‘మా’లో ముసలం!

ABN , First Publish Date - 2021-10-12T07:21:49+05:30 IST

‘మా’లో ముసలం మొదలైంది. ఎన్నికల అనంతరం నాగబాబు, ప్రకాశ్‌రాజ్‌ రాజీనామాలతో పరిస్థితులు చల్లబడలేదనే సంకేతాలిచ్చారు.

‘మా’లో ముసలం!

  • మాజీ అధ్యక్షుడు నరేశ్‌పై శివాజీరాజా లేఖాస్త్రం
  • ఆయన హయాంలో జరిగిన అవకతవకలపై
  • 15 రోజుల్లోగా విచారణ జరపాలని డిమాండ్‌
  • లేదంటే సభ్యత్వానికి రాజీనామా చేస్తానని వెల్లడి
  • ఫలితాల మార్పుతో ఓట్ల లెక్కింపుపై అనుమానాలు
  • అనసూయ విజయం సాధించినట్లు ఆదివారం 
  • సమాచారం.. ఓడిపోయినట్లు సోమవారం వెల్లడి
  • బ్యాలెట్లను ఎవరో తీసుకెళ్లారన్న అనసూయ 
  • తప్పుకోవాలంటూ చిరంజీవి ఫోన్‌ చేశారు: విష్ణు
  • నన్ను రెచ్చగొట్టాలని చూస్తున్నారు: మోహన్‌ బాబు
  • నా తల్లిదండ్రులు తెలుగువారు కాకపోవడం నా 
  • తప్పు కాదు.. ఆట ఇప్పుడు మొదలైంది: ప్రకాశ్‌ రాజ్‌


(సినిమా డెస్క్‌-ఆంధ్రజ్యోతి): ‘మా’లో ముసలం మొదలైంది. ఎన్నికల అనంతరం నాగబాబు, ప్రకాశ్‌రాజ్‌ రాజీనామాలతో పరిస్థితులు చల్లబడలేదనే సంకేతాలిచ్చారు. వారి రాజీనామాలతో ‘మా’లో అందరూ ఒక్కటి కాదని పరోక్షంగా వెల్లడించినట్టు అయ్యింది. మరోవైపు.. మంచు విష్ణు వెనకుండి అన్నీ తానై వ్యవహరించిన నరేశ్‌ మీద నటుడు శివాజీరాజా లేఖాస్త్రం ఎక్కుపెట్టారు. నరేశ్‌ హయాంలో జరిగిన అవకతవకలపై విచారణ చేసి, తప్పులు జరిగినట్టు రుజువైతే చర్యలు తీసుకోవాలని... ఇదంతా 15 రోజుల్లో జరగాలని విష్ణు ప్యానల్‌ను డిమాండ్‌ చేశారు. లేదంటే తాను ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని శివాజీరాజా చెప్పారు. నాగబాబు తన రాజీనామా లేఖను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. మరోవైపు.. ఓట్ల లెక్కింపుపై పలువురు అనుమానాలు లేవనెత్తారు. ఎందుకంటే.. అనసూయ విజయం సాధించినట్టు ఆదివారం సమాచారం అందింది. కానీ.. ఆమె పరాజయంపాలైనట్లు సోమవారం అధికారికంగా ప్రకటించారు. దీంతో.. ‘‘క్షమించాలి... ఒక్క విషయం గుర్తొచ్చి తెగ నవ్వొచ్చేస్తుంది. నిన్న... ‘అత్యధిక మెజారిటీ’, ‘భారీ మెజారిటీ’తో గెలుపు అన్నారు. ఈ రోజు ‘లాస్ట్‌’, ‘ఓటమి’ అంటున్నారు. రాత్రికి రాత్రి ఏం జరిగుంటుందబ్బా?’’ అని అనసూయ ట్వీట్‌ చేశారు.  ‘‘నిన్న ఎవరో ఎన్నికల నిబంధనలకు భిన్నంగా బ్యాలెట్‌ పేపర్స్‌ని ఇంటికి కూడా తీసుకెళ్లారని బయట టాకు! నేనట్లలేదు’’ అని మరో ట్వీట్‌ అనసూయ చేశారు. తన కుమారుడు మంచు విష్ణు విజయం భగవంతుడి నిర్ణయం ప్రకారమే జరిగిందని మోహన్‌ బాబు అన్నారు. కార్యవర్గ సభ్యుల ఫలితాలు విడుదలైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.


