శేష జీవితంలోనూ.. విలక్షణం!

ABN , First Publish Date - 2022-01-23T07:03:21+05:30 IST

లేటు వయసులో లేటెస్ట్‌గా వచ్చా. నాకెంతో సంతృప్తి నిచ్చేది... నన్ను ఆనందంగా ఉంచేది నటనే. మొన్న కరోనా లాక్‌డౌన్‌లో సినిమా ఆలోచనలతో నిండిపోయా. రిటైర్‌ అయ్యాక ఖాళీగా ఉండటమెందుకూ? చిన్ననాటి కల నెరవేర్చుకుంటే పోలా? అనుకున్నా. ...

శేష జీవితంలోనూ.. విలక్షణం!

లేటు వయసులో లేటెస్ట్‌గా వచ్చా. నాకెంతో సంతృప్తి నిచ్చేది... నన్ను ఆనందంగా ఉంచేది నటనే. మొన్న కరోనా లాక్‌డౌన్‌లో సినిమా ఆలోచనలతో నిండిపోయా. రిటైర్‌ అయ్యాక ఖాళీగా ఉండటమెందుకూ? చిన్ననాటి కల నెరవేర్చుకుంటే పోలా? అనుకున్నా. నవ్వే వాళ్లు నవ్వనీ.. ఏడ్చే వాళ్లు ఏడ్వనీ.. అనేది నా కాన్సెప్ట్‌. కరోనా సమయంలో ఆ పాత చిత్రాలు చూస్తుంటే.. సినిమాలపై మరింత ప్రేమ కలిగింది. ‘ది మూన్‌’ అనే షార్ట్‌ ఫిల్మ్‌ను ప్రొఫైల్‌ వీడియోలా తీశా. నాకిదో దరఖాస్తు లాంటిది.  ప్రసాద్‌ ల్యాబ్‌లో ‘ది మూన్‌’ ప్రీమియర్‌ చూసి కొందరు సినీ పెద్దలు అభినందించారు. విక్రాంత్‌ శ్రీనివాస్‌ అనే దర్శకుడు తన తాజా చిత్రంలో మంచి పాత్రను ఆఫర్‌ చేశారు. త్వరలో షూటింగ్‌ ప్రారంభమవుతుంది. 



బాల్యంలో వీరపాండ్య కట్టప్ప... 

చెన్నైలో పుట్టి పెరిగా. నాకో తమ్ముడు, చెల్లెలు. స్కూల్‌ డేస్‌లో నాటకాలు వేసేవాణ్ని. ఏ పాత్ర ఇచ్చినా ఇరగదీసేవాణ్ని. నాలుగో తరగతిలో వీరపాండ్య కట్టప్ప పాత్రలో ఆవేశంతో, గంభీరంగా నటించా. పాఠశాలలో మంచి పేరొచ్చింది. నాన్న తపాలాశాఖలో పని చేసేవారు. తను నాటకాలంటే ఇష్టపడేవారు కాదు. పదమూడేళ్ల వయసులో మా అమ్మగారు పోయారు.   

దర్శకుల ఇంటిచుట్టూ...

ఉదయమే నాన్న తపాలా ఆఫీసుకి వెళ్లిపోయేవారు. నేను వంట వండి.. క్యారీ కట్టుకుని కాలేజీకి వెళ్లినట్లు ఫోజుకొట్టేవాణ్ని. కాలేజీ దారిలో వెళ్లి రూట్‌ మార్చేవాణ్ని. టెలిఫోన్‌ డైరక్టరీలో దర్శకుల ఫోన్‌ నంబర్లు చూసి అడ్రస్‌ కనుక్కుని వెళ్లిపోయేవాణ్ని. టీనగర్‌లో దర్శకులు విఠలాచార్యులు, దాసరి నారాయణరావుగారిని కలిశా. బాలచందర్‌, భారతీరాజాగారిని కలిశా. మా కాలేజీలో జాకబ్‌ కురువిల్లా అనే ప్రొఫెసర్‌ ఉండేవారు. కాలేజీకి రాలేదెందుకూ? అని ఆమె అడిగితే ‘ఇంగ్లీషు రాదు మేడమ్‌’ అన్నా. పీయూసీ పూర్తి చేస్తే ఇష్టమైన సినిమాల్లో చేర్పిస్తానంది. అప్పటికి ఆమె ఫిల్మ్‌ జర్నలిస్ట్‌. ఫెమినా లాంటి మ్యాగజైన్స్‌కి ఇంటర్వ్యూలు చేసేవారు. ఆమె రిఫరెన్స్‌తో హిందీ సినిమా ‘యాదోంకీ భారత్‌’ తమిళ వర్షెన్‌లో చిన్న తమ్ముడి పాత్రకోసం ఓ సినిమా ఆఫీసుకి వెళ్లా. ‘నువ్వు చిన్నపిల్లోడివి కాదు. అలాగని పెద్దవయసు పాత్రలు నప్పవు. మూడేళ్ల తర్వాత కనపడు’ అన్నారు ఆ దర్శకుడు కె.ఎస్‌. సేతుమాధవన్‌. చివరికి నేను వెళ్లిన ఆ పాత్రను చంద్రమోహన్‌గారు చేశారు.  

