ప్రభాస్‌తో పాటే యాక్టింగ్‌లో శిక్షణ పొందా: జై ధనుష్‌

ABN , First Publish Date - 2020-05-06T01:27:40+05:30 IST

త్రిభాషా నటుడుగా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం జీ తెలుగు ఛానల్‌లో ‘నెంబర్‌ 1 కోడలు’ సీరియల్‌‌లో హీరోగా నటిస్తున్నాడు జై. తెలుగులో ఇదే హయ్యస్ట్‌ బడ్జెట్

ప్రభాస్‌తో పాటే యాక్టింగ్‌లో శిక్షణ పొందా: జై ధనుష్‌

త్రిభాషా నటుడుగా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం జీ తెలుగు ఛానల్‌లో ‘నెంబర్‌ 1 కోడలు’ సీరియల్‌‌లో హీరోగా నటిస్తున్నాడు జై. తెలుగులో ఇదే హయ్యస్ట్‌ బడ్జెట్‌ సీరియల్‌. ప్రేక్షకులే నా మార్గదర్శకులు, నటులకు వాళ్ళే దేవుళ్ళు.. అంటున్న జై ధనుష్‌ ఇంటర్వ్యూ. ‍తాతలకాలం నుంచీ విశాఖపట్నంలోనే స్థిరపడింది జై కుటుంబం. అతడి తండ్రి కె.పి.చంద్రరావు. తల్లి తిరుమల. అక్కయ్య చంద్రిక, బావ శ్రీజిత్‌. వాళ్ళిద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లే. కెనడాలో స్థిరపడ్డారు. జై బాల్యం, విద్యాభ్యాసం అంతా విశాఖపట్నంలోనే. బి.ఏ ఇంగ్లీష్ లిటరేచర్‌ చదువుకున్నాడు జై. 


నేవీ ఆఫీసరై రియల్‌ హీరో అనిపించుకోవాలనే  కోరికతో...

బాల్యం నుండీ జైకి నటుడవ్వాలనే ఆలోచనే లేదట. విశాఖలో ఏటా నౌకాదళ దినోత్సవం రోజున జై నావికాదళ విన్యాసాలు, హెలికాప్టర్ల ద్వారా చేసే ఆ రెస్క్యూ ఆపరేషన్స్‌, విన్యాసాలు చూసి, తను కూడా ఒక పెద్ద నౌకాదళాధికారిని కావాలనీ, నిజ జీవితంలో ‘రియల్‌ హీరో’ అనిపించుకోవాలనీ, ప్రజలకు సేవ చేయాలని కలలు గనేవాడట. ఆ కోరికతోనే, ఏడవ తరగతిలోనే ప్రతి ఆదివారం సీ కెడెట్ క్రాప్స్ (ఎస్‌సిసి)లో బోట్‌ పుల్లింగ్‌, బోట్‌ కమ్యునికేషన్‌, ఎస్‌ఎల్ఆర్, కార్బన్‌లతో సహా అన్ని రకాల ఫైరింగ్‌లో శిక్షణ పొందాడు.


హీరో ప్రభాస్‌తో స్నేహం.. యాక్టింగ్‌లో శిక్షణ 

నేవీ ఆఫీసర్‌ అయ్యేందుకు నైన్త్‌ క్లాస్‌ నుంచే ఫిజికల్‌ ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టి ఆరున్నరకే జిమ్‌కి వెళ్ళేవాడు జై. అదే సమయంలోనే ఆరు ఆడుగులు పైగా ఎత్తు ఉన్న ఆజానుబాహుడైన మరో యువకుడు కూడా జిమ్‌ చేసేవారు. ఆయన హైదరాబాద్‌ నుంచి వచ్చి, సత్యానంద్‌ యాక్టింగ్‌ స్కూల్లో శిక్షణ పొందుతున్నారని కోచ్‌ ద్వారా తెలుసుకున్నారు జై. ఆ యువకుడే హిస్టారిక్‌ మూవీ ‘బాహుబలి’ హీరో ప్రభాస్‌. అలా జిమ్‌లోనే జై–ప్రభాస్‌ మధ్య స్నేహం ఏర్పడింది. ప్రభాస్‌తో కలిసి జై సరదాగా యాక్టింగ్‌ స్కూల్‌కి వెళ్ళేవారట. ఒకరోజు సత్యానంద్‌ మాస్టర్‌ యాక్టింగ్‌ ఇంప్రొవైజేషన్‌, ఇమిటేషన్‌ గురించి చెప్పి, కుక్కను ఇమిటేట్‌చేస్తూ, దాని చేష్టల్ని ఇంప్రొవైజ్‌ చేయమనడంతో జై కూడా చేసి చూపించాడట. అతడి ఇంప్రొవైజేషన్‌ చూసి మాస్టర్‌తోపాటు, అందరూ చప్పట్లు కొట్టి అభినందించారట. అలా మాస్టర్‌ కూడా జైని శిక్షణ పొందమని ప్రోత్సహించారట. అయితే, ఈ లోపు నేవీలో అత్యంత ప్రమాదకరమైన పీట్లు చేయాల్సి రావడంతో, జై తల్లి భయపడి అభ్యంతరం పెట్టారు. అమ్మానాన్నలు యాక్టింగ్‌పైనే దృష్టి సారించమని ప్రోత్సహించారు. ప్రజలకు సేవ చెయ్యాలంటే, ఏదైనా ఒక రంగంలో ఎదిగి బాగా సంపాదించి, ఆ డబ్బు ప్రజాసేవకు ఉపయోగించాలి.. అంటూ జై తండ్రి, చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ను ఉదాహరణగా చూపించారట. దాంతో జై మనసు మార్చుకుని ఒకవైపు చదువుకుంటూనే, మరోవైపు ఎనిమిది నెలలపాటు ప్రభాస్‌తో పాటే యాక్టింగ్‌లో శిక్షణ పొందారు.


