‘అల వైకుంఠపురములో’ కాంట్రవర్సీ: హీరో మమ్మల్ని బెదిరించలేదు.. తేల్చిచెప్పిన నిర్మాతలు..

ABN , First Publish Date - 2022-01-25T21:32:04+05:30 IST

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ ఎంత మంచి హిట్ సాధించిందో అందరికి తెలిసిందే...

‘అల వైకుంఠపురములో’ కాంట్రవర్సీ: హీరో మమ్మల్ని బెదిరించలేదు.. తేల్చిచెప్పిన నిర్మాతలు..

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ ఎంత మంచి హిట్ సాధించిందో అందరికి తెలిసిందే. దీంతో ఈ సినిమాని బాలీవుడ్‌లో సైతం రీమేక్ చేస్తున్నారు. ఈ మూవీకి రోహిత్ ధావన్ దర్శకత్వం వహిస్తుండగా.. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నాడు. 


అయితే అల్లు అర్జున్ నటించి ‘పుష్ప: ది రైజ్’ హిందీలో కూడా విడుదలై మంచి సక్సెస్‌ని అందుకుంది. దీంతో రెండేళ్ల క్రితం వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా రైట్స్ కొనుకున్న నిర్మాత మనీష్ షా దాన్ని డబ్బింగ్ పూర్తి చేసి భారీ స్థాయిలో థియేటర్స్ విడుదల చేయాలని భావించారు. కానీ అప్పటికే ఆ సినిమా రీమేక్ షూటింగ్ దశలో ఉండడంతో.. నిర్మాత అభ్యర్థన మేరకు ఆ ఆలోచనను విరమించుకొని కేవలం టీవీలో మాత్రమే టెలీకాస్ట్ చేయనున్నారు. 

దీని గురించి మనీష్ మాట్లాడుతూ.. ‘తన సినిమా థియేటర్స్‌లో విడుదలయితే ‘షాహ్‌జాదా’ నుంచి తప్పుకుంటానని కార్తీక్ ఆర్యన్ నిర్మాతలను బెదిరించాడు. అది చాలా అన్‌ప్రొషెషనల్‌’ అంటూ విమర్శలు చేశాడు.


తాజాగా ఈ విషయంలో తమ హీరోకి సపోర్టుగా నిలిచారు ‘షాహ్‌జాదా’ దర్శక నిర్మాతలు. రూ.40 కోట్లకి పైగా నష్టమోస్తుందనే తమ రిక్వెస్ట్ మేరకే మనీష్ షా సినిమా థియేట్రికల్ విడుదలని ఆపేశాడని వారు తెలిపారు. అంతేకానీ కార్తీక్ సినిమా నుంచి తప్పుకుంటామని తమని బెదిరించలేదని వివరించారు.


ఈ కాంట్రవర్సీపై నిర్మాత భూషణ్ కుమార్ మాట్లాడుతూ.. ‘అల వైకుంఠపురములో హిందీ డబ్బింగ్ వెర్షన్‌ కంటే ముందే ‘షాహ్‌జాదా’ను ముందుగా థియేటర్‌లో విడుదల చేయాలని మేం అనుకున్నాం. అందుకే, ఆ సినిమాను విడుదల చేయవద్దని మనీష్‌ని అభ్యర్థించాం. చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేయాలి.. ఎలా చేయాలనే బాధ్యత ఎల్లప్పుడూ నిర్మాతదే. అంతేకానీ నటుడిది కాదు’ అని చెప్పాడు. అంతేకాకుండా హీరో గురించి మాట్లాడుతూ..‘కార్తీక్ కెరీర్ ప్రారంభం నుంచి నాకు తెలుసు. మేము కలిసి అనేక సినిమాలు చేశాం. నేను పనిచేసిన ప్రొఫెషనల్ నటులలో అతను ఒకడు’ అంటూ తెలిపాడు.


దర్శకుడు రోహిత్ ధావన్, హీరోకు మద్దతుగా మాట్లాడుతూ.. ‘‘షాహ్‌జాదా’ కోసం కార్తీక్ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. అతనితో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు, నటుడిగా మా మధ్య మంచి బంధం ఉంది. ఈ సినిమాపై మా ప్రేమకు అంతు లేదు’ అని చెప్పుకొచ్చారు.

Updated Date - 2022-01-25T21:32:04+05:30 IST