తమిళ దర్శకుడు శంకర్‌కు, చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు మధ్య నడుస్తున్న న్యాయవివాదం ఓ కొలిక్కి వచ్చింది. శంకర్‌పై నిషేధం విధించాలన్న లైకా ప్రొడక్షన్స్ పిటిషన్‌ను కొట్టివేస్తూ శుక్రవారం కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో శంకర్ కొత్త సినిమా ప్రాజెక్ట్‌లకు లైన్ క్లియరైనట్టేనని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రామ్‌చరణ్‌తో ఓ చిత్రం ప్రకటించారు. రణ్‌వీర్‌సింగ్ కథానాయకుడిగా ‘అపరిచితుడు’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నారు. కమల్‌హాసన్ కథానాయకుడిగా నటిస్తున్న ‘భారతీయుడు 2’ చిత్రం షూటింగ్ పూర్తయ్యేదాకా శంకర్ మరో సినిమాకు దర్శకత్వం వహించకుండా నిషేధం విధించాలని లైకా ప్రొడక్షన్స్ చెన్నై హై కోర్టును ఆశ్రయించింది. ఇరు వర్గాలకు రాజీ కుదిర్చేందుకు కోర్టు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.