 ‘‘నేను పదిహేడేళ్ల క్రితం ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికయ్యా. అదీ అక్టోబర్‌ 10వ తేదీనే. మరి, దీనిని ఏమంటాం? ఇది అందరి విజయం. 883 మంది సభ్యుల ఆశీస్సులు ఉన్నాయి’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘సింహం నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే.. ఆలోచించుకోవడానికే! ఆ తర్వాత విజృంభిస్తుంది. సముద్ర కెరటం ఉప్పొంగుతుంది. అది వెనక్కి వెళ్లిందని అజాగ్రత్తతో ఉంటే... సునామీ వచ్చినట్లు ఉధృతి ప్రదర్శిస్తుంది. నన్ను రెచ్చగొట్టాలని చూస్తూనే ఉన్నారు. నేను అసమర్థుణ్ని కాను. మౌనంగా ఉండాలని.. అంతే! ప్రతిదానికీ మౌనంగా ఉండాలట. అన్నీ నవ్వుతూ స్వీకరించాలి. మాట్లాడమని అవకాశం ఇచ్చారు కాబట్టి మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ గురించే నేనిప్పుడు మాట్లాడాలి. ఇది కాకుండా వేరే రాజకీయం మాట్లాడితే... ఎక్కడా మాట్లాడడానికి అవకాశం లేక, ఎక్కడో ఒక వేదిక దొరికితే, ఆ వేదికలో ఇష్టం వచ్చినట్లు నోరు జారడం మనిషి స్థాయి దీన స్థితికి దిగజార్చడమే అవుతుంది. ‘నిన్నటిది వేస్ట్‌ పేపర్‌. ఈ రోజు న్యూస్‌ పేపర్‌. రేపు క్వశ్చన్‌ పేపర్‌. రీడ్‌ అండ్‌ రైట్‌.. అదర్‌వైజ్‌ యు విల్‌ బికమ్‌ ఏ టిష్యూ పేపర్‌’ అన్నారు మహానుభావుడు అబ్దుల్‌ కలాంగారు. అందువల్ల గెలిచిన వారంతా రేపు క్వశ్చన్‌ పేపర్‌ అవుతారు. ఆలోచించు.. సహాయం కోరుకో. బాధ్యతను తీసుకున్నాం. ముఖ్యమంత్రుల సహాయ సహకారం లేకపోతే నువ్వు అడుగు వేయలేవు’’ అని తన కుమారుడు విష్ణును ఉద్దేశించి మోహన్‌బాబు అన్నారు. దాసరి నారాయణరావు లేని లోటును మోహన్‌బాబు భర్తీ చేస్తారనే నమ్మకం ఉందని నరేశ్‌ వ్యాఖ్యానించగా... ‘‘ఇండస్ట్రీ పెద్ద అనే హోదా నాకు వద్దు. దాసరి లేని లోటును భర్తీ చేయలేం’’ అని మోహన్‌బాబు బదులిచ్చారు.


నాన్నవల్లే గెలిచా..