చెన్నై నుంచి కడపకొచ్చా!

ఓ చిట్‌ ఫండ్‌ కంపెనీలో ఉద్యోగం పడితే దరఖాస్తు చేశా. నాన్న వద్దన్నారు. ‘చిన్నపిల్లోడివి. చదువుకో’ అన్నారు. ‘ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేర్పించ’మని అడిగా. ‘నువ్వు జీవితంలో బాగుపడవుపో’ అంటూ తిట్టేసి వెళ్లిపోయారు. కడప, ఒంగోలులో పనిచేశా. అక్కడే తెలుగు సినిమాలు బాగా చూశా.  చదవడం, రాయడం నేర్చుకున్నా. ఆ రంగంలో కెరీర్‌లో పెద్దస్థాయికి వెళ్లాలంటే.. ‘డిగ్రీ ఉండాల’న్నారు ఓ అధికారి. దీంతో మళ్లీ చెన్నై బాట పట్టా. డిగ్రీ చేశాక టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగం వచ్చింది. ఫిల్మ్‌ఫేర్‌ ఫంక్షన్లు దగ్గరుండి చూసుకునేవాణ్ని. ఆ సమయంలో ఫిల్మ్‌స్టార్లతో మాట్లాడేవాణ్ని. భారతీరాజా దగ్గర సహదర్శకుడిగా పనిచేసిన పాండ్య రాజన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘మీన్రుమ్‌ మహాన్‌’ చిత్రంలో ఓ పాత్ర చేశా. హీరోగా చేయమని ఒకట్రెండు సినిమాలొచ్చాయి. ఆ సమయంలోనే పెళ్లయింది. దీంతోపాటు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో మేనేజర్‌గా చేశా. మీడియా అడ్వయిర్టయిజ్‌మెంట్‌ రంగంలో పాతికేళ్లు పనిచేశా. ఆ తర్వాత ఓ ప్రైవేట్‌ సంస్థలో పదిహేనేళ్లు పనిచేశా. ఒకప్పుడు ‘ప్యూన్‌ ఉద్యోగం కూడా దొరకదురా’ అని తిట్టిన మానాన్న కెరీర్‌లో నా ఎదుగుదల చూసి ఆనందించారు. మీడియా, కార్పొరేట్‌రంగంలో మంచి స్థాయిలో ఉన్నపుడు అవకాశాలు అడగలేకపోయా. 

 నా డ్రీమ్‌! 

2019లో షష్టిపూర్తి చేసుకున్నా. అదే సమయంలో పాత సినిమాలు చూశా. మళ్లీ నాస్టాల్జియాలోకి వెళ్లా. ఈసారైనా సినిమా ఇండస్ర్టీలోకి గట్టిగా ప్రయత్నించాలనుకున్నా. 12 నిమిషాల ‘ది మూన్‌’ లఘుచిత్రానికి  మంచి పేరొచ్చింది. ఇప్పుడిప్పుడే అవకాశాలొస్తున్నాయి. తండ్రి పాత్ర, విలన్‌.. ఇలా నటనకు స్కోప్‌ ఉండే పాత్రలు చేయాలనుంది. జీవితంలో ప్రతి ఒక్కరికీ ఓ కల ఉంటుంది. కానీ కొన్ని పరిస్థితుల వల్ల రాజీపడతారు. ట్రాక్‌ మారిపోతారు. అరవై రెండేళ్ల వయసులో సినిమా ఏంటీ అనుకోవచ్చు. ఇది నా ప్యాషన్‌. ఉద్యోగానికి రిటైర్‌మెంట్‌ ఉంటుంది కానీ ‘కల’కు ఉండదు కదా! క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా బిజీ అవ్వాలన్నదే నా డ్రీమ్‌!

                                                                                                         రాళ్లపల్లి రాజావలి

Updated Date - 2022-01-23T07:03:21+05:30 IST