందీప్ అనే వ్యక్తిని పెళ్ళి చేసుకుని విడిపోయారు. ఆ తర్వాత 2004- 2016 వరకు హీరో కమల్‌హాసన్‌తో కలిసి సహజీవనం చేశారు. కొంతకాలానికి వీరిద్దరూ విడిపోయారు.

తమిళం, తెలుగు భాషల్లో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన రఘువరన్ నటి రోహిణిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. 1996-2004 వరకు దాంపత్య జీవితం కొనసాగించిన వీరిద్దరూ ఆ తర్వాత విడిపోయారు.

హీరో ప్రశాంత్ తన భార్య గృహలక్ష్మికి విడాకులు ఇచ్చారు. ఆమెకు అప్పటికే పెళ్ళి జరిగిందని, ఆ విషయాన్ని దాచిపెట్టి తనను పెళ్ళి చేసుకున్నారనే కారణంతో విడాకులు ఇచ్చారు. వీరిద్దరు 2005-2009 వరకు నాలుగేళ్ళపాటు దంపతులుగా ఉన్నారు.

1980లో టాప్ హీరోయిన్‌గా ఉన్న నటి రేవతి ప్రముఖ కెమెరామెన్, నటుడు సురేష్ మేనన్‌ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. 14 యేళ్ళు (1986- 2013) కలిసివున్నప్పటికీ విడాకుల కోసం 2000లో కోర్టును ఆశ్రయించగా, 2013లో 13 యేళ్ళ తర్వాత ఈ దంపతులకు కోర్టు విడాకులు మంజూరు చేసింది.

దర్శకుడు సెల్వరాఘవన్ హీరోయిన్ సోనియా అగర్వాల్‌ను 2006లో ప్రేమించి పెళ్లి చేసుకుని నాలుగేళ్ళకే విడిపోయారు. ఆ తర్వాత అసిస్టెంట్ దర్శకురాలు గీతాంజలిని సెల్వరాఘవన్ రెండో పెళ్లి చేసుకోగా, సోనియా అగర్వాల్ మాత్రం ఒంటరిగానే ఉంటోంది.

ఇండియన్ మేఖైల్ జాక్సన్‌గా, నటుడుగా, హీరోగా, దర్శకుడిగా గుర్తింపు పొందిన ప్రభుదేవా కూడా తొలుత ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈయన రమ లతను ప్రేమ వివాహం చేసుకున్నారు. 1995-2011 వరకు కలిసివున్న ఈ జంట 2011లో విడాకులు తీసుకున్నారు.

సీనియర్ హీరో శరత్‌కుమార్ తొలుత ఛాయ అనే మహిళను పెళ్ళి చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి ఇపుడు సీనియర్ నటి రాధికను పెళ్ళి చేసుకున్నారు.
నటి రాధిక కూడా తొలుత నటుడు, దర్శకుడు ప్రతాప్ పోతన్‌ను పెళ్ళి చేసుకున్నారు. అతనికి విడాకులు ఇచ్చి రిచర్డ్ అనే వ్యక్తిని పెళ్ళి చేసుకుని విడిపోయారు. మూడోసారి నటుడు శరత్ కుమార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

అదేవిధంగా చిత్ర పరిశ్రమకు చెందిన సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా, దర్శకుడు ప్రియదర్శిన్, నటి లిజి ప్రియదర్శన్, నటుడు అరవింద్‌స్వామి, నటి గాయత్రి రామమూర్తి, నటుడు ప్రకాష్‌రాజ్, నటీమణులు సరిత, ఊర్వశి, శ్రీవిద్య, వనితా విజయ కుమార్ వివాహ బంధం కూడా విడాకులతోనే ముగిసింది.

ఇపుడు హీరో ధనుష్ - ఐశ్వర్య రజనీకాంత్ వివాహ బంధం ఇదే విధంగా ముగియనుండటాన్ని ప్రతి ఒక్కరూ జీర్ణించుకోలేకపోతున్నారు. వయసులో తన కంటే రెండేళ్ళు పెద్దదైన తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యను హీరో ధనుష్ ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకున్నారు. వీరి వివాహం 2004 నవంబరు నెల 18న అంగరంగ వైభవంగా జరిగింది. వీరి 18 యేళ్ళ దాంపత్య జీవితానికి గుర్తుగా యాత్ర, లింగా అనే ఇద్దరు పిల్లలున్నారు. కానీ, ఈ జంట విడిపోతున్నట్టు తాజాగా ప్రకటించి వార్తల్లో నిలిచింది.