రెండు చిత్రాలకు నంది అవార్డులు

జై నటించిన రెండు చిత్రాలకు నంది అవార్డులు లభించాయి. ఇంటర్మీడియట్‌ తర్వాత జై కి ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తన ‘పోతే పోనీ’ సినిమాలో సెకండ్‌ హీరోగా అవకాశం ఇచ్చారు. ఇందులో శివబాలాజీ, సింధుతులానీ హీరోహీరోయిన్లు. శివబాలాజీ పాత్ర మరణించాక సెకండ్‌ హీరోగా రోల్‌ ప్లే చేస్తాడు జై. అలా జై తొలి చిత్రానికి నంది బహుమతి లభించింది. ‘పోతే పోనీ‍’ చిత్రంలో జైకి మంచి పేరు వచ్చింది. భరద్వాజ ప్రోత్సాహంతోపాటు సినిమా రంగంలోని పెద్ద పెద్ద టెక్నీషియన్లు జైకి పరిచయం కావడంతో, అతడికి మంచి మంచి ఆఫర్లు వచ్చాయి. అలా జై నటించిన రెండో చిత్రం ‘నువ్వే’. ‘మూవీ మార్కెట్‌’ మ్యాగజైన్‌ గోపీచంద్‌ నిర్మించిన ఈ చిత్రంలో జై హీరోగా నటించారు. ఇందులో రాగిణి హీరోయిన్‌.  అదేవిధంగా రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్రలో ఆయన కొడుకుగా, ‘మీ శ్రేయోభిలాషి’ చిత్రంలో యంగ్‌ హీరోగా నటించాడు జై. ఇందులో పాకీర్‌ హీరోయిన్‌. ఈ చిత్రానికి కూడా నంది అవార్డు లభించింది. జీ టీవీ వారు నిర్మించిన ‘మనోరమ’ అనే మరో చిత్రంలో కూడా హీరోగా నటించారు జై. ప్రముఖ నటి ఛార్మి, జై సరసన హీరోయిన్‌గా నటించింది. వరుణ్‌ సందేశ్‌తో కలిసి ‘లవకుశ’ చిత్రంలో సెకండ్‌ హీరోగా నటించాడు జై. ఇలా పలు చిత్రాలో నటించి మంచి అనుభవం, గుర్తింపు సంపాదించుకున్నాడు. 


టీవీ సీరియల్స్‌

‘‘నాకు ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకపోయినా దేవుడి దయవల్ల ఆటోమేటిక్‌గా నాకు సినిమా అవకాశాలు రావడం ఒక గొప్ప విషయం. అయితే, ఒక్కొక్క సినిమాకు ఏడాదికాలం పట్టేది. దాంతో హైదరాబాద్‌లో డైలీ మెయింటెనెన్స్‌ చాలా కష్టమైపోయేది. అప్పుడే ఒక ప్రముఖ టీవీ చానల్‌లో ‘ఆడదే ఆధారం’ సీరియల్‌లో హీరో ఆఫర్‌ ఇచ్చారు. ‘ఆడపిల్ల’ చిత్ర దర్శకుడు సంజీవరెడ్డి ఈ సీరియల్ దర్శకుడు. ఆయన సూచన మేరకు ఆడిషన్‌ ద్వారా ఎంపికై టీవీ సీరియల్స్‌లోకి ప్రవేశించా. ‘ఆడదే ఆధారం’ సీరియల్‌లో హీరోగా 2000 ఎపిసోడ్స్‌‌లో అర్చన భర్తగా నటించా. జనరేషన్‌ మార్పుతో ఈ సీరియల్‌ ఏడేళ్ళుగా ఇప్పటికీ కొనసాగుతోంది. ఆ తర్వాత రామోజీరావుగారి కుమారుడు, ప్రముఖ దర్శకనిర్మాత నటుడు దివంగత సుమన్‌తో కలిసి ‘హలో డాడీ’ అనే టెలిఫిలింలో, ఆయన కొడుకు పాత్రలో నటించా. మరో టెలిఫిలిమ్‌లో కూడా విలన్‌గా నటించా’’ అని చెప్పారు జై.



