శభాష్‌ మిథు... కొత్త దర్శకుడొచ్చాడు!

మహిళా క్రికెటర్‌ మిథాలీరాజ్‌ బయోపిక్‌ ‘శభాష్‌ మిథు’కు కొత్త దర్శకుడొచ్చాడు. తొలుత ఈ చిత్రానికి రాహుల్‌ ఢోలాకియాను దర్శకుడిగా ఎంపిక చేశారు. సినిమా ప్రకటనతో అదే విషయం వెల్లడించారు. అయితే, కరోనా పరిస్థితుల వల్ల చిత్రీకరణ అనుకున్నట్టుగా సాగలేదు. షెడ్యూళ్లను రీ - షెడ్యూల్‌ చేయాల్సి వచ్చింది. దాంతో దర్శకత్వ బాధ్యతల నుంచి రాహుల్‌ ఢోలాకియా తప్పుకొన్నారు. ఆయన స్థానంలో బెంగాలీ దర్శకుడు శ్రీజిత్‌ ముఖర్జీ వచ్చారు. ‘బేగమ్‌ జాన్‌’తో హిందీ పరిశ్రమకు ఆయన దర్శకుడిగా పరిచయమయ్యారు. ఓటీటీలో విడుదలైన యాంథాలజీ ఫిల్మ్‌ ‘రే’లో రెండు కథలకు దర్శకత్వం వహించారు. ఇప్పుడు ‘శభాష్‌ మిథు’కు దర్శకత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని దర్శకులు రాహుల్‌ ఢోలాకియా, శ్రీజిత్‌ ముఖర్జీతో పాటు నిర్మాతలు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక, ఈ సినిమాలో మిథాలీ రాజ్‌గా తాప్సీ పన్ను నటించనున్న సంగతి తెలిసిందే. క్రికెట్‌లో కొన్ని రోజులు శిక్షణ కూడా తీసుకున్నారామె.


విదేశాల నుంచి స్వదేశానికి!

చెల్లెలు షగున్‌ పన్నుతో కలిసి గత వారం తాప్సీ పన్ను విదేశాలకు వెళ్లారు. రష్యాలోని మాస్కోతో పాటు ఇతర నగరాలు తిరిగారు. బుల్లెట్‌ ట్రైన్‌ జర్నీ చేశారు. సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ నగరంలో చీర కట్టుకుని రోడ్డు దాటుతున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు తాప్సీ. దానికి మంచి స్పందన లభించింది. ఇప్పుడు హాలిడే టూర్‌ ముగించుకుని ఇంటికొస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు.

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.