‘మా’ ఎన్నికల్లో తన తండ్రి మోహన్‌బాబు వల్లే గెలిచానని మంచు విష్ణు అన్నారు. ‘‘ఇప్పుడు చెప్పకూడదేమో.. ఈ ఎన్నికల నుంచి నన్ను తప్పుకోమని చిరంజీవి అంకుల్‌ చెప్పారు. ‘ప్రకాశ్‌రాజ్‌ పోటీలో ఉన్నాడు కదా! ఏకగ్రీవంగా అతన్ని ఎన్నుకుందాం. విష్ణును తప్పుకోమని చెప్పొచ్చు కదా’ అని నాన్నను చిరంజీవి అడిగారు. కానీ, నాన్న అంగీకరించలేదు. ఎన్నికలకు వెళదామన్నారు. మా నాన్న వల్లే గెలిచా. మోహన్‌బాబు అబ్బాయికి ఓటేద్దామని పరిశ్రమ అందరూ అనుకుని ఓటేయడంతో గెలిచా. విష్ణుగా కాదు... మోహన్‌బాబు వాళ్లబ్బాయి ఈ పని చేశాడని భవిష్యత్తులో అందరూ చెప్పుకొనేలా ‘మా’ను అభివృద్ధి చేస్తా’’ అని విష్ణు హామీ ఇచ్చారు. త్వరలో తెలుగు రాష్ట్రాల సీఎంలిద్దరినీ కలిసి ఇండస్ట్రీ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి, అవి పరిష్కారమయ్యేలా చూస్తామన్నారు. నాగబాబు, ప్రకాశ్‌రాజ్‌ రాజీనామాలను అమోదించట్లేదని విష్ణు స్పష్టం చేశారు. వాళ్లిద్దర్నీ త్వరలో వ్యక్తిగతంగా కలుస్తానన్నారు. ‘‘నాగబాబుగారు మా కుటుంబ సభ్యుడు. ‘మా’ పెద్దల్లో ఆయన ఒకరు. ఆయన రాజీనామాను నేను ఆమోదించను. నాగబాబుగారిని త్వరలో కలుస్తాను. రాజీనామాను అంగీకరించడం లేదని పర్సనల్‌గా చెబుతాను. అలాగే ప్రకాశ్‌రాజ్‌గారంటే నాకు ఇష్టం. గతం గతః. జరిగిపోయిన దాని గురించి ఆలోచించం. ప్రకాశ్‌రాజ్‌గారి సలహాలు తీసుకుని ముందుకు నడుస్తాం. ఓటమి ఇబ్బందికరంగానే ఉంటుంది. నేను స్పోర్ట్స్‌ పర్సన్‌ కనుక ఆ విషయం బాగా తెలుసు. తెలుగేతరులు పోటీ చేయకూడదని నేను ఎక్కడా చెప్పలేదు. ఆ రకంగా బైలా్‌సలో మార్పులు చేస్తామా లేదా అనేది జనరల్‌ బాడీలో తీసుకోవాల్సిన అంశం. దాని గురించి  ఇప్పుడు మాట్లాడ్డం తొందరపాటే అవుతుందన్నారు.


ఎలా ఓడిపోయామన్నది ముఖ్యం కాదు: ప్రకాశ్‌రాజ్‌

‘‘కళాకారుడిగా నాకంటూ ఆత్మగౌరవం ఉంటుంది. అందువల్ల, ‘మా’ సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నాను. అయితే, తెలుగు సినిమాల్లో నటిస్తా’’ అని నటుడు ప్రకాశ్‌రాజ్‌ అన్నారు. విజయం సాధించిన విష్ణు ప్యానెల్‌కు  ఆయన శుభాకాంక్షలు చెప్పారు. ‘‘ఎలా ఓడిపోయాం? ఎలా గెలిచాం? అన్నది ముఖ్యం కాదు. ‘మా’కు తెలుగువారే నాయకత్వం వహించాలన్నారు. నేను తెలుగు వ్యక్తిని కాదన్నారు. ప్రాంతీయత, జాతీయవాదం... వీటన్నిటి నేపథ్యంలో ఎన్నికలు జరిగాయి. బండి సంజయ్‌ లాంటి వాళ్లు ట్వీట్‌ చేశారు. తెలుగోడు కానివాడు ఓటు వేయొచ్చు కానీ, పోటీ చేయకూడదనే విధంగా బైలాస్‌ మార్చాలనే నినాదం ప్రారంభించారు. మీరొచ్చిన తర్వాత బైలాస్‌ మారుస్తామన్నారు. ఏం చేయను? నా తల్లితండ్రులు తెలుగోళ్లు కాదు. అది నా తప్పు కాదు, వాళ్ల తప్పు కూడా కాదు. మోహన్‌బాబు, కోట, రవిబాబు వంటివారు ‘అతిథిగా వస్తే, అతిథిగా ఉండాలి’ అని చెప్పారు. ఇటువంటి ఎజెండా ఉన్నవాళ్ల దగ్గర నేను ఉండలేను. అందుకని, రాజీనామా చేస్తున్నా’’ అని తెలిపారు. అసలు ఆట ఇప్పుడు మొదలైందన్నారు.

Updated Date - 2021-10-12T07:21:49+05:30 IST