తమిళ, మలయాళ సీరియల్స్‌ హీరోగా..

తమిళం, మలయాళం సీరియల్స్‌లో కూడా హీరోగా నటించి అక్కడి ప్రేక్షకుల ఆదరాభిమానాలు సంపాదించుకున్నారు జై ధనుష్‌. సన్ టీవీలో ‘ఆధీర’ అనే హారర్‌ సీరియల్‌లో హీరోగా నటించారాయన. ఇందులో శ్రీవాణి హీరోయిన్‌. తమిళనాట ఇదెంతో సక్సెస్‌ఫుల్‌ సీరియల్‌గా ప్రేక్షకాదరణ పొందింది. దాంతో టి.సిరీస్‌వారి ‘సరిగమ’ టెలిఫిలిమ్‌వారు జైతో ‘చంద్రలేఖ’ అనే తమిళ సీరియల్‌ తీశారు. గత ఐదేళ్ళుగా సన్‌ టీవీలో వస్తూ, ఇప్పటికి 2000ఎపిసోడ్స్‌కు చేరువైన ఈ సీరియల్‌లో హీరో సంజయ్‌గా నటిస్తున్నాడు జై. ఇది సస్పెన్స్‌, థ్రిల్లర్‌ నిండిన ఫ్యామిలీ యాక్షన్‌ సీరియల్‌.


మలయాళీయుల ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ 

జై ధనుష్‌ మలయాళ టీవీ సీరియల్స్‌లో నటించి కేరళ ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందాడు. అంతేకాదు, కేరళ బుల్లితెర సెలెబ్రిటీగా భాసిల్లుతున్నాడు జై. ప్రేక్షకులు జై నటనకు బ్రహ్మరథం పడుతూ, ‘జై ధనుష్‌ ఆల్‌ కేరళ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌’ స్థాపించారు. పరాయి రాష్ట్రంలో ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ పెట్టే స్థాయికి ఒక తెలుగువాడు ఎదగడం మనందరికీ గర్వకారణమే. తమిళనాడులో కూడా ‘జై ధనుష్‌ ఫ్యాన్‌ క్లబ్‌’ ఏర్పడింది. నిజంగా చాలా గ్రేట్‌ కదా! ‘ఆధీర’ సీరియల్‌ చూసిన మలయాళ దర్శకుడు సిజ్జూ అరోరా, ‘అలియాంబల్‌’ అనే తన సీరియల్‌లో జైకి హీరో అవకాశం ఇచ్చారు. పల్లవి గౌడ హీరోయిన్‌. ‘అల్లియాంబుల్‌’ సీరియల్‌ మలయాళంలో సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టింది. దాంతో జై, కేరళ బుల్లితెర సెలబ్రిటీగా మారిపోయాడు. స్థానిక సినీ హీరోలతో సమానంగా ఒక టీవీ సెలబ్రిటీకి ఫ్యాన్స్‌ అసోసియేష‌న్‌ స్థాపించడం ఒక అరుదైన గౌరవమే.



ప్రపంచవ్యాప్త ఆదరణ

‘‘కన్నడ మినహా దక్షిణాది భాషల సీరియల్స్‌లో, తెలుగు సినిమాల్లో నటించడం నాకెంతో సంతోషంగా ఉంది. నా సీరియల్స్ అన్నీ విజయవంతమైనవే. దీనివల్ల ప్రపంచంలో ఎక్కడకు వెళ్ళినా దక్షిణాది రాష్ట్రాల ప్రజలు నన్ను గుర్తుపట్టి ఎంతో ఆత్మీయంగా మాట్లాడుతున్నారు. టీవీ సీరియల్స్‌ అనేవి చాలా పెద్ద మార్కెట్‌. ఇందులో నటుడుగా రాణించాలంటే, మనకు ట్యాలెంట్‌ తప్ప, ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ ఉండాల్సిన పనిలేదు. మలయాళంలో నాకెంతో పాపులారిటీ తెచ్చిపెట్టిన ‘అల్లియాంబుల్‌’ సీరియల్‌ పార్ట్‌–1 గొప్ప విజయం సాధించడంతో, నాతోనే పార్ట్‌–2 కూడా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు’’ అన్నారు జై.


‘నెంబర్‌ 1 కోడలు’.. తెలుగులో హయ్యస్ట్‌ బడ్జెట్‌ సీరియల్‌

‘నెంబర్‌ 1 కోడలు’ సీరియల్‌ తెలుగులో హయ్యస్ట్‌ బడ్జెట్‌ సీరియల్‌. ఇంతవరకు ఎవరూ ఇంత పెద్ద బడ్జెట్‌తో తెలుగులో సీరియల్‌ నిర్మించలేదు. ‘అల్లియాంబుల్’ సీరియల్‌లో నా నటననూ, కేరళలో ఆ సీరియల్‌కు, నాకు ఉన్న పాపులారిటీ గమనించిన జీ హెడ్ అనూరాధగారు, ‘నెంబర్‌ 1 కోడలు’ సీరియల్‌లో అవకాశం ఇచ్చి నన్నెంతగానో ప్రోత్సహించారు. చాలాకాలం తర్వాత తెలుగులో రీఎంట్రీకి అవకాశం ఇచ్చిన అనూరాధగారికి మనఃపూర్వక కృతజ్ఞతలు. ‘నెంబర్‌1 కోడలు’లో నేను హీరో రాకేష్‌గా, మధుమిత హీరోయిన్‌గా నటిస్తున్నాం. ఇది నాకు తెలుగులో మళ్లీ ఒక గొప్ప అవకాశం. ‘జీ తెలుగు’ ట్యాలెంట్‌ ఎక్కడ ఉన్నా ప్రోత్సహిస్తుందనడానికి ఇదొక ఉదాహరణ. తక్కువ సమయంలోనే విజయవంతమైన ఈ సీరియల్‌ ద్వారా నాకు రీ ఎంట్రీలో మంచి సక్సెస్‌ లభించినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ప్రముఖ నాట్యకళాకారిణి సుధాచంద్రన్‌ నాకు తల్లిపాత్రలో వాగ్దేవిగా నటిస్తున్నారు. దీనికి దర్శకుడు శ్రీనివాస్‌, నిర్మాత హరీష్‌. 

ఈ సీరియల్ కథ సింపుల్‌గా చెప్పాలంటే, ఇదొక మెసేజ్‌ ఒరియెంటెడ్‌ సీరియల్‌. ‘‘చదువులో కోడలు నెంబర్1గా రాణించాలని కోరుకునే అత్తగారి ఆశలను, అక్షరం ముక్క కూడా రాని కోడలు నెరవేరుస్తుందా?’’ అనేదే సింపుల్‌గా ఈ సీరియల్‌ సారాంశం. ప్రతి ఎపిసోడ్‌లోనూ చదువుకు ఉన్న ప్రాధాన్యాన్ని పాత్రల ద్వారా తెలియజేస్తూ, ప్రతి సీన్‌నీ చాలా రిచ్‌గా తీస్తున్న ‘ప్యాకేజ్‌ ఆఫ్‌ ఎమోషన్స్‌’ సీరియల్‌ ‘నెంబర్‌ 1 కోడలు’’ అన్నారు జై.


సక్సెస్‌ఫుల్‌ కమర్షియల్ చిత్రం చెయ్యాలి

‘‘టీవీ సీరియల్స్‌ పుణ్యమా అని ఆర్థిక సమస్యలు అధిగమించాను. ఇప్పటికి ఏడు సీరియల్స్‌లో నటించాను. అన్నీ విజయవంతమైనవే. ఆ సక్సెస్‌ వల్లనే నేను ఇలా హీరోగా కొనసాగుతున్నాను. ఇప్పటివరకు కళాత్మక చిత్రాల్లో నటించడంవల్ల కమర్షియల్‌గా వెనుకబడ్డాను. కమర్షియల్‌గా విజయవంతమైన సినిమాల్లో నటించాలని నా కోరిక. నా ప్రయత్నం అదే. ఆడియన్స్‌తో నేనెప్పుడూ కనెక్ట్ అవుతాను. ప్రేక్షకులే నాకు దేవుళ్ళు. వారు నిత్యం నా సీరియల్స్‌ చూస్తూ, తండ్రిలా నన్ను తిడుతూ అన్నదమ్ముల్లా, తల్లిలా, చెల్లిలా ఆదరిస్తూ, ఇస్తున్న సలహాలు నాకెంతో ఉపయోగపడుతున్నాయి’’ అన్నారు జై ధనుష్‌. 

Updated Date - 2020-05-06T01:27:40+05:30